ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక గ్రంథావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. “రాష్ట్రపతి భవన్ : ఫ్రమ్ రాజ్ టు స్వరాజ్” పేరిట ఒక పుస్తకాన్ని ఆయన విడుదల చేసి, ఆ గ్రంథం మొదటి ప్రతిని రాష్ట్రపతికి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీకి ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి పదవిని తాను స్వీకరించిన తొలి నాళ్లలో రాష్ట్రపతి శ్రీ ముఖర్జీ అందించిన మార్గదర్శకత్వాన్ని శ్రీ మోదీ గుర్తుచేసుకొన్నారు. రాష్ట్రపతి శ్రీ ముఖర్జీ కి ఉన్న చిరకాలానుభవం నుండి దేశం నిరంతరాయంగా లాభపడగలదంటూ శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీతో కలిసి పనిచేసే మరియు ఆయన నుండి నేర్చుకొనే చక్కని అదృష్టం తనకు దక్కిందని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ రోజు విడుదలైన మూడు పుస్తకాలూ రాష్ట్రపతి భవన్ చరిత్ర, అందులో నివాసం ఉన్న వ్యక్తుల జీవనం మరియు వారు సాగించిన కార్యకలాపాలు సహా వివిధ అంశాలను గురించిన సమగ్ర అంతర్ దృష్టిని అందజేశాయని ప్రధాన మంత్రి అన్నారు.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ మిత్తల్ “ఫ్రమ్ రాజ్ టు స్వరాజ్” గ్రంథావిష్కరణకు సహకరించారు. ఈ మూడు గ్రంథాలనూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రచురణల విభాగం ప్రచురించింది.