‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు ప్రారంభించారు. అన్ని ఇళ్ళకు విద్యుత్ ను అందించాలన్నదే ఈ పథకం ధ్యేయం.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒఎన్‌జిసి నూతన భవనం ‘దీన్ దయాళ్ ఊర్జా భవన్’ను ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేశారు.
అలాగే, బసీన్ గ్యాస్ క్షేత్రంలో బూస్టర్ కంప్రెసర్ ఫెసిలిటీ ని కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అత్యంత పేదలకు ఏ రకంగా ప్రయోజనకారిగా ఉన్నదీ ప్రముఖంగా వివరించడం కోసం జన్ ధన్ యోజన, బీమా పథకాలు, ముద్ర యోజన, ఉజ్జ్వల యోజన మరియు ‘ఉడాన్’ల గురించి చెప్తూ, ఈ పథకాలు విజయవంతం అయ్యాయన్నారు.
ఇదే సందర్భంలో ఆయన ప్రస్తుతం విద్యుత్తు సదుపాయం లేనటువంటి సుమారు 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు ను ‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ అందిస్తుందని ప్రస్తావించారు. ఈ పథకానికి వ్యయం 16,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ కనెక్షన్ లను బీదలకు ఉచితంగా అందించడం జరుగుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.
ఒక ప్రజెంటేషన్ అండతో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, విద్యుత్తు సౌకర్యం లేనటువంటి 18000 పైగా పల్లెలలో విద్యుత్తు సౌకర్యాన్ని 1000 రోజుల వ్యవధి లోగా సమకూర్చాలంటూ ఒక లక్ష్యాన్ని తాను విధించిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పటికీ విద్యుతీకరించవలసిన పల్లెలు 3000 కన్నా తక్కువే మిగిలివున్నాయని ఆయన చెప్పారు.
బొగ్గు కొరత సమస్యలు తెరమరుగైన అంశంగా ఎలా మారిందీ ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్తు ఉత్పాదనలో అదనపు సామర్ధ్యాన్ని జోడించే అంశంలో లక్ష్యాలను అధిగమించినట్లు వెల్లడించారు.
2022 కల్లా 175 గీగా వాట్ ల లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో నవీకరణ యోగ్య విద్యుత్తు యొక్క స్థాపిత సామర్ధ్యాన్ని పెంచినట్లు కూడా ప్రధాన మంత్రి చెప్పారు. నవీకరణ యోగ్య శక్తికి సంబంధించినంత వరకు పవర్ టారిఫ్ ను ఏ విధంగా గణనీయంగా తగ్గించిందీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రసార మార్గాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను సైతం నమోదు చేయడమైంది.
ఉదయ్ పథకం విద్యుత్తు పంపిణీ కంపెనీల నష్టాలను ఏ విధంగా తగ్గిస్తూ వచ్చిందీ ప్రధాన మంత్రి తెలియజేశారు. దీనిని సహకారాత్మకమైన, స్పర్ధాత్మకమైన సమాఖ్య విధానానికో ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
ఉజాలా పథకం ఏ మేరకు ఆదాకు దారితీసిందీ ప్రధాన మంత్రి చాటిచెప్తూ, ఎల్ఇడి బల్బుల తాలూకు వ్యయం గణనీయంగా దిగివచ్చిందన్నారు.
సమానత్వం, సామర్ధ్యం ఇంకా మన్నిక.. ఈ సూత్రం ఆధారంగా పని చేసే ఒక ఎనర్జీ ఫ్రేమ్ వర్క్ అనేది ‘న్యూ ఇండియా’కు అవసరమని ప్రధాన మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో పని సంస్కృతిలో వచ్చిన మార్పు శక్తి రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇది ఇక మీదట, యావత్ దేశంలో పని సంస్కృతిని సకారాత్మకంగా ప్రభావితం చేయగలుగుతుందని ఆయన అన్నారు.