భారతదేశం లో అత్యంత ప్రధానమైన హైడ్రో కార్బన్ సదస్సు పెట్రోటెక్-2019ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోడియా ఇండియా ఎక్స్ పో సెంటర్ లో ఈ రోజు ప్రారంభించారు.
సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఇంధనమే అత్యంత కీలకమైన చోదకశక్తి అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. “ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన పురోగమించాలంటే న్యాయబద్ధమైన ధర నిర్ణయించిన, స్థిరమైన, సుస్థిర ఇంధన విధానం చాలా అవసరం. పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలు కూడా ఆర్థిక ప్రయోజనాలు అందుకోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
ఇంధన వినియోగం పాశ్చాత్య దేశాల నుంచి తూర్పు దేశాలకు మారిందంటూ షేల్ విప్లవం అనంతరం అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి దేశంగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. చౌకధరలకే లభించే పునరుత్పాదక ఇంధన వనరులు, సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్ అప్లికేషన్లు సమీకృతమవుతున్నాయనేందుకు సంకేతాలున్నాయంటూ పలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. అయితే “అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించగల బాధ్యతాయుతమైన ధరలు నిర్ణయం కావలసిన తరుణం ఇది. ఆయిల్, గ్యాస్ రెండింటికీ పారదర్శకమైన, చలనశీలత గల మార్కెట్లు రూపు దిద్దుకోవాలి. అప్పుడే మనం మానవతా అవసరాలను గరిష్ఠస్థాయిలో తీర్చగలుగుతాం” అని ప్రధానమంత్రి అన్నారు.
వాతావరణ మార్పులను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం అంతా చేతులు కలపాల్సిన అవసరం ఉన్నదంటూ పారిస్ లోని సిఓపి-21లో నిర్ణయించుకున్న లక్ష్యాల సాధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ కట్టుబాట్లను అమలుపరిచే దిశగా భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని ఆయన తెలిపారు.
ఇంధన రంగానికి అందించిన సేవలు, ఇంధన రంగానికి సంబంధించిన విజన్ కలిగి ఉన్నందుకు గౌరవ డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్ ను ప్రధానమంత్రి అభినందించారు. ఇండస్ర్టీ 4.0 కొత్త టెక్నాలజీలు, ప్రాసెస్ ల సహాయంతో ప్రపంచంలో పరిశ్రమలు పని చేసే విధంగా వాటి తీరులో పరిపూర్ణమైన పరివర్తన తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో మన కంపెనీలన్నీ సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు, భద్రత పెంపునకు, వ్యయనియంత్రణకు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రజలందరికీ స్వచ్ఛమైన ఇంధనాలు అందుబాటు ధరల్లో సుస్థిరమైన, సమతూకమైన విధంగా అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “మనం మరింతగా ఇంధనం అందుబాటులో ఉండే శకంలోకి అడుగుపెడుతున్నాం. అయినా ప్రపంచవ్యాప్తంగా ఇంకా వందల కోట్ల సంఖ్యలో ప్రజలకు విద్యుత్ అందుబాటులో లేదు.ఇంకా ఎంతో మందికి స్వచ్ఛమైన వంట ఇంధనాలు అందుబాటులో లేవు” అని ఆయన విమర్శించారు. అందరికీ ఇంధనం అందుబాటులో ఉంచే దిశగా భారతదేశం నాయకత్వ స్థానం అక్రమించిందని ఆయన చెప్పారు.
ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెబుతూ 2030 నాటికి ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగాను, మూడవ అతి పెద్ద ఇంధన వినియోగదేశంగాను మారనున్నదన్నారు. 2040 నాటికి దేశంలో ఇంధన డిమాండు రెట్టింపు దాటి పెరిగే ఆస్కారం ఉన్నందు వల్ల ఇంధన కంపెనీలకు భారతదేశం ఆకర్షణీయమైన మార్కెట్ అని ఆయన చెప్పారు.
2016 డిసెంబర్ లో జరిగిన పెట్రోటెక్ సదస్సులో భారత ఇంధన భవిష్యత్తుకు ఇంధనం అందుబాటు, ఇంధన సామర్థ్యం, ఇంధన సుస్థిరత, ఇంధన భద్రత కీలకమైన నాలుగు మూల స్తంభాలని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇంధన న్యాయం కూడా భారతదేశానికి అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన అన్నారు. “ఈ దిశగా మేం ఎన్నో విధానాలు రూపొందించి అమలుపరుస్తున్నాం. ఆ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది” అని ఆయన చెప్పారు. ప్రజలకు తమ సామూహిక శక్తిపై విశ్వాసం ఏర్పడినప్పుడే ఇంధన న్యాయం సాధించినట్టవుతుంది అని ఆయన అన్నారు.
దేశంలో “నీలి జ్వాలల విప్లవం” విస్తరిస్తున్నదని ఆయన అన్నారు. ఎల్ పిజి కవరేజి 90 శాతం దాటిందంటూ అందులో 55 శాతం గత ఐదు సంవత్సరాల కాలంలోనే సాధించగలిగినట్టు ఆయన చెప్పారు. “గత ఐదేళ్ల కాలంలో భారత ఆయిల్, గ్యాస్ ఎన్నో ప్రధాన సంస్కరణలు చోటు చేసుకున్నాయి. భారతదేశం ప్రపంచంలో రిఫైనింగ్ సామర్థ్యంలో నాలుగో పెద్ద దేశంగా మారింది. 2030 నాటికి అది 20 కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి విస్తరిస్తుంది” అని ప్రధానమంత్రి చెప్పారు.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశం త్వరిత పురోగతి సాధిస్తోందని ఆయన చెప్పారు. 16 వేల కిలోమీటర్ల నిడివి గల గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని, మరో 11 వేల కిలోమీటర్ల నిడివి గల పైప్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. సిటీ గ్యాస్ పంపిణీకి 10వ విడత బిడ్డింగ్ ప్రక్రియలో 400 జిల్లాలను చేర్చామని, 70 శాతం జనాభాకు సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు.
పెట్రోటెక్ 2019లో ప్రపంచ ఆయిల్, గ్యాస్ రంగంలోని దిగ్గజాలందరూ పాల్గొంటున్నారు. గత 25 సంవత్సరాల కాలంలో ఇంధన రంగానికి సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలపై చర్చించేందుకు పెట్రోటెక్ చక్కని వేదికగా నిలిచింది. ఇంధన రంగం భవిష్యత్తుకు ఆధారనీయమైన వేదిక అందించడమే కాకుండా ఆ రంగంలో ప్రపంచ దేశాల్లో చోటు చేసుకునే మార్పులు, పరివర్తన, విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రతిబింబిస్తూ ఇంధన మార్కెట్ స్థిరత్వం, భవిష్యత్ పెట్టుబడులను ప్రభావితం చేసే శక్తిగా నిలిచింది.