ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘నవ భారతం- మేధో మథనం’’ (New India - Manthan) ఇతివృత్తంగా దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం 75 వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ‘న్యూ ఇండియా- మంథన్’ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఉత్తేజితం చేయడం లక్ష్యంగా ప్రధాన మంత్రి తొలి సారి కలెక్టర్లతో సంభాషించారు. “సంకల్పంతో సాధిస్తాం” (హిందీలో ‘సంకల్ప్ సే సిద్ధి’) అనే మంత్రంతో ఆగస్టు 9 వ తేదీ ఎంత సహజంగా ముడివడివుందో వారికి ప్రధాన మంత్రి వివరించారు. యువతరం సంకల్ప శక్తి, లక్ష్య సాధనాసక్తికి ఈ తేదీ ఒక సంకేతమని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన క్విట్ ఇండియా ఉద్యమంలో తొలుత సీనియర్ నాయకులు అరెస్టు కాగా, దేశవ్యాప్తంగా యువతరం ఉద్యమాన్ని భుజాలకెత్తుకుని ఎలా ముందుకు తీసుకువెళ్లిందీ శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
యువతరం నాయకత్వ పాత్రను స్వీకరిస్తే, లక్ష్యాలను తప్పక సాధించగలుగుతామని ప్రధాన మంత్రి చెప్పారు. కలెక్టర్లు కేవలం ఆయా జిల్లాలకు ప్రతినిధులు మాత్రమే కాదు, ఆ ప్రాంత యువతకు ప్రతీకలు అని ఆయన వివరించారు. జాతికి తమను తాము అంకితం చేసుకోగల అవకాశం లభించిన కలెక్టర్లు ఎంతో అదృష్టవంతులని ప్రధాన మంత్రి అభివర్ణించారు.
దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ 2022 నాటికి సాధించగలిగేలా ఓ కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తాము పనిచేస్తున్న జిల్లాలు 2022 నాటికి అధిగమించవలసిన లోటుపాట్లు ఏమిటో, ప్రజలకు ఏయే సేవలు అందేటట్లు చూడాలో- మొత్తంమీద తమ జిల్లా ఏ స్థానంలో ఉండాలో ఆయా జిల్లాలకు ప్రతినిధులుగా కలెక్టర్లు నిర్ణయించుకోవాలి అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
విద్యుత్తు, మంచినీటి సరఫరా, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల విషయంలో కొన్ని జిల్లాలు ఎప్పటికీ వెనుకబడే ఉంటున్నాయని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాల్లో సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే జాతి సర్వతోముఖాభివృద్ధి సూచికలకు కొత్త ఉత్తేజం లభిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు సదరు వెనుకబడిన జిల్లా కలెక్టర్లు ఉద్యమ స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఉందని ఆయన వివరించారు.
నిర్దేశిత పథకంలో లేదా రంగంలో సత్ఫలితాలను సాధిస్తున్న జిల్లాలలో అనుసరిస్తున్న ప్రణాళికలను, ఉత్తమ ఆచరణను అనుసరించడంతో పాటు మరింత ఉన్నతీకరించే దిశగా కలెక్టర్లను ప్రధాన మంత్రి ప్రోత్సహించారు. జిల్లాల్లోని సహోద్యోగులు, మేధావులు, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థుల సహాయంతో కలెక్టర్లు వారి జిల్లా కోసం ఈ నెల 15 వ తేదీ లోగా ఓ దార్శనిక పత్రాన్ని/ సంకల్ప పత్రాన్ని రూపొందించాలని ప్రధాన మంత్రి కోరారు. ఈ పత్రంలో 2022 కల్లా సాధించగలమని భావించే 10- 15 లక్ష్యాలను పొందుపరచాలని ఆయన సూచించారు.
‘సంకల్పంతో సాధిస్తాం’ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు, సమాచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ www.newindia.in ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఈ అంశంపై వారితో తాను మేధో మథనం నిర్వహించిన తరహా లోనే వారు కూడా వారి వారి జిల్లాలలో నిర్వహించాలని ఆయన సూచించారు.
న్యూ ఇండియా వెబ్‌సైట్ ప్రధాన లక్షణాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఆన్ లైన్ క్విజ్ వంటి వాటితో పాటు ‘సంకల్పంతో సాధిస్తాం’ ఉద్యమంలో భాగంగా చేపట్టబోయే వివిధ కార్యక్రమాల సమగ్ర కాలక్రమణిక వివరాలు ఇందులో ఉంటాయన్నారు. జిల్లాల్లో అభివృద్ధిని ప్రధాన మంత్రి రిలే పరుగు పందెంతో పోల్చారు. జట్టు లోని ఒక సభ్యుడి నుండి మరో సభ్యుడికి ‘పరుగు దండం’ (బ్యాటన్) అందే రీతిలోనే ఓ కలెక్టర్ నుండి మరో కలెక్టర్ చేతికి ‘అభివృద్ధి దండం’ విజయవంతంగా మారినప్పుడే అంతిమ లక్ష్యమైన విజయం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
కొన్ని పథకాల గురించి ప్రజలకు అవగాహన లేని కారణంగా అనేక సందర్భాల్లో వాటి ద్వారా ఆకాంక్షించిన ఫలితాలను సాధించడంలో వైఫల్యం సంభవిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. ఎల్ ఇ డి బల్బులు, భీమ్ యాప్ ల వంటి వాటిపై ప్రజలలో అవగాహనను పెంచడం ద్వారా వారు వాటి నుండి లబ్ధిని పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ‘స్వచ్ఛభారత్ ఉద్యమ’ విజయం కూడా ప్రజలలో అవగాహన, ప్రతిస్పందనాత్మక పాలన యంత్రాంగంపైన ఆధారపడి ఉందని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే వాస్తవ మార్పు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవల పరిస్థితి వంటి క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకొనే దిశగా కార్యాలయాల్లోని ఫైళ్లకు ఆవల ఉన్న ప్రపంచంలోకి వెళ్లాలని కలెక్టర్లను ప్రధాన మంత్రి కోరారు. వారు ఎంతగా జిల్లాల్లో పర్యటిస్తే ఫైళ్ల విషయంలో అంత చురుగ్గా వ్యవహరించగలరని ఆయన పేర్కొన్నారు. వస్తువులు మరియు సేవల పన్ను(జిఎస్ టి) ఏ విధంగా “మంచి, సరళమైన పన్నో’’ అనే విషయాన్ని జిల్లాల్లోని వ్యాపారులకు వివరించాలని కలెక్టర్లకు ప్రధాన మంత్రి సూచించారు. ప్రతి వ్యాపారి జిఎస్ టి వ్యవస్థలో నమోదయ్యేలా చూడాలని కోరారు. జిల్లాలో కొనుగోళ్లు సంబంధించి ఇ-మార్కెట్ ప్లేస్ ను వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. దేశంలో అత్యంత పేదల జీవితాలను మెరుగుపరచడమే పరిపాలన అంతిమ లక్ష్యం అని చెప్పిన మహాత్మ గాంధీ సందేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. పేదల జీవితాల్లో మార్పు తేవడానికి తామేం చేశామో నిత్యం సమీక్షించుకోవలసిందిగా కలెక్టర్లను ఆయన కోరారు. వివిధ సమస్యలతో వారి వద్దకు వచ్చే పేదల బాధలను కలెక్టర్లు శ్రద్ధగా వినాలని, వాటిని పరిష్కరించాలని ప్రధాన మంత్రి సూచించారు.
చివర్లో, కలెక్టర్లు యువకులు, సమర్ధులు మరియు వారు 2022 నాటి నవ భారత నిర్మాణం కోసం వారి జిల్లాలకు సంబంధించిన సంకల్పాలు రచించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. కలెక్టర్లు వారు నిర్దేశించుకున్న సంకల్పాలను సాధిస్తారన్న విశ్వాసాన్ని, ఈ ప్రక్రియలో, దేశం కూడా, సరికొత్త విజయ శిఖరాలను అందుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.