The time is ripe to redefine ‘R&D’ as ‘Research’ for the ‘Development’ of the nation: PM Modi
Science is after all, but a means to a far greater end; of making a difference in the lives of others, of furthering human progress and welfare: PM
An 'Ethno-Medicinal Research Centre' has been set up in Manipur to undertake research on the wild herbs available in the North-East region: PM
State Climate Change Centres have been set up in 7 North-Eastern States: PM Modi
Our scientific achievements need to be communicated to society. This will help inculcate scientific temper among youth, says the Prime Minister
We are committed to increasing the share of non-fossil fuel based capacity in the electricity mix above 40% by 2030: Prime Minister
We have set a target of 100 GW of installed solar power by 2022: PM Narendra Modi
We have to be future ready in implementing technologies vital for the growth and prosperity of the nation, says PM Modi
I call upon the scientific community to extend its research from the labs to the land: PM

మ‌ణిపుర్ గ‌వ‌ర్న‌ర్‌ డాక్ట‌ర్ న‌జ్మా హెప్తుల్లా,

మ‌ణిపుర్ ముఖ్య‌మంత్రి శ్రీ ఎన్‌. బీరేన్ సింగ్‌,

నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధ‌న్‌,

ఇంకా వేదికను అలంకరించిన ఇత‌ర ఉన్నతాధికారులు,

ప్ర‌తినిధులు,

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఇటీవల మనం కోల్పోయిన చాలా ప్రముఖ శాస్త్ర‌వేత్త‌లు ముగ్గురు.. ప‌ద్మ విభూష‌ణ్ ప్రొఫెస‌ర్ య‌శ్ పాల్‌, ప‌ద్మ విభూష‌ణ్ ప్రొఫెస‌ర్ యు.ఆర్. రావు, ప‌ద్మ శ్రీ డాక్ట‌ర్ బ‌ల్ దేవ్ రాజ్.. లకు ఘ‌న‌మైన నివాళులను అర్పించడం ద్వారా నేను నా ప్ర‌సంగాన్ని ఆరంభిస్తాను. వారంతా భార‌త‌దేశ విజ్ఞ‌ాన శాస్త్ర రంగానికి, విద్య రంగానికి విశిష్టమైన సేవ‌ల‌ను అందించారు.

మ‌న కాలానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త శ్రీ స్టీఫన్ హాకింగ్. ఆయ‌న మృతితో ప్ర‌పంచ‌మంతా విషాద ఛాయ‌లు అలుముకొన్నాయి. ఆయ‌న ఆధునిక అంత‌రిక్ష శాస్త్రంలో నిత్యం వెలిగే న‌క్ష‌త్రం. ఆయ‌న భార‌తదేశానికి స్నేహితుడు. రెండు సార్లు మ‌న‌ దేశాన్ని సంద‌ర్శించారు. భార‌త‌దేశం లోని సాధార‌ణ పౌరునికి కూడా స్టీఫన్ హాకింగ్ పేరు తెలుసు. కార‌ణం ఆయ‌న కృష్ణ బిలాల‌ పైన చేసిన ప‌రిశోధ‌న‌లు కాదు. ఆయ‌న త‌న‌కు ఎదురైన అన్ని ర‌కాల అడ్డంకుల‌ను ఎదుర్కొని అత్యున్న‌త‌మైన అసాధార‌ణమైన నిబ‌ద్ద‌త‌తో, స్ఫూర్తితో జీవించడ‌మే దీనికి కార‌ణం. ప్ర‌పంచంలో అతి గొప్ప స్ఫూర్తిని అందించే వ్య‌క్తులలో ఒక‌రుగా ఆయ‌న పేరు చ‌రిత్ర‌లో చిరకాలం నిలచిపోతుంది.

మిత్రులారా,

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105వ స‌మావేశం సంద‌ర్భంగా ఇంఫాల్ కు రావ‌డం నాకు ఎంత‌గానో సంతోషాన్ని ఇస్తోంది. రేప‌టి మెరుగైన రోజుల‌ కోసం దారులు వేసే శాస్త్ర‌వేత్త‌ల‌ మ‌ధ్య‌ గ‌డ‌ప‌డం నాకు ఆనందంగా ఉంది. ఎంతో ముఖ్య‌మైన ఈ స‌మావేశానికి మ‌ణిపుర్ విశ్వ‌విద్యాల‌యం ఆతిథేయిగా ఉండడం సంతోష‌దాయకం. ఈశాన్య భార‌త‌దేశంలో ఈ విశ్వ‌విద్యాల‌యం ఒక ప్ర‌ధాన మైన ఉన్నత విద్యాకేంద్రంగా అవ‌త‌రిస్తోంది. ఈశాన్య భార‌త‌దేశంలో సైన్స్ కాంగ్రెస్ ను నిర్వ‌హించ‌డం శ‌తాబ్ద‌ కాలంలో ఇది కేవ‌లం రెండో సారి అని నాకు తెలిసింది. ఈశాన్య భార‌త‌దేశంలో పుంజుకొంటున్న స్ఫూర్తికి ఇది నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఇది శుభ‌క‌ర‌మైన భ‌విష్య‌త్తుకు సంకేతం. అనాదిగా ప్ర‌పంచం సాధిస్తున్న ప్ర‌గ‌తి, సౌభాగ్యాల‌కు విజ్ఞ‌ాన శాస్త్రమే కార‌ణం. మీరంద‌రూ భార‌త‌దేశానికి చెందిన ఉత్త‌మ‌మైన శాస్త్ర‌వేత్త‌లు. మీరంతా విజ్ఞాన భాండాగారాలు. ఆవిష్క‌ర‌ణ‌, సంస్థాగ‌త‌మైన స్వ‌భావంతో మీరు ఈ దేశంలో ప్ర‌గ‌తిని ముందుకు తీసుకుపోగ‌ల‌రు.

