జమ్ము & కశ్మీర్ లోని నియంత్రణ రేఖకు సమీపంలో నెలకొన్న గురేజ్ లోయ ప్రాంతంలో భారతీయ సైన్యానికి మరియు బిఎస్ఎఫ్ కు చెందిన జవాన్లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దీపావళి పండుగను జరుపుకొన్నారు. అక్కడ ఆయన సుమారు రెండు గంటల సేపు గడిపారు. ప్రధాన మంత్రి సరిహద్దులలో జవాన్లతో కలసి దీపావళిని జరుపుకోవడం ఇప్పటికి ఇది వరుసగా నాలుగో సారి.
ప్రధాన మంత్రి జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టి, శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకొన్నారు.
జవాన్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరి మాదిరిగానే తాను కూడా తన కుటుంబంతో కలసి దీపావళిని జరుపుకోవాలని కోరుకొంటానన్నారు. ఈ కారణంగానే తాను ‘‘తన కుటుంబ సభ్యులు’’గా పరిగణించే సాయుధ దళాలకు చెందిన జవాన్ల మధ్యకు తరలివచ్చినట్లు ఆయన చెప్పారు.
సాయుధ దళాల జవాన్లతోనూ, సైనికులతోనూ సమయాన్ని గడిపేటప్పుడు తాను కొత్త శక్తిని పుంజుకొంటానని ప్రధాన మంత్రి అన్నారు. కఠోర పరిస్థితులలో వారు చేస్తున్న త్యాగాన్ని, తపస్సును ఆయన ప్రశంసించారు.
ఇక్కడ గుమికూడిన జవానులు క్రమం తప్పక యోగాను అభ్యసిస్తున్నారన్న సంగతి తన దృష్టికి వచ్చినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. ఇది వారి శక్తియుక్తులను తప్పక పెంచగలిగేదేనని, అంతేకాకుండా వారిని శాంతపరుస్తుందని కూడా ఆయన అన్నారు.
పదవీ కాలం ముగిసిన తరువాత సాయుధ దళాలను వీడి వెళ్ళే జవాన్లు తదనంతర కాలంలో ప్రవీణులైన యోగా శిక్షకులుగా మారవచ్చని ఆయన చెప్పారు.
భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న 2022వ సంవత్సరం కల్లా ప్రతి భారతీయ పౌరుడు ఒక కొత్త సంకల్పాన్ని తప్పక తీసుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు. నూతన ఆవిష్కారాలు చేయవలసిందిగా జవాన్లను ఆయన ప్రోత్సహించారు. ఇలా చేస్తే వారు రోజువారీ నిర్వహించే కార్య భారాలు మరింత సులభం, సురక్షితం అవుతాయని ఆయన చెప్పారు. ఉత్తమమైన నూతన ఆవిష్కారాలను ఏ విధంగా సైన్య దినం, నౌకాదళ దినం మరియు వాయుసేన దినం సందర్భాలలో గుర్తించి, పురస్కారాలు అందజేస్తోందీ ఆయన ప్రస్తావించారు.
సాధ్యమైన అన్ని విధాలుగానూ సాయుధ దళాల సంక్షేమానికి, అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధురాలై ఉన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. దశాబ్దాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి వన్ ర్యాంక్, వన్ పెన్షన్ ను అమలుచేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
సైనిక దళ ప్రధానాధికారి శ్రీ జనరల్ బిపిన్ రావత్ తో పాటు, సీనియర్ సైన్యాధికారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.
సందర్శకుల పుస్తకంలో ప్రధాన మంత్రి..:
‘‘మీ ఆప్తులకు దూరంగా ఉంటూ, మాతృభూమిని కాపాడుతూ, త్యాగం యొక్క అత్యున్నత సంప్రదాయాలను ప్రదర్శిస్తూ, దేశ సరిహద్దులలో విధులను నిర్వహిస్తున్న సైనికులందరూ సాహసానికి మరియు అంకిత భావానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.
మీతో కలసి దీపావళి పండుగను జరుపుకొనే అవకాశం నాకు దక్కింది. ఈ పర్వదినం సందర్భంలో సరిహద్దుల వద్ద సాహసికులైన సైనికులు వారి విధులను నిర్వహిస్తుండడం కోట్లాది భారతీయులలో ఆశాదీపాన్ని వెలిగిస్తోంది. అంతేకాదు, వారిలో ఒక కొత్త శక్తిని జనింప చేస్తోంది కూడాను.
‘‘న్యూ ఇండియా’’ కలను పండించుకోవడానికి మనందరం కలసి పనిచేసే సువర్ణావకాశం ఇది. ఇందులో సైన్యం కూడా ఒక భాగమే.
మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని రాశారు.