ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ఈ రోజు న జరిగిన 16వ ఇండియా-ఆసియాన్ సమిట్ లో పాల్గొన్నారు.
ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ, 16వ ఇండియా-ఆసియాన్ సమిట్ లో పాలు పంచుకొంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయమైన ఆతిథ్యాన్ని అందించినందుకు గాను థాయిలాండ్ కు ఆయన ధన్యవాదాలు పలికారు. అలాగే, వచ్చే సంవత్సరం లో శిఖర సమ్మేళనాని కి అధ్యక్ష బాధ్యత ను స్వీకరిస్తున్నందుకు గాను వియత్నామ్ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇండో-పసిఫిక్ వ్యూహాని కి భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’ ఒక ముఖ్య ఆధార స్తంభం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే, ఆసియాన్ అనేది ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’కి మూల స్థానం లో ఉందని ఆయన వివరించారు. ఒక బలవత్తరమైనటువంటి ‘ఆసియాన్’ భారతదేశాని కి ఎనలేని మేలు చేస్తుందని చెప్పారు. భూతల సంధానాన్ని, సముద్ర సంధానాన్ని, వాయు మార్గ సంధానాన్ని మరియు డిజిటల్ కనెక్టివిటీ ని మెరుగు పరచేందుకు తీసుకొంటున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. భౌతికమైన సంధానాన్ని మరియు డిజిటల్ కనెక్టివిటీ ని మెరుగు పరచడం కోసం ఉద్దేశించినటువంటి ఒక బిలియన్ డాలర్ విలువ కలిగిన ఇండియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రయోజనకారి గా నిరూపణ అవుతుందని ఆయన తెలిపారు.
గత సంవత్సరం లో జరిగిన కమెమరేటివ్ సమిట్ మరియు సింగపూర్ ఇన్ ఫార్మల్ సమిట్ ల సందర్భం గా తీసుకొన్న నిర్ణయాల అమలు ఫలితం గా ఆసియాన్ మరియు భారతదేశం సన్నిహితం అయినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆసియాన్ కు, భారతదేశాని కి పరస్పరం ప్రయోజనకారి కాగల రంగాల లో భాగస్వామ్యాన్ని మరియు సహకారాన్ని అధికం చేసుకొనేందుకు భారతదేశం సుముఖం గా ఉన్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయం, పరిశోధన, ఇంజినీరింగ్, విజ్ఞాన శాస్త్రం, ఇంకా ఐసిటి రంగాల లో భాగస్వామ్యాన్ని మరియు కెపాసిటీ బిల్డింగ్ ను మెరుగు పరచుకోవడం కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సముద్ర సంబంధిత భద్రత మరియు నీలి ఆర్థిక వ్యవస్థ.. ఈ రంగాల లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని భారతదేశం కోరుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. ఇండియా ఆసియాన్ ఎఫ్‌టిఎ ను సమీక్షించాలని ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాని కి మెరుగులు దిద్దగలుగుతుందన్నారు.