రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు జరిగిన 49 వ గవర్నర్ ల సమావేశం ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
గవర్నర్లు తమకు ఉన్నటువంటి అనుభవాన్ని జీవితం లోని పలు మార్గాలలో ఏ విధంగా రంగరించడం ద్వారా వివిధ కేంద్ర ప్రాయోజిత అభివృద్ధి పథకాలు మరియు కార్యక్రమాల తాలూకు గరిష్ట ప్రయోజనాన్ని ప్రజలు పొందడం సాధ్యపడగలదో ప్రధాన మంత్రి సుదీర్ఘంగా వివరించారు. సమాఖ్య స్వరూపంలో మరియు మన దేశంలో రాజ్యాంగ చట్రంలో గవర్నర్ వ్యవస్థ ఒక ప్రధానమైన పాత్రను పోషించవలసి ఉందని ఆయన అన్నారు.
ఆదివాసీ జనాభా చెప్పుకోదగిన విధంగా ఉన్న రాష్ట్రాల గవర్నర్ లు విద్య, క్రీడలు మరియు అన్ని వర్గాల అందుబాటులోకి ఆర్థిక సేవలు వంటి రంగాలలో ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాల యొక్క ప్రయోజనాలు ఆదివాసీ సముదాయాలకు అందేటట్లు చూడడంలో చేయూతను అందించగలరని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆదివాసీ సముదాయాలు ఒక కీలకమైన పాత్రను పోషించాయని, దీనిని గుర్తించి, భావితరాల వారికి అందించేందుకుగాను డిజిటల్ మ్యూజియమ్ ల వంటి మార్గాలలో వీటిని పదిలపరచవలసివుందని ఆయన చెప్పారు.
గవర్న ర్ లు విశ్వవిద్యాలయాలకు కులపతులు కూడా అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. జూన్ నెల 21వ తేదీ నాడు అంతర్జాతీయ యోగ దినం కావడంతో, ఈ అవకాశాన్ని యువత లో యోగా పట్ల మరింత ఎక్కువ చైతన్యాన్ని పాదుగొల్పడానికి వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మరి ఇదే రకంగా విశ్వవిద్యాలయాలు మహాత్మ గాంధీ 150వ వార్షికోత్సవం వేడుకలలో కూడా ఒక కీలక కేంద్ర బిందువు కాగలుగుతాయని ఆయన నొక్కి చెప్పారు.
జాతీయ పోషణ్ అభియాన్, గ్రామాలలో విద్యుత్తు సౌకర్యం కల్పన, ఇంకా మహత్వాకాంక్ష కలిగిన జిల్లాలలో అభివృద్ధి సంబంధిత పరామితుల వంటి కీలక ఇతివృత్తాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గవర్నర్ లు విద్యుత్తు సౌకర్యం తాలూకు లాభాలను స్వయంగా తెలుసుకోవడం కోసం ఇటీవలే విద్యుత్తు సౌకర్యానికి నోచుకొన్న పల్లెలలో పర్యటించాలి అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు.
ఏప్రిల్ నెల 14వ తేదీ నుండి ఆరంభమైన ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ లో భాగంగా 16000 కు పైగా పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఏడు కీలక పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు ఆయన చెప్పారు. జన్ భాగీదారీ ద్వారా ఏడు సమస్యల బారి నుండి ఈ గ్రామాలకు విముక్తిని ప్రసాదించడం జరిగిందని ఆయన చెప్పారు. ఆగస్టు నెల 15వ తేదీ గడువుగా పెట్టుకొని ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ ను ప్రస్తుతం మరో 65000 పల్లెలకు విస్తరించడం జరుగుతోందని ఆయన తెలిపారు.
వచ్చే సంవత్సరంలో జరిగే 50వ గవర్నర్ ల సమావేశం కోసం ప్రణాళికా రచనను వెంటనే మొదలుపెట్టాలని ప్రధాన మంత్రి సూచించారు. ఈ వార్షిక కార్యక్రమం మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలను అందించేటట్లుగా ఈ ప్రయత్నంలో శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.