ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లో వ్యాపార రంగ ప్రముఖుల తో ఈ రోజు భేటీ అయ్యి వారితో ముఖాముఖి సంభాషించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో భాగమైన పలు విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 41 మంది వ్యాపార రంగ ప్రముఖులు ఈ సమావేశంలో పాలుపంచుకొన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో ప్రవేశపెట్టిన విధానపరమైన సంస్కరణలు మరియు కార్యక్రమాలు రెండు గంటలకు పైగా సాగిన సమావేశంలో సమగ్రంగా చర్చ కు వచ్చాయి. ఆర్థిక వృద్ధి కి, ఇంకా అభివృద్ధి కి పారిశ్రామిక రంగం అందించిన తోడ్పాటు ను గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
దేశంలో వ్యాపార సంబంధ వాతావరణంలోని మెరుగుదలను పరిశ్రమ కు చెందిన అనేక మంది ప్రతినిధులు ప్రశంసించారు. ఇది భారతదేశ వృద్ధి అవకాశాలు నెరవేరడంలో తోడ్పడగలదని వారు అన్నారు. ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి ‘న్యూ ఇండియా’ యొక్క దార్శనికత కు వారు వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు.
నవ పారిశ్రామికులతోను, స్టార్ట్-అప్ లతోను తాను ఇటీవల జరిపిన చర్చలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. దేశంలో ప్రస్తుతం ఒక సకారాత్మకమైన ఆలోచనల సరళి, ఇంకా ‘‘సాధించగలుగుతాము’’ అనేటటువంటి ఒక స్ఫూర్తి పరివ్యాప్తం అవుతున్నాయని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలని- ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఈ పని చేయాలని- కార్పొరేట్ రంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశీయంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేస్తూ వైద్య ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగ సామగ్రి వంటి రంగాలలో ఉత్పత్తిని పెంపొందించవలసిన ఆవశ్యకతను గురించి చెప్పుకొచ్చారు.
అంతక్రితం, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశ గా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో చేపట్టిన కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణల యొక్క ప్రేరణ, అభివృద్ధి సాధన కోసం పరిపూర్ణమైన విధానాలతో పాటు విధానపరమైన చొరవలను గురించి కూడా ఆయన వివరించారు.