పరిశోధన ను మరియు అభివృద్ధి ని (ఆర్ & డి) ని పున‌ర్ నిర్వ‌చించే స‌మ‌యం వ‌చ్చింది. ఆర్ అండ్ డి అంటే రిసెర్చ్ ఫ‌ర్ ది డివెలప్ మెంట్‌. దీనిని దేశం యొక్క అభివృద్ధి కోసం చేసే ప‌రిశోధ‌న‌గా భావించాలి. శాస్త్ర విజ్ఞానం అంటే ప్ర‌జ‌ల జీవితాలలో మార్పు ను తీసుకు వచ్చేది. మాన‌వ ప్ర‌గ‌తిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయేది. త‌గిన శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను అందించడం ద్వారా, శాస్త్ర‌సాంకేతిక విజ్ఞానాల‌ ద్వారా దేశం లోని 125 కోట్ల మంది సుల‌భ‌త‌రంగా జీవించ‌డానికి నిబ‌ద్ద‌త‌తో కృషి చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

నేను ఇవాళ ఇక్కడి సాహ‌సోపేత భూమి మణిపుర్ గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నాను. 1944 ఏప్రిల్ నెల‌లో నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ సార‌థ్యం లోని ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ స్వాతంత్ర్య పోరాటం లోకి రావాల‌ంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది ఈ గడ్డ మీది నుండే. ఈ స‌మావేశం త‌రువాత మీరు మణిపుర్ వ‌దలి మీ ప్రాంతాల‌కు వెళ్లే స‌మ‌యంలో ఈ దేశం కోసం చిర‌ స్థాయిగా నిలచిపోయే ప‌ని చేయాల‌నే నిబ‌ద్ద‌త‌తో కూడిన స్ఫూర్తిని వెంట తీసుకుపోతార‌ని నాకు న‌మ్మ‌కంగా ఉంది. ఇక్క‌డ మీరు భేటీ అయినటువంటి శాస్త్ర‌వేత్త‌ల‌తో క‌లసి ముందు ముందు మీరు మీ ప‌నిని కొన‌సాగిస్తార‌ని నాకు పూర్తి న‌మ్మ‌కంగా ఉంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పుట్టుకొచ్చే పెద్ద స‌మ‌స్యల‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిష్కారాలు కావాలంటే వివిధ రంగాల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌ల మ‌ధ్య‌ స‌మ‌ర్థ‌వంత‌మైన స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్ర‌భుత్వం అనేక శాస్త్ర విజ్ఞాన రంగ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. గ్రామీణ్ కృషి మౌస‌మ్ సేవా ప‌థ‌కంలో భాగంగా వ్య‌వ‌సాయ వాతావ‌ర‌ణ సేవ‌ల‌ను అందించ‌డం జ‌రుగుతోంది. దీని వ‌ల్ల 5 ల‌క్షల మంది అన్న‌దాత‌లు ల‌బ్ధిని పొందుతారు. ఈశాన్య రాష్ట్రాలలోని ప‌లు జిల్లాల్లో ఈ నెట్ వ‌ర్క్ ను విస్త‌రించ‌డానికి ప్ర‌స్తుతం మేం కృషి చేస్తున్నాం. ప‌లు నూత‌న కేంద్రాలు ఈశాన్య రాష్ట్రాల‌ కోసం అనుకూల‌మై శాస్త్ర‌ సాంకేతిక‌తలను తీసుకు వస్తున్నాయి. ప‌లు సంప్ర‌దాయ జాతుల మందుల‌ పైన అధ్య‌యనం చేసే కేంద్రాన్ని మణిపుర్ లో ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్క‌డ‌ మాత్ర‌మే ల‌భించే అనేక సంప్ర‌దాయ మందులు, సుగంధ ద్ర‌వ్యాల మూలిక‌లు ఉన్నాయి. మణిపుర్ లో ప్రారంభించిన కేంద్రం ఈ మూలిక‌ల‌ పైన ప‌రిశోధ‌న‌లు చేస్తుంది.

