My intention is to make India, which is already the cutting and polishing hub, into an International Diamond Trading Hub: PM 
Our goal is to transform India in one generation: PM Modi 
#MakeInIndia one of the most transformative initiatives, our aim is to make India a preferred destination for manufacturing: PM 
Gems & jewellery industry must encourage start-ups, create a growing market for made-to-order Indian jewellery: PM

భార‌త‌దేశం, ఇంకా వివిధ దేశాల‌ నుంచి విచ్చేసిన విశిష్ట అతిథులారా,
ప్ర‌తినిధులారా,
లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌..

అంత‌ర్జాతీయ వ‌జ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందు స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. భార‌త‌దేశ ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండలి (జిజెఇపిసి) స్వర్ణోత్సవాల సంద‌ర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ సదస్సు ఒక భాగం. ఈ స‌ద‌స్సు ముఖ్యాంశ‌మైన “మైన్స్ టు మార్కెట్ 2017” ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వున్న గ‌నుల నిపుణులను, వ‌జ్రాల కంపెనీలను, రీటెయిల‌ర్ల‌ను, బ్యాంక‌ర్ల‌ను, ఇంకా ఇత‌ర విశ్లేష‌కులను ఒకే వేదిక‌పైకి తీసుకువచ్చింది.

యాభై సంవ‌త్స‌రాల క్రితం భార‌త‌దేశ ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండ‌లి ఏర్ప‌టిన‌ప్ప‌టి నుండీ ఈ ప‌రిశ్ర‌మ‌లో భార‌త‌దేశం త్వ‌రిత‌గ‌తిన అడుగులు వేసి ప్ర‌గ‌తి సాధించింది. ప్రపంచంలో క‌ట్‌ చేసిన మరియు పాలిష్ చేసిన వ‌జ్రాల‌ అతి పెద్ద ఉత్పత్తిదారు ప్రస్తుతం భార‌త‌దేశమన్న సంగతి మీకు తెలిసిన విషయమే. ఎగుమ‌తుల విలువ‌లోను, ఉపాధి కల్ప‌న‌లోను విశిష్ట స్థాయిగ‌ల రంగాల్లో ఒక‌టిగా భార‌త‌దేశ ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల రంగం పేరు సంపాదించుకుంది. గ‌త నాలుగు ద‌శాబ్దాలలో వ‌జ్రాల త‌యారీలో, ఎగుమ‌తిలో భార‌తదేశం ఒక్కో మెట్టే ఎక్కుతూ ఈ రంగంలో ఉన్న‌త‌ స్థాయికి చేరుకుంది. భార‌త‌దేశ వాణిజ్య ఉత్ప‌త్తుల ఎగుమ‌తులలో భార‌త‌దేశ ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తుల శాతం 15 శాతం. ఇది భార‌త‌దేశ విజ‌య‌ గాథలో ఒక‌టి అని స‌గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. 1966-67లో ఈ రంగంలో ఈ రంగంలో భారత ఎగుమ‌తుల విలువ 28 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే. 1982-83లో ఈ ఎగుమతులు ఒక బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోగా, 1987-88లో మేం రెండు బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తులు చేయ‌గ‌లిగాం. 2003-04లో ఈ ఎగుమతులు ప‌ది బిలియ‌న్ డాల‌ర్ల విలువ‌కు చేరుకోగా, 2007-08లో 20 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు దాదాపుగా 40 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తులు చేస్తున్నాం.

స్నేహితులారా, భార‌త‌దేశ‌ దిగుమ‌తిదారులు ఇటీవలి వ‌ర‌కు ముడి వ‌జ్రాలను చూడాల‌న్నా, కొనుగోలు చేయాల‌న్నా విదేశాల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. దీని వ‌ల్ల ఈ రంగంలో స‌ప్ల‌యి సామ‌ర్థ్యం క్షీణించింది. ముడి వ‌జ్రాల ప‌రిశీల‌న‌, కొనుగోలు భార‌త‌దేశంలోనే చోటు చేసుకొనేటట్లుగా మేం చొరవ తీసుకోవాల‌ని మీలో చాలా మంది కోరుకొన్నారు. ఇందుకోసం ఒక స్పెష‌ల్ నోటిఫైడ్ జోన్ ను మేం ఏర్పాటు చేస్తామని 2014 డిసెంబ‌ర్ లో ఢిల్లీలో ప్ర‌పంచ వ‌జ్రాల స‌ద‌స్సు జరిగినప్పుడు ర‌ష్యా అధ్య‌క్షుడి స‌మ‌క్షంలో నేను ప్ర‌క‌ట‌ించాను. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం జ‌రిగింది. మ‌న వ్యాపారుల ప‌రిశీల‌న నిమిత్తం.. ఎటువంటి సుంకాలు లేకుండా విదేశీ ముడి వ‌జ్రాలు మ‌న దేశంలోకి రావ‌డానికి, తిరిగి వెళ్ల‌డానికి వీలుగా మ‌న చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం జ‌రిగింది. భార‌త్ డైమండ్ బోర్స్ వద్ద స్పెష‌ల్ నోటిఫైడ్ జోన్ 2015 నవంబ‌ర్‌ నుండి తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇది ఇప్పటికే మంచి ఫలితాలను సాధించింది కూడా. ఇదివరకు 80- 90 మంది బడా వ్యాపారులు మాత్ర‌మే బెల్జియం, ఆఫ్రికా మరియు ఇజ్రాయల్ లకు వెళ్లి అంత‌ర్జాతీయ ముడి వ‌జ్రాల‌ను చూడ‌గ‌లిగే వారు. ఇప్పుడు, దాదాపు మూడు వేల మంది చిన్న, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారులు ఈ స్పెష‌ల్ నోటిఫైడ్ జోన్ ద్వారా ఈ ప్రత్యేకాధికారానికి నోచుకొన్నారు. వ‌జ్రాల ప‌రిశ్ర‌మ‌లో పేరున్న అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీలు ఇంత‌వ‌ర‌కూ 244 రోజుల పాటు త‌మ ముడి వ‌జ్రాల‌ను మ‌న వ్యాపారుల‌ కోసం ప్ర‌ద‌ర్శించ‌డమైంది. ఈసరికే వజ్రాల క‌టింగ్‌, పాలిషింగ్‌ నిలయంగా ఉన్న భారతదేశాన్ని అంత‌ర్జాతీయ వ‌జ్రాల వాణిజ్య కేంద్రంగా చేయాలనేదే నా ఉద్దేశం.

లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌, ఒక త‌రం స‌మ‌యంలోనే భార‌త‌దేశాన్ని స‌మూలంగా మార్చేయాలనేది మన ల‌క్ష్యం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుండి అనేక పరివర్తనాత్మకమైన చొరవలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. వాటిలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక‌టి. తయారీ కోసం భారతదేశాన్నే ఎంపిక చేసుకోవాలనేది మా ధ్యేయం. గ‌త యాభై సంవ‌త్స‌రాలలో ర‌త్నాభ‌ర‌ణాల రంగంలో 475 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమతులు జ‌రిగాయి. భారతదేశంలో వ‌జ్రాల‌, లేదా బంగారం ఉత్ప‌త్తి చాలా తక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ఇది సాధ్యమైంది. ‘స్కిల్ ఇండియా’ మ‌రో ముఖ్య‌మైన కార్యక్రమం. శ్రామిక శక్తిలో నూతన పాత్రధారులు 21వ శ‌తాబ్దపు ఆర్ధిక వ్యవస్థకు తమ సేవలను అందించేందుకు తగిన నైపుణ్యాల‌ను క‌లిగి ఉండేటట్లు చూడడం ‘స్కిల్ ఇండియా’ సంకల్పం. ర‌త్నాలు మరియు ఆభ‌ర‌ణాల రంగం 4.6 మిలియ‌న్ మందికి ఉపాధిని కల్పిస్తోంది. వీరిలో ఒక్క వజ్రాల పరిశ్రమలోనే ఒక మిలియ‌న్ మంది శ్రమిస్తున్నారు. అంటే, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ ల సత్తాను చాట‌ిచెప్పడానికి ర‌త్నాలు మరియు ఆభ‌ర‌ణాల రంగం ఒక ప్రధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోందన్నమాట.

ఇవాళ, ప‌లు ఆఫ్రికా దేశాల‌ నుండి వ‌చ్చిన ప‌లువురు మంత్రులు మనతో పాటు ఈ సదస్సులో ఉన్నారు. ఆఫ్రికాతో భార‌త‌దేశం సంబంధ బాంధ‌వ్యాలు అత్యుత్తమంగా ఉన్నాయి. వ‌ల‌స‌వాద వార‌స‌త్వాన్ని ఉమ్మ‌డిగా క‌లిగిన దేశాలుగా ఆఫ్రికాకు, భార‌త‌దేశానికి గుర్తింపు ఉంది. ఇరు దేశాలు ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డంలో పోలికలు క‌లిగి ఉన్నాయి. అందుకే మ‌నం స‌హ‌జ‌సిద్ద‌మైన స్నేహితులం కాగ‌లిగాం. ఈ సంద‌ర్భంగా నేను నా ఆఫ్రికా స్నేహితుల‌కు సంతోషంగా ఓ విష‌యాన్నిచెప్ప‌ాలనుకొంటున్నాను. మీరు మీ దేశాల ర‌త్నాలు మరియు ఆభ‌ర‌ణాల రంగాన్నిఅభివృద్ధి చేసుకోవ‌డానికి మా మ‌ద్ద‌తు ఎల్ల‌వేళ‌లా వుంటుంది. మీ సాంకేతిక నిపుణుల‌కు భార‌త‌దేశం శిక్ష‌ణ కూడా ఇస్తుంది.
ఈ రంగం ఏ స్థాయినుంచి ఏ స్థాయికి ఎదిగిందో నేను మొద‌ట‌నే చెప్పాను. అయితే ఈ రంగం ఉండాల్సిన స్థాయి కంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. ఈ రంగంలో మ‌న‌కున్న బ‌లం క‌టింగ్‌, పాలిషింగ్‌. అంతర్జాతీయ ర‌త్నాలు, ఆభ‌రణాల మార్కెట్ విలువ‌ను దృష్టిలో పెట్టుకుంటే అందులో మ‌న వాటా ఉండాల్సిన దాని కంటే త‌క్కువ‌గా ఉంది. మ‌న భ‌విష్య‌త్ క‌టింగ్ పాలిషింగ్ స్థాయిని దాటి ప్ర‌గ‌తి సాధించాలి. వెలుగులోకి రాని సామ‌ర్థ్య‌మెంతో ఈ రంగంలో ఉంది. నేను మిమ్మ‌ల్ని ఓ ప్ర‌శ్న అడుగుతాను.
చేతితో తయారు చేసే ఆభ‌ర‌ణాల మార్కెట్ లో భార‌త‌దేశ వాటా పెంచ‌డానికి మీ ద‌గ్గ‌రున్న వ్యూహం ఏంటి ? అని.
భార‌త‌దేశ ఎగుమ‌తులు దిగుమ‌తిప్రధానమైనవి అనే విషయం నాదృష్టికి వచ్చింది. ఆభ‌రణాల్ని దిగుమ‌తి చేసుకుంటున్న‌ వారి అభిరుచుల‌పై ఆధారపడి వాటి డిజైన్స్‌, ఇత‌ర అంశాలు ఉంటున్నాయి. దీని అర్థం ఏంటంటే, భార‌త‌దేశం అంత‌ర్జాతీయ ఫ్యాష‌న్‌ను అనుసరిస్తోంది. అంతర్జాతీయ అభిరుచిని నెల‌కొల్ప‌డంలో అగ్ర‌గామిగా వుండ‌డానికి బదులుగా మ‌నం విదేశీ అభిరుచుల‌ను అనుస‌రిస్తున్నాం. మ‌న దేశంలోని ఎంతో విలువైన డిజైన్ ప్ర‌తిభ‌కు, ఈ రంగంలోని అనుభ‌వానికి ఇది ఎంత మాత్రం త‌గ‌దు. ఈ సంద‌ర్భంగా నేను ఒక ఉదాహ‌ర‌ణ ఇస్తాను. భార‌త‌దేశంలో రెండువేల సంవ‌త్స‌రాల క్రితం నాటి ప్ర‌సిద్ధి చెందిన విగ్ర‌హాలు, ప్ర‌తిమ‌లు ఉన్నాయి. వాటిలో అనేకం ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించినవే. ఈ క‌ళాత్మ‌క సంప‌ద‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మందిని ఆక‌ర్షించింది. ఈ సంప‌ద‌ను మ‌నం డాక్యుమెంట్ చేశామా ? ఈ క‌ళా ప్ర‌తిభ‌ను ఆధారం చేసుకొని మ‌నం మ‌న ఆభ‌ర‌ణాల రంగాన్ని ఉన్నతీకరించుకోవచ్చ‌ని ఆలోచించామా ?

స్నేహితులారా.. వస్త్ర ప్ర‌పంచంలోని రీటెయిల్ వ్యాపారులు ప్ర‌జ‌ల అభిరుచుల‌ను మార్చేస్తున్నారు. కేశాలంక‌ర‌ణదారులు సైతం వారి వినియోగదారుల అభిరుచుల‌ను మార్చుతుంటారు. ప్ర‌స్తుతం మనం కళ్లజోళ్లు, గడియారాలు, కలాలకు కూడా వ‌జ్రాల‌ను ఉప‌యోగిస్తున్న యుగంలో ఉన్నాం. మ‌న నగలు తయారు చేసే వ్యక్తులు వారికున్న నైపుణ్యాలు, బ‌లాలు, వార‌స‌త్వంతో అంత‌ర్జాతీయ అభిరుల‌ను, ఫ్యాష‌న్ల‌ను మార్చి కొత్తవి సృష్టించ‌లేరా ?

అంత‌ర్జాతీయ ఫ్యాష‌న్ రంగాన్ని ప్ర‌భావితం చేయాలంటే దాని లోతుపాతుల పైన, మార్కెట్ పైన‌ స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న మ‌న ప‌రిశ్ర‌మ‌కు ఉండాలి. ఈ విష‌యాన్ని మ‌న ప‌రిశ్ర‌మ స‌మైక్యంగా అధ్య‌య‌నం చేయాలి. ముందుగా అంతిమ వినియోగ‌దారులకు ఏం కావాలో తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు, కొన్ని ప్రాంతాలలో బంగారానికి ప్రాధాన్య‌ం ఉంటే మ‌రికొంత‌ మంది వెండిని ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకొంత‌ మంది ప్లాటినమంటే మ‌క్కువ చూపుతారు. వినియోగ‌దారుల‌తో బ‌లమైన అనుబంధాన్ని పెంచుకోక‌పోతే ఈ రంగంలో మ‌నం అంత‌ర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాతులు ఆర్జించలేం. అంతిమ వినియోగ‌దారుల‌తో నేరుగా సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌డానికి ఎల‌క్ట్రానిక్ కామ‌ర్స్ (E-commerce) చాలా సులువైన మార్గం. భార‌తీయ ప‌రిశ్ర‌మకు ఇది సువ‌ర్ణ అవ‌కాశం. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌తో స్టార్ట‌ప్ కంపెనీల‌ను ప్రారంభింప చేయ‌డానికి వీలుగా భార‌త‌దేశ ర‌త్నాలు మరియు ఆభ‌ర‌ణాల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండలి ప్రోత్సాహం అందించాలి. త‌ద్వారా వారు భార‌తీయ ఆభ‌ర‌ణాల కోసం విదేశీ మార్కెట్ ను సృష్టించ‌గ‌లుగుతారు.

గ‌తంలో భార‌త‌దేశంలో త‌యార‌యిన కొన్ని ఉత్ప‌త్తులు అంత‌ర్జాతీయంగా మంచి పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నాయి. ప్ర‌స్తుతం మ‌న దేశం సాఫ్ట్ వేర్ రంగంలో అంత‌ర్జాతీయ బ్రాండ్‌ను సంపాదించింది. అత్యున్న‌త నైపుణ్యాల‌ను, స‌మ‌ర్థ‌త‌ను అందిస్తోంది. ఆభ‌ర‌ణాల రంగంలోను మ‌నం ఈ విజ‌యాన్ని సాధించాలి. ఈ రంగంలో అత్యున్న‌త స్థాయికి వెళ్లాల‌నుకుంటే అవ‌కాశాలు అపారంగా వున్నాయి. భార‌త‌దేశ ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండలి కూడా ఈ విష‌యాన్ని గ్ర‌హించి స‌రైన ప‌ద్ధ‌తిలో ముందుకు సాగాలి. ఇందులో రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఎగుమ‌తుల విష‌యంలో ఉత్సాహంగా వ్య‌వ‌హ‌రించాల‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రిగింది. ప‌రిశ్ర‌మ కూడా ఆయా రాష్ట్రాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ద‌నే నేను భావిస్తున్నాను. ఎగుమ‌తుల‌తో పాటు, ప్ర‌పంచం లోనే వేగ‌వంతంగా వృద్ధి చెందుతున్న ఆర్దిక వ్య‌వ‌స్థ‌ను క‌లిగిన భార‌త‌దేశంలో స్థానికంగా కూడా ఆభ‌ర‌ణాల‌ డిమాండ్ పెరుగుద‌ల‌ను మ‌నం చూడబోతున్నాం.

