కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ రెండోదశ అసాధారణ పరిస్థితులపై ఆదర్శప్రాయ పోరాటం చేస్తున్న వైద్య లోకానికి, అనుబంధ విధుల సిబ్బందికి ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇందుకుగాను దేశం మొత్తం వారికి రుణపడి ఉన్నదని చెప్పారు. రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల సరఫరా లేదా రికార్డు సమయంలో కొత్త మౌలిక వసతుల కల్పన... అది ఏదైనప్పటికీ ఇవన్నీ అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో ఎదురైన అనేక సమస్యలను త్వరగానే అధిగమించామని పేర్కొన్నారు. మానవ వనరుల పెంపు దిశగా మన దేశం చేపట్టిన చర్యల్లో కోవిడ్ చికిత్స కోసం ‘ఎంబీబీఎస్’ విద్యార్థులను నియమించడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవల బాధ్యతను ‘ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగించడం వంటివి ఆరోగ్య వ్యవస్థకు అదనపు మద్దతునిచ్చాయని పేర్కొన్నారు.
కోవిడ్‌పై పోరులోగల ముందువరుస యోధులతో టీకాల కార్యక్రమం ప్రారంభించే వ్యూహం రెండో దశలో ఎనలేని ఫలితాలనిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని ఆరోగ్యరంగ సిబ్బందిలో దాదాపు 90 శాతం టీకా తొలి మోతాదు తీసుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా వైద్యులలో అనేకమందికి టీకాలు ఎంతో భరోసానిచ్చాయని పేర్కొన్నారు.
ఆక్సిజన్ వినియోగంపై పర్యవేక్షణను వైద్యులు తమ రోజువారీ విధుల్లో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. పెద్ద సంఖ్యలో రోగులు ‘ఏకాంత గృహవాస చికిత్స’ పొందుతున్నారని గుర్తుచేస్తూ- ఈ గృహాధార వైద్య సంరక్షణకు ప్రామాణిక విధాన ప్రక్రియ తప్పనిసరి ప్రాతిపదికగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోగులకు ‘ఏకాంత గృహవాస చికిత్స’లో దూరవాణి వైద్యసేవ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో దూరవాణి సేవలు అందించడంపై వారిని కొనియాడారు. అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి బృందాల ఏర్పాటు చేయాలని, తుది సంవత్సరం ‘ఎంబీబీఎస్’ విద్యార్థులతోపాటు శిక్షణలోగల విద్యార్థి వైద్యులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా దేశంలోని అన్ని జిల్లాలు, తాలూకాల్లో దూరవాణి వైద్యసేవలకు భరోసా దిశగా కృషిచేయాలన్నారు.
బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకోర్‌మైకోసిస్ సవాలుపైనా ప్రధానమంత్రి వైద్యులతో చర్చించారు. దీనిపై చురుకైన చర్యల దిశగా వైద్యులు మరింత కృషి చేయాలని, అలాగే దీనిపై అవగాహన పెంచడానికీ ప్రయత్నించాల్సి ఉందని ఆయన అన్నారు. శారీరక సంరక్షణకుగల ప్రాధాన్యంతోపాటు మానసిక సంరక్షణ ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కిచెప్పారు. వైరస్‌పై ఈ సుదీర్ఘ యుద్ధంలో నిరంతరం పోరు సాగించాల్సిన పరిస్థితి వైద్య లోకానికి మానసికంగా సవాలు అనడంలో సందేహం లేదన్నారు. అయితే, ఈ పోరాటంలో వారిపై పౌరులకుగల విశ్వాసం ఇచ్చే శక్తి ఆయుధం కాగలదని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇటీవల కేసుల విజృంభించినపుడు ప్రధానమంత్రి మార్గదర్శనంపై ఈ సమావేశంలో వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. టీకాలివ్వడంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడంపై వైద్యులు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. కోవిడ్ తొలిదశతోపాటు రెండోదశలో ఎదురైన సవాళ్లదాకా తమ సంసిద్ధత గురించి వారు ప్రధానికి తెలియజేశారు. అలాగే తమ అనుభవాలు, అనుసరించిన ఉత్తమ పద్ధతులు, వినూత్న కృషి తదితరాలను ఆయనతో పంచుకున్నారు. మహమ్మారిపై పోరాటంసహా కోవిడేతర రోగులకు సముచిత సంరక్షణలోనూ వీలైనంత కృషి చేశామని చెప్పారు. ప్రజల్లో అన్నివిధాలా అవగాహన పెంపు, మందుల అనుచిత వాడకంపై చైతన్యం తేవడం వంటి అంశాలపై తమ అనుభవాలను తెలిపారు. నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడితోపాటు ఆరోగ్య, ఔషధ శాఖల కార్యదర్శులు, ప్రధాని కార్యాలయంసహా కేంద్ర ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.