జాతీయ యువజన దినం సందర్భంగా ఈ రోజు జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
గ్రేటర్ నోయిడా లోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన జాతీయ యువజనోత్సవం- 2018 ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. పిఎస్ఎల్‌వి-సి40 ని విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఇస్రో ను ప్రధాన మంత్రి అభినందిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతరిక్షంలో మనం వేస్తున్న అడుగులు పౌరులకు సహాయకారిగా ఉంటాయని, అలాగే మన అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.
జిల్లాలలో మాక్ పార్లమెంటులను నిర్వహించాలంటూ 2017 డిసెంబర్ నెల ‘మన్ కీ బాత్’లో తాను పిలుపునిచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆ తరహా మాక్ పార్లమెంటులు మన యువతీ యువకులలో చర్చా స్ఫూర్తిని పెంపొందించగలుగుతాయని ఆయన పేర్కొన్నారు. మనం 1947 తరువాత జన్మించామని, మరి మనకు స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకొనే గౌరవం లభించలేదని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, మన స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అంకితం చేసిన గొప్ప పురుషులు మరియు మహిళల కలలను నెరవేర్చే అవకాశాన్ని మనం కలిగివున్నామని ఆయన చెప్పారు. మన స్వాతంత్య్ర యోధులు కలలు గన్న భారతదేశాన్ని మనం నిర్మించాల్సివుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఉద్యోగాలను సృష్టించే వారుగా మన దేశ యువతను తయారు చేయాలని కోరుకొంటున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. వారు నూతన ఆవిష్కారాలను అందించే వారుగా ఉండాలని ఆయన అన్నారు. నేటి యువతలో ‘ధైర్యం’ గాని లేదా సహనం గాని లేవు అని కొంత మంది అంటున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అయితే ఒక రకంగా ఇది మన యువతలో ఒక సరికొత్త అభినివేశాన్ని రగిలించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భావన మన యువజనులు విభిన్నంగా ఆలోచించడానికి మరియు కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించేటట్టు చేయగలదని ఆయన అన్నారు. యువత క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ప్రధాన మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.
జాతీయ యువజన దినం మరియు సర్వ ధర్మ సభ ల సూచకంగా కర్నాటక లోని బెళగావి లో ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వామి వివేకానంద గారు సోదరత్వాన్ని నొక్కి చెప్పారని తెలిపారు. భారతదేశం అభివృద్ధి లోనే మన శ్రేయస్సు ఇమిడి ఉందని ఆయన నమ్మారని ప్రధాన మంత్రి వివరించారు.
భారతదేశానికి వ్యతిరేకంగా పశ్చిమ ప్రపంచంలో బోలెడంత ప్రచారం జరిగిందని, దానిని అనుచితమని స్వామి వివేకానంద గారు నిరూపించారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక దురాచారాలను వ్యతిరేకిస్తూ స్వామి వివేకానంద గారు గళమెత్తారని కూడా శ్రీ మోదీ అన్నారు.
దేశాన్ని విభజించడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని, మరి ఈ దేశ యువతరం అటువంటి శక్తులకు సరైన సమాధానం చెబుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. మన యువత ఎన్నటికీ పెడదోవ పట్టరని ప్రధాన మంత్రి చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ను నూతన శిఖరాలకు తీసుకుపోతున్నది భారతదేశ యువతరమే అని ప్రధాన మంత్రి చెప్పారు. సమాజానికి సేవ చేసి, సంస్కరించిన ఎంతో మంది సాధువులకు, జ్ఞానులకు భారతదేశం నిలయమని ఆయన అన్నారు.
సేవాభావం మన సంస్కృతిలో ఒక భాగం అని ప్రధాన మంత్రి చెప్పారు. సమాజానికి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలు భారతదేశం అంతటా అనేకంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మన దేశాన్ని ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జనకు తావు లేనిది (ఒడిఎఫ్)గా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
Click here to read PM's speech at Gautam Buddha University in Noida