QuoteGreetings on the occasion of Chhath Puja: PM Modi
QuoteChhath Puja is an example of Ek Bharat Shreshtha Bharat: PM Modi
QuoteToday we are one of the largest solar power generating countries: PM Modi
QuoteOur country is doing wonders in the solar as well as the space sector. The whole world, today, is astonished to see the achievements of India: PM Modi
QuoteUrge more and more Start-ups and innovators to take full advantage of the huge opportunities being created in India in the space sector: PM Modi
QuoteStudent power is the basis of making India strong. It is the youth of today who would lead India in the journey till 2047: PM Modi
QuoteIn India, Mission LiFE has been launched. The simple principle of Mission LiFE is - Promote a lifestyle which does not harm the environment: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా!

నమస్కారం!

      దేశంలోని అనేక ప్రాంతాల్లో సూర్యారాధన పండుగ 'ఛత్' ను జరుపుకుంటారు. 'ఛత్' పండుగలో భాగంగా లక్షలాది మంది భక్తులు తమ గ్రామాలకు, వారి ఇళ్లకు, వారి కుటుంబాల దగ్గరికి చేరుకున్నారు. ఛత్ మాత ప్రతి ఒక్కరికీ సమృద్ధిని,సంక్షేమాన్ని అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా!

      మన సంస్కృతికి, మన విశ్వాసానికి, ప్రకృతికి ఎంత లోతైన సంబంధం ఉందో చెప్పేందుకు సూర్యారాధన సంప్రదాయమే నిదర్శనం. ఈ పూజ మన జీవితంలో సూర్యకాంతి  ప్రాముఖ్యతను వివరిస్తుంది. దీంతో పాటు ఎత్తుపల్లాలు జీవితంలో అంతర్భాగమని సందేశం కూడా ఇస్తుంది. కాబట్టిప్రతి సందర్భంలోనూ మనం ఒకే వైఖరిని కలిగి ఉండాలి. ఛత్ మాత పూజలో వివిధ పండ్లు,తేకువా మిఠాయిలను సమర్పిస్తారు. ఈ వ్రతం ఏ కష్టమైన సాధన కంటే తక్కువేమీ కాదు. ఛత్ పూజలో మరో ప్రత్యేకత ఏమిటంటే పూజకు ఉపయోగించే వస్తువులను సమాజంలోని వివిధ వ్యక్తులు కలిసి తయారుచేస్తారు. ఇందులో వెదురుతో చేసిన బుట్ట లేదా సుప్లిని ఉపయోగిస్తారు. మట్టి దీపాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. దీని ద్వారాశనగలను పండించే రైతులు, పిండిని తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలకు సమాజంలో ప్రాముఖ్యత  ఏర్పడింది. వారి సహకారం లేకుండా ఛత్ పూజలు పూర్తికావు. ఛత్ పండుగ మన జీవితంలో పరిశుభ్రత  ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ఈ పండుగ సందర్భంగా రోడ్లు, నదులు, ఘాట్‌లు, వివిధ నీటి వనరులను సమాజ స్థాయిలో శుభ్రం చేస్తారు. ఛత్ పండుగ కూడా 'ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్'కి ఉదాహరణ. ఈరోజు బీహార్, పూర్వాంచల్ ప్రజలు దేశంలో ఏ మూలన ఉన్నా ఛత్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో, ముంబాయితో సహా మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఛత్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లో ఇంతకు ముందు ఛత్ పూజ పెద్దగా జరిగేది కాదని నాకు గుర్తుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాదాపు గుజరాత్ మొత్తంలో ఛత్ పూజ రంగులు కనిపించడం మొదలైంది. ఇది చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో విదేశాల నుంచి కూడా ఛత్ పూజకు సంబంధించిన ఎన్ని అందమైన చిత్రాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటేభారతదేశ  గొప్ప వారసత్వం, మన విశ్వాసం, ప్రపంచంలోని ప్రతి మూలలో మన గుర్తింపును పెంచుతున్నాయి. ఈ గొప్ప పండుగలో పాల్గొనే ప్రతి విశ్వాసికి నా శుభాకాంక్షలు.

నా ప్రియమైన దేశప్రజలారా!

    ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు  కూడా అధ్యయనం చేసే అంశం.

