ఆసియాన్ అధ్యక్షులు, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“ఆసియాన్ అధ్యక్షులు, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాశారు. ఇండియా- ఆసియాన్ సంబంధాల యొక్క సంపన్న చరిత్రను, పటిష్ఠ సహకారాన్ని మరియు ఆ సంబంధాలు మరింతగా వృద్ధి లోకి రాదగ్గ భవిష్యత్తు ను ఆ వ్యాసం సుందరంగా ఆవిష్కరించింది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
భారతదేశ పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ భారతదేశానికి, ఆసియాన్ కు మధ్య తరాల తరబడి నెలకొన్న వ్యాపార, వాణిజ్య మరియు సాంస్కృతిక బంధాలు ఈ సంబంధాలకు ఒక నూతనోత్తేజాన్ని ఇవ్వడంలో ఒక ప్రధానమైన పాత్రను పోషించాయని నేటి టైమ్స్ ఆఫ్ ఇండియా లో ‘‘రివైవ్ ఎ మిలెనియల్ పార్ట్ నర్ షిప్: సింగపూర్ హాజ్ ప్లేయ్ డ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఇండియా స్ క్లోజర్ ఇంటిగ్రేషన్ విద్ ఆసియాన్’’ శీర్షికన రాసిన ఒక బహిరంగ సంపాదకీయ వ్యాసం లో రాశారు.
ఆసియాన్- ఇండియా సంబంధాలకు 25 ఏళ్లు పూర్తి కావడాన్ని మనం స్మరించుకొంటున్న వేళ.. ఆగ్నేయ ఆసియా తో భారతదేశం యొక్క సంబంధాలు 2,000 సంవత్సరాల కు పైగా కొనసాగుతూ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి మరియు కంబోడియా, మలేశియా, ఇంకా థాయీలాండ్ ల వంటి దేశాలకు మధ్య పురాతన కాలం నుండీ వ్యాపార సంబంధాలు నెలకొన్నాయనడానికి చక్కని దస్తావేజు పూర్వక రుజువులు ఉన్నాయి. ఈ ప్రాచీన బంధాలు ఆగ్నేయ ఆసియా సంస్కృతులను, సంప్రదాయాలను మరియు భాషలను గాఢంగా ప్రభావితం చేశాయి. మనం కంబోడియా లో సియమ్ రీప్ సమీపంలోని అంకోర్ దేవాలయ సముదాయం, ఇండొనేశియా లోని యోగ్య కార్టా సమీపంలో బోరోబుదోర్ మరియు ప్రాంబనన్ దేవాలయాలు, ఇంకా మలేశియా లో కెడాలో ఉన్న పురాతనమైన కాండీల వంటి చారిత్రక స్థలాలలో ఇండిక్ హిందూ- బౌద్ధ ప్రభావాలను గమనించగలం. ఇండొనేశియా, మయన్మార్ లతో పాటు థాయీలాండ్ లతో సహా పలు ఆగ్నేయ ఆసియా సంస్కృతులలో రామాయణం మమేకమైంది. సింగపూర్ కు మలే భాషలో ఉన్న పేరు సింగపుర. ఈ మాటను సంస్కృత భాషలో నుండే స్వీకరించారు. ఈ మాటకు ‘సింహ నగరం’ అని అర్థం.
ఆసియాన్ సముదాయంలో భారతదేశాన్ని చేర్చుకోవాలని సింగపూర్ ఎల్లప్పుడూ వాదిస్తూ వచ్చినట్లు భారతదేశానికి అతిథిగా విచ్చేసిన ప్రధాని (శ్రీ లీ సీన్ లూంగ్) తెలియజేశారు. భారతదేశం 1992లో ఆసియాన్ సెక్టరల్ డైలాగ్ పార్ట్ నర్ గా మారి, 1995 కల్లా పూర్తి స్థాయి ఆసియాన్ డైలాగ్ పార్ట్ నర్ గా ఆవిర్భవించింది. 2005 నుండి ఈస్ట్ ఆసియా సమిట్స్ (ఇఎఎస్) లో పాలుపంచుకొంటూ వచ్చింది. ఇఎఎస్ అనేది దాపరికానికి తావు లేనటువంటి, సమ్మిళితమైన మరియు దృఢమైన ప్రాంతీయ వాస్తుకళ లలో కీలక భాగంగా ఉండటంతో పాటు ఈ ప్రాంతపు ప్రధాన వ్యూహాత్మక నేతల నాయకత్వంలోని వేదికగా కూడా అలరారుతోంది.
