స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కోయంబత్తూరు లోని శ్రీ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
“ఈ వేడుకలు స్వామి వివేకానందుని ప్రసంగం పాశ్చాత్య దేశాలపై ఎటువంటి ప్రభావాన్ని ప్రసరించిందీ?, పాశ్చాత్యులు భారతీయ తత్వాన్ని ఏ కోణం లో గమనించిందీ?, భారత తత్వానికి సరైన స్థానం ఎలా లభించిందీ అన్న అంశాలను చాటి చెబుతాయి” అని ఈ సందర్భం గా ప్రధాన మంత్రి అన్నారు.
మన వేదాలు బోధించిన తత్వాన్ని ప్రపంచానికి స్వామి వివేకానందుడు మరింత విస్తారంగా పరిచయం చేశారని ఆయన అన్నారు. “వేదాల్లోని తత్వాన్ని ఆయన ప్రపంచానికి శికాగో లో బోధించారు. భారతదేశాని కి ఎంతటి ఘనమైన చరిత్ర ఉందో గుర్తు చేస్తూ దానికి గల సంపూర్ణమైన శక్తి ఏమిటన్నది చాటి చెప్పారు. మన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, భారతీయ మూలాలను ఆయన మనకు తిరిగి ఇచ్చారు” అని ప్రధాన మంత్రి అన్నారు.
స్వామి వివేకానందుని దార్శనికత ను ఆసరా చేసుకుని “భారతదేశం సంపూర్ణ ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగుతోంది” అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను, కార్యక్రమాలను గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది:
“శికాగో లో స్వామి వివేకానందుని ప్రసంగం 125వ వార్షికోత్సవ వేడుకలలో పాలుపంచుకొంటున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని అనుకొంటున్నాను. యువకులు, వృద్ధులు, మిత్రులు దాదాపు నాలుగు వేల మంది ఇక్కడకు తరలివచ్చారని నాకు తెలిసింది.
125 సంవత్సరాల క్రితం శికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానందుడు ప్రసంగించిన సభ లో పాల్గొన్నది కూడా నాలుగు వేల మందే కావడం యాదృచ్ఛికమే కావచ్చు.
ఎంతో ప్రేరణాత్మకమైన ఓ గొప్ప ప్రసంగం తాలూకు వార్షికోత్సవాన్ని జరుపుకొన్నటువంటి సందర్భం మరేదైనా ఉందేమో నేను ఎరుగను.
బహుశ అటువంటిది ఉండకపోవచ్చు.
ఆ రకంగా ఈ వేడుక లు స్వామీ జీ ప్రసంగం పాశ్చాత్య సమాజం పైన ఎటువంటి ప్రభావాన్ని ప్రసరించిందీ, భారతీయ తత్వాన్ని ఏ కోణంలో పాశ్చాత్యులు గమనించిందీ, భారత తత్వాని కి సరైన స్థానం ఎలా లభించిందీ అనే అంశాలను ఈ వేడుకలు చాటి చెబుతాయి.
శికాగో ప్రసంగం వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మరింత ప్రత్యేకత ఉంది.
రామకృష్ణ మఠం, మిషన్ లు నిర్వహించిన ఈ వేడుకల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ, తమిళ నాడు ప్రభుత్వానికి, ఆ చరిత్రాత్మక ప్రసంగాన్ని గుర్తు చేసుకునేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం లో పాల్గొన్న యువత కు అందరికీ ఇవే అభినందనలు.
సన్యాస దీక్ష లో ఉన్న వారి సాత్విక గుణం, యువత లోని శక్తి, ఉత్సాహాలు ఇక్కడ ఒక్కటిగా పోగవడం భారతదేశం అసలైన బలాని కి నిదర్శనం.
నేను మీ అందరికీ చాలా దూరం లో ఉండవచ్చు, అయితే ఆ అసామాన్యమైన శక్తి ని నేను అనుభవించగలుగుతున్నాను.
ఈ రోజు ఈ కార్యక్రమాలను ప్రసంగాలకే పరిమితం చేయడం లేదని నాకు చెప్పారు. రామకృష్ణ మఠం ఇంకా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. స్వామీ జీ ప్రపంచానికి అందించిన సందేశాన్ని యువత లో వ్యాపింపచేసేందుకు పాఠశాలల్లో, కళాశాలల్లో పోటీ లను నిర్వహించారు. మన యువత అత్యంత కీలకమైన అంశాలపై గోష్ఠులను నిర్వహించి దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల కు పరిష్కారాలను కనుగొంటారు. ఈ ప్రజా భాగస్వామ్యం, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల ను కలిసి కట్టుగా ఎదుర్కొనే కట్టుబాటు ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ సిద్ధాంతానికి మూలం. అదే స్వామీ జీ అందించిన సందేశ సారం.
