హైదరాబాద్లో పోలీసుల డీజీలు/ఐజీల సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఇవాళ నిర్వహించిన పోలీసు డీజీలు/ఐజీల సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈ రోజు నవంబరు 26 అని, ఇది ముంబై నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన రోజని గుర్తుచేశారు. ఈ దాడిని తిప్పికొట్టడంలో పోలీసులు అసమాన ధైర్యసాహసాలు చూపారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో భాగంగా దేశంలో 33వేల మంది పోలీసులు అమరులయ్యారని కూడా ఆయన గుర్తుచేశారు.
డీజీలు/ఐజీల వార్షిక సదస్సు నిర్వహణ విధానంలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనుభవాలను పంచుకునేందుకు ఇదొక చక్కని వేదికగా మారిందని, తద్వారా విధాన రూపకల్పనకు అవసరమైన సకల సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యాచరణ దిశగా ఖరారు చేసిన అంశాల ఆధారంగా నిర్దిష్ట ఫలితం రాబట్టాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
పోలీసు శిక్షణకు సంబంధించి చురుకైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, శిక్షణలో అదొక భాగం కావాలని ప్రధానమంత్రి చెప్పారు. మానవ మనస్తత్వం, ప్రవర్తనా మనోవిజ్ఞానంలో నైపుణ్యం శిక్షణలో కీలకాంశాలని ఆయన అన్నారు. నాయకత్వ నైపుణ్య సముపార్జన ఎంతో ప్రధానమని, పోలీసు సిబ్బందిలో ఈ నైపుణ్యాన్ని ప్రోది చేయాల్సిన బాధ్యత సీనియర్ అధికారులదేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు మేధస్సు, ప్రత్యక్ష గస్తీకిగల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
సమష్టి శిక్షణ కృషిద్వారా పోలీసు బలగాలలో గుణాత్మక మార్పు తేవాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిరంతర ప్రగతి దిశగా సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మానవ సామర్థ్యం మేళవింపు పోలీసు బలగాలకు చాలా ముఖ్యమైనవని ప్రధానమంత్రి చెప్పారు. “మీకు అందుబాటులో భారత పోలీసులు” (Indian Police at Your Call) పేరిట మొబైల్ అప్లికేషన్ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగంలోని పోలీసు అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు. అంతకుముందు జాతీయ పోలీసు అకాడమీలోని అమరవీరుల స్మారకంవద్ద ప్రధానమంత్రి పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అలాగే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి, ఒక మొక్కను నాటారు.