ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 750 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాలను మణిపుర్ లో ఈ రోజు ప్రారంభించారు. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయానికి, 1000 ఆంగన్ వాడీ కేంద్రాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, అనేక ఇతర ముఖ్యమైన అభివృద్ధి పథకాలకు కూడా శ్రీకారం చుట్టారు. లువాంగ్ పోక్ పా మల్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, రాణి గైడిన్‌లియూ పార్కు ను, మరియు ఇతర ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. లువాంగ్ సంగ్ బమ్ లో జరిగిన జన సభ లోనూ ఆయన ప్రసంగించారు.
ఉత్సాహంగా తరలి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఒక సంవత్సర కాలంలో చేసిన కృషిని అభినందించారు.
ఈ రోజు ఆరంభించిన పథకాలు యువజనుల ఆకాంక్షలకు మరియు ప్రతిభకు, వారి ఉద్యోగాలకు, మహిళల సాధికారితకు మరియు అనుసంధానానికి సంబంధించినవి అని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతాలలో యువజనుల ప్రతిభను మరియు క్రీడా సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే పరిచయం చేసిన ఖేలో ఇండియా కార్యక్రమం తాలూకు గరిష్ట ప్రయోజనాన్ని పొందవలసిందిగా మణిపుర్ యువతీయువకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా ఆటలలో చక్కని ప్రదర్శనను ఇచ్చినందుకు గాను మణిపుర్ ను ఆయన ప్రశంసించారు. మల్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శిక్షణకు మరియు పోటీలకు అవకాశాలను ప్రసాదిస్తుందని ఆయన అన్నారు.
మహిళల సాధికారితకు క్రీడలు ఎలాగ ఒక సాధనం కాగలవో మణిపుర్ నిరూపించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. సరితా దేవి మరియు మీరాబాయి చానూ లు సహా రాష్ట్రంలోని ప్రఖ్యాత క్రీడాకారులను ఆయన మెచ్చుకొన్నారు. అలాగే, మహిళా సాధికారితకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈ రోజు పునాది రాయి వేసినటువంటి 1000 ఆంగన్ వాడీ కేంద్రాలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవలే ప్రారంభించిన ‘జాతీయ పోషణ అభియాన్’ ను గురించి సైతం ఆయన మాట్లాడారు.
‘రవాణా ద్వారా పరివర్తన’ అనేది ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దార్శనికతగా ఉన్నట్లు ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశం వృద్ధికి ఈశాన్య ప్రాంతాలుఒక కొత్త చోదక శక్తి కాగలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఈశాన్య ప్రాంతాలు వృద్ధి చెందేటట్టు ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల ప్రత్యేక అవసరాలను నెరవేర్చుతోందని ఆయన తెలిపారు. తాను గత 4 సంవత్సరాలలో 25 సార్లకు పైగా ఈశాన్య ప్రాంతాలను స్వయంగా సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలో అవస్థాపనను మెరుగు పరచడంపై కేంద్ర ప్రభుత్వం బృహత్ ప్రయత్నం చేసినట్లు ప్రధాన మంత్రి వివరించారు. ఈ ప్రాంతంలో రహదారులు మరియు రైలు మార్గ అనుసంధానాన్ని మెరుగుపరచేందుకు తీసుకొన్న కార్యక్రమాలను గురించి ఆయన ఏకరువు పెట్టారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు నిర్దిష్ట వ్యవస్థలతో ముఖాముఖి సహా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పౌర ప్రధాన కార్యక్రమాలను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన ఐఎన్ఎ స్వాతంత్య్రం కోసం 1944 ఏప్రిల్ లో పిలుపును ఇచ్చింది మణిపుర్ లోనే అని ఆయన గుర్తుకు తెచ్చారు. ఒక ‘న్యూ ఇండియా’ ఉన్నతి లో ముఖ్యమైన పాత్రను పోషించాలని నేడు మణిపుర్ నిర్ణయించుకొందని ఆయన అన్నారు.