ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా చేసిన తాజా ప్రసంగం లో ఓణమ్ పర్వదినాన్ని గురించి ప్రస్తావించారు. ఈ పండుగ చింగం నెల లో వస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భం లో ప్రజలు కొత్త వస్తువుల ను కొనుగోలు చేస్తారని, వారి ఇళ్ల ను అందం గా అలంకరించుకుంటారని, పూక్కలమ్ ను తయారు చేసుకుంటారని, ఇంకా ‘ఓణమ్- సాదియా’ ను ఆస్వాదిస్తారని ఆయన అన్నారు.
ఓణమ్ ఆనందోత్సాహాలు విదేశాల లోని దూర తీరాలకు కూడా చేరుకొన్న నేపథ్యం లో ఓణమ్ పండుగ ఇప్పుడు అతి శీఘ్రం గా అంతర్జాతీయ పండుగ గా మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
వ్యవసాయం తో ముడిపడిన పండుగ గా ఓణమ్ ఉందని, అంతే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఇది ఒక నవీనమైన ఆరంభ వేళ గా కూడా ఉంటుందని ఆయన అన్నారు. రైతుల నైతిక ధైర్యం నుండే మన సమాజం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మనకు ఆహారాన్ని అందించే అన్నదాత ను వేదాలు కూడా ప్రస్తుతించాయని ఆయన ఈ సందర్బంగా గుర్తుకు తెస్తూ, కరోనా కష్టకాలం లోనూ రైతులు వారి ధైర్యాన్ని రుజువుచేశారని, పొలాల్లో విత్తులు చల్లడం లో చెప్పుకోదగ్గ పెరుగుదల చోటు చేసుకోవడం దీనికి ప్రతిబింబం గా నిలచింది అని ప్రధాన మంత్రి చెప్తూ, వారి నిరంతర శ్రమ కు వందనాలు పలికారు.