ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో ‘రాజస్వ జ్ఞాన సంగమ్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, మరియు రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అధికారులు వారి పని విధానాన్ని మెరుగుపరచుకోవాలని, వారి పనితీరులో ‘‘అత్యవసర భావన’’ను మరియు ‘‘ప్రమాణాలను’’ అలవరచుకోవాలని ఆయన ఉద్భోదించారు.
వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) సంబంధిత ప్రయోజనాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దేశాన్ని ఆర్థికంగా సమైక్యపరచడమే కాకుండా వ్యవస్థలో పారదర్శకత్వానికి ఈ పద్ధతి తోడ్పడిందని, రెండు నెలల వ్యవధిలో 17 లక్షలకు పైగా కొత్త వ్యాపారస్తులను పరోక్ష పన్ను వ్యవస్థ లోకి తీసుకు రావడం జరిగిందన్నారు.
వర్తకులు అందరూ జిఎస్ టి తాలూకు గరిష్ఠ లబ్దిని పొందేందుకు వీలుగా సాపేక్షంగా రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ను కలిగివుండే చిన్న వ్యాపారస్తులు సైతం జిఎస్ టి వ్యవస్థలో నమోదు అయ్యే దిశగా మనం పని చేయాల్సివుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కేటగిరీకి చెందిన వారి కోసం ఒక విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ విషయంలో కృషి చేయండంటూ అధికారులకు ఆయన సూచించారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే 2022వ సంవత్సరం కల్లా దేశ పన్నుల వ్యవస్థను మెరుగుపరచేందుకు స్పష్టమైన లక్ష్యాలను ఖరారు చేయవలసిందని కూడా అధికారులకు ఆయన సూచన చేశారు. అవినీతిపరులైన వారి విశ్వాసాన్ని భంగపరచి, నిజాయతీగా పన్ను చెల్లించే వ్యక్తులలో నమ్మకాన్ని నెలకొల్పే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లధనానికి మరియు బేనామీ ఆస్తికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలుపరచడం, నోట్ల చట్టబద్ధత రద్దు తదితర చర్యలను కేంద్ర ప్రభుత్వం ఈ కృషిలో భాగంగా చేపట్టినట్లు ఆయన ప్రస్తావించారు.
పన్నుల సంబంధిత లావాదేవీలలో మానవ ప్రమేయాన్ని అవశ్యం కనీస స్థాయికి పరిమితం చేయాలని ప్రధాన మంత్రి చెప్పారు. ‘ఇ- అసెస్‌మెంట్’కు ఊతం ఇవ్వాలని, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ ప్రక్రియలలో నామ రహిత పద్ధతికి చోటు ఇవ్వాలని, ఇలా చేస్తే స్వార్ధపర శక్తులు చట్టం అమలులో ఎటువంటి అడ్డంకులను కల్పించలేక పోతాయని ఆయన అన్నారు.
పై అధికారికి నివేదించుకోవడం, న్యాయ నిర్ణయం.. ఈ దశలలో పన్నుల సంబంధిత కేసులు భారీ సంఖ్యలో పేరుకు పోవడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులలో పెద్ద మొత్తంలో నగదు ఇమిడి ఉన్నదని, ఆ నిధులను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించి ఉండాల్సిందని ఆయన అన్నారు. నిలచిపోయిన కేసులను అరికట్టడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రాజస్వ జ్ఞాన సంగమ్ సందర్భంగా సిద్ధం చేయవలసిందిగా అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
వెల్లడించని ఆదాయాన్ని మరియు సంపదను పసిగట్టడానికి, ఇంకా నిర్ధారించడానికి సమాచార ఆధారిత విశ్లేషణాత్మక సాధనాలను ఉపయోగించుకొమ్మని అధికారులను ప్రధాన మంత్రి కోరారు. పన్నుల సంబంధిత రాబడిని పెంచడం కోసం ప్రతి సంవత్సరం అధికారులు వారి వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ, వ్యవస్థ లోకి చేరవలసిన పన్నుల అంచనా మొత్తాలు తరచుగా తుల తూగడం లేదని ఆయన అన్నారు. ‘‘పన్ను చెల్లించవలసి ఉన్నప్పటికీ అది జమ కాని’’ సమస్యకు ఒక నిర్ణీత కాలావధితో కూడిన పరిష్కార మార్గాన్ని అధికారులు కనుగొనాలని ప్రధాన మంత్రి చెప్పారు. నిజాయతీపరులు కాని వారు పాల్పడే చెడు పనులకు నిజాయతీపరులు మూల్యాన్ని చెల్లించడం కొనసాగకూడదని ఆయన స్పష్టం చేశారు. డేటా ఎనలిటిక్స్, దర్యాప్తు విభాగాలను పటిష్ట పరచడానికిగాను పన్ను విభాగాలలో మానవ వనరుల నిర్వహణను సంపూర్ణంగా పునరుత్తేజితం చేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.
రెండు రోజుల పాటు సాగే జ్ఞాన సంగమ్ పన్నుల నిర్వహణను మెరుగుపరచేందుకు నిర్ధిష్టమైన ఉపాయాలను అందించగలదన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వెలిబుచ్చారు.