ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్ (ఐఎన్ఎస్‌వి) తారిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస యాత్రకు బయలుదేరి వెళ్ళిన నావిక సిబ్బందితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక వీడియో కాల్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా దేశ ప్రజల పక్షాన ఐఎన్ఎస్‌వి తారిణి సిబ్బందికి ప్రధాన మంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారు తలపెట్టిన యాత్ర విజయవంతం కావాలని కూడా ఆయన అభిలషించారు.
అంతక్రితం, ఐఎన్ఎస్‌వి తారిణి నావిక సిబ్బంది ప్రపంచాన్ని సముద్ర మార్గంలో చుట్టివచ్చేందుకు 22,100 నాటికల్ మైళ్ళ మేర జల యాత్ర జరప తలపెట్టిన సందర్భంగా వారితో 2017 ఆగస్టు 16న ప్రధాన మంత్రి భేటీ అయ్యారు. ఐఎన్ఎస్‌వి తారిణి ప్రస్తుతం తన తొలి మజిలీ అయినటువంటి ఆస్ట్రేలియా లోని ఫ్రీమేంటల్ ను సమీపిస్తోంది. ఈ బృందం 4770 నాటికల్ మైళ్ళను అధిగమించి, 2017 అక్టోబర్ 22న ఫ్రీమేంటల్ కు చేరుకోగలదని ఆశిస్తున్నారు.
నావిక సిబ్బందిలోని ఇద్దరు సభ్యురాళ్ళు లెఫ్టెనంట్ కమాండర్ వర్తిక జోషి కి మరియు లెఫ్టెనంట్ పాయల్ గుప్త కు త్వరలో వారు పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలను ప్రధాన మంత్రి ముందుగానే తెలియజేశారు.