“ఆర్థిక విధానం- ముందు ఉన్న అవకాశాలు” ఇతివృత్తం పై 40 మందికి పైగా ఆర్థికవేత్తలతోను మరియు ఇతర నిపుణులతోను నీతి ఆయోగ్ ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ఈ సభలో పాల్గొన్న వారు స్థూల ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ కల్పన, ఆరోగ్యం మరియు విద్య, తయారీ మరియు ఎగుమతులు, పట్టణాభివృద్ధి, అవస్థాపన, ఇంకా అనుసంధానం ల వంటి వివిధ ఆర్థిక సంబంధ అంశాలపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
ఆలోచనలను రేకెత్తించే సలహాలు చెప్పినందుకు గాను వారందరికీ ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విభిన్న అంశాలపై సభకు విచ్చేసిన వారు వారి వారి సూచనలను, దృష్టి కోణాలను వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా, వేరు వేరు విషయాలలో నిపుణులైన వారు వెలిబుచ్చినటువంటి గుణాత్మకమైన సూచనలను ఆయన అభినందించారు.
ఆర్థిక విషయాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ అరవింద్ పాన్ గఢియా, కేంద్ర ప్రభుత్వం మరియు నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.