మిత్రులారా,
స్వామి వివేకానందుల వారు ఆ ప్రసంగం ద్వారా భారతీయ సంస్కృతిని, తత్త్వ శాస్త్రాన్ని, ప్రాచీన సంప్రదాయాలను గురించి ప్రపంచం అంతటికీ చాటి చెప్పారు.
శికాగో ప్రసంగాన్ని గురించి ఎంతో మంది రాశారు. మీరు కూడా ఈ కార్యక్రమ సమయం లో నిర్వహించిన గోష్ఠి కార్యక్రమాలలో, ప్రసంగాలలో స్వామీ జీ ప్రసంగం లోని పలు కీలకాంశాలను గురించి విశేషంగా మాట్లాడుకుని ఉంటారు. స్వామీ జీ సందేశాన్ని గుర్తు కు తెచ్చుకొంటూ మనం దాని నుండి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం.
ఆయన ప్రసంగం ప్రభావాన్ని గురించి వివరించే సందర్భం లో నేను కూడా స్వామీ జీ మాటలను ఉదాహరిస్తూ వుంటాను. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమం లో ఎదురైన ప్రశ్న కు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “శికాగో పార్లమెంటు భారతీయత, భారతీయ తత్వ పరంగా ఒక అద్భుతమైన విజయం. వేదాంతం ప్రపంచం అంతటా ఒక అల లాగా విస్తరించడానికి అది సహాయకారి అయింది”.
మిత్రులారా,
స్వామీ జీ నివసించిన కాలాన్ని గనక మీరు మననం చేసుకొంటే ఆయన సాధించిన ఈ విజయం పరిధి ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
మన దేశం విదేశీ పాలకుల బంధనాల్లో వుంది. మనం నిరుపేదలం; వెనుకబాటుతనం వల్ల మన సమాజాన్ని చిన్న చూపు చూసే వారు. మన సమాజం లో కూడా ఎన్నో దురాగతాలు అంతర్గతం గా ఉండేవి.
విదేశీ పాలకులు, న్యాయమూర్తులు, బోధకులు ఎవరూ ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని, సంస్కృతి ని, వైభవాన్ని పరిశీలించ లేని స్థితి అది.
మన సాంస్కృతిక విలువ లను ఎంత చిన్న చూపు చూడాలో మన ప్రజలకే బోధించిన రోజులవి. వారిని మూలాలకు దూరం చేశారు. ఈ ఆలోచన ధోరణి ని స్వామీ జీ సవాలు చేశారు. భారతీయ సంస్కృతి పై, తత్వ శాస్త్రం పై శతాబ్దాల తరబడి పేరుకు పోయిన దుమ్ము ను దులిపే బృహత్ ప్రయత్నాన్ని స్వామీ జీ మొదలుపెట్టారు.
మన వైదిక తత్వం గొప్పతనం ఏమిటో ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. వైదిక తత్వాన్ని గురించి ప్రపంచానికి ఆయన శికాగో లో బోధించి, భారతదేశం యొక్క గతం ఎంతో ఉన్నతమైందో, దాని అపారమైన శక్తి ఎంతటిదో చాటి చెప్పారు. ఆ రకంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, మన మూలాలను మనకు ఆయన తిరిగి ప్రసాదించారు.
“సముద్రం లో అలల వలె ఆధ్యాత్మికత, తత్వ చింతన ఈ నేల నుండి ఉవ్వెత్తున లేచి ప్రపంచాన్ని చుట్టి పెడుతున్నాయి. మానవాళి అంతరించిన జీవనాన్ని, శక్తి ని తెలియచెప్పే ఈ అలలు ఈ భూమి నుండి నిరంతరం ఎగసి పడుతూనే ఉంటాయి” అని స్వామీ జీ మనందరికీ గుర్తు చేశారు.
స్వామీ జీ ప్రపంచంపై తనదైన ముద్ర ను వేయడమే కాదు, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తి ని, కొత్త విశ్వాసాన్ని అందించారు.
చైతన్యవంతులైన ప్రజలు దేనినైనా సాధించగలరన్న భావన ను రేకెత్తించారు. ఆ యువ సన్యాసి రక్తం లో అణువణువునా ఈ ఆత్మవిశ్వాసమే తొణికిసలాడుతుంది. “మిమ్మల్ని మీరు నమ్మండి, మీ దేశాన్ని ప్రేమించండి” అనేదే ఆయన అందించిన మంత్రం.
మిత్రులారా,
స్వామి వివేకానందుడు అందించిన ఈ దార్శనికత సహాయం తోనే భారతదేశం సంపూర్ణ ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగుతోంది. మనను మనం నమ్మి శ్రమించేందుకు సంసిద్ధులైన పక్షంలో మనం సాధించలేంది ఏముంటుంది?.
ఆరోగ్యానికి, సంక్షేమానికి యోగ, ఆయుర్వేద ల వంటి ప్రాచీన సంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయని ప్రపంచం గుర్తించింది. అదే కాలం లో దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటోంది.
మన దేశం ఒకే సారి వంద ఉపగ్రహాలను ప్రయోగించగలిగినప్పుడు ప్రపంచం మంగళ్ యాన్, గగన్ యాన్ లను గురించి చర్చించుకుంటోంది. మన భీమ్ యాప్ తరహా లో ఇతర దేశాలు కూడా ప్రయోగాలు చేస్తున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం మరింతగా ఇనుమడించింది. సమాజం లో నిరాదరణకు, అల్పత్వ భావానికి అలవాటు పడిన పేద ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మనం ఎంతో కష్టించి కృషి చేస్తున్నాం. ఈ ఆత్మవిశ్వాసం ప్రభావాన్ని మన యువకులలోనూ, పుత్రికలలోనూ చూడగలుగుతున్నాం.
మీరు ఎంత పేద వారు ?, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ? అనే అంశాలతో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసం తో, అకుంఠిత దీక్ష తో కృషి చేస్తే మీరు దేశానికి గౌరవ ప్రతిష్ఠలను సాధించిపెట్టడం సాధ్యమేనని ఇటీవల ముగిసిన ఆసియా క్రీడోత్సవాలు నిరూపించాయి.
ఈ రోజు న దేశంలో రికార్డు స్థాయి లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ని సాధిస్తున్న రైతన్నలు కూడా ఇదే వైఖరి ని ప్రదర్శించారు. దేశానికి చెందిన వ్యాపార వేత్తలు, కార్మికులు పారిశ్రామికోత్పత్తి ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. మీ వంటి యువ ఇంజినీర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కొత్త స్టార్ట్- అప్ శకం లోకి నడిపిస్తున్నారు.
మిత్రులారా,
భారతదేశం భవిష్యత్తు యువత మీదనే ఆధారపడి ఉందని స్వామీ జీ గట్టిగా విశ్వసించారు. వేదాలను ఉట్టంకిస్తూ ఆయన “యువకులు, శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, సునిశిత పరిజ్ఞానం గల వారే భగవంతుడిని దర్శించగలరు” అని చెప్పారు.
ఈ రోజు న యువత ఉద్యమ స్ఫూర్తి తో ముందుకు నడవడం నాకు చాలా ఆనందంగా ఉంది. యువత లోని ఆశ లను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం కొత్త పని సంస్కృతి ని, కొత్త మార్గాలను ముందుకు తీసుకు వస్తోంది.
మిత్రులారా,
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 70 సంవత్సరాల తరువాత కూడా నిరక్షరాస్యత పెరుగుతోంది. మన యువత లో చాలా మంది కి ఉద్యోగ అర్హత కు అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదు. మన విద్యావ్యవస్థ నైపుణ్యాలకు తగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడం విచారకరం.
యువత లో నైపుణ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికంటూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసింది.
సొంత కాళ్ళ మీద నిలబడి కలలను పండించుకోవాలని ఆకాంక్షించే యువత కోసం మా ప్రభుత్వం బ్యాంకుల ద్వారాలను తెరిపించింది.
ముద్ర పథకం లో భాగంగా ఇప్పటి వరకు 13 కోట్ల కు పైగా రుణాలను మంజూరు చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్రోపాధి ని విస్తరించడం లో ఈ పథకం ఎంతో కీలక పాత్ర ను పోషిస్తోంది.
స్టార్ట్- అప్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కొత్త ఆలోచన లకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దాని ఫలితంగా గత ఏడాది అంటే 2016లో 8 వేల స్టార్ట్- అప్ లు గుర్తింపు పత్రాన్ని అందుకొన్నాయి. అంటే ఒక్క సంవత్సరం లోనే వాటి సంఖ్య పది రెట్లు పెరిగిందన్న మాట.
పాఠశాలల్లో కొత్త తరహా ఆలోచన లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు “అటల్ ఇనవేశన్ మిశన్”ను ప్రారంభించాం.
ఈ పథకం లో భాగంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలం లో దేశం లో 5 వేల అటల్ టింకరింగ్ లాబ్స్ ను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోంది. నవ్య ఆలోచన లను వెలికి తెచ్చేందుకు స్మార్ట్ ఇండియా హ్యాకథన్ ను కూడా అమలుపరుస్తున్నాం.
