Quoteభారత్ సూచన మేరకు ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించింది: ప్రధాని
Quoteఆయా రుతువుల్లో విరివిగా దొరికే పండ్లను తినాలి, ఆహారాన్ని భుజించేటప్పుడు బాగా నమిలి తినడం మరువరాదు, సరైన వేళకు మంచి ఆహారాన్ని స్వీకరించాలి: ప్రధాని
Quoteరోగాలు లేనంత మాత్రాన ఆరోగ్యవంతులమని చెప్పలేం, స్వస్థతకు ప్రాముఖ్యాన్నివ్వాలి: శ్రీ మోదీ
Quoteచేస్తున్న పని మీద మనసు లగ్నం చేస్తూ, ఒత్తిడిని అధిగమించే చర్యలు చేపట్టాలి: ప్రధానమంత్రి
Quoteప్రగతి ప్రయత్నాలను కొనసాగించాలి, మనకు ఎదురయ్యే సవాళ్ళపై మనమే యుద్ధం చేయాలి, మనసులో ప్రశాంతత సాధించే ప్రయత్నాలు చేయాలి: ప్రధాని
Quoteగౌరవం అడిగితే ఇచ్చే హక్కు కాదు, మన ప్రవర్తనను బట్టి సహజంగా దక్కుతుంది.. పనులను చేపట్టడం ద్వారా నాయకత్వం చూపాలి తప్ప, అధికారం చూపడం ద్వారా కాదు: ప్రధాని
Quoteవిద్యార్థులు మరమనుషులు కారు, విద్య వైవిధ్యమైన వికాసానికి హేతువు.. తమ ఇష్టాలపై సమయాన్ని వెచ్చించే స్వాతంత్య్రం వారికి ఉండాలి: శ్రీ మోదీ
Quoteపరీక్షలూ మార్కులే సర్వస్వం కాదు.. విజ్ఞానం, పరీక్షలు వేర్వేరు పార్శ్వాలు: ప్రధాని

సుందర నర్సరీలో ఈరోజు ఏర్పాటైన ‘పరీక్షా పే చర్చా’ (పీపీసీ) ఎనిమిదో సంచిక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. దేశం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులతో ఆహ్లాదకర వాతావరణంలో ముచ్చటించిన ప్రధాని, ఈ సందర్భంగా అనేక అంశాలను స్పృశించారు. శీతాకాలంలో శరీరంలో వేడిని కలిగించే నువ్వుల మిఠాయిని ప్రధాని విద్యార్థులకు పంచారు.  

పోషకాహారంతో వికాసం

పోషకాహారం గురించి మాట్లాడుతూ, భారత్ సూచన మేరకు ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా అందుకు తగిన ప్రచారాన్ని కల్పించిందని చెప్పారు. సరైన పోషకాహారం అనేక వ్యాధులను నివారించగలదు కాబట్టి పోషకాహారానికి సంబంధించిన అవగాహన కీలకమని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి తెలియజేసిందన్నారు. భారతదేశంలో తృణధాన్యాలను ‘సూపర్‌ఫుడ్‌’గా పరిగణిస్తారని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  దేశంలో పండే అనేక పంటలూ ఫలాలూ మన వారసత్వంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని చెబుతూ,  ప్రతి కొత్త పంటనూ, రుతువునీ దేవునికి అంకితం చేయడం మన వారసత్వంలో భాగమని, పంటలతో  ముడిపడ్డ అనేక పండుగలను వేడుక చేసుకోవడం మనకు అలవాటనీ  వివరించారు. ఇక దేవుడికి నివేదించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన అలవాటని గుర్తుచేశారు. ఆయా రుతువుల్లో దొరికే ఫలాలను తినాలని శ్రీ మోదీ విద్యార్థులకు సూచించారు. మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు, జంక్ ఫుడ్, నూనెను అతిగా వాడే ఆహార పదార్థాలకు  దూరంగా ఉండాలని చెప్పారు. ఆహారాన్ని తినే సరైన పద్ధతి గురించి వివరిస్తూ, ఆహారాన్ని మింగడానికి ముందు కనీసం 32 సార్లు బాగా నమలాలని చెప్పారు. నీళ్లు తాగినప్పుడల్లా చిన్న చిన్న గుక్కలు తీసుకోవాలని, నీటి రుచిని కూడా ఆస్వాదించాలంటూ పలు చిట్కాలను ప్రధాని పంచుకున్నారు. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ఎంతో కీలకమంటూ, రైతుల ఆహారపుటలవాట్ల గురించి తెలియజేశారు.  రైతులు ఉదయాన్నే  పొలాలకు వెళ్లే ముందు కడుపారా ఆహారాన్ని తిని, తిరిగి సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనాన్ని ముగిస్తారన్నారు. విద్యార్థులు కూడా వారి ఉదాహరణను అనుసరించి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని కోరారు.
 

|

పోషకాహారం, ఆరోగ్యం

 ఆరోగ్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, జబ్బులు లేకపోవడాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా భావించలేమనీ, పిల్లలు స్వస్థతపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. మనిషి ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంతో అవసరమని, మనిషి శరీరాన్ని కాపాడగల శక్తి నిద్రకు ఉందని అన్నారు. మనిషి ఆరోగ్యంలో నిద్ర ప్రాముఖ్యాన్ని అధ్యయనం చేసే అనేక పరిశోధనలు జరుగుతున్నాయని శ్రీ మోదీ విద్యార్థులకు చెప్పారు. సూర్యుడి కిరణాలు మనిషికి స్వస్థత చేకూర్చగలవని, ప్రతిరోజూ ఉదయపు వేళలో  సూర్యుడికి అభిముఖంగా కొద్ది నిమిషాలు గడిపే అలవాటును అలవర్చుకోవాలని ఉద్బోధించారు.  సూర్యోదయం అయిన వెంటనే ఏదైనా వృక్షం కింద నిలబడి గాఢంగా శ్వాసించాలని ప్రధాని సూచించారు.  వ్యక్తి ప్రగతిలో పోషకాహారం ఎంతో ముఖ్యమైన అంశమనీ, అయితే ఆహారం విషయంలో ఏది, ఎప్పుడు, ఏ విధంగా, ఎందుకు అనే ప్రశ్నలు కీలకమైనవని ప్రధాని వివరించారు.
 

|

ఒత్తిడిపై పైచేయి
 

ఒత్తిడి అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ, 10 వ తరగతి లేదా 12 వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు రాకపోతే, విద్యార్థి గతి అధోగతే అన్న సమాజపు తీరు అవాంఛనీయమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇటువంటి వైఖరి వల్లే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషించారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ఆచరించవలసిన విధానాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరించారు. ఏ విధంగా క్రికెట్ ఆటలో బంతిని ఎదుర్కొనే బ్యాట్స్మన్ మిగతా ప్రపంచాన్ని మరిచిపోయి కేవలం రాబోయే బంతి మీదే దృష్టి కేంద్రీకరిస్తాడో, అదే విధంగా విద్యార్థులు కేవలం తమ చదువు మీదే పూర్తి శ్రద్ధ పెడితే ఒత్తిడిని సులభంగా జయించగలరని శ్రీ మోదీ సూచించారు.

 

మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి

విద్యార్థులు బాగా సన్నద్ధమై, ప్రతిసారీ తమను తాము సవాలు చేసుకుంటూ ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. చాలా మంది తమతో తాము పోరాటం చేయడానికి వెనకాడుతుంటారని, అయితే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనతో మనం యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.  నేను ఏం అవుతాను, ఏం చేయగలను, ఏం చేస్తే నాకు సంతృప్తి లభిస్తుందని తరచూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలని సూచించారు.  రోజుకో లక్ష్యం గురించి కాకుండా క్రమంగా మనసు ఒకే లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేసుకోవాలని వ్యాఖ్యానించారు. చాలా మంది ఆలోచనలు స్థిరంగా ఉండవనీ అయితే మనకోసం మనం నిర్దేశించుకున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మనం మనసుపై నియంత్రణ కలిగి ఉండి మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలని సూచించారు.

 

|

నాయకత్వ కళ

ఒక మంచి నాయకునిగా మారాలంటే ఏం చేయాలని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు శ్రీ మోదీ సమాధానం ఇస్తూ, ఒక వ్యక్తి బాహ్య రూపం వల్ల వారు నాయకులు కాలేరనీ, ఇతరులకు ఆదర్శంగా ఉండే వారు మంచి  నాయకులు కాగలరని చెప్పారు. దీనిని సాధించడానికి, వ్యక్తులు తమను తాము మార్చుకోవాలని, వారి ప్రవర్తన ఈ మార్పును ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు. "నాయకత్వం మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆమోదించడం ద్వారా లభిస్తుంది" అని ప్రధానమంత్రి అన్నారు. ఇతరులకు బోధించడం కన్నా ముందు వాటిని మనం ఆచరించడం మంచి నాయకత్వ లక్షణమని అన్నారు. పరిశుభ్రత గురించి ప్రసంగం చెప్పే వ్యక్తి దానిని ఆచరించకపోతే, వారు ఎన్నటికీ మంచి నాయకుడు కాలేరని పేర్కొంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నాయకత్వానికి సమిష్టి కృషి, సహనం అవసరమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఎవరికైనా పనులను అప్పగించేటప్పుడు, వారు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, అలాగే ఆ సవాళ్లలో వారికి సహాయం చేయడం ద్వారా మీ నాయకత్వంపై వారికి బలమైన నమ్మకం ఏర్పడుతుందన్నారు. పిల్లవాడు సంతలో తప్పిపోకుండా తల్లిదండ్రుల చేయి పట్టుకోవాలని కోరుకుంటాడు, అది అతనిలో భద్రత, నమ్మకాన్ని కలిగిస్తుంది. అలాగే నాయకులుగా మనం మార్గదర్శకంగా ఉన్నప్పుడు మన నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందని, ఆ విశ్వాసమే మంచి నాయకత్వ లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనదని ప్రధానమంత్రి వివరించారు.

పుస్తకాలకు మించి - 360º వృద్ధి (సర్వతోముఖాభివృద్ధి)

చదువుతో అభిరుచులను సమతుల్యం చేసుకోవడం అనే అంశంపై మాట్లాడుతూ, విద్యాభ్యాసం మాత్రమే విజయానికి మార్గం అనే సాధారణ నమ్మకం ఉన్నప్పటికీ, మనం రోబోలం కాదని, మనుషులుగా మనం చదువుతో పాటు మనసుకు నచ్చిన పనులు కూడా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు, సమగ్ర అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. విద్య కేవలం తదుపరి తరగతికి వెళ్లడం కోసం మాత్రమే కాదని, సమగ్ర వ్యక్తిగత వృద్ధి కోసమని ఆయన పేర్కొన్నారు. పిల్లలను చదువు పేరుతో నాలుగు గోడలకు పరిమితం చేయవద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రధానమంత్రి కోరారు, ఎందుకంటే ఇది వారి పెరుగుదలను అడ్డుకుంటుంది. పిల్లలు ఆరుబయట స్వేచ్ఛగా ఆడాలని, వారికి ఇష్టమైన పనులు చేసే స్వేచ్ఛ ఉండాలని, ఇది వారి చదువులను సైతం మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. పరీక్షల కోసమే చదవడం సరికాదని, పరీక్షలే సర్వస్వం కాదని స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడానికి వ్యతిరేకంగా తాను మాట్లాడడం లేదని, పుస్తకాలు బాగా చదివి మంచి జ్ఞానం పొందవచ్చన్నారు. అయితే  జ్ఞానం, పరీక్షలు రెండు వేర్వేరు విషయాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

|

సానుకూలతలను గుర్తించడం

మనం ఎవరికైనా సలహా ఇస్తే అలా ఎందుకు చెప్పారు, నాలో ఏమైనా లోపం ఉందా అని తరచూ వారు ఆలోచిస్తుంటారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే సామర్థ్యాన్ని కచ్చితంగా అడ్డుకుంటుందన్నారు. అయితే సలహాలు ఇవ్వడానికి బదులుగా, ఇతరుల్లోని మంచి లక్షణాలను గుర్తించాలని, బాగా పాడుతున్నారు లేదా చక్కగా దుస్తులు ధరిస్తారు అని వారిలోని సానుకూల లక్షణాలను చర్చించాలని ఆయన సలహా ఇచ్చారు. దీనివల్ల వారిలో నిజమైన ఆసక్తి ఏర్పడుతుంది, మీ మధ్య  సంబంధాలను పెంచుతుంది. అప్పుడు వారిని మీతో కలిసి చదువుకోవడానికి ఆహ్వానించడం ద్వారా వారికి సహాయం అందించాలని ఆయన సూచించారు. రచనా అలవాటును పెంపొందించుకునే ప్రాముఖ్యతను కూడా ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అలవాటు గల వారు తమ ఆలోచనలను సమర్థవంతంగా సంగ్రహిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

మీ ప్రత్యేకతను తెలుసుకోండి

అహ్మదాబాద్‌లో ఒక పిల్లవాడిని పాఠశాల నుంచి బహిష్కరించబోతున్న సంఘటనను ప్రధానమంత్రి గుర్తుచేసుకుంటూ, ఆ పిల్లవాడిని పాఠశాల నుంచి పంపేయాలనుకున్నారు, అయితే అంతలో ఆ పాఠశాలలో టింకరింగ్ ల్యాబ్‌ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఎక్కువ సమయం టింకరింగ్ ల్యాబ్‌లోనే గడిపేవాడు. ఒకసారి పాఠశాలలో రోబో తయారీ పోటీలు నిర్వహిస్తే ఆ పిల్లవాడు ఆ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకే పిల్లల్లో ఉన్న ప్రత్యేక ప్రతిభను, బలాలను గుర్తించి వాటిని పెంపొందించడం ఉపాధ్యాయుడి ప్రధాన భాద్యత అవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. స్వీయ-ఆలోచన, సంబంధాలను అర్థం చేసుకోవడానికి శ్రీ మోదీ ఒక సాధనను విద్యార్థులకు సూచించారు. 25-30 మంది బాల్య స్నేహితులను గుర్తుచేసుకుని, వారి తల్లిదండ్రుల పేర్లతో సహా వారి పూర్తి పేర్లను రాయాలని ఆయన సూచించారు. మనం ఆప్తమిత్రులుగా భావించే వారి గురించి మనకు ఎంత తక్కువ తెలుసో మనకు ఇది తెలియజేస్తుందన్నారు. ఎదుటివారిలో సానుకూల లక్షణాలను గుర్తించే అలవాటును పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి ప్రోత్సహించారు. ఇది వ్యక్తిగత వృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

|

మీ సమయం, మీ జీవితంపై మీదే నియంత్రణ

సమయ నిర్వహణపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రోజులో అందరికీ 24 గంటలే ఉంటాయన్న శ్రీ మోదీ.. కొందరు చాలా పనులు పూర్తిచేస్తారని, మరికొందరు తామేదీ సాధించలేకపోయినట్టు భావిస్తారని అన్నారు. సమయ నిర్వహణ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. తమ సమయాన్ని ప్రభావవంతంగా ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై చాలా మందికి అవగాహన లేదన్నారు. సమయపాలన పాటించాలని, కొన్ని పనులను నిర్దేశించుకోవాలని, తమ పురోగతిని రోజూ సమీక్షించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. క్లిష్టంగా ఉన్న సబ్జెక్టులను వదిలేయకుండా, వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. కష్టంగా భావించే సబ్జెక్టును ముందుగా మొదలుపెట్టి సమర్థవంతంగా దాన్నెలా ఎదుర్కోవాలో ఒక ఉదాహరణతో వివరించారు. ఈ సవాళ్లను దృఢ సంకల్పంతో స్వీకరిస్తే అవరోధాలను అధిగమించి విజయం సాధించగలరన్నారు. పరీక్ష సమయంలో ఏవేవో ఆలోచనలు, సాధ్యాసాధ్యాలు, అనేక ప్రశ్నల వల్ల పరధ్యానానికి గురయ్యే సమస్యను ప్రస్తావిస్తూ.. చాలావరకూ విద్యార్థులు తమగురించి తాము తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మిత్రులతో ముచ్చట్లలో మునిగిపోతారని, చదవకుండా సాకులు చెప్తారని ప్రధానమంత్రి అన్నారు. బాగా అలసిపోయామని, చదివే మూడ్ లేదని... చాలావరకూ ఇలాంటి సాకులు వినిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్లతోపాటు ఇటువంటి పరధ్యానాలన్నీ దృష్టి నిలవకుండా చేసి చదువులో వెనుకబడేలా చేస్తాయని ప్రధానమంత్రి విద్యార్థులకు చెప్పారు.

ఈ క్షణంలో జీవించండి

ఈ క్షణమే అన్నింటికన్నా విలువైనదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గడిచిందంటే అది ముగిసినట్టే. కానీ సంపూర్ణంగా జీవిస్తే, అది జీవితంలో భాగమవుతుంది. ఆహ్లాదాన్నిచ్చే ఓ గాలితెమ్మెర వంటి క్షణాన్ని గుర్తించి, ఆస్వాదించడం అత్యావశ్యకమన్నారు.
 

|

పంచుకోవడంలో ఉన్న శక్తి

చదువుకునేటప్పుడు ఆందోళన, నిరాశలను ఎదుర్కోవడమన్న అంశంపై మాట్లాడుతూ.. కుటుంబానికి దూరమవుతున్న భావన, సామాజిక సంబంధాల నుంచి క్రమంగా వైదొలగడం ద్వారా చాలావరకూ నిరాశా నిస్పృహల సమస్యలు మొదలవుతాయని శ్రీ మోదీ చెప్పారు. అంతర్గత సందిగ్ధాలను వ్యక్తం చేస్తూ, అవి పెరగకుండా చూసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. సాంప్రదాయక కుటుంబ నిర్మాణాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడడం ద్వారా ఒత్తిడి తొలగిపోతుందని, అది ఉద్విగ్నత పెరగకుండా నిరోధిస్తుందని అన్నారు. తన చేతిరాతను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు ఎంతలా కష్టపడ్డారో ఆయన గుర్తుచేసుకున్నారు. అది తన మనసును తాకిందన్న ఆయన.. ఉపాధ్యాయులు విద్యార్థులపై నిజంగా శ్రద్ధ చూపితే అది ఎంతగానో ప్రభావం చూపుతుందని పునరుద్ఘాటించారు. ఈ శ్రద్ధ, ఈ రకమైన జాగరూకత విద్యార్థి శ్రేయస్సును, అభ్యసన తీరును విశేషంగా ప్రభావితం చేస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

మీ అభిరుచులను అనుసరించండి

నిర్దిష్టమైన కెరియర్ను ఎంచుకోవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తేవడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. పిల్లలను ఇతరులతో పోల్చడం ద్వారా తల్లిదండ్రుల అంచనాలు మొదలవుతాయనీ, అది పిల్లల అహాన్నీ, సామాజిక స్థితినీ దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రతిచోటా మోడల్‌గా చూపొద్దని, వారి శక్తియుక్తులను అంగీకరించి వారిని ప్రేమించాలని హితవు పలికారు. పిల్లల్లో ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా ఒక్కో ప్రతిభ ఉంటుందని చెప్తూ.. పాఠశాల నుంచి దాదాపు బహిష్కరణకు గురవబోతున్న ఓ విద్యార్థి రోబోటిక్స్ లో అద్భుతంగా రాణించిన విషయాన్ని ఆయన ఉదహరించారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను కూడా ఆయన ఉదహరించారు. పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి లేకపోయినా, వారిలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ప్రధానమంత్రి కోరారు. నైపుణ్యాభివృద్ధి అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్న ఆయన.. ప్రధానమంత్రిని కాకపోయి ఉంటే తాను నైపుణ్యాభివృద్ధి శాఖనే ఎంచుకునేవాడినని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలపై దృష్టిపెట్టడం ద్వారా ఒత్తిడిని తగ్గించి, వారు అభివృద్ధి చెందడంలో సహాయపడగలరని అన్నారు.
 

|

ఆగండి, ఆలోచించండి, మళ్లీ మొదలుపెట్టండి

విభిన్న ధ్వనులను గుర్తించడంపై దృష్టి కేంద్రీకరించడం ఏకాగ్రతకు ఎలా దోహదపడుతుందో ప్రధానమంత్రి వివరించారు. ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాల ద్వారా నూతన శక్తి జనిస్తుందని, ఆందోళనను అధిగమించడంలో అది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు నాసికల ద్వారా శ్వాసలో సమతౌల్యం సాధించే నైపుణ్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఇది క్షణాల్లో శరీరాన్ని అదుపులోకి తీసుకురాగలదు. ఒత్తిడిని జయించి, దృష్టిని కేంద్రీకరించేలా చేయడంలో ధ్యానం, శ్వాస నియంత్రణ ఎలా దోహదపడతాయో ఆయన వివరించారు.

మీ సామర్థ్యాన్ని తెలుసుకుని లక్ష్యాలను సాధించండి

సానుకూల దృక్పథంతో ఉండడం, చిన్న విజయాలతో సంతోషాన్ని పొందడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఒక్కోసారి కొందరు సొంత ఆలోచనలతోనో లేదా ఇతరుల ప్రభావంవల్లో ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోతారని శ్రీ మోదీ అన్నారు. పదో తరగతిలో 95% మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని 93% రావడంతో నిరాశకు గురైన విద్యార్థితో మాట్లాడుతూ.. దీన్ని విజయంగా భావించాలని చెప్పారు. లక్ష్యాన్ని ఉన్నతంగా నిర్దేశించుకున్న ఆ విద్యార్థికి అభినందనలు తెలిపారు. లక్ష్యాలు ప్రతిష్ఠాత్మకంగా, వాస్తవికంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థి శక్తియుక్తులను అర్థం చేసుకుని, లక్ష్యానికి చేరువగా వెళ్లడానికి చేసిన కృషిని అభినందిస్తూ విజయాలను సానుకూల దృక్పథంతో చూడాలని శ్రీ మోదీ కోరారు.

ప్రతి పిల్లవాడూ ప్రత్యేకమే

పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనే అంశంపై మాట్లాడుతూ.. ప్రధానంగా విద్యార్థులతో సమస్య తక్కువే అని, వారి కుటుంబాలతోనే సమస్య ఎక్కువ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పిల్లలకు కళల వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు వారిని ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ వంటి కెరీర్లనే ఎంచుకునేలా ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిరంతర ఒత్తిడి పిల్లల జీవితాన్ని ఒత్తిడితో నింపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలను, ఆసక్తులను అర్థం చేసుకుని గుర్తించాలని, వారి పురోగతిని పర్యవేక్షించాలని, చేయూతనివ్వాలని కోరారు. ఉదాహరణకు, పిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తే, తల్లిదండ్రులు వారిని ఆటలపోటీలను చూడడానికి తీసుకెళ్లి ప్రోత్సహించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి. ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులపై మాత్రమే శ్రద్ధ కనబరిచి, ఇతరులను నిర్లక్ష్యం చేసే వాతావరణాన్ని సృష్టించవద్దని ఉపాధ్యాయులను ప్రధానమంత్రి కోరారు. విద్యార్థులను ఇతరులతో పోల్చకుండా, ప్రతి ఒక్కరిలో ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం అత్యంత ప్రధానమైన అంశమని స్పష్టం చేశారు. తమనుతాము నిరంతరం మెరుగుపరచుకునేలా విద్యార్థులు కృషిచేయాలని, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. అయితే, జీవితంలో చదువొక్కటే సర్వస్వం కాదన్న విషయాన్నీ గుర్తించాలని కోరారు.

 

|

స్వీయ ప్రేరణ

స్వీయ ప్రేరణ విషయంపై ప్రధాని మాట్లాడుతూ, ఒకరు వారి ఆత్మ నుంచి వేరుపడకూడదు, మనలో కలిగే ఆలోచనలను పంచుకోవడానికీ, కుటుంబం నుంచి గాని లేదా సీనియర్ల నుంచి గాని ప్రేరణను పొందడానికి  ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని సూచించారు. చిన్న చిన్న లక్ష్యాలతో ఒకరు తనకు తాను సవాలు విసురుకోవాలి, ఉదాహరణకు.. పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను అనే షరతును పెట్టుకొని దానిని సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆ విజయం నుంచి లభించిన ఉల్లాసాన్ని అనుభూతి చెందాలి అని ఆయన వివరించారు. ఈ చిన్న ప్రయోగాలు ఒక వ్యక్తి స్వీయ పరిమితుల నుంచి ఎదిగి వర్తమానంలో జీవించనిస్తాయి. గతం గత: అనే భావనను కలుగజేస్తాయి అని ఆయన చెప్పారు. తాను 140 కోట్ల మంది భారతీయుల వద్ద నుంచి ప్రేరణను పొందుతూ ఉంటానని ప్రధానమంత్రి తెలిపారు.  తాను ‘పరీక్షా పే చర్చా’ పుస్తకాన్ని రాసినప్పుడు, అజయ్ వంటి వారు వారి పల్లెల్లో దీనికి  కవిత్వ రూపాన్నిచ్చే ప్రయత్నాలు చేశారన్నారు. ఇది తనకు అలాంటి పనిని కొనసాగించవచ్చన్న భావనను కలుగజేసిందని, మన చుట్టూరా ప్రేరణను పొందేటందుకు అనేక మార్గాలుండడమే దీనికి కారణమని ప్రధాని అన్నారు. విషయాలను లోపలకు తీసుకోవడం గురించి అడిగినప్పడు, నిద్ర నుంచి త్వరగా మేల్కోవడం వంటి సూచనను గురించి ఆలోచిస్తూ ఉండడం చాలదు, దానిని అమలుపరచాలి అని శ్రీ మోదీ జవాబు చెప్పారు. నేర్చుకున్న వాటిని ఆచరణలో చేసి చూడాలి, ప్రయోగాలు చేస్తూ పోయి రాటుదేలాలని ఆయన అన్నారు. ఒకరు తనను తాను ఒక ప్రయోగశాలగా అనుకొని ఈ సిద్ధాంతాలను పరీక్షించుకోవాలి,  అప్పుడు ఫలితాలను కలబోసుకొని వాటి ద్వారా లాభపడొచ్చు అని వివరించారు. చాలా మంది తమతో పోటీపడే కన్నా ఇతరులతో పోటీపడుతుంటారు, తరచు తమ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వారితో తమను పోల్చుకుంటూ ఉంటారు, దీంతో ఆశాభంగం ఎదురవుతుంది అని ఆయన అన్నారు. మనతో మనం పోటీపడితే అచంచల ఆత్మవిశ్వాసం పోగవుతుంది. ఒకరిని ఇతరులతో పోల్చుకుంటూ కూర్చుంటే నిరుత్సాహం, అధైర్యం కలుగుతాయి అని ఆయన స్పష్టం చేశారు.

వైఫల్యాల్నుంచే ముందుకు పరుగుతీయాలి

అపజయాన్నుంచి బయటపడడం ఎలాగన్న అంశంపై శ్రీ మోదీ స్పందిస్తూ, 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు వారి పదో తరగతి లేదా పన్నెండో తరగతుల్లో ఉత్తీర్ణతను సాధించలేకపోయినా సరే, జీవనం ముగింపునకు చేరుకోదన్నారు. జీవనంలో విజేతగా నిలవాలా, లేక కేవలం చదువుసంధ్యల్లోనా అనేది నిర్ణయించుకోవడం ముఖ్యం అని ఆయన చెప్పారు. వైఫల్యాలను గురువుగా చేసుకోవాలి అని ఆయన సలహా ఇచ్చారు. ఈ సందర్భంలో క్రికెటే ఒక ఉదాహరణ, ఆ ఆటలో క్రీడాకారులు వారి పొరపాట్లను సమీక్షించుకొని మెరుగుపడడానికి శ్రమిస్తారు అని ఆయన గుర్తుచేశారు. జీవనాన్ని ముక్కలుముక్కలుగా చేసి కాక సమగ్రంగా చూడాలని, ఒక్క పరీక్షల కోణంలో నుంచే చూడకండని ప్రధాని కోరారు. భిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల్లో తరచు అసాధారణ బలాలు ఇమిడిపోయి ఉంటారని, ప్రతి ఒక్కరిలో ప్రత్యేక శక్తియుక్తులుంటాయని ఆయన స్పష్టంచేశారు. కేవలం విద్యావిషయక విజయాలపై శ్రద్ధ చూపే కన్నా ఈ బలాలకు పదును పెట్టుకోవడం కీలకం అని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో, ఇది ఒకరి జీవనానికీ, సత్తాలకూ సంబంధించిన విషయం, విజయాన్ని నిర్ధారించేది ఇవే, కేవలం చదువులో తెచ్చుకొన్న మార్కులు కాదని ఆయన తెలిపారు.
 

|

సాంకేతికతపై పట్టు సాధించండి

మనమంతా అదృష్టవంతులం, ముఖ్యంగా టెక్నాలజీ విస్తారంగా పాతుకుపోయి ప్రభావాన్ని ప్రసరిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం అని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. టెక్నాలజీకి వెన్ను చూపాల్సిన అవసరం లేదు, అంతకన్నా, వ్యక్తులు వారి సమయాన్ని ఫలం లేని పనులపై వెచ్చిస్తారో లేక వారి అభినివేశాలకు మెరుగులు పెట్టుకుంటారో నిర్ణయించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేయడం వల్ల, టెక్నాలజీ ఒక విధ్వంసక శక్తిగా మారే బదులు ఒక బలంగా మారుతుంది అని ఆయన అన్నారు. పరిశోధకులు, ఆవిష్కర్తలు చేసే పని సమాజం మంచికి టెక్నాలజీని అభివృద్ధిపరచడమేనని శ్రీ మోదీ తెలిపారు. టెక్నాలజీని అర్థం చేసుకొని వీలున్నంతవరకు వాడుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా పనిలో ఒక వ్యక్తి తన సర్వోత్తమ ప్రదర్శనను ఎలా ఇవ్వగలరంటారంటే అదేపనిగా మెరుగులు పెట్టుకోవడానికి ప్రాముఖ్యాన్నిస్తూ ఉండటం వల్లేనని ఆయన చెప్పారు. నిన్న చేసిందానికన్నా మేలైన పనిని చేయడానికి శాయశక్తులా కష్టపడుతూ ఉండడం శ్రేష్ఠత్వాన్ని సాధించడానికి మొదటి షరతు అని ఆయన అన్నారు.

మీ తల్లితండ్రుల్ని ఒప్పించడమెలా?

కుటుంబం సూచనను అనుసరించాలా, లేక వ్యక్తిగత అభిరుచుల ప్రకారం నడుచుకోవాలా అనే రెంటిలో దేనిని ఎంచుకోవడం అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉంటారనే విషయంపై శ్రీ మోదీ మాట్లాడుతూ, కుటుంబం ఇచ్చే సూచనలను ఒప్పుకోవడం ముఖ్యం, ఆ తరువాత వారిచ్చిన సలహాను పాటిస్తూ ముందుకు ఎలా పోవాలో కూడా చెప్పండని వారిని అడిగి, ఈ విషయంలో వారి సహాయాన్ని కోరాలన్నారు. నిజాయతీగా ఆసక్తి చూపెట్టి, ప్రత్యామ్నాయ ఐచ్ఛికాలను గౌరవభావంతో చర్చించడం వల్ల కుటుంబాలు మెల్లమెల్లగా అర్థం చేసుకొని మీ ఆకాంక్షలను సమర్థించేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు.
 

|

పరీక్షల ఒత్తిడిని ఇలా తట్టుకోండి

విద్యార్థులు పరీక్షపత్రాలను సకాలంలో పూర్తి చేయలేకపోవడం అనే ఉమ్మడి సమస్యను ఎదుర్కొంటూ ఉన్న సంగతిని ప్రధాని చర్చిస్తూ, ఇదివరకటి పరీక్షపత్రాల్ని మళ్లీ ఒకసారి రాయడం ద్వారా చిక్కనైన సమాధానాల్ని ఎలా రాయాలో, సమయాన్ని ఎలా నిర్వహించుకోవచ్చో నేర్చుకోండని సలహాలిచ్చారు. మరింత ఎక్కువ ప్రయత్నం అవసరమయ్యే ప్రశ్నలపై మనసు పెట్టడానికి ప్రాముఖ్యాన్నివ్వాలని, కష్టంగా ఉన్న ప్రశ్నలకు, జవాబులు తెలియని ప్రశ్నలకు ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టొద్దని ఆయన ప్రధానంగా చెప్పారు. తరచుగా అభ్యాసం చేస్తుండడం పరీక్షల్లో సమయాన్ని మెరుగైన విధంగా ఉపయోగించుకోవడంలో తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.


ప్రక‌ృతి పట్ల శ్రద్ధ తీసుకోండి

వాతావరణ మార్పు గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ అంశంపై యువతరం మక్కువ చూపుతుండడాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో అభివ‌ృద్ధి విరివిగా చోటుచేసుకోవడం దోపిడీ సంస్క‌తికి దారితీసిందని, ప్రజలు పర్యావరణ పరిరక్షణ కన్నా స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిస్తున్నారని ఆయన అన్నారు. మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్‌మంట్) ను గురించి శ్రీ మోదీ చెప్పారు. ఇది ప్రకృతిని కాపాడే, పెంచి పోషించే జీవనసరళి అని వివరించారు. ధరణి మాతను క్షమాపణలు వేడుకోవడం, చెట్లను, నదులను ఆరాధించడం వంటి మన దేశంలోని సాంస్కృతిక సంప్రదాయాల్ని ప్రస్తావిస్తూ, ఇవి ప్రక‌తి అంటే మనకున్న గౌరవాన్ని చాటిచెబుతాయన్నారు. ‘ఏక్ పేఢ్ మా కె నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) ఉద్యమాన్ని గురించి కూడా ఆయన ప్రధానంగా చెప్తూ, ప్రజలను వారి మాతృమూర్తుల జ్ఞాపకార్థం మొక్కలను నాటాల్సిందిగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం అనుబంధాన్ని, యాజమాన్య భావనను పెంచుతుందని, ప్రకృతి పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.
 

|

మీ హరిత స్వర్గాన్ని మీరే ఆవిష్కరించుకోండి
 

విద్యార్థులు వారంతట వారుగా మొక్కలను నాటాల్సిందిగా శ్రీ మోదీ వారిని ఉత్సాహపరిచారు. , వాటికి నీరు పోయడంలో ఆచరణీయ చిట్కాలను ఆయన సూచించారు. మొక్కకు ఒక పక్కగా నీటితో నింపిన మట్టి కుండను ఉంచి, దానిని నెలకొకసారి మళ్లీ నీటితో నింపాలంటూ సలహానిచ్చారు. ఈ పద్ధతి మొక్క కనీస స్థాయిలో నీటిని వినియోగించుకొని త్వరత్వరగా పెరగడానికి తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి అందరికీ అభినందనల్ని తెలియజేస్తూ, వారు కార్యక్రమంలో పాల్గొన్నందుకు తన కృతజ్ఞత‌లు వ్యక్తం చేశారు.

 

Click here to read full text speech

  • Jitendra Kumar March 21, 2025

    🙏🇮🇳
  • ABHAY March 15, 2025

    नमो सदैव
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • கார்த்திக் February 25, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🙏Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏Jai Shree Ram🚩
  • Vivek Kumar Gupta February 24, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 24, 2025

    जय जयश्रीराम ................................🙏🙏🙏🙏🙏
  • கார்த்திக் February 23, 2025

    Jai Shree Ram 🚩Jai Shree Ram 🌼Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🌼
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha February 22, 2025

    नमो
  • கார்த்திக் February 21, 2025

    Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🚩Jai Shree Ram 🌼
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs

Media Coverage

Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 మార్చి 2025
March 24, 2025

Viksit Bharat: PM Modi’s Vision in Action