ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్ము & కశ్మీర్ నుండి విచ్చేసిన 100 మందికి పైగా యువతీ యువకులతోను, బాలలతోను భేటీ అయ్యారు. వారంతా “వతన్ కో జానో” కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం భారతదేశంలోని వేరు వేరు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
జమ్ము & కశ్మీర్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి, క్రీడా సదుపాయాలను గురించి, విద్య మరియు ఉపాధి అవకాశాలను గురించి, ఇంకా ప్రధాన మంత్రి రోజువారీ విధులను గురించి యువతీయువకులు, బాలలు ప్రధాన మంత్రి ని పలు ప్రశ్నలు అడిగారు.
ప్రధాన మంత్రి వారితో సంభాషిస్తూ జమ్ము & కశ్మీర్ లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు, అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి వారికి వివరించారు. క్రీడలన్నా, క్రీడాకారుల స్ఫూర్తి అన్నా ప్రజలలో ఎంతటి ప్రాముఖ్యం ఉందో ప్రధాన మంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. కఠోర పరిశ్రమ ఎన్నటికీ అలసటకు దారితీయదని, ఒక పనిని పూర్తి చేయడం సంతృప్తిని ఇస్తుందని, ఆ సంతృప్తి ఎటువంటి నిస్సత్తువ కన్నా కూడా మిన్నగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి గా ఉన్న డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.