మిత్రులారా,
స్వామి వివేకానందుడు సామాజిక, ఆర్థిక సమస్యల గురించి కూడా మాట్లాడారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారిని కూడా అత్యున్నత స్థాయి లో కూర్చున్న వారికి సమానంగా చేయగలిగినప్పుడే అసమానతలు తొలగిపోతాయని ఆయన అన్నారు. గత నాలుగు సంవత్సరాలు గా మేం ఇదే లక్ష్యంతో పని చేస్తున్నాం. జన్ ధన్ ఖాతాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ల ద్వారా బ్యాంకులే నిరుపేదల ముంగిటకు వెళ్తున్నాయి. ఇళ్లు లేని వారికి గృహ వసతి, గ్యాస్ మరియు విద్యుత్తు కనెక్షన్ లు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ల వంటి అనేక కార్యక్రమాలు నిరుపేదల అభ్యున్నతి ని దృష్టి లో పెట్టుకొని ప్రారంభించాం.
ఈ నెల 25వ తేదీన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దేశం లో ప్రారంభించబోతున్నాం. ఈ పథకం లో భాగంగా 10 కోట్ల కు పైగా కుటుంబాలకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కు ఐదు లక్షల రూపాయల వరకు సహాయం హామీ ఉంటుంది. ఈ పథకం లో చేరినందుకు తమిళ నాడు ప్రజలకు, ప్రభుత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను.
పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, దానికి మూలాన్ని కూడా నిర్మూలించాలన్నది మా లక్ష్యం.
పార్లమెంట్ పై ఉగ్రవాదులు జరిపిన 9/11 దాడుల దుర్దినం కూడా ఇదే రోజు న ఉన్న విషయాన్ని మీకు గుర్తుకు తీసుకు వస్తున్నాను. ఈ సమస్య కు ఏదో ఒక పరిష్కారాన్ని సాధించాలని ఎన్నో దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వామి వివేకానందుడు శికాగో లో ప్రవచించిన సహనం, ఆమోదం సిద్ధాంతం లోనే దానికి పరిష్కారం దాగి ఉంది.
“సహనాన్ని, విశ్వ ఆమోదనీయత ను ప్రపంచానికి బోధించిన మతం లో నేను ఉండడం గర్వకారణం” అని స్వామీ జీ ఆ రోజు న చెప్పారు.
ఆలోచనలను స్వేచ్ఛ గా పంచుకొనే సమాజం మన సమాజం. శతాబ్దాలు గా ఈ భూమి భిన్న సంస్కృతులకు, ఆలోచన లకు ఆలవాలం. “చర్చించు” “నిర్ణయించు” అనే సంప్రదాయం మన సంప్రదాయం. ప్రజాస్వామ్యం, చర్చ లు మన అంతర్గత విలువలు.
కానీ మిత్రులారా, ఆ దురాగతాలన్నింటి బారి నుండి మన సమాజం విముక్తం అయినట్లేమీ కాదు. విశిష్టమైనటువంటి వైవిధ్యానికి నిలయమైన ఇంతటి సువిశాలమైన దేశం లో అనేక గొప్ప సవాళ్లూ ఉన్నాయి.
“దాదాపుగా అన్ని యుగాల్లోనూ దుష్ట శక్తులు ఉండేవి” అని వివేకానందుడు చెబుతూ ఉండే వారు.
సమాజం లోని అటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉంటూ వాటిని ఓడించాలి. అన్ని శక్తులు మనకు ఉన్నప్పటికీ సమాజం చీలిపోయినప్పుడు, అంతర్గత వైషమ్యాలతో కునారిల్లినప్పుడు వెలుపలి శత్రువులు దానిని అవకాశం గా మలుచుకున్నాయి.
ఈ పోరాట కాలం లోనే మన రుషులు, సామాజిక సంస్కర్తలు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించారు. ఆ మార్గమే మనందరినీ తిరిగి దగ్గరకు చేర్చింది.
స్వామి వివేకానందుడు అందించిన స్ఫూర్తి తో మనం ‘న్యూ ఇండియా’ ను నిర్మించవలసివుంది.
మీ అందరికీ అనేక ధన్యవాదాలను తెలియచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. చారిత్రక కార్యక్రమం లో పాలుపంచుకొనే అవకాశాన్ని మీరందరూ నాకు కల్పించారు. స్వామీ జీ సందేశాన్ని చదివి అర్ధం చేసుకొని పోటీలలో పాల్గొని గెలిచిన పాఠశాలల్లోని, కళాశాలల్లోని వేలాది మంది మిత్రులకు అభినందనలు తెలియచేస్తున్నాను.
మీకు అందరికీ మరో మారు ధన్యవాదాలు.