ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ లు నిన్నటి రోజు న సాయంత్రం పూట టెలిఫోన్ లో సంభాషించుకొంటూ ఒకరికి మరొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పుకొన్నారు.
భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం లో 2018వ సంవత్సరం లో చోటు చేసుకొన్న పురోగతి పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. సరిక్రొత్త గా 2+2 చర్చల యంత్రాంగం రంగప్రవేశం చేయడం తో పాటు భారతదేశం, యుఎస్ మరియు జపాన్ ల ప్రప్రథమ త్రైపాక్షిక శిఖర సమ్మేళనం జరగడం తదితర పరిణామాలను వారు కొనియాడారు.
రక్షణ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం, శక్తి , ఇంకా ప్రాంతీయ అంశాల లోను మరియు ప్రపంచ అంశాల లోను సమన్వయం.. ఈ రంగాల లో ద్వైపాక్షిక సహకారం ఇనుమడిస్తూ ఉండటాన్ని ఉభయ నేతలు సానుకూల దృక్పథం తో గమనించారు. 2019వ సంవత్సరం లో కూడా భారతదేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠపరచడం కోసం కలసి పని చేసేందుకు వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.