భారతదేశం, ఆసియాన్ ల భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకొనేందుకుగాను నిర్వహిస్తున్న ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ (ఎఐసిఎస్) కు ముందు రోజు.. అంటే, బుధవారం నాడు.. మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ చీ తో, వియత్నామ్ ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడి విడిగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్నారు.
2. ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చిన గా ముగ్గురు నేతలకు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. అలాగే, ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలంటూ పంపించిన ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
3. స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ చీ తో ప్రధాన మంత్రి సమావేశమైన సందర్భంగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడిన వివిధ అశాలపైన చర్చలు చోటు చేసుకొన్నాయి. ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2017 సెప్టెంబర్ లో మయన్మార్ లో పర్యటించినప్పుడు తీసుకొన్న కీలక నిర్ణయాల విషయంలో తరువాయిగా చేపట్టిన చర్యలు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనేందుకు ఉన్న మార్గాల పైన కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.
4. ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో జరిగిన సమావేశంలో, రక్షణ, చమురు మరియు గ్యాస్, వ్యాపారం మరియు పెట్టుబడి వంటి రంగాలతో సహా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర సంబంధిత సహకారంతో పాటు కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ యొక్క ఫ్రేమ్ వర్క్ పరిధిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల లో నమోదైన వృద్ధి పట్ల నేతలు ఉభయులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సమాచార- ప్రసార రంగంలో మరియు ఆసియాన్- ఇండియా స్పేస్ కోఆపరేషన్ లో భాగంగా వియత్నాంలో ట్రాకింగ్ అండ్ డేటా రిసెప్షన్ స్టేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఫెసిలిటీ ల ఏర్పాటు పైన ఈ పర్యటన సందర్భంగా కుదిరిన రెండు ఒప్పందాలు భారత, వియత్నాంల సంబంధాలకు నూతనోత్తేజాన్ని ఇస్తాయని నేతలు ఇద్దరూ అంగీకరించారు. 100 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ అమలవడం పట్ల వారు సంతృప్తిని వెలిబుచ్చారు. దీనిలో భాగంగా ఆఫ్ షోర్ పట్రోల్ వెసల్స్ (ఒపివి లు) ఎల్ & టి కి ఇవ్వడమైంది. 500 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన మరొక లైన్ ఆఫ్ క్రెడిట్ త్వరలోనే ఆచరణ రూపం లోకి రానుంది.
5. అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో జరిగిన సమావేశంలో, 2017 నవంబర్ లో మనీలా లో వారు ఉభయులు సమావేశమైన అనంతరం చోటు చేసుకొన్నటువంటి ప్రపంచ పరిస్థితులు మరియు ప్రాంతీయ పరిస్థితులలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నమోదైన పురోగతిని సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలపరచుకోవాలని, మరీ ముఖ్యంగా, అవస్థాపన అభివృద్ధి లో ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసి మరియు ఫిలిప్పీన్స్ అవలంబిస్తున్న బిల్డ్- బిల్డ్- బిల్డ్ ప్రోగ్రామ్ లలో భాగంగా ఇరు దేశాల ప్రయివేటు రంగాల మధ్య సహకారానికి అనువైన పలు రంగాలు ఉన్నాయని వారు అంగీకారానికి రావడం జరిగింది. ఇన్ వెస్ట్ ఇండియా కు, ఫిలిప్పీన్స్ కు చెందిన బోర్డ్ ఆఫ్ ఇన్ వెస్ట్ మెంట్ కు మధ్య సంతకాలు అయిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రాన్ని ఇరు దేశాల ప్రతినిధులు- నేతల సమక్షంలో- ఇచ్చి, పుచ్చుకొన్నారు.
6. మూడు సమావేశాలలోనూ భారతదేశ పర్యటనకు విచ్చేసిన ఉన్నతాధికారులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఆసియాన్- ఇండియా సంబంధాల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి పలికారు. అలాగే, ఎఐసిఎస్ లో జరిగే చర్చోపచర్చల కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.