ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు, నారీశక్తి పురస్కార గ్రహీతలను కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, సేవా పరమో ధర్మ అన్నది మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు.
అవార్డు గ్రహీతలు ఇతరులకు సేవ చేయడమే లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. వీరి కృషి, వీరి సేవలు లబ్ధి పొందిన వారికే కాక, సమాజానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, ఆయన అన్నారు. దేశం ప్రస్తుతం సిస్టర్ నివేదిత 150 జయంతిని జరుపుకుంటున్నదని, ఆమె నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతిరూపమని ప్రధాని కొనియాడారు.
సమాజ సేవకు కృషి చేయడం అనేది భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉన్నదని అంటూ ప్రధాని, ధర్మశాలలు, గోశాలల రూపంలోను, విద్యాసంస్థల రూపంలోనూ ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తుందని అన్నారు.
మహిళ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.