ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) డైరెక్టర్ జనరల్ గౌరవనీయులు డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తో టెలిఫోనులో మాట్లాడారు.
కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందనను అందించడంలో డబ్ల్యూ.హెచ్.ఓ. నిర్వహించిన యొక్క ముఖ్య పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని కూడా ఇదే స్పూర్తితో కొనసాగించవలసిన అవసరాన్ని ఆయన గుర్తిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య వ్యవస్థలకు డబ్ల్యూ.హెచ్.ఓ. ఇస్తున్న మద్దతు యొక్క ప్రాముఖ్యతను ప్రశంసించారు.
డబ్ల్యూ.హెచ్.ఓ. మరియు భారత ఆరోగ్యశాఖ అధికారుల మధ్య సన్నిహిత మరియు క్రమమైన సహకారాన్ని, డైరెక్టర్ జనరల్, నొక్కి చెప్పారు. అదేవిధంగా, ఆయుష్మాన్ భారత్ పథకం అమలు మరియు క్షయవ్యాధికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన ప్రచారం వంటి భారతదేశ దేశీయ కార్యక్రమాలను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భారతదేశానికి ముఖ్యమైన పాత్ర ఉందని ఆయన అన్నారు.
సాంప్రదాయ ఔషధ వ్యవస్థల విలువపై ప్రధానమంత్రి మరియు డైరెక్టర్ జనరల్ ప్రయోజనకరమైన అంశాలపై, ముఖ్యంగా ప్రపంచ జనాభా యొక్క ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడం కోసం చర్చలు జరిపారు. పరిపూర్ణ విధానాల ద్వారా సాంప్రదాయ ఔషధ పరిష్కారాలను ఆధునిక వైద్య విధానంతో అనుసంధానించవలసిన అవసరాలన్నీ, అదేవిధంగా కాలానుగుణంగా పరీక్షించిన సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులు మరియు పద్ధతుల శాస్త్రీయ ధృవీకరణ కోసం వారు అంగీకరించారు.
సాంప్రదాయ ఔషధాల సామర్థ్యాన్ని ఇప్పటివరకు తగినంతగా ప్రశంసించలేదని డైరెక్టర్ జనరల్ నొక్కిచెప్పారు. అయితే, ఈ రంగంలో పరిశోధన, శిక్షణతో పాటు, ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, డబ్ల్యూ.హెచ్.ఓ. చురుకుగా పనిచేస్తోందని ఆయన తెలియజేశారు.
ఈ ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. "కోవిడ్-19 కోసం ఆయుర్వేద" అనే ఇతివృత్తంతో నవంబర్, 13వ తేదీన భారతదేశంలో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినట్లు డైరెక్టర్ జనరల్‌కు తెలియజేశారు.
కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి కొనసాగుతున్న ప్రపంచ సహకారం గురించి ప్రధానమంత్రి మరియు డైరెక్టర్ జనరల్ చర్చించారు. ఈ నేపథ్యంలో, మానవజాతి ప్రయోజనం కోసం వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో ప్రముఖ తయారీదారుగా భారతదేశ సామర్థ్యాలను మోహరించడానికి ప్రధానమంత్రి మోదీ ప్రదర్శిస్తున్న స్పష్టమైన నిబద్ధతను డైరెక్టర్ జనరల్ ఘనంగా ప్రశంసించారు.