ఏడు ఈశాన్య రాష్ట్రాలలో వాతావ‌ర‌ణ మార్పుల‌ను తెలియ‌జేసే కేంద్రాలను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ కేంద్రాలు వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను విశ్లేష‌ణ చేసి, వాటి పైన ప్ర‌జ‌ల్లో త‌గిన అవ‌గాహ‌న ను పెంచుతాయి. గ‌తంలో వెదురును చెట్టు కింద ప‌రిగ‌ణించే వారు. ఈ నియ‌మాన్ని ర‌ద్దు చేసి గ‌డ్డి జాతి కింద‌కు తెచ్చాం. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కొన‌సాగిన చ‌ట్టాల‌ను ఇందుకోసం స‌వ‌రించ‌డం జ‌రిగింది. ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ కార‌ణంగా వెదురును చాలా సులువుగా త‌ర‌లించ‌డం జ‌రుగుతుంది. దీనివ‌ల్ల ఉత్ప‌త్తి కేంద్రాలు, వినియోగ‌ కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క‌లిసి పోయి పని చేస్తాయి. వెదురు జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన మొత్తం విలువ యొక్క‌ వాస్త‌వ సామ‌ర్థ్యాన్ని రైతులు పొంద‌గ‌లుగుతారు. జాతీయ వెదురు కార్య‌క్ర‌మానికి రూ.1200 కోట్ల‌ను కేటాయించ‌డం ద్వారా ఈ మిష‌న్ ను పున‌ర్ నిర్మించ‌డం జరుగుతోంది. ఈ నిర్ణ‌యం కార‌ణంగా మణిపుర్ లాంటి రాష్ట్రాలు ప్రయోజనాన్ని పొందుతాయి.

మిత్రులారా,

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ఘ‌న‌మైన వార‌స‌త్వం వుంది. ఆచార్య జె.సి. బోస్‌, సి.వి. రామ‌న్‌, మేఘ్ నాద్ శాహ్, ఎస్‌.ఎన్‌. బోస్ ల వంటి హేమాహేమీలు దీనికి నేతృత్వం వహించారు. ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త‌లు నెల‌కొల్పిన అత్యున్న‌త ప్ర‌మాణాల‌ నుండి నేటి భార‌త‌దేశం స్ఫూర్తిని పొందాలి. మ‌న దేశం ఎదుర్కొంటున్న ప‌లు సామాజిక‌, ఆర్ధిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు క‌నుక్కోవాల‌ని అనేక సంద‌ర్భాల్లో శాస్త్ర‌వేత్త‌ల‌ను నేను కోరాను. పేద‌ల‌కు, వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు ల‌బ్ధి ని చేకూర్చేలా నూత‌న స‌వాళ్ల‌ను చేప‌ట్టాల‌ని శాస్త్ర‌వేత్త‌ల‌కు నేను విజ్ఞ‌ప్తి చేశాను.

ఈ నేప‌థ్యంలో చూసిన‌ప్పుడు, ఈ సంవ‌త్స‌రం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కోసం చేప‌ట్టిన ఇతివృత్తం చాలా స‌మంజసంగా ఉంది. ఇంత‌వ‌రకు చేరుకోని వ‌ర్గాల‌ను శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా చేరుకోవ‌డమ‌నే థీమ్ చాలా బాగుంది. ఇది నా హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంది.

ఈ ఏడాది ప‌ద్మ‌ శ్రీ పుర‌స్కారం పొందిన శ్రీ రాజ‌గోపాల‌న్ వాసుదేవ‌న్ విష‌యాన్ని తీసుకుందాం. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను రహదారుల నిర్మాణంలో ఉప‌యోగించ‌డానికిగాను ఆయ‌న ఓ వినూత్న‌మైన ప‌ద్ధ‌తిని క‌నిపెట్టి, పేటెంట్ ను పొందారు. ఆయ‌న క‌నిపెట్టిన ప‌ద్ధ‌తి ప్ర‌కారం రోడ్లు వేస్తే అవి ఎక్కువ‌కాలం మ‌న‌గ‌లుగుతాయి. నీటిని పీల్చుకోవు, ఎంత బరువునైనా భ‌రించ‌గ‌లుగుతాయి. ఈ ప‌ద్ధ‌తివ‌ల్ల ఈ మేలే కాదు.. అదే స‌మ‌యంలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల ద్వారా వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌కు ఆయ‌న నిర్మాణాత్మ‌క‌మైన ప‌రిష్కారాల‌ను క‌నిపెట్టగ‌లిగారు. ఈ వినూత్న‌మైన సాంకేతిక‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి ప్రొఫెస‌ర్ వాసుదేవ‌న్ ఉచితంగా అందించారు. ఈ సాంకేతిక‌త ద్వారా ఇప్ప‌టికే 11 రాష్ట్రాల్లో 5 వేల కిలోమీట‌ర్ల పొడ‌వైన ర‌హ‌దారుల‌ను వేయ‌డం జ‌రిగింది.

