ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ ల సమావేశం తాలూకు ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
సమావేశంలో జరిగిన వివిధ చర్చలు మరియు వ్యక్తమైన అభిప్రాయాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
భాగస్వామ్యాలను, సాంస్కృతిక బృందాల రాకపోకలను, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య ప్రజల సంబంధాలను ప్రోత్సహించే “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” కార్యక్రమాన్ని బలోపేతం చేయవలసిందిగా గవర్నర్ లకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం లోని వేరు వేరు రాష్ట్రాల నడుమ సామరస్యాన్ని, సమగ్రతను వృద్ధి పరచేందుకు నూతన మార్గాలను నిర్మించవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
విద్య రంగంలో శ్రేష్ఠత్వాన్ని పెంపొందించడం కోసం గవర్నర్ లు- వారి యొక్క కులపతుల హోదా లో- విశ్వవిద్యాలయాలకు పిలుపు ఇవ్వాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశం లోని విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో కల్లా ఉత్తమమైన విశ్వవిద్యాలయాలుగా ఎదిగి తీరాలని, మరి విశ్వవిద్యాలయాలలో పరివర్తనను తీసుకురావడం లో గవర్నర్లు ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఐఐఎమ్ లలోను, అగ్రగామి 10 ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాలలోను స్వతంత్ర ప్రతిపత్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గురించి ఆయన వివరించారు.
సామాన్య మావనవుడి జీవనంలో సరళత్వాన్ని వృద్ధిపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆశయ సాధన దిశగా పని చేసేటట్లుగా పౌర సంస్థలను మరియు ప్రభుత్వ విభాగాలను గవర్నర్ లు ప్రజా జీవితంలో వారికున్నటువంటి అపార అనుభవం ద్వారా ప్రేరేపితం చేయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ పథకం అయినటువంటి ‘ఆయుష్మాన్ భారత్’ గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.
భారతదేశం 2019 లో మహాత్మ గాంధీ 150వ జయంతిని జరుపుకోనుందని, అలాగే 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని 2022 లో జరుపుకోనుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ఇటువంటి సందర్భాలు అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో స్ఫూర్తిదాయక మైలు రాళ్ళుగా నిలువగలుగుతాయన్నారు. త్వరలో జరుగనున్న కుంభ మేళా కూడా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం కలిగిన లక్ష్యాలను ప్రోత్సహించడంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలువగలుగుతుందని ఆయన అన్నారు.