తమిళనాడులోని కాంచీపురంలో ఎఝిలన్ అనే రైతు ఉన్నారు. ఆయన 'పిఎం కుసుమ్ యోజన'ని సద్వినియోగం చేసుకున్నారు. తన పొలంలో పది అశ్వ సామర్థ్యాల సోలార్ పంప్‌సెట్‌ను అమర్చారు. ఇప్పుడు తమ పొలానికి కరెంటు కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. పొలంలో సాగునీటి కోసం ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సరఫరాపై కూడా ఆధారపడడం లేదు. అలాగే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కమల్‌జీ మీనా 'పి.ఎం. కుసుమ్ యోజన' నుండి లబ్ధి పొందారు.  కమల్ గారు  పొలంలో సోలార్ పంప్‌ను అమర్చారు. దాని కారణంగా ఆయన ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గితే ఆదాయం కూడా పెరుగుతుంది. కమల్ జీ సౌరశక్తి కారణంగా అనేక ఇతర చిన్న పరిశ్రమలకు కూడా విద్యుత్తు లభిస్తోంది. వారి ప్రాంతంలో చెక్క పని ఉంది. ఆవు పేడతో కూడా ఉత్పత్తులు  తయారవుతున్నాయి. సోలార్ విద్యుత్తును వాటిలో కూడా వినియోగిస్తున్నారు. వారు 10-12 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అంటే కమల్ జీ ప్రారంభించిన కుసుమ్ యోజన పరిమళం ఎంతో మందికి చేరడం ప్రారంభమైంది.

మిత్రులారా!

     మీరు ఒక నెలంతా కరెంటు వాడిన తర్వాత మీకు కరెంటు బిల్లు రావడం కాకుండామీకు అదనంగా ఆదాయం వస్తుందని మీరు ఊహించగలరా? సౌరశక్తి ఈ పని కూడా చేసింది. కొన్ని రోజుల క్రితంమీరు దేశంలోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామం - గుజరాత్‌లోని మోధేరా గురించి చాలా విన్నారు. మోధేరా సౌరగ్రామంలోని చాలా ఇళ్లలో సౌర శక్తి తో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.ఇప్పుడు అక్కడ చాలా ఇళ్లలో నెలాఖరులోగా కరెంటు బిల్లు రావడం లేదు. దానికి బదులుగా కరెంటుతో సంపాదన చెక్కు వస్తోంది. ఇలా జరగడం చూసి ఇప్పుడు దేశంలోని అనేక గ్రామాల ప్రజలు తమ గ్రామాన్ని కూడా సౌరగ్రామంగా మార్చాలని నాకు లేఖలు రాస్తున్నారు. అంటే భారతదేశంలో సౌర గ్రామాల నిర్మాణం పెద్ద ప్రజా ఉద్యమంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. దీని ప్రారంభాన్ని మోధేరా గ్రామ ప్రజలు ఇప్పటికే చేసి చూపించారు.

రండి.. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా మోధేరా ప్రజలను  పరిచయం చేద్దాం. శ్రీమాన్  విపిన్‌భాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్‌లో ఉన్నారు.

ప్రధానమంత్రి గారు :- విపిన్ భాయ్ నమస్తే! చూడండి.. ఇప్పుడు దేశం మొత్తానికి మోధేరా ఆదర్శంగా నిలిచి చర్చలోకి వచ్చింది. మీ బంధువులు, పరిచయస్తులను మిమ్మల్ని వివరాలు అడిగినప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? ఏం లాభం కలిగింది?

విపిన్ గారు :- సార్ మమ్మల్ని ఎవరైనా అడిగితే ఇప్పుడు కరెంటు బిల్లు జీరోగా వస్తోందని చెప్తాం. ఒక్కోసారి ఇది 70 రూపాయలు వస్తోంది. మొత్తం మీద మా ఊరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.

ప్రధానమంత్రి గారు :- అంటే ఒకరకంగా చెప్పాలంటే ఇంతకు ముందులాగా కరెంటు బిల్లు గురించిన ఆలోచన ఇప్పుడు లేదన్నమాట.

విపిన్ గారు :- అవును సార్. అది వాస్తవం సార్. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి టెన్షన్‌ లేదు. సార్ చేసిన పని బాగుందని అందరూ అనుకుంటున్నారు. వారంతా ఆనందంగా ఉన్నారు సార్. అందరూ సంతోషిస్తున్నారు.

ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మీరే స్వయంగా మీ ఇంట్లోనే కరెంటు ఫ్యాక్టరీకి యజమాని అయ్యారు. మీ స్వంత ఇంటి పైకప్పు మీద విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

విపిన్ జీ :- అవును సార్. నిజమే సార్.

ప్రధానమంత్రి గారు :- ఈ మార్పు గ్రామ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

విపిన్ గారు:- సార్.. ఊరి మొత్తం ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మాకున్న కరెంటు కష్టాలు తీరిపోయాయి. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సార్.

ప్రధానమంత్రి గారు:- అంటే కరెంటు బిల్లు కూడా పోయింది. సౌకర్యం పెరిగింది.

విపిన్ గారు:- మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉంది సార్. ఇక్కడ మొదలైన 3-డిషో తర్వాత మోధేరా గ్రామంలో నాలుగు  చందమామలు వచ్చినట్టయింది సార్. అప్పుడు వచ్చిన సెక్రటరీ సార్...

ప్రధాని గారు :- అవును...

విపిన్ గారు :- అలా ఊరు ఫేమస్ అయింది సార్.

ప్రధానమంత్రి గారు :- అవును. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. ఆయన కోరిక అది. ఇంత గొప్ప పనిని అక్కడికి వెళ్లి స్వయంగా చూడాలని ఉందని ఆయన నన్ను కోరారు. విపిన్ సోదరా!మీకు, మీ గ్రామ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచం యావత్తూ మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలని, ఈ సౌరశక్తి ప్రచారం ఇంటింటా జరగాలని కోరుకుంటున్నాను.

విపిన్ గారు :- సరే సార్. ‘సౌరశక్తి ఉపయోగించుకోండి-మీ డబ్బు ఆదా చేసుకోండి’ అని అందరికీ చెప్తాం సార్.   దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది సార్.

ప్రధానమంత్రి గారు :- అవును. దయచేసి ప్రజలకు వివరించండి. మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సోదరా!

విపిన్ గారు :- ధన్యవాదాలు సార్. థాంక్యూ సార్. మీతో మాట్లాడటం వల్ల నా జీవితం ధన్యమైంది.

ప్రధాన మంత్రి గారు :- విపిన్ భాయ్ గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మోధేరా గ్రామంలో వర్ష సోదరితో కూడా మాట్లాడదాం.

వర్షాబెన్ :- నమస్తే సార్!

ప్రధాన మంత్రి గారు :- నమస్తే-నమస్తే వర్షాబెన్. మీరు ఎలా ఉన్నారు?

వర్షాబెన్ :- మేం చాలా బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు ?

ప్రధాని గారు:- నేను చాలా బాగున్నాను.

వర్షాబెన్ :- మీతో మాట్లాడినందుకు మేం ధన్యులమయ్యాం సార్.

ప్రధాన మంత్రి గారు :- వర్షాబెన్..

వర్షాబెన్ :- అవును సార్

ప్రధానమంత్రి గారు:- మీరు మోధేరాలో ఉన్నారు. మీరు సైనిక కుటుంబానికి చెందినవారు కదా.

వర్షాబెన్ :- అవును సార్. మాది సైనిక కుటుంబం సార్.  మాజీ సైనికుడి భార్యను  మాట్లాడుతున్నాను సార్.

ప్రధానమంత్రి గారు:-  మీకు భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్లే అవకాశం వచ్చింది?

వర్షాబెన్ :- నేను రాజస్థాన్‌కు వెళ్ళాను.  గాంధీ నగర్‌కు వెళ్ళాను. జమ్మూలో కలిసి ఉండే అవకాశం వచ్చింది. అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి సార్.

ప్రధానమంత్రి గారు:- అవును. మీవారు సైన్యంలో ఉండడం వల్ల మీరు హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారు.

వర్షాబెన్ :- అవును సార్. అవును. నేను నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి గారు :- మోధేరాలో వచ్చిన పెద్ద మార్పును చెప్పండి. మీరు ఈ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను పెట్టారు. ప్రజలు మొదట్లో ఏమి చెప్తుండేవారో అప్పుడు మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు ? ఏం జరుగుతుంది ? ఇలా విద్యుత్తు వస్తుందా? ఇవన్నీ మీ మనసులో మెదిలి ఉంటాయి. ఇప్పుడు మీ అనుభవం ఏంటి? దీని వల్ల ఏం లాభం కలిగింది?

వర్షాబెన్:- చాలా లాభం ఉంది. చాలా లాభమే వచ్చింది సార్. మీ వల్లే మా ఊళ్లో ప్రతిరోజు దీపావళి జరుపుకుంటారు. 24 గంటలు కరెంటు వస్తోంది. బిల్లు అస్సలే రావడం లేదు. మా ఇంట్లోకి అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు తెచ్చుకున్నాం సార్. మీ వల్లే అన్నీ వాడుతున్నాం సార్. బిల్లు అసలే రాకపోతే డబ్బు ఖర్చు ధ్యాసే లేకుండా వాడుకోవచ్చు కదా!

ప్రధానమంత్రి గారు :- ఇది నిజమే. మీరు కూడా కరెంటును ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

వర్షాబెన్ :- నిర్ణయించాం సార్. నిర్ణయించాం. ప్రస్తుతం మాకు ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ మనం ఫ్రీ మైండ్‌తో ఉపయోగించుకోవచ్చు. అన్నీ ఉన్నాయి.. వాషింగ్ మెషీన్, ఏసీ.. అన్నీ ఉపయోగించుకుంటున్నాం సార్.

ప్రధానమంత్రి  గారు:- మరి ఊళ్లోని మిగతా ప్రజలు కూడా దీనివల్ల సంతోషంగా ఉన్నారా?

వర్షాబెన్ :- చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్.

ప్రధానమంత్రి గారు:- అక్కడ సూర్య దేవాలయంలో పని చేసేది మీ భర్తేనా? అక్కడ జరిగిన లైట్ షో ఎంతో పెద్ద ఈవెంట్ కావడంతో ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు.

వర్షా బెన్ :- ప్రపంచం నలుమూలల నుండి విదేశీయులు రావచ్చు కానీ మీరు మా ఊరుప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేశారు సార్.

ప్రధానమంత్రి గారు:- అయితే గుడిని చూసేందుకు చాలా మంది అతిథులు వస్తుండడంతో మీ భర్తకు ఇప్పుడు పని పెరిగి ఉండవచ్చు..

వర్షా బెన్ :- పని ఎంత పెరిగినా ఫర్వాలేదు సార్. మా వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్లండి.

ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మనమందరం కలిసి గ్రామాభివృద్ధి చేయాలి.

వర్షా బెన్ :- అవును. అవును సార్. మేం మీతో ఉన్నాం.

ప్రధానమంత్రి గారు:- నేను మోధేరా ప్రజలను అభినందిస్తున్నాను.  ఎందుకంటే గ్రామం ఈ పథకాన్ని అంగీకరించింది. మన ఇంట్లో విద్యుత్తును తయారు చేయగలమని వారు విశ్వసించారు.

వర్షా బెన్ -: 24 గంటలు సార్! మా ఇంట్లో కరెంటు ఉంది. చాలా సంతోషంగా ఉంది.

ప్రధానమంత్రి గారు :- రండి! నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. కరెంటు బిల్లు ఆదావల్ల మిగిలిన డబ్బును పిల్లల అభ్యున్నతికి వినియోగించండి. మీ జీవితానికి ప్రయోజనం చేకూర్చేలా ఆ డబ్బును బాగా ఉపయోగించండి. నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. మోధేరా ప్రజలందరికీ నా నమస్కారాలు!

మిత్రులారా!

    వర్షాబెన్, బిపిన్ భాయ్ చెప్పిన విషయాలు దేశం మొత్తానికి, గ్రామాలకు, నగరాలకు ప్రేరణ. మోధేరా  అనుభవం దేశవ్యాప్తంగా పునరావృతమవుతుంది. సౌర శక్తి ఇప్పుడు డబ్బును ఆదా చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన మిత్రులు మంజూర్ అహ్మద్ లఢ్వాల్. కాశ్మీర్‌లో చలి ఎక్కువ కావడంతో కరెంటు ఖర్చు కూడా ఎక్కువే. ఈ కారణంగా మంజూర్ గారి కరెంటు బిల్లు కూడా 4 వేల రూపాయలకు పైగా వచ్చేది. కానీమంజూర్ గారి ఇంట్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన  ఖర్చు సగానికి పైగా తగ్గింది. అదే విధంగా ఒడిషాకు చెందిన కున్ని దేవురి అనే అమ్మాయి తనతో పాటు ఇతర మహిళలకు కూడా సౌరశక్తిని ఉపాధి మాధ్యమంగా మారుస్తోంది. ఒడిషాలోని కేందుఝర్ జిల్లా కర్దాపాల్ గ్రామంలో కున్ని నివసిస్తున్నారు. సౌరశక్తితో నడిచే రీలింగ్ యంత్రంతో పట్టు వడకడంపై ఆదివాసీ మహిళలకు ఆమె శిక్షణ ఇస్తున్నారు. సోలార్‌ మెషీన్‌ ఫలితంగా ఈ ఆదివాసీ  మహిళలకు కరెంటు బిల్లుల భారం లేకపోగా, ఆదాయాన్ని కూడాపొందుతున్నారు. ఇది సూర్య భగవానుడి సౌరశక్తి  వరం. వరం, ప్రసాదం  ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుచేతమీరు ఇందులో చేరండి. ఇతరులను కూడా చేర్చండి.

నా ప్రియమైన దేశప్రజలారా!

      ఇప్పటివరకు నేను మీతో సూర్యుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతరిక్షం వైపు మతోంది. అందుకు కారణం మన దేశం సోలార్ రంగంతో పాటు అంతరిక్ష రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. భారతదేశం సాధించిన విజయాలను చూసి ప్రపంచం మొత్తం నేడు ఆశ్చర్యపోతోంది. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలకు ఈ విషయం చెప్పి వారిని కూడా సంతోషపెట్టాలని అనుకున్నాను.

మిత్రులారా!కొద్దిరోజుల క్రితం భారతదేశం ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడాన్ని మీరు చూసిఉంటారు. దీపావళికి సరిగ్గా ఒక్కరోజు ముందు సాధించిన ఈ విజయం ఒక విధంగా మన యువత నుండి దేశానికి ప్రత్యేకమైన దీపావళి కానుక. ఈ ప్రయోగంతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. దీని సహాయంతోమారుమూల ప్రాంతాలు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానమవుతాయి. దేశం స్వావలంబన సాధించినప్పుడు కొత్త విజయ శిఖరాలకు చేరుకుంటుందని చెప్పేందుకు ఇది కూడా ఒక  ఉదాహరణ. మీతో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడుభారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికతను ఇవ్వడాన్ని నిరాకరించిన పాత కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను.కానీ, భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా ఇప్పుడు దాని సహాయంతో ఏకకాలంలో పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో ఇప్పుడు ప్రపంచ వాణిజ్య విపణిలో భారతదేశం సుదృఢ స్థానం పొందింది. మనకు కొత్త అవకాశాల ద్వారాలు కూడా తెరుచుకున్నాయి.

మిత్రులారా!

   ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే సంకల్పంతో నడుస్తున్న మన దేశం ప్రతి ఒక్కరి కృషితోనే తన లక్ష్యాలను చేరుకోగలదు.భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే ఉండేది. యువత కోసం, ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వడంతో ఇందులో విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి.భారతీయ పరిశ్రమలు,స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలను,కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయి. విశేషించి ఇన్-స్పేస్ సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ప్రభుత్వేతర సంస్థలు కూడా తమ పేలోడ్‌లు, ఉపగ్రహాలను IN-SPAce ద్వారా ప్రయోగించే సౌకర్యాన్ని పొందుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారతదేశంలోని ఈ భారీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని నేను స్టార్టప్‌లను, ఆవిష్కర్తలను కోరుతున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!

     విద్యార్థులు, యువశక్తి, నాయకత్వ శక్తి విషయాలకు వస్తే మనలో పాతుకుపోయిన ఎన్నో మూస భావనలు, పాత విషయాలు గుర్తుకువస్తాయి. విద్యార్థి శక్తి విషయానికి వస్తే దాని పరిధిని విద్యార్థి సంఘం ఎన్నికలతో జోడించడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ విద్యార్థి శక్తి పరిధి చాలా పెద్దది. చాలా విస్తృతమైంది. భారతదేశాన్ని శక్తిమంతం చేయడానికి విద్యార్థి శక్తి ఆధారం. నేటి యువత భారతదేశాన్ని 2047 వరకు తీసుకువెళ్తుంది. భారతదేశం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడుఈ యువత శక్తి, వారి శ్రమ, వారి చెమట, వారి ప్రతిభ, భారతదేశాన్ని ఈ రోజు సంకల్పిస్తున్న ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. నేటి మన యువత దేశం కోసం పని చేస్తున్న తీరును, వారు దేశ నిర్మాణంలో చేరిన తీరును చూసి నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మన యువత హ్యాకథాన్‌లలో సమస్యలను పరిష్కరించే విధానం, రాత్రంతా మేల్కొని గంటల తరబడి శ్రమించే తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. దేశంలోని లక్షలాది మంది యువతగత సంవత్సరాల్లో నిర్వహించిన హ్యాకథాన్ లలో అనేక సవాళ్లను పరిష్కరించింది. దేశానికి కొత్త పరిష్కారాలను అందించింది.

మిత్రులారా!

        మీకు గుర్తుండే ఉంటుంది- నేను ఎర్రకోట నుండి 'జై అనుసంధాన్' అని ఆహ్వానించాను. ఈ దశాబ్దాన్ని ‘టెకేడ్’ గా మార్చడం గురించి కూడా నేను మాట్లాడాను. దీన్ని చూడటం నాకు చాలా ఇష్టం. మన ఐ.ఐ.టి.ల విద్యార్థులు కూడా దీని స్ఫూర్తి ని తీసుకున్నారు.ఈ నెల-అక్టోబరు- 14-15 తేదీల్లో మొత్తం 23 ఐ.ఐ.టి.లు తమ ఆవిష్కరణలు,పరిశోధన ప్రాజెక్టులను ప్రదర్శించడానికి మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు 75కు పైగా అత్యుత్తమ ప్రాజెక్టులను ఈ మేళాలో  ప్రదర్శించారు.ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమీకండక్టర్స్, ఫైవ్- జికమ్యూనికేషన్స్ ఇలా ఎన్నో ఇతివృత్తాలపై ఈ ప్రాజెక్ట్‌లను రూపొందించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఒకదాన్ని మించినవి మరొకటి అయినప్పటికీకొన్ని ప్రాజెక్టుల గురించి మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. ఉదాహరణకు ఐఐటి భువనేశ్వర్‌కు చెందిన ఒక బృందం నవజాత శిశువుల కోసం పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఇది నెలలు నిండకుండా జన్మించిన శిశువుల జీవితాలను రక్షించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, డ్రోన్ సాంకేతికత, ఫైవ్-జి - ఏదైనా కావచ్చు, మన విద్యార్థులు చాలా మంది వాటికి సంబంధించిన కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. స్థానిక భాషలను నేర్చుకునే విధానాన్ని సులభతరం చేసే బహుభాషా ప్రాజెక్టులో వివిధ ఐఐటిలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కొత్త జాతీయ విద్యా విధాన లక్ష్యాలను సాధించడంలో చాలా సహాయపడుతుంది. భారతదేశ స్వదేశీ ఫైవ్-జి టెస్ట్ బెడ్‌ను అభివృద్ధి చేయడంలో ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ ప్రముఖ పాత్ర పోషించాయని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప ప్రారంభం. రాబోయే కాలంలో ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలని నేను ఆశిస్తున్నాను. ఐఐటిలు, ఇతర సంస్థలు కూడా తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!

          పర్యావరణం పట్ల సున్నితత్వం మన సమాజంలోని అణువణువులో ఇమిడి ఉంది. మన చుట్టూ మనం దాన్ని  అనుభవించగలం. పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలను వెచ్చించే వారికి దేశంలో కొరత లేదు.