అదే విధంగా ఈ ఏడాది అర‌వింద గుప్తా కు ప‌ద్మ‌ శ్రీ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇళ్ల‌లో దొరికే వ‌స్తువుల‌ను, వ్య‌ర్థ‌ ప‌దార్థాల‌ను ఉప‌యోగించి బొమ్మ‌ల‌ను త‌యారు చేసి వాటి ద్వారా విజ్ఞాన ప్ర‌యోగాల‌ను చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న నిరూపించారు. ఎంతో మేంది విద్యార్థులు సైన్స్ నేర్చుకోవ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. గ‌త ఏడాది చింత‌కింది మ‌ల్లేశానికి ప‌ద్మ‌ శ్రీ పుర‌స్కారం ఇవ్వడమైంది. ఆయ‌న క‌నిపెట్టిన ల‌క్ష్మి ఆసు యంత్రం కారణంగా చీర నేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యంతో పాటు శ్ర‌మ‌ కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింది. వ‌ర్త‌మానంలో మ‌నం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప‌నికివచ్చేటట్టు ప‌రిశోధ‌న‌లు చేసి, ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ని చేయాల‌ని మిమ్మల్ని నేను అభ్య‌ర్థిస్తున్నాను. విజ్ఞాన శాస్త్రానికి నేడు సామాజిక బాధ్య‌త అనేది చాలా అవ‌స‌రం.

మిత్రులారా,

ఈ స‌మావేశం కోసం తీసుకొన్నటువంటి ఇతివృత్తం కొన్ని ప్ర‌శ్న‌ల‌ను మ‌న ముందుంచుతోంది. భార‌త‌దేశం లోని చిన్నారుల‌కు సైన్స్ ను ప‌రిచ‌యం చేయ‌డానికి మ‌నం త‌గినంత కృషి చేశామా ? మ‌న చిన్నారులు వారిలో దాగిన ప్ర‌తిభ‌ను వెలికి తీసుకు రావ‌డానికి వీలుగా స‌రైన వాతావ‌ర‌ణాన్ని వారికి మనం క‌ల్పించామా ? శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజ‌యాల‌ను చాలా వేగంగా స‌మాజానికి అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీనివ‌ల్ల యువ‌త‌లో శాస్త్ర విజ్ఞాన చైత‌న్యం పెరుగుతుంది. ఇది మ‌న యువ‌తీయువ‌కులు శాస్త్ర విజ్ఞాన రంగంలో కెరియర్ లను వెతుక్కొనేందుకు వీలుగా వారిలో చైత‌న్యాన్ని రగిలిస్తుంది. జాతీయ సంస్థ‌లను, ప‌రిశోధ‌నాల‌యాల‌ను మ‌న విద్యార్థుల‌ అందుబాటులోకి తీసుకు రావాలి. శాస్త్ర‌వేత్త‌లు తాము పాఠ‌శాల విద్యార్థుల‌కు ద‌గ్గ‌ర‌వ‌డానికి వీలుగా త‌గిన వ్య‌వ‌స్థ‌ను రూపొందించాలని నేను కోరుతున్నాను. ప్ర‌తి ఏడాది ప‌దో, ప‌ద‌కొండో, ప‌న్నెండో త‌ర‌గ‌తుల‌కు చెందిన వంద మంది విద్యార్థుల‌తో వంద గంట‌ల‌ పాటు శాస్త్ర సాంకేతిక విష‌యాల‌ గురించి మాట్లాడాల‌ని నేను వారిని అభ్య‌ర్థిస్తున్నాను. వంద‌ గంట‌లు, వంద మంది విద్యార్థులు.. ఈ విధంగా ఎంత మంది శాస్త్ర‌వేత్త‌లు త‌యార‌వుతారో ఒక‌సారి ఊహించండి.

మిత్రులారా,

2030 కల్లా మన దేశంలో వినియోగించే విద్యుత్తు లో న‌ల‌భై శాతం శిలాజేత‌ర ఇంధ‌నమే ఉండ‌డానికి వీలుగా మార్గ‌ద‌ర్శ‌కాలను మనం రూపొందించుకొన్నాం. అనేక దేశాలు స‌భ్యులుగా ఉన్న అంత‌ర్జాతీయ సౌర కూలమి ని నెల‌కొల్ప‌డంలో భార‌త‌దేశం ముఖ్య‌పాత్ర‌ను పోషించింది. ఇలాంటి వేదిక‌ల కార‌ణంగా స్వ‌చ్ఛ ఇంధ‌నాల‌ త‌యారీకి సంబంధించి ఆర్ అండ్ డి మీద ఒత్తిడి పెరుగుతుంది. అణు ఇంధ‌న శాఖ ఒక్కొక్క‌టి 700 మెగా వాట్ల సామ‌ర్థ్యం కల ప‌ది నూత‌న దేశీయ ఒత్తిడి తో కూడిన భార జ‌ల రియాక్ట‌ర్ లను నెల‌కొల్పుతోంది. ఇది ప్ర‌ధానంగా దేశీయ పరామాణు పరిశ్రమ అభివృద్ధికి దోహ‌దం చేసే చ‌ర్య‌. అంతే కాదు దీని కార‌ణంగా ప్ర‌ధాన‌మై పరమాణు శక్తి ఉత్ప‌త్తి దేశంగా భార‌త‌దేశానికి ఉన్నటువంటి పేరు మ‌రింత బ‌లోపేత‌ం అవుతుంది. ఈ మ‌ధ్య‌ కాలంలో సిఎస్ ఐ ఆర్ చేతితో పట్టుకొని ప‌ని చేయించే మిల్క్ టెస్ట‌ర్ ను త‌యారు చేసింది. దీని సాయంతో పాల నాణ్య‌త‌ను ఎవ‌రికి వారు వారి ఇళ్ల‌లో క్ష‌ణాలలో తెలుసుకోగ‌లుగుతారు. అరుదుగా వ‌చ్చే జ‌న్యుప‌ర‌మైన వ్యాధుల‌ను గుర్తించ‌గ‌లిగే సాంకేతిక‌త గ‌ల కిట్ లను సిఎస్ ఐఆర్ త‌యారు చేసింది. అంతే కాదు, అత్యంత విలువైన ఆయుర్వేద మొక్క‌ల‌ను, సుగంధ ద్ర‌వ్యాల మొక్క‌ల‌ను రైతుల‌కు అంద‌జేసి వారి ఆదాయాల‌ను పెంచ‌డానికి కృషి చేస్తోంది.

దేశంలో నుండి క్ష‌య వ్యాధిని పూర్తిగా నిర్మూలించ‌డానికిగాను మేం అనేక చ‌ర్య‌ల‌ను చేప‌డ‌తున్నాం. కొన్ని రోజుల క్రితం న్యూ ఢిల్లీ లో క్షయ వ్యాధి అంతంపై ఒక స‌ద‌స్సు జ‌రిగింది. 2025 కల్లా దేశంలో టిబి ని పూర్తిగా నిర్మూలించాల‌ని ఆ స‌ద‌స్సులో నిశ్చ‌యించ‌డం జ‌రిగింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి టిబి ని నిర్మూలించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొంటే ఆ ల‌క్ష్యాన్ని ఐదేళ్లు ముందుగానే సాధించాల‌ని మ‌నం నిశ్చ‌యించాం. అంత‌రిక్షం లోకి ఒకేసారి వంద ఉప‌గ్ర‌హాల‌ను పంప‌గ‌లిగే సామ‌ర్థ్యాన్ని మ‌న శాస్త్ర‌వేత్త‌లు సంపాదించారు. మ‌న దేశ అంత‌రిక్ష ప‌రిశోధన కార్య‌క్ర‌మం ద్వారా ఇది సాధ్య‌మైంది. భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి అంకిత‌భావంతో ప‌ని చేయ‌డంవ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది.

చంద్ర‌యాన్- 1 విజ‌య‌వంతమైంది. చంద్ర‌యాన్- 2ను త్వరలోనే ప్రారంభించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాం. ఇందుకోసం పూర్తిగా దేశీయంగా త‌యారైన సాంకేతిక‌త‌ను వాడుతున్నాం. చంద్రునిపైన రోవ‌ర్ ను న‌డిపించ‌గ‌లిగాం. గ‌త శ‌తాబ్దికి చెందిన విఖ్యాత శాస్త్ర‌వేత్త అల్బ‌ర్ట్ ఆయిన్ స్టీన్ గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల‌కు సంబంధించి సిద్ధాంతాన్ని ప్ర‌పంచానికి అందించారు. ఈ సిద్ధాంతం స‌రైందే అని మూడు సంవ‌త్స‌రాల క్రితం నిరూపించారు. ఈ నిరూపించే కార్య‌క్ర‌మంలో మ‌న దేశానికి చెందిన 9 సంస్థ‌లకు చెందిన‌ 37 మంది శాస్త్ర‌వేత్త‌లు పాల్గొన్నారు. అంత‌ర్జాతీయ లేజ‌ర్ ఇంట‌ర్ ఫెరోమీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ వేవ్ అబ్జ‌ర్వేట‌రీ (లిగో) నిర్వ‌హించిన కార్య‌క్ర‌మమిది. మూడో లిగో డిటెక్ట‌ర్ ను ఏర్పాటు చేయ‌డానికి ఇప్ప‌టికే మ‌న ప్ర‌భుత్వం అనుమ‌తి కూడా ఇచ్చింది. దీని కార‌ణంగా లేజ‌ర్ కిర‌ణాలు, కాంతి కిర‌ణాలు, గ‌ణ‌న రంగాల్లోని ప్రాథమిక విజ్ఞానంలో మ‌నకున్న తెలివితేట‌లు విస్త‌రిస్తాయి. దీనికి వాస్త‌వ రూపాన్ని తీసుకురావ‌డానికి మ‌న శాస్త్ర‌వేత్త‌లు విరామం లేకుండా ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయా న‌గ‌రాలలో కల ముఖ్య‌మైన శాస్త్ర‌ విజ్ఞాన సంస్థ‌లకు చుట్టుప‌క్క‌ల, శాస్త్ర‌ విజ్ఞానంలో ఉత్త‌మ‌ స్థాయి గ‌ల క్ల‌స్ట‌ర్ లను అభివృద్ధి చేయ‌డం గురించి నేను మాట్లాడాను. దీని ల‌క్ష్యం ఏంటంటే న‌గ‌ర ఆధారిత ఆర్ అండ్ డి క్ల‌స్ట‌ర్ లను నెల‌కొల్ప‌డం. ఇవి శాస్త్ర సాంకేతిక భాగ‌స్వాముల‌ను ఒకే వేదిక మీద‌కు చేరుస్తాయి. అంటే విద్యాసంస్థ‌ల‌ నుండి విజ్ఞాన‌ సంస్థ‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు, స్టార్ట్- అప్ కంపెనీల‌కు భాగ‌స్వాములు చేరుతారు. దీని కార‌ణంగా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు సాధ్య‌మవుతాయి. త‌ద్వారా అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డ‌గ‌ల‌ ప‌రిశోధ‌న కేంద్రాలు పుట్టుకొస్తాయి. 
మేం ఈ మ‌ధ్య‌ ప్రైమ్ మినిస్ట‌ర్ రసెర్చ్ ఫెలోస్ ప‌థ‌కానికి ఆమోదం తెలిపాం. ఈ ప‌థ‌కం కింద ఐఐఎస్ సి, ఐఐటి, ఎన్ ఐటి, ఐఐఎస్ ఇఆర్, ఐఐఐటి లలో చ‌దువుకొన్న అత్యుత్త‌మ విద్యార్థుల‌కు ఐఐటి, ఐఐఎస్ సి సంస్థ‌లలో నేరుగా పిహెచ్. డి. లో ప్ర‌వేశం ల‌భిస్తుంది. ఈ ప‌థ‌కం కార‌ణంగా మేధోవ‌ల‌సకు అడ్డుక‌ట్ట ప‌డుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని అత్యుత్త‌మ రంగాలలో దేశీయ ప‌రిశోధ‌న‌కు ప్రోత్సాహ‌మివ్వ‌డానికి ఇది ముందు ముందు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మిత్రులారా,

భార‌త‌దేశం ప‌లు ప్ర‌ధాన‌మైన సామాజిక ఆర్ధిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ది. ఇవి మ‌న జ‌నాభా లోని అనేక వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. భార‌త‌దేశంలో స్వచ్ఛ‌మైన‌, హ‌రిత‌, సౌభాగ్య ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డానికి శాస్త్ర సాంకేతిక రంగం స‌హాయం చాలా అవ‌స‌రం ఉంది. శాస్త్ర‌వేత్త‌ల‌ నుండి నేను ఏం ఆశిస్తున్నానో చెబుతాను. మ‌న గిరిజ‌న జ‌నాభాను తీసుకుంటే ఇందులో ప‌లువురు సికిల్ సెల్ అనీమియాతో బాధ‌ప‌డుతున్నారు. ఈ అనారోగ్యాన్ని తొల‌గించ‌డానికి త‌క్కువ ఖ‌ర్చు కాగ‌ల ప‌రిష్కారాన్ని ఎవ‌రైనా క‌నిపెట్ట‌గ‌ల‌రా ? అది కూడా స‌మీప భ‌విష్య‌త్ లోనే. మ‌న దేశంలో అనేక‌మంది పిల్ల‌లు పౌష్టికాహార లేమి తో ఇబ్బంది పడుతున్నారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ పౌష్టికాహార కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలంటే మీ సూచ‌న‌లు, స‌ల‌హాలు, ప‌రిష్కారాలు కావాలి.

భార‌త‌దేశంలో ఇప్పుడు కోట్లాది నూత‌న గృహాల‌ను నిర్మించాల్సి వుంది. ఈ డిమాండ్ ను తీర్చ‌డానికిగాను మ‌న శాస్త్రవేత్త‌లు త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక‌తను ఉప‌యోగించ‌గ‌ల‌రా ? మ‌న న‌దుల్లో కాలుష్యం పెరిగిపోతోంది. వాటిని ప‌రిశుభ్రం చేయ‌డానికిగాను వినూత్న‌మైన ఆలోచ‌న‌లు, సాంకేతిక‌తలు అవ‌స‌ర‌మ‌వుతాయి. వివిధ రంగాల‌కు సంబంధించి ఇప్పుడు మ‌న‌కు బ‌హుళ ద‌శ‌ల ప‌ని విధానం కావాలి. స‌మ‌ర్థ‌వంత‌మైన సౌర‌ విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు కావాలి. అలాగే ఇంధనాల్ని ఆదా చేయగ‌లిగే వ్య‌వ‌స్థ‌లు, విద్యుత్తు ప్రసార సంబంధిత స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు, స్వ‌చ్ఛ‌మైన వంట చెర‌కు కావాలి. బొగ్గుకు బ‌దులుగా మెథ‌నాల్ లాంటివి వాడడం చేయాలి. బొగ్గు నుండి స్వ‌చ్ఛ‌మైన విద్యుత్తు ను పొందాలి. స్మార్ట్ గ్రిడ్ లు, మైక్రో గ్రిడ్ లు, జీవ‌న ఇంధ‌నాలు అవ‌స‌రం.

2022 కల్లా 100 గీగావాట్ ల స్థాపిత సౌర విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేసుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో వున్న సోలార్ ప‌రికరాల సామ‌ర్థ్యం 17నుండి 18 శాత‌మే. మ‌రింత మెరుగైన సామ‌ర్థ్యంగ‌ల సోలార్ మాడ్యుల్స్ ను త‌యారు చేయాల‌నే స‌వాల్ ను మ‌న శాస్త్ర‌వేత్త‌లు స్వీక‌రించ‌గ‌ల‌రా ? భారతదేశం లో ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగేలా అందుబాటు ధ‌ర‌లలో ఇది వుండాలి. ఈ విష‌యంలో మ‌నం ఆదా చేసే వ‌న‌రులు ఎలా ఉంటాయో ఒక సారి ఊహించండి. అంత‌రిక్షంలో ఉప‌గ్ర‌హాల‌ను నిర్వ‌హించ‌డానికిగాను ఐఎస్ఆర్ఒ (ఇస్రో) అత్యుత్త‌మ‌మైన బ్యాట‌రీల‌ను వాడుతోంది. ఇత‌ర సంస్థ‌లు కూడా ఇస్రో తో భాగ‌స్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే స‌మ‌ర్థ‌త‌ కల బ్యాట‌రీ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌మ మొబైల్ ఫోన్ ల కోసం, విద్యుత్తు కార్ల కోసం రూపొందించుకోవ‌చ్చు. మ‌లేరియా, మెద‌డువాపు వ్యాధి లాంటి వ్యాధులు చాలా నిశ్శ‌బ్దంగా న‌ష్టాన్ని చేస్తున్నాయి. వాటి బారి నుండి రోగుల‌ను ర‌క్షించాలంటే మ‌నం కొత్త విధానాల‌ను, మందుల‌ను, టీకాల‌ను త‌యారు చేసుకోవాల్సివుంది. యోగా, క్రీడ‌లు, సంప్ర‌దాయ విజ్ఞాన రంగాలలో ప‌రిశోధ‌న‌లను నిర్వ‌హించాలి. ఉపాధి క‌ల్ప‌న‌ కోసం చిన్న, మ‌ధ్య త‌ర‌హాల ప‌రిశ్ర‌మ‌లు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే అంత‌ర్జాతీయంగా పెరుగుతున్న పోటీ కారణంగా చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు రాను రాను అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి మ‌న శాస్త్ర సాంకేతిక సంస్థ‌లు అండ‌గా నిల‌బ‌డ‌గ‌ల‌వా ? వీటి ప‌ని విధానాన్ని, ఉత్ప‌త్తుల‌ను మెరుగ‌ప‌ర‌చ‌డంలో సాయం చేయ‌గ‌ల‌వా ?

మిత్రులారా,

దేశం అభివృద్ధి సాధించ‌డానికి, సౌభాగ్యవంతంగా ఉండ‌డానికిగాను భ‌విష్యత్ లో సాంకేతిక‌త‌లను అమ‌లు చేయాలి. అందుకోసం మ‌నం సిద్ధంగా ఉండాలి. సాంకేతిక‌త కార‌ణంగా విద్య‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, బ్యాంకింగ్ రంగాలలో మ‌న పౌరుల‌కు అపార‌మైన‌ సేవ‌లను అందించగ‌లం. 2020 నాటికి 5జి బ్రాడ్ బ్యాండ్ టెలిక‌మ్యూనికేశన్ నెట్ వ‌ర్కుల కోసం సాంకేతిక‌త‌లను, వ‌స్తువులను, ప్ర‌మాణాల‌ను త‌యారు చేయ‌డంలో భార‌త‌దేశానిదే ప్ర‌ధాన పాత్రగా ఉండాలి. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ , బిగ్ డాటా అన‌లిటిక్స్‌, మెషీన్ లెర్నింగ్‌, సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ మొద‌లైన‌ వాట‌న్నింటి కార‌ణంగా ప్ర‌భావ‌వంత‌మైన క‌మ్యూనికేశన్ ప్ర‌ధాన అంశంగా మారుతుంది. ఇది స్మార్ట్ మేన్యుఫాక్చరింగ్, స్మార్ట్ సిటీస్, 4.0 ప‌రిశ్ర‌మ‌ల రంగాల విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. 2030 నాటికి గ్లోబ‌ల్ ఇనవేశన్ ఇండెక్స్ లో మొద‌టి ప‌ది దేశాల జాబితాలో భార‌త‌దేశం ఉండ‌టానికి మ‌నంద‌రం క‌లిసి కృషి చేద్దాం.

మిత్రులారా,

మ‌రో నాలుగు సంవ‌త్స‌రాలలో మ‌నం 75 ఏళ్ల స్వాతంత్ర్య దిన సంబ‌రాల‌ను జ‌రుపుకోబోతున్నాం. 2022 కల్లా న్యూ ఇండియా ను నిర్మించుకోవ‌డానికిగాను మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా తీర్మానం చేసుకున్నాం. స‌బ్ కా సాత్, స‌బ్ కా వికాస్ నినాదం స్ఫూర్తితో మ‌నంద‌రం ఐక‌మ‌త్యంగా నిలచి, అంద‌రి శ్రేయ‌స్సు కోసం కృషి చేయాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరంద‌రూ హృద‌య‌పూర్వ‌కంగా ప‌ని చేయాలి. భార‌త‌దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ భారీ వృద్ధిని సాధించే దిశ‌గా సాగుతోంది. కానీ మాన‌వాభివృద్ధి సూచిక‌లలో మ‌నం త‌క్కువ స్థాయిలలో ఉన్నాం. ఈ అస్థిర‌త‌కు ప్ర‌ధాన కార‌ణాలలో ఒక‌టి రాష్ట్రాల మ‌ధ్య‌న, రాష్ట్రాలలో ఉన్న తేడాలు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి మేం చ‌ర్య‌లు చేప‌ట్టాం. వంద జిల్లాల్లో అభివృద్ధిని మెరుగు ప‌ర‌చ‌డానికి కార్య‌క్రమాలు మొద‌ల‌య్యాయి. ఆరోగ్యం, పౌష్టిక‌ం, విద్య‌, వ్య‌వ‌సాయ‌ం, జల వ‌న‌రులు మొద‌లైన ప్ర‌ధాన రంగాల పైన దృష్టి పెట్టాం. వెనుక‌బ‌డ్డ వ‌ర్గాల‌కు ఆర్ధిక చేయూత‌, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాథమిక సౌక‌ర్యాల క‌ల్ప‌పైన దృష్టి పెట్టాం. ఈ రంగాల‌న్నిటికీ వైవిధ్య‌ంతో కూడిన ప‌రిష్కారాలు అవసరం. అవి స్థానిక స‌వాళ్లను ఎదుర్కొని, అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగేవి అయి వుండాలి. అంద‌రికీ ఒకే కొల‌త ప‌నికొస్తుంద‌నే ప‌ద్ధ‌తి ఇక్క‌డ ప‌ని చేయ‌దు. అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న వంద జిల్లాల‌ కోసం మ‌న శాస్త్ర విజ్ఞాన సంస్థలు ప‌ని చేయ‌గ‌ల‌వా ? నైపుణ్యాల‌ను రూపొందించి, ఔత్సాహిక పారిశ్రామిక త‌త్వాన్ని పెంచ‌డానికి అనువైన సాంకేతిక‌త‌ల్ని త‌యారు చేసి, వాటిని అంద‌రికీ అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేయ‌గ‌ల‌వా ?

ఈ ప‌ని చేస్తే ఇది మ‌న భార‌త‌ మాత‌కు చేసే అత్యున్న‌త సేవ కాగ‌ల‌దు. ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డంలో, శాస్త్ర సాంకేతిక రంగాల‌ను వినియోగించ‌డంలో భార‌త‌దేశానికి ఘ‌న‌మైన సంప్ర‌దాయం, సుదీర్ఘ‌మైన చ‌రిత్ర ఉన్నాయి. ఈ రంగాలలో మ‌న‌కు ద‌క్కవలసిన ముందు వ‌ర‌ుస స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవ‌డానికి ఇదే స‌రైన అదును. ప్ర‌యోగ‌శాల‌ల్లో జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌లను, క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయ‌డానికిగాను శాస్త్రవేత్త‌లు కృషి చేయాల‌ని నేను పిలుపునిస్తున్నాను. మ‌న శాస్త్ర‌వేత్త‌లు ఎంతో అంకిత‌భావంతో చేసే కృషి కార‌ణంగా మ‌నం మెరుగైన భ‌విష్య‌త్తు ను సాధించ‌గ‌లం. మ‌న‌ కోసం, మ‌న పిల్ల‌ల‌ కోసం మ‌నం ఆకాంక్షిస్తున్న భ‌విష్య‌త్తు ను పొంద‌గ‌లం.

మీ అంద‌రికీ ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi