ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారాణసీ లో బడి పిల్లల తో సమావేశమై, సుమారు తొంభై నిమిషాల పాటు వారి తో ఉన్నారు.
నరూర్ గ్రామం లోని ఒక ప్రాథమిక పాఠశాల కు ఆయన విచ్చేసినప్పుడు బడి పిల్లలు ఉత్సాహం గా ఆయన కు ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా చిన్నారుల కు శుభాకాంక్షలు తెలియజేసి, రక రకాల నైపుణ్యాలను నేర్చుకోవడం ముఖ్యమని సూచించారు.
విద్యార్థులు గా ప్రశ్నలు అడగడం కీలకమైన విషయమని ప్రధాన మంత్రి అన్నారు. ప్రశ్నలు వేయడానికి ఎన్నడూ భయపడ వద్దని విద్యార్థుల తో ఆయన చెప్పారు. ప్రశ్నించడం నేర్చుకోవడం లో ఒక కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు.
లాభాపేక్ష లేనటువంటి ‘‘రూమ్ టు రీడ్’’ సంస్థ చేయూత ను అందిస్తున్న విద్యార్థుల తో ప్రధాన మంత్రి చాలా సేపు గడిపారు.
ఆ తరువాత, డిఎల్‌డబ్ల్యు వారాణసీ లో పేదలు మరియు అనాదరణకు గురైన వర్గాల వారి పిల్లల తో ప్రధాన మంత్రి భేటీ అయ్యారు. ఈ విద్యార్థులు కాశీ విద్యాపీఠ్ నుండి సహాయాన్ని అందుకొంటున్నారు. శ్రద్ధ తో విద్య ను అభ్యసిస్తూ, మరి అలాగే ఆటల లో సైతం మక్కువను కలిగివుండండంటూ వారికి ఆయన ఉద్బోధించారు.
సాయంత్రం పూట ప్రధాన మంత్రి వారాణసీ వీధుల గుండా ప్రయాణిస్తూ, నగరం లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరు ను పరిశీలించారు. పూజలు చేయడానికని కొద్ది నిమిషాల సేపు కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. మండువాడీహ్ రైల్వే స్టేషన్ ను కూడా ఆయన ఆకస్మికం గా సందర్శించారు.