ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి లో జరిగిన ఒక కార్యక్రమంలో నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్‌వరీ ని దేశానికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేస్తూ, ఐఎన్ఎస్ కల్‌వరీ ని‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమం యొక్క సాఫల్యానికి ఒక ప్రధాన ఉదాహరణగా అభివర్ణించారు. దీని తయారీలో పాలుపంచుకొన్న అందరినీ ఆయన కొనియాడారు. ఫ్రాన్స్ కు మరియు భారతదేశానికి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం శీఘ్రగతిన వర్ధిల్లుతోందనడానికి ఈ జలాంతర్గామి ఒక ఉత్తమ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారతీయ నౌకాదళానికి ఐఎన్ఎస్ కల్‌వరీ మరింత బలాన్ని జోడిస్తుందని ఆయన చెప్పారు.
21వ శతాబ్దాన్ని ఆసియా కు చెందిన శతాబ్దంగా అభివర్ణిస్తున్నారని ప్రధాన మంత్రి చెప్పారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి మార్గం హిందూ మహాసముద్రం గుండా సాగడమనేది కూడా తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ విధానాలలో హిందూ మహాసముద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఆయన వివరించారు.
ఈ యొక్క దార్శనికతను ‘సాగర్’ (SAGAR- Security and Growth for All in the Region) అనే క్లుప్త పదం ద్వారా అర్థం చేసుకోవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు.
హిందూ మహాసముద్రంలో భారతదేశం తనకు గల ప్రపంచ శ్రేణి, వ్యూహాత్మకమైన మరియు ఆర్థికపరమైన ప్రయోజనాల విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఆధునికమైన మరియు బహుముఖీనమైన భారతీయ నౌకాదళం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ మహాసముద్రానికి సహజ సిద్ధంగా ఉన్న సామర్ధ్యం మన దేశం యొక్క అభివృద్ధికి అవసరమైన ఆర్థిక అండదండలను ప్రసాదిస్తోందని ఆయన అన్నారు. ఈ కారణంగానే సముద్ర తలం మీది ఉగ్రవాద కార్యకలాపాలు, సముద్ర దోపిడీలు, మత్తు మందుల దొంగ రవాణా ల వంటి సవాళ్ళ విషయంలో- ఒక్క భారతదేశంలోనే కాకుండా, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా ఎదుర్కోవలసి వచ్చే సవాళ్ళను గురించి- ఇండియా మంచి ఎరుకను కలిగివున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ సవాళ్ళను ఎదిరించి పోరాడడంలో భారతదేశం ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచం ఒక కుటుంబమని భారతదేశం నమ్ముతోందని, అంతేకాకుండా ప్రపంచం పట్ల తన యొక్క బాధ్యతలను భారతదేశం నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. భారతదేశం తన భాగస్వామ్య దేశాలు సంక్షోభంలో చిక్కుకున్న సమయాలలో స్పందించే మొదటి దేశంగా ఉంటూ వచ్చిందని ఆయన తెలిపారు. భారతదేశ దౌత్యానికి, భారతీయ భద్రత సంస్థలకు మానవీయ పార్శ్వం ఉండడం మన ప్రత్యేకత అని ఆయన చెప్పారు. బలమైన, సమర్ధమైన భారతదేశం మానవాళి కోసమని ఒక కీలకమైన పాత్రను పోషించాల్సివుందని ఆయన అన్నారు. భారతదేశంతో కలిసి శాంతి మరియు స్థిరత్వాల బాటలో నడవాలని ప్రపంచ దేశాలు అభిలషిస్తున్నాయని ఆయన అన్నారు.
రక్షణ కు మరియు భద్రత కు సంబంధించిన యావత్తు ఇకో సిస్టమ్ గత మూడు సంవత్సరాలలో మార్పు చెందడం మొదలైందని ప్రధాన మంత్రి అన్నారు. ఐఎన్ఎస్ కల్‌వరీ తయారీ కాలంలో అలవరచుకొన్న నైపుణ్యాల రాశి భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి అని ఆయన చెప్పారు.
చిరకాలంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ‘‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’’ అంశాన్ని ప్రభుత్వ నిబద్ధతే పరిష్కరించిందని ఆయన చెప్పారు.
జమ్ము & కశ్మీర్ లో పరోక్ష యుద్ధం చేయడం కోసం ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడమనే విధానం విజయవంతం కాకుండా ప్రభుత్వ విధానాలు మరియు సాయుధ దళాల సాహసం చూడగలిగాయి అని ప్రధాన మంత్రి వివరించారు.
దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ ప్రధాన మంత్రి తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.