త‌న ప్ర‌గ‌తికోసం ప‌థ‌క‌ ర‌చ‌న చేయ‌డం ప‌రిశ్ర‌మ‌కు చాలా ముఖ్యం. మీలోని బ‌ల‌హీనుల‌ గురించి ఆలోచించ‌డం కూడా మీకు చాలా ముఖ్యం. ప‌రిశ్ర‌మ‌లో త‌క్కువ వేత‌నాలు పొందుతున్న‌, ఆర్ధికంగా వెనుక‌బ‌డిన వారి వివ‌రాల‌ను మండ‌లి సేక‌రించాలి. జైపూర్‌, త్రిసూర్‌, వార‌ణాసి, రాజ్‌కోట్‌, కోయంబ‌త్తూర్ లాంటి ప్రాంతాల్లో నివ‌సిస్తున్న కార్మికుల గురించి తెలుసుకోవాలి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అందిస్తున్న అతి త‌క్కువ వ్య‌యంతో కూడిన సామాజిక భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మాలలో ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు వారి పేర్ల‌ను న‌మోదు చేసుకునేలా ప‌రిశ్ర‌మ జాగ్ర‌త్త‌లు తీసుకోగ‌ల‌దా ?

• ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఆదుకోవ‌డానికి ‘ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న’ ఉంది.

• జీవిత బీమానందించ‌డానికి ‘ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న’ ఉంది.

• త‌ప్ప‌కుండా నెల‌నెలా పింఛ‌ను అందించ‌గ‌లిగేలా ‘అట‌ల్ ఫించ‌న్ యోజ‌న’ వుంది.. వీటిలో మీ కార్మికులను చేర్పించ‌గ‌ల‌రా ?

నెల‌కు ఒక రూపాయి చెల్లిస్తే, ప్ర‌మాద బీమా ల‌భిస్తుంది. రోజుకు ఒక రూపాయి చెల్లిస్తే జీవిత బీమా సౌక‌ర్యం వ‌స్తుంది. ఐదు వేల రూపాయ‌ల్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంచితే, త‌ద్వారా వ‌చ్చే వ‌డ్డీతో ఈ స్కీముల ప్రీమియంల‌ను శాశ్వతంగా చెల్లించుకోవ‌చ్చు.

స్నేహితులారా, భార‌త‌దేశం 2022 వ సంవత్సరం లో 75వ స్వాతం త్ర దినోత్స‌వ సంబ‌రాలు జ‌రుపుకోనుంది. అప్పటికి మ‌న ర‌త్నాలు మరియు ఆభ‌ర‌ణాల ప‌రిశ్ర‌మ ఎలాంటి ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంది ? ఆ స‌మ‌యానికి మ‌న ప‌రిశ్ర‌మ ఏ స్థాయిలో వుండాల‌ని మీరు భావిస్తున్నారు ? ఆ ల‌క్ష్యాల‌ను మీరు ఎలా అందుకుంటారు ? ఎన్ని నూత‌న ఉద్యోగాల‌ను మీరు క‌ల్పించ‌గ‌ల‌రు ? ఈ విష‌యాన్ని మీరు గంభీరంగా తీసుకోవాల‌ని నేను కోరుతున్నాను. దీని పైన ఓ ప‌థ‌కంతో రండి. నియ‌మ నిబంధ‌న‌లలో మార్పులు కావాల్సి వ‌స్తే వాటి పైన మీరు స్ప‌ష్ట‌మైన విధానంతో, అమ‌లుకు యోగ్య‌మైన సూచ‌న‌ల‌తో నా దగ్గ‌ర‌కు రండి. మీరు తీసుకొచ్చే ప్ర‌తిపాద‌న‌లు దేశానికి మేలు చేస్తాయంటే, వాటిని వెంట‌నే ఆమోదించ‌డం జ‌రుగుతుంది. నా ఆలోచ‌న‌లను మీతో పంచుకోవ‌డానికి ఈ అవ‌కాశ‌మిచ్చినందుకు మీ అంద‌రికీ నా ధన్యవాదాలు పలుకుతూ, నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ స‌ద‌స్సు అన్ని విధాలా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi