గుజరాత్ లో పర్యటించిన ప్రధాని…హజిరాలోని ఆర్మౌర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను దేశానికి అంకితం చేశారు. నవ్ సారిలో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆసుపత్రికి పునాది రాయి వేశారు.
హజిరాలో ఏర్పాటు చేసిన ఎల్ అండ్ టి వారి ఆర్మౌర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేశారు. కాంప్లెక్స్ ను సందర్శించిన ప్రధాని ఈ ప్రాజెక్టు వెనక వున్న వినూత్న స్ఫూర్తిని తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. నవ్ సారిలో నిర్మించనున్న క్యాన్సర్ ఆసుపత్రికి పునాది రాయి వేశారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స, నివారణకు సంబంధించి స్థానికంగా వున్న ప్రజలకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమాలతో ప్రధాని గుజరాత్ సందర్శన ముగిసింది. ఆ తర్వాత ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా సిల్వస్సా, ముంబాయిలకు వెళ్లారు.
ఉజ్వల గుజరాత్ సదస్సు నేపథ్యంలో ఎగ్జిబిషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. తన మూడురోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహమ్మదాబాద్‌లో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ హాస్పిటల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ విధానాన్ని ప్రస్తావించారు. అందరికీ అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధిని అందించే ఈ విధానంతో దేశం ముందుకు పోతుందని ఆకాంక్షించారు.
సబర్మతి నది తీరాన ఏర్పాటు చేసిన అహమ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్ – 2019ని ప్రధాని ప్రారంభించారు. ఇది మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా వ్యాపారరంగంలో ఎలాంటి ఒడిదుడుకులు లేని వాతావరణాన్ని కల్పించడానికిగాను తమ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని అన్నారు.
ప్రధాని గుజరాత్ పర్యటనలో వుండగానే రెండోరోజున మూడు రోజుల పాటు జరిగే ఉజ్వల గుజరాత్ సదస్సు ప్రారంభమైంది. గాంధీ నగర్ లోని మహత్మా మందిర్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 9వ గుజరాత్ సదస్సును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని భారతదేశంతో వ్యాపార వాణిజ్యాలు నిర్వహించడం ఎంతో గొప్ప అవకాశమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు చేశారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులు శ్రీ షావ్ కత్ మిర్జియోయోవ్, చెక్ రిపబ్లిక్ ప్రధాని శ్రీ ఆంద్రెజ్ బాబిస్, మాల్టా ప్రధాని శ్రీ జోసెఫ్ మస్కట్, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లొక్కెలతో ప్రధాని శ్రీ నరేందర్ మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వీటి తర్వాత గాంధీనగర్ లోని దండి కుటీర్ లో 3 డి లేజర్ ప్రొజెక్షన్ ప్రదర్శన జరిగింది.
ఉజ్వల గుజరాత్ సదస్సు సందర్భంగా పలు వ్యాపార వాణిజ్య దిగ్గజాలు పెట్టుబడులకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది.