స్వచ్ఛభారత్ అభియాన్ (కార్యక్రమం)లో దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతం చేసేదిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా బాపూజీ కలలుగన్న ‘పరిశుభ్ర భారతం’ సాకారానికి జాతి ఉద్యమించేలా ప్రేరణనిచ్చారు. దేశంలో సంపూర్ణ పరిశుభ్రత లక్ష్యం సాధించడంలో ప్రజలు మరింతగా పాలుపంచుకునేందుకే ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమం ఈ రోజు ప్రారంభమైంది. అక్టోబరు 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమ నాలుగో వార్షికోత్సవంతోపాటు బాపూజీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి నాంది పలికారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ‘పరిశుభ్ర భారతం’ సృష్టికి సాగుతున్న కృషిని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమ శ్రీకారంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని 17 ప్రాంతాలకు చెందిన విభిన్నవర్గాల ప్రజలతో ప్రధానమంత్రి ముచ్చటించారు.
నాలుగేళ్ల కాలంలో దేశంలోని 450 జిల్లాలను బహిరంగ విసర్జనరహితం చేయడంలో సాధించిన విజయాన్ని తన తొలి పలుకుల్లో ఆయన ప్రస్తావించారు. ఇదే నాలుగేళ్లలో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ విసర్జనరహితంగా ప్రకటించుకోవడాన్ని గుర్తుచేశారు. అయితే- మరుగుదొడ్ల సౌకర్యం కల్పన, చెత్తబుట్టలు సమకూర్చడం వంటివాటితో మన లక్ష్యం పూరిపూర్ణం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘పరిశుభ్రత లేదా స్వచ్ఛత’ అన్నది దైనందిన అలవాట్లలో ఒకటి మారాల్సిన అవసరం ఎంతయినా ఉందని నొక్కిచెప్పారు. ఆ మేరకు ఈ అలవాటును పెంపొందించడంలో దేశ ప్రజలంతా తమవంతు భాగస్వామ్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు తమ విద్యాలయాన్ని, పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దిన వైనం గురించి ప్రధానమంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- సామాజిక మార్పులో యువతరమే ముందుతరం దూతలని కొనియాడారు.
పరిశుభ్రత సందేశాన్ని వారు వ్యాప్తిచేస్తున్న తీరు ప్రశంసనీయమని అభినందించారు. అలాగే ప్రధానితో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ రాష్ట్రం మెహసానాలోని పాడి, వ్యవసాయ సహకార సమాఖ్యల సభ్యులు కూడా స్వచ్ఛత కోసం తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కారణంగా డయేరియా వంటి వ్యాధుల ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ ప్రాంతం నుంచి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ- ముంబైలోని బీచ్‌ని శుభ్రం చేయడంసహా తాను పాల్గొన్న వివిధ పరిశుభ్రత కార్యకలాపాలను వివరించారు. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ప్రధానితో మాటామంతీలో భాగస్వామి అయ్యారు. పరిశుభ్ర భారతం దిశగా చేపట్టిన ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తూ గర్విస్తున్నానని చెప్పారు. స్వచ్ఛ భారతం ప్రతి భారతీయుడి స్వప్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- పరిశుభ్ర భారతం సృష్టిలో ప్రైవేటు రంగం కూడా ప్రధాన పాత్ర పోషించగలదన్న విశ్వాసం వెలిబుచ్చారు.
నోయిడా నుంచి దైనిక్ జాగరణ్ పత్రికకు చెందిన శ్రీ సంజయ్ గుప్తాసహా పలువురు సీనియర్ పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, పరిశుభ్రత కోసం తాము చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రతినబూనారు. జమ్ముకశ్మీర్ పరిధిలోని లడఖ్ ప్రాంతంలోగల అత్యంత ఎత్తయిన మంచుపర్వత శ్రేణుల్లోని పాంగాంగ్ సరస్సువద్ద సరిహద్దు రక్షణ బాధ్యతల్లో ఉన్న ఐటీబీపీ జవాన్లు కూడా మాటామంతీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ల ధైర్యసాహసాలను, దేశానికి వారు చేస్తున్న సేవను ప్రధానమంత్రి ప్రశంసించారు.
సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత ఉద్యమ ఉత్సాహం గణనీయ స్థాయికి చేరుకున్నట్లు తన పర్యటనల సందర్భంగా గమనించానని ఆయన పేర్కొన్నారు. ఇందుకు తగిన ఉత్తేజమివ్వడంలో ప్రధానమంత్రి అద్వితీయ పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. అయితే, ‘స్వచ్ఛ భారత్’ అన్నది ప్రభుత్వ లేదా ప్రధానమంత్రుల ఉద్యమం కాదని, ఇది మొత్తం జాతి చేపట్టిన ఉద్యమమని ప్రధాని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, తమిళనాడులోని సేలంల నుంచి మహిళా ‘స్వచ్ఛాగ్రహులు’ తాము చేపట్టిన స్వచ్ఛత కార్యకలాపాలను ప్రధానికి వివరించారు.
అలాగే పాట్నాసాహిబ్ గురుద్వారా నుంచి ఆధ్యాత్మిక గురువులు, మౌంట్ అబూ నుంచి దాది జానకి కూడా ప్రధానితో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ- ప్రధానమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ వాసులతోనూ ప్రధానమంత్రి ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బెంగళూరు నుంచి ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ కూడా ఇందులో పాల్గొన్నారు. దేశ ప్రజలు… ప్రత్యేకించి యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో ప్రధానమంత్రి ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నారని రవిశంకర్ కొనియాడారు.
గంగా నది ప్రక్షాళనలో పాలుపంచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని స్వచ్ఛంద కార్యకర్తలతోనూ ప్రధానమంత్రి ముచ్చటించారు. ‘గంగామాత’ పవిత్రత పునరుద్ధరణ కోసం వారు చేస్తున్న కృషిని ప్రదానమంత్రి కొనియాడారు. ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమంలో భాగంగా గంగా పరిశుభ్రత కృషిలో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అజ్మీర్ షరీఫ్ దర్గా నుంచి భక్తులు, హరియాణాలోని రేవారినుంచి రైల్వే సిబ్బంది కూడా ప్రధానితో ముచ్చటించారు. కేరళలోని కొళ్లం నుంచి మాతా అమృతానందమయి కూడా మాట్లాడారు.
ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ- స్వచ్ఛగ్రాహుల సేవలను కొనియాడుతూ, పరిశుభ్ర భారతం కోసం వారు చేసిన కృషిని చరిత్ర సదా గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. పరిశుభ్రత దిశగా మన దృఢ సంకల్పం, విశ్వాసాలకు ఆకాశమే హద్దని వివరిస్తూ- ‘స్వచ్ఛతే సేవ’ కోసం అలుపెరగకుండా శ్రమించాలని ప్రజలకు ఆహ్వానం పలికారు.