ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు దీవుల సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకొనే చర్యలను సమీక్షించేందుకు జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు.
సంపూర్ణ అభివృద్ధిలో భాగంగా నీతి ఆయోగ్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంకా ఇతర సీనియర్ అధికారుల సూచనలతో కూడిన ఒక ప్రస్తుతీకరణాన్ని ప్రధాన మంత్రి సమక్షంలో ప్రదర్శించారు.
భారతదేశంలో సముద్రపు ఒడ్డు కలిగిన ద్వీపాలు మొత్తం 1382 ఉన్నాయి. వీటిలో సంపూర్ణ ప్రగతి కోసం అధికారులు తొలుత 26 ద్వీపాలను పరిశీలించవచ్చని ప్రతిపాదించారు. ఈ 26 ద్వీపాలలో కొన్ని ద్వీపాలు అండమాన్ దీవులు మరియు లక్షద్వీప్ లోను, మరికొన్ని భారతదేశ కోస్తాతీరం వెంబడి వేరు వేరు చోట్ల నెలకొన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను మౌలిక సదుపాయాలు, పర్యటన, వ్యవసాయం (సేంద్రియ వ్యవసాయం మరియు చేపల పెంపకం సహా), ఇంకా వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ను పెంచని (కార్బన్-న్యూట్రల్) శక్తి ఉత్పాదకత రంగాల చుట్టూ కేంద్రీకృతం అయితే మంచిదని అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
భారతదేశ ద్వీప సంపదకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి, ఆయా ప్రాంతాలలో పర్యటనలను పెంచేందుకు తగిన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీవుల అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలకు సత్వరం రూపురేఖలు తీర్చిదిద్దాలని అధికారులను ఆయన కోరారు. ఈ క్రమంలో సౌర శక్తిని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు.