రేపు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని మహత్వాకాంక్ష కలిగిన బీజాపుర్ జిల్లా లో పర్యటించనున్నారు.
ఆయన ఒక హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆరోగ్య హామీ పథకం- ఆయుష్మాన్ భారత్ కు నాంది పలకనుంది.
బీజాపుర్ జిల్లా లో జాంగ్ లా అభివృద్ధి కేంద్రాన్ని ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఈ క్రమంలో ఒక గంట సేపు అక్కడి ప్రజలతో ఆయన మమేకమవుతారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలలో చోటుచేసుకొంటున్న పురోగతిని గురించి ఆయనకు వివరించనున్నారు.
హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆశ (ASHA) వర్కర్ లతో ఆయన ముఖాముఖి మాట్లాడుతారు. ఒక ఆంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి, ఆంగన్‌వాడీ కార్యకర్తలతోను, పోషణ్ అభియాన్ లబ్దిదారులైన బాలల తోను మాట్లాడుతారు. ఒక హాట్ బజార్ హెల్త్ కియోస్క్ ను సందర్శించి, ఆరోగ్య కార్యకర్తలతో ముచ్చటిస్తారు. జాంగ్ లా లో ఒక బ్యాంకు శాఖను ప్రారంభించి, ముద్ర పథకంలో భాగంగా ఎంపిక చేసిన లబ్దిదారులకు రుణ మంజూరు లేఖలను ప్రదానం చేస్తారు. గ్రామీణ బిపిఒ ఉద్యోగులతో కూడా ఆయన సంభాషిస్తారు.
ఆ తరువాత ప్రధాన మంత్రి జనసభ జరిగే స్థలానికి చేరుకొంటారు. ఆదివాసీ సముదాయాలకు సాధికారిత ను ప్రసాదించడం ధ్యేయంగా రూపొందినటువంటి ‘వన్ ధన్ యోజన’ ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పథకం కనిష్ఠ మద్దతు ధర ద్వారా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎమ్ఎఫ్‌పి) యొక్క మార్కెటింగ్ కు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఎమ్ఎఫ్‌పి కోసం ఒక వేల్యూ చైన్ ను అభివృద్ధిపరచాలని సూచిస్తోంది.
ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భానుప్రతాప్‌పుర్- గుదుమ్ రైలు మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తారు. దల్లీరాజ్‌హరా మరియు భానుప్రతాప్‌పుర్ ల మధ్య ఒక రైలుకు ప్రారంభ సూచకంగా జెండా ను చూపుతారు. బీజాపుర్ ఆసుపత్రిలో ఒక రక్త శుద్ధి కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.
పిఎమ్ జిఎస్ వై లో భాగంగా ఎల్‌డబ్ల్యుఇ ప్రాంతాలలో 1988 కి.మీ. రహదారుల నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి పునాది రాయి ని వేస్తారు; ఎల్‌డబ్ల్యుఇ ప్రాంతాలలో మరికొన్ని రహదారి అనుసంధాన పథకాలకు, బీజాపుర్ లో నీటి సరఫరా పథకానికి మరియు రెండు వంతెనల పనులకు శంకు స్థాపన చేస్తారు. ఒక జన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.