కర్ణాటకలోని బెంగుళూరులో నివసిస్తున్న సురేష్ కుమార్ గారి నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయనకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో గొప్ప అభిరుచి ఉంది. ఆయన ఇరవై ఏళ్ల క్రితం నగరంలోని సహకారనగర్‌లో ఒక అడవిని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వాటి అందాలు అందరి మనసులను దోచుకుంటున్నాయి. ఇది అక్కడ నివసించే ప్రజలకు కూడా గర్వకారణం. సురేష్ కుమార్ గారు అద్భుతమైన పని చేశారు. కన్నడ భాష , సంస్కృతులను పెంపొందించేందుకు సహకరనగర్‌లో బస్ షెల్టర్‌ను కూడా నిర్మించారు. కన్నడలో రాసిన ఇత్తడి పలకలను వందలాది మందికి బహూకరించారు. పర్యావరణం – సంస్కృతి రెండూ కలిసి వృద్ధి చెంది,  వికసించాలంటే... ఇది ఎంత పెద్ద కార్యమో ఆలోచించండి.

మిత్రులారా!

        ఈ రోజు ప్రజల్లో పర్యావరణ అనుకూల జీవన విధానం, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల గురించి గతంలో కంటే ఎక్కువ అవగాహన కనిపిస్తోంది. తమిళనాడు నుండి అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయత్నం గురించి తెలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. కోయంబత్తూరులోని అనైకట్టిలో ఆదివాసి మహిళల బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నం ఇది. ఈ మహిళలు ఎగుమతుల కోసం పది వేల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట టీ కప్పులను తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టెర్రకోట టీ కప్పుల తయారీ బాధ్యతను ఈ మహిళలే స్వయంగా తీసుకున్నారు. క్లే మిక్సింగ్‌ నుంచి ఫైనల్‌ ప్యాకేజింగ్‌ వరకు స్వయంగా చేశారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి ఎలాంటి ప్రశంసలు దక్కినా తక్కువే.

మిత్రులారా!

        త్రిపురలోని కొన్ని గ్రామాలు కూడా చాలా మంచి పాఠాలు చెప్పాయి. మీరు బయో-విలేజ్ గురించి వినే ఉంటారు. కానీ త్రిపురలోని కొన్ని గ్రామాలు బయో-విలేజ్-2నిచ్చెనను అధిరోహించాయి. బయో-విలేజ్ 2 ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించాలో నొక్కి చెబుతుంది. ఇందులోవివిధ ఆలోచనల ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పూర్తి శ్రద్ధ పెడతారు. సౌరశక్తి, బయోగ్యాస్, తేనెటీగల పెంపకం,బయో ఫెర్టిలైజర్లపై పూర్తి దృష్టి పెడతారు. మొత్తమ్మీద చూస్తే వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి బయో-విలేజ్ 2మరింత బలం చేకూరుస్తుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొద్ది రోజుల కిందట భారతదేశంలోపర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితమైన మిషన్ లైఫ్ కూడా ప్రారంభమైంది. మిషన్ లైఫ్  సాధారణ సూత్రం పర్యావరణానికి హాని కలిగించని జీవనశైలినిప్రోత్సహించడం. మిషన్ లైఫ్ గురించి తెలుసుకుని, దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

మిత్రులారా!

       రేపు- అక్టోబర్ 31- జాతీయ ఐక్యతా దినోత్సవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభ సందర్భం. ఈ రోజున దేశంలోని ప్రతి మూలలో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తారు. ఈ పరుగు దేశంలో ఐక్యతా సూత్రాన్ని బలపరుస్తుంది. మన యువతకు స్ఫూర్తినిస్తుంది. కొద్ది రోజుల క్రితం మన జాతీయ క్రీడల సందర్భంగా కూడా అదే భావన కనిపించింది. 'జుడేగా ఇండియా తో జీతేగా ఇండియా' – అంటే ‘దేశం అనుసంధానమైతే విజయం సాధిస్తుంది’ అనే థీమ్‌తోజాతీయ క్రీడలు  బలమైన ఐక్యతా సందేశాన్ని అందించాయి. భారతదేశ క్రీడా సంస్కృతిని కూడా ప్రోత్సహించాయి. భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో ఇవే అతిపెద్ద జాతీయ క్రీడలని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఇందులో 36 క్రీడలను చేర్చారు. వాటిలో 7 కొత్త పోటీలతో పాటు రెండు దేశీయ పