మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకొని ఏడు దశాబ్దాలు గడుస్తున్నాయి. అలాగే దేశాన్ని ఐక్య భారతదేశంగా నిలిపేందుకు సర్దార్ పటేల్ గారు వివిధ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. రాజకీయ ఏకత సాకారమైంది. కానీ భారతదేశమంతా ఒకే విపణిగా రూపుదిద్దుకోలేక పోయింది. మన ఉత్పత్తిదారులకు సాధికారితను కల్పించడం, మన వినియోగదారులను బలోపేతం చేసేందుకు దేశ మార్కెట్ లను ఏకం చేసే లక్ష్యంతో ఎన్ డి ఎ ప్రభుత్వం గట్టి కృషి చేస్తోంది. ఈ దార్శనికతతోనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం ఒక దేశం- ఒక మార్కెట్ నినాదాన్ని సాకారం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకొంటోంది.
ఇ-నామ్
వ్యవసాయ మార్కెటింగ్ పాలన ఆయా రాష్ట్రాల అగ్రి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంటుంది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని పలు మార్కెట్ ఏరియాలుగా విభజిస్తారు. ఇలా ఏర్పడిన మార్కెట్ ఏరియాల పాలనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసయా ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఎ పి ఎం సి)లు చూస్తాయి. ఇది తన స్వీయ మార్కెటింగ్ రెగ్యులేషన్ లను , ఫీజు నిర్ణయం వంటి వాటిని అమలు చేస్తుంటుంది. ఒకే రాష్ట్రంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక మార్కెట్ నుండి మరో మార్కెట్ ప్రాంతానికి తరలించడంలో ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ స్థాయిలలో వ్యవసాయ ఉత్పత్తులపై చార్జీలు, పలు స్థాయిలలో మండీ చార్జీలు ఇలా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండానే వినియోగదారులపై అదనపు భారం పడి ధరలుపెరిగే పరిస్థితి ఉంటున్నది.
ఇ-నామ్ పథకం ఈ సవాళ్లను ఎదుర్కొని, ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి మార్కెట్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇది, ఏకరూపతను ప్రోత్సహించడమే కాకుండా, సమీకృత మార్కెట్‌లలో పద్ధతులను క్రమబద్ధీకరిస్తుంది. కొనుగోలు దారులకు , అమ్మకం దారులకు మధ్య సమాచార లోపాన్ని లేకుండా చూస్తుంది. వాస్తవ గిరాకీకి, సరఫరా కు అనుగుణంగా ధరలు తెలుసుకొనే వీలు కల్పిస్తుంది. దీని వల్ల వేలం ప్రక్రియలో పారదర్శకతకు అవకాశం కలుగుతుంది. రైతులకు దేశ వ్యాప్త మార్కెట్ లతో అనుసంధానం ఏర్పడుతుంది. వారి సరుకులకు నాణ్యతకు అనుగుణంగా మంచి ధరను పొందడమే కాకుండా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులకు అవకాశం కలుగుతుంది. వినియోగదారుకు మంచి నాణ్యమైన సరుకు మరింత సహేతుక ధరకు లభిస్తుంది.
జి ఎస్ టి..
దేశవ్యాప్తంగా మనకు ఎన్నోరకాల పన్నులున్నాయి. ఒకే దేశంలో వివిధ పన్ను రేట్లు, వివిధ రకాల నిబంధనలు ఉన్నాయి. ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. జి ఎస్ టి అమలుతో ఇదంతా మారిపోతుంది. జి ఎస్ టి అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా ఒకే ఒక పన్ను విధానం ఉంటుంది.
జి ఎస్ టి అనేది వస్తువులు, సేవలకు సంబంధించి తయారీదారు నుండి వినియోగదారు వరకు ఒకే ఒక పన్ను విధింపునకు సంబంధించినది. ప్రతి దశలో చెల్లించే ఇన్ పుట్ టాక్సుల క్రెడిట్‌లు తదుపరి దశ వేల్యూ యాడిషన్‌లో అందుబాటులోకి వస్తాయి. దీనితో జి ఎస్ టి ప్రాథమికంగా ప్రతి దశలో వేల్యూ అడిషన్‌పై మాత్రమే పడుతున్న పన్ను. పరోక్ష పన్ను నిబంధనలు, వ్యవస్థలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేటట్లు జి ఎస్ టి చేస్తుంది. దీనితో వ్యాపార అనుకూలత పెరుగుతుంది. వేల్యూ చెయిన్ అంతటా , దేశవ్యాప్తంగా అతుకులు లేని టాక్స్ క్రెడిట్‌లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పన్ను భారం కనీస స్థాయిలో ఉంటుంది. జి ఎస్ టి లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రధాన పన్నులను కలిపివేయడం, కేంద్ర అమ్మకపు పన్ను (సి ఎస్ టి)ను ఉపసంహకరించడం వంటి చర్యల వల్ల స్థానికంగా ఉత్పత్తి అయ్యే సరుకులు, సేవల ఖర్చు బాగా తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ విపణిలో భారతీయ ఉత్పత్తులు పోటీకి నిలబడడానికి అవకాశం కలుగుతుంది. భారతీయ ఎగుమతులు పుంజుకోవడానికి వీలు ఏర్పడుతుంది. పన్నుల విధానంలో లీకేజీలను అరికట్టడం, సామర్ధ్యం పెంపు వల్ల చేకూరే లబ్ధి కారణంగా చాలా వరకు సరుకులపై మొత్తం మీద పన్ను భారం తగ్గుతుంది. ఇది అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఒకే దేశం, ఒకే గ్రిడ్, ఒకే ధర
భారతదేశంలో విద్యుత్తు పంపిణీ సామర్ద్యం చాలినంతగా లేకపోవడం, అసమ రీతిలో విస్తరించి ఉండడం వల్ల విద్యుత్తు మిగులు రాష్ట్రాల నుండి లోటు రాష్ట్రాలకు విద్యుత్తు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వేసవిలో బాగా విద్యుత్తుకు డిమాండ్ ఉండే సమయంలో ట్రాన్స్‌మిషన్ లైన్ లు అందుబాటులో లేక విద్యుత్తు కొరత ఏర్పడుతుంటుంది. అందువల్ల ఈ రాష్ట్రాలకు రెండంకెల ధరలు పడతాయి. ఎన్‌చ డి ఎ ప్రభుత్వం అందుబాటులో ఉన్న (విద్యుత్) ట్రాన్స్ ఫర్ కెపాసిటీ (ఎ టి సి)ని సుమారు 71 శాతం పెంచింది. 2013-14 లో అందుబాటులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫర్ కెపాసిటీ 3450 మెగా వాట్లు ఉండగా , దానిని 5,900 మెగా వాట్లకు పెంచారు. ఇది రేట్లను గణనీయంగా తగ్గించింది.
“VidyutPravah app” ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు గ్రిడ్‌లోని మిగులు విద్యుత్ గురించి, ధర గురించిన సమాచారం అందించడం జరుగుతోంది. రాష్ట్రాల నుండి కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించిన సమాచారం, ఆ రాష్ట్రం ఏదైనా కొరతను గురించి వెల్లడించిందా వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. చాల సందర్భాలలో అన్నిరాష్ట్రాలకు విద్యుత్ రేట్లు ఒకే రకంగా ఉన్నట్టు మొబైల్ యాప్ ద్వారా గమనించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా ఇది సాధ్యమైంది.
ట్రాన్స్‌మిషన్ సామర్ధ్యం పెంపు కారణంగా పలు రాష్ట్రాలు వాటి స్వల్పకాలిక అవసరాలకు విద్యుత్‌ను నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డి ఇ ఇ పి ( డిస్కవరీ ఆఫ్ ఎఫిసియంట్ ఎలక్ట్రిసిటీ ప్రైస్) ఇ- బిడ్డింగ్, ఇ-రివిర్స్ ఆక్షన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. స్వల్పకాలికంగా విద్యుత్తును సమకూర్చుకోవడానికి విద్యుత్తు పంపిణీ సంస్థలకు ( డిస్కమ్ లకు) పనికివస్తుంది. ఈ విధమైన స్పర్ధాత్మక సేకరణ విధానం విద్యుత్ సేకరణ ధరను తగ్గించడానికి ఉపయోగపడి అంతిమంగా వినియోగదారుకు మేలు జరుగుతుంది.
యు ఎ ఎన్
గతంలో ఎవరైనా వ్యక్తి కొత్తగా తొలిసారిగా ఉద్యోగంలో చేరినట్టయితే , అతని పేరు మీద ఇ పి ఎఫ్ ఖాతాను సదరు సంస్థ యాజమాన్యం ప్రారంభించి అతని ఖాతాలో ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను జమ చేసేది. ఉద్యోగి ఉద్యోగం వదిలి వెళితే కొత్త ఇ పి ఎఫ్ ఖాతాతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చేది. దీని వల్ల పాత ఖాతా నుండి కొత్త ఉద్యోగంలో చేరిన కొత్త ఖాతాకు డబ్బు బదిలీ కావడానికి ఎంతో వ్యయప్రయాసలు పడాల్సి రావడమే కాక ఎనో దరఖాస్తు ఫారాలు పూర్తి చేయాల్సి వచ్చేది. అంతేకాదు, గతంలో ఉద్యోగి పనిచేసిన సంస్థ పై వాలిడేషన్ కోసం అధారపడాల్సి వచ్చేది. యు ఎ ఎన్ అమలుతో ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ మొత్తం బదిలీ విషయంలో పాత ఉద్యోగ సంస్థ ప్రమేయం లేకుండా చేశారు. ఈ విషయంలో ఉద్యోగికి ఇ పి ఎఫ్ ఒ కు మధ్య నేరుగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఉద్యోగి తన ఉద్యోగ జీవిత కాలం మొత్తానికి ఒకే యు ఎ ఎన్ నంబర్ ఉంటుంది. పి ఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తాలను యు ఎ ఎన్ నంబరుకు జత చేస్తారు. దీనితో ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ సులభతరం అవుతుంది. ఇటువంటి చర్యలు ఇండియా మార్కెట్‌ను సమీకృతం చేయడానికి, పౌరుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఎంతో ఉపకరించనున్నాయి.