ఆసియాన్- ఇండియా సంబంధాల 20వ వార్షికోత్సవం నాటికి 2012 లో ఆసియాన్ – ఇండియా సంబంధాలు మరింత ఉన్నతిని పొంది, ఒక వ్యూహాత్మకమైన భాగస్వామ్యంగా ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియాన్ కూటమి యొక్క రాజకీయపరమైన, భద్రత పరమైన, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన సహకారాల రీత్యా ఆసియాన్ మరియు భారతదేశం బహుళ విధ సహకారాన్ని ఇచ్చి పుచ్చుకొంటున్నాయి. ఆసియాన్ తో బంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ మోదీ అనుసరిస్తున్నటువంటి ‘యాక్ట్ ఈస్ట్’ పాలిసీ మరియు 3-సి (కామర్స్, కనెక్టివిటీ, కల్చర్) సూత్రం మన మధ్య నెలకొన్న విశాల ప్రాతిపదిక కలిగిన సహకారాన్ని చాటి చెబుతున్నాయి. మనం ప్రతి ఏటా నిర్వహించుకొనే నేతల శిఖర సమ్మేళనంతో పాటు మంత్రిత్వ స్థాయి సంభాషణలు ఏడింటితో సహా సుమారు 30 సహకారాత్మక వేదికలను ఏర్పాటు చేసుకొన్నాం. ఆసియాన్ రీజనల్ ఫోరమ్, ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ లతో పాటు ఈస్ట్ ఆసియా సమిట్ ల తో సహా ఆసియాన్ నేతృత్వంలోని వేదికలలో భారతదేశం చురుకుగా పాలుపంచుకొంది.
వాణిజ్య సంబంధాలు మరియు వ్యాపార సంబంధాలను గురించి ఆయన తన వ్యాసంలో ప్రస్తావిస్తూ, 1993లో 2.9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నటువంటి ఆసియాన్- ఇండియా వ్యాపారం.. ఆసియాన్ – ఇండియా ఫ్రీ ట్రేడ్ ఏరియా (ఎఐఎఫ్‌టిఎ) దరిమిలా 2016లో 58.4 బిలియన్ డాలర్ల స్థాయికి పుంజుకొందని తెలిపారు. సామాజికపరంగా, సాంస్కృతిక పరంగా చూస్తే ఆసియాన్- ఇండియా స్ట్యూడంట్స్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాములు మరియు ఏటా నిర్వహిస్తున్న ఢిల్లీ డైలాగ్ ల వంటి కార్యక్రమాలు ప్రజలకు-ప్రజలకు మధ్య సంబంధాలను మరింత సన్నిహితం చేశాయి అని చెప్పవచ్చు. ఈ వేదికల ద్వారా మన యువత, విద్యారంగ ప్రముఖలతో పాటు, వ్యాపారస్తులు ఒకరిని మరొకరు కలుసుకొని అనేక విషయాలను నేర్చుకొంటూ మరింత లోతైన అవగాహనను ఏర్పరచుకొంటున్నారు.
ఆసియాన్- ఇండియా సంబంధాల రజత జయంతి కి గుర్తుగా ఇరు పక్షాలు అనేక స్మరణాత్మక కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రవాసీ భారతీయుల తోడ్పాటును సింగపూర్ లో ఇటీవలే నిర్వహించిన ‘ప్రవాసీ భారతీయ దివస్’ గుర్తించింది. నేటి ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ ఈ వేడుకల ముగింపునకు సంకేతంగా నిలుస్తోంది. ఈ సందర్భంలో న్యూ ఢిల్లీ కి తరలి రావడం ఆసియాన్ నేతలందరికీ లభించిన గౌరవం. అలాగే రేపటి 69వ గణతంత్ర సైనిక ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ఆహ్వానాన్ని అందుకోవడం అనేది కూడా ఆసియాన్ నేతలకు దక్కిన ఒక గొప్ప గౌరవమే.
ప్రపంచంలో ఆవిష్కారమవుతున్న ప్రధాన సరళులు వ్యూహాత్మక దృక్పథాన్ని పునర్ నిర్వచిస్తున్నాయని సింగపూర్ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సరళులు అటు సవాళ్ళను, ఇటు అవకాశాలను సైతం ఆవిష్కరిస్తున్నాయి. వ్యూహాత్మక సమతుల్యత మార్పునకు లోనవుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలలో జనాభా పరంగా, సంస్కృతి పరంగా మరియు రాజకీయ పరంగా మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ప్రపంచీకరణ మరియు స్వేచ్ఛా వ్యాపారం అంశాలపై ఏకాభిప్రాయం చెదరుతోంది. అయినప్పటికీ ఆసియాన్ గాథ మాత్రం సకారాత్మకంగా కొనసాగుతోంది. మనం ఆర్థిక అంశాల పరంగా సమగ్రతకు పెద్ద పీటను వేయవలసిన అవసరం ఉంది. అదే విధంగా సరిహద్దుల అవతలివైపు నుండి ఎదురవుతున్న ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఇంకా జల వాయు పరివర్తనలు సహా పలు సవాళ్ళకు ఎదురొడ్డి నిలుద్దాం అనేటటువంటి దృఢ సంకల్పాన్ని కూడా తీసుకోవలసి ఉంది.
శ్రీ లీ సీన్ లూంగ్ అభిప్రాయం ప్రకారం, ఈ తరహా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి భారతదేశం వంటి కీలక భాగస్వాములతో ఆసియాన్ నెరపుతున్న సహకారానికి ఒక ఉత్తేజాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి మరియు భద్రతల వంటి ఉమ్మడి ప్రయోజనాలతో పాటు, దాపరికం లేనటువంటి, సమతుల్యత కలిగిన, సమ్మిళితమైన ప్రాంతీయ స్వరూపాలు భారతదేశంతో పాటు ఆసియాన్ కు కూడా ఏక రీతిలో ఉన్నాయి. భారతదేశం.. హిందూ మహా సముద్రం మొదలుకొని పసిఫిక్ వరకు విస్తరించిన ప్రధానమైన సముద్ర మార్గాలతో బంధాన్ని కలిగివున్నటువంటి వ్యూహాత్మక ప్రాంతంలో.. విస్తరించి ఉంది. ఈ సముద్ర మార్గాలు అనేక ఆసియాన్ సభ్యత్వ దేశాలకు కీలకమైన వ్యాపార మార్గాలుగా కూడా ఉన్నాయి. ఇరు పక్షాలు ఈ కీలకమైన సముద్ర సంబంధ వ్యాపార మార్గాలను పరిరక్షించుకోవడంలో తమ ప్రయోజనాలను కలిసి పంచుకొంటున్నాయి.
భారతదేశంలోను, ఆసియాన్ లోను కలిపి మొత్తం 1.8 బిలియన్ జనాభా నివసిస్తున్నారు. వీరు ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతుకు సమానం కావడంతో ఈ అంశానికి ఎంతో ప్రాముఖ్యం మరియు శక్తి ఉన్నాయి అని శ్రీ లీ సీన్ లూంగ్ అంటున్నారు. భారతదేశం, ఆసియాన్ ల ఉమ్మడి జిడిపి 4.5 ట్రిలియన్ డాలర్లను మించుతోంది. ఆయన చెప్పిన దానిని బట్టి చూసినప్పుడు, 2025 కల్లా భారతదేశ వినియోగదారు విపణి ప్రపంచంలో 5వ అతిపెద్ద విపణిగా లెక్కకు రాగలదు. కాగా, ఆగ్నేయ ఆసియా లో మధ్యతరగతి కుటుంబాలు 2025 కల్లా రెట్టింపై 163 మిలియన్ కు చేరుకొంటాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా జనాభా పరంగా ఒక అనుకూలమైన అంశానికి నిలయాలుగా ఉంటాయి. అదేమిటంటే, ఆసియాన్ జనాభాలో 60 శాతం జనాభా యొక్క వయస్సు 35 ఏళ్ళ కన్నా తక్కువగా ఉంటుంది. కాగా, 2020 కల్లా భారతదేశం 29 ఏళ్ళ సగటు వయస్సు కలిగిన వారితో ప్రపంచంలోనే అత్యంత యవ్వన భరిత జనాభాను కలిగి ఉండే దేశంగా లెక్కకు రావచ్చు. అంతే కాకుండా ఆసియాన్- ఇండియా లు.. ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్న వారు శరవేగంగా పెరుగుతున్న దేశాలు కూడాను. ఈ పరిణామం మనం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యం ఇండియా- ఆసియాన్ సంబంధాలను పెంపొందించుకొనేందుకు మరింత అవకాశం ఇప్పటికీ ఉందని సూచిస్తోంది. 2016 లో ఆసియాన్ నెరపిన విదేశీ వ్యాపారంలో భారత్ ఖాతాలో చేరింది 2.6 శాతం మాత్రమే.
పరస్పర లాభదాయకమైన సహకారం ద్వారా వృద్ధిలోకి రాదగ్గ రంగాలు మూడు ఉన్నట్లు సింగపూర్ ప్రధాని సూచించారు.
వాటిలో ఒకటోది- ఆసియాన్ మరియు భారతదేశం వ్యాపారం ఇంకా పెట్టుబడులను ప్రోత్సహించుకొనేందుకు వాటి ప్రయత్నాలను మరోమారు పెంచుకోవాలి. ఇప్పటికే అమలవుతున్న పథకాలను.. ఎఐఎఫ్‌టిఎ తో సహా తగిన విధంగా విస్తరించుకోవలసిన అవసరం ఉంది. మనం ప్రస్తుతం అమలులో ఉన్న ఎఐఎఫ్‌టిఎ ను అధిగమించి ఒక అధిక నాణ్యత కలిగిన రీజినల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సిఇపి) కి తుది రూపం ఇవ్వడానికి కలిసి పని చేయాలి. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే, ప్రపంచ జిడిపి లో మూడవ వంతుకు ప్రాతినిధ్యం వహించే ఒక సమీకృత ఆసియా విపణిని సృష్టించేందుకు దోహదం చేయగలదు. నియమ నిబంధనలను రూపొందించడం, రెండు దిశలలోను పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా, భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ పాలిసీకి పూరకంగాను మరియు ఈ ప్రాంతంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎగుమతులకు ఆస్కారం కల్పించేదిగాను మారగలదు.
ఇక రెండోది- మన దేశాల ప్రజానీకం భూతల, గగన తల, సముద్ర ఉపరితల అనుసంధానాల పరంగా విస్తృత ప్రయోజనాలను అందుకోవాల్సి ఉంది. మూడు త్రైపాక్షికమైన ఇండియా – మయన్మార్ – థాయీలాండ్ హైవే విస్తరణ మరియు ఆసియాన్ తో అవస్థాపన సంబంధిత అనుసంధానాన్ని ప్రోత్సహించడం కోసం భారతదేశం ఇచ్చిన 1 బిలియన్ డాలర్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ వంటి చర్యలతో పాటు భూ మార్గ అనుసంధానాన్ని మెరుగుపరచే దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఆసియాన్- ఇండియా ఏర్ ట్రాన్స్‌పోర్ట్ అగ్రిమెంట్ ను త్వరగా ఒక కొలిక్కి తేవడంతో సహా మన భౌతిక అనుసంధానాన్ని పెంపొందించుకొనేందుకు భారతదేశంతో సన్నిహితంగా పని చేయాలని ఆసియాన్ ఎదురుచూస్తోంది అని కూడా శ్రీ లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు-ప్రజలకు మధ్య రాకపోకలను అధికం చేసేందుకు తోడ్పడంతో పాటు అటు భారతదేశం, ఇటు ఆసియాన్ విమాన కంపెనీలు నూతన మరియు ప్రవర్ధమాన విపణులను.. ప్రత్యేకించి వ్యాపారం, పెట్టుబడి మరియు పర్యాటక పరమైన రాకపోకలను.. దక్కించునకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
డిజిటల్ అనుసంధానం అనేది సహకారానికి వీలు ఉన్న మరొక ముఖ్యమైన రంగం. ఇది భవిష్యత్తులో ప్రజలకు-ప్రజలకు మధ్య సంబంధాలను సరికొత్త రీతిలో నిర్వచించగలుగుతుంది. ఉదాహరణకు ఇండియా- ఆసియాన్ ఫిన్‌టెక్ వేదికలను సమన్వయ పరచేందుకు లేదా ఇ-పేమెంట్ వ్యవస్థలను జోడించేందుకు భారతదేశం యొక్క ‘ఆధార్’ వ్యవస్థ కొత్త అవకాశాలను ఎన్నింటినో అందిస్తుంది.
భారతదేశం, ఆసియాన్ కొత్త సమన్వయాలను అన్వేషించే దిశగా వాటి ప్రయత్నాలను కొనసాగిస్తాయని శ్రీ లీ సీన్ లూంగ్ చెబుతున్నారు. ‘ఆసియాన్ స్మార్ట్ సిటీస్ నెట్‌వర్క్’ ను అభివృద్ధిపరచడం సింగపూర్ యొక్క అధ్యక్ష స్థానం లక్ష్యాలలో ఒకటిగా ఉంది. ఈ విషయంలో భారతదేశం మరియు సింగపూర్ ఇప్పటికే స్వాభావిక భాగస్వాములుగా ఉన్నాయి. భారతదేశంలో నగరీకరణం శర వేగంగా జరుగుతోంది. అంతేకాకుండా 100 స్మార్ట్ సిటీస్ ను ఆవిష్కరించాలనేది భారతదేశం తనకు తాను నిర్దేశించుకొన్న లక్ష్యం కావడం గమనించదగ్గది. ఈ ప్రయాణంలో భారతదేశానికి భాగస్వామి అయ్యేందుకు మరియు మా స్వీయ అనుభవం ఆధారంగా అర్బన్ సొల్యూషన్స్ ను అభివృద్ధి పరచడంలో సహాయపడేందుకు నగర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న సిటీ- స్టేట్ అయినటువంటి సింగపూర్ సిద్ధంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ యొక్క నూతన రాజధాని నగరమైన ‘అమరావతి’ ఇందుకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ఆసియాన్ అధ్యక్ష పదవిని స్వీకరించిన సింగపూర్ ఆసియాన్- ఇండియా సంబంధాలను బలపరచడం కోసం కంకణబద్ధురాలై ఉంది అని సింగపూర్ ప్రధాని తన సంపాదకీయ వ్యాసం సారాంశంగా వెల్లడించారు. నేటి సవాళ్ళను పరిష్కరించడానికి మరియు భవిష్యత్తులో సేతువులను నిర్మించడానికి ఇరు పక్షాలు గనుక వాటి చారిత్రక మరియు సాంస్కృతిక బంధాలను ఉపయోగించుకొన్న పక్షంలో మన యువతతో పాటు తదుపరి తరం వారువాటి తాలూకు లాభాలను చాలా వరకు పొందుతారు.
A wonderful article by @ASEAN Chair Singapore’s PM, Mr. @leehsienloong. It beautifully covers the rich history, robust cooperation and promising future of India-ASEAN relations. https://t.co/FPGfI1eLbj
— Narendra Modi (@narendramodi) January 25, 2018