దేశంలో కోవిడ్-19 మహమ్మారి తాజా స్థితిపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మత సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు.
దేశ ప్రయోజనాల కోసం సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేయగలవనేందుకు ఈ సమావేశం మరో చక్కని ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. కోవిడ్-19 సందర్భంగా ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొనడంలో ఆయా సంస్థలు చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. మహమ్మారి ప్రభావంతో బాధితులైన ప్రజలకు కుల, మతాలకు అతీతంగా అందిన సహాయం “ఏక్ భారత్-ఏక్ నిష్ఠతా ప్రయాస్” సిద్ధాంతానికి మరో చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాలుగా పరివర్తన చెందడమే కాకుండా కష్టాల్లో ఉన్న వారికి అవసరమైన ఆహారం, మందులు కూడా అందించాయని చెప్పారు.
వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేయించేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చిస్తూ “సబ్ కో వ్యాక్సిన్ ముఫ్త్ వ్యాక్సిన్” ప్రచారం ఒక్కటే కరోనాను పోరాడే రక్షణ కవచంగా నిలుస్తుందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ పై చైతన్యం కల్పించేందుకు, వ్యాక్సిన్ విషయంలో ప్రచారంలోకి వచ్చిన వదంతులు, గందరగోళం తిప్పికొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలవాలని మత, సామాజిక సంఘాల నాయకులను ఆయన కోరారు. ప్రత్యేకించి వ్యాక్సిన్ పట్ల తీవ్ర విముఖత ఉన్న ప్రాంతాల్లో మరింత సహకారం అవసరమని ఆయన చెప్పారు. మన ఆరోగ్య కార్యకర్తలు దేశంలోని ప్రతీ ఒక్క పౌరునికి దగ్గర కావడానికి ఇది ఎంతో సహాయపడుతుందని ఆయన అన్నారు.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ అందరూ భాగస్వాములు కావాలని నాయకులకు ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. “అజాదీ కా అమృత్ మహోత్సవ్”లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా “భారత్ జోడో ఆందోళన్” నిర్వహించేందుకు మనందరం చేతులు కలపాలని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వాస్తవ స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపు ఇచ్చారు.
కేంద్రీయ ధార్మిక జనమోర్చా కన్వీనర్, జమాత్-ఇ-ఇస్లామీ హిందీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సలీమ్ ఇంజనీర్; ఉత్తర ప్రదేశ్ కు చెందిన భారతీయ సర్వధర్మా సంసద్ జాతీయ కన్వీనర్, మహాఋషి పీఠాధీశ్వర్ గోస్వామి సుశీల్ మహరాజ్; న్యూఢిల్లీకి చెందిన ఓంకార్ ధామ్ పీఠాధీశ్వర్ స్వామి ఓంకారానంద్ సరస్వతి; న్యూఢిల్లీకి చెందిన గురుద్వారా బంగ్లా సాహిబ్ చీఫ్ గ్రంథి సింగ్ సాహిబ్ జ్ఞాని రంజిత్ సింగ్; న్యూఢిల్లీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్మనీ అండ్ పీస్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఎం.డి.థామస్; అఖిల భారత రవిదాసీయ ధర్మ సంఘటన్ ప్రెసిడెంట్ స్వామి వీర్ సింగ్ హిత్ కారి; జైపూర్ గల్టా పీఠ్ స్వామి సంపత్ కుమార్; న్యూఢిల్లీకి చెందిన అంతర్జాతీయ మహావీర్ జైన్ మిషన్ ప్రెసిడెంట్ ఆచార్య వివేక్ ముని; న్యూఢిల్లీకి చెందిన లోటస్ టెంపుల్, ఇండియన్ బహాయి కమ్యూనిటీ జాతీయ ట్రస్టీ, కార్యదర్శి డాక్టర్ ఎ.కె.మర్చంట్; న్యూఢిల్లీలోని రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్ స్వామి శంతాత్మానంద్; హర్యానాకు చెందిన ఓంశాంతి రిట్రీట్ సెంటర్ సిస్టర్ బి.కె.ఆశా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ చర్చ నిర్వహించినందుకు మత నాయకులు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కోవిడ్ పై పోరాటంలో ఆయన చూపిన నిర్ణయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు. కోవిడ్-19 విసిరిన సవాలును ఎదుర్కొనడంతో మత, సామాజిక సంఘాలు చేసిన అసాధారణమైన కృషి గురించి వారు ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చైతన్యం విస్తరించేందుకు వారు తమ మద్దతు ప్రకటిస్తూ మూడో వేవ్ ను నివారించేందుకు సూచనలు కూడా అందచేశారు.