ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్లొవాక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించడంలో సహకరించడంపై ఈ సందర్భంగా గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారతదేశం నుంచి ప్రత్యేక తరలింపు విమానాలను అనుమతించడంపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో స్లొవాక్ రిపబ్లిక్ నుంచి నిరంతర సహాయం కోరారు. అదే సమయంలో సంఘర్షణ ప్రాంతాల నుంచి ఇతర దేశాల పౌరులను తరలించే ప్రక్రియను కూడా భారత్ చేపట్టింది.
భారత పౌరుల తరలింపు ప్రక్రియ పర్యవేక్షణ కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజును నియమించినట్లు కూడా ప్రధానమంత్రి గౌరవనీయ హెగర్‌కు తెలిపారు.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింస, మానవతా సంక్షోభంపై ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శత్రుభావాన్ని విడనాడి, చర్చలవైపు తిరిగి దృష్టి మళ్లించాలని పలుమార్లు భారత్ చేసిన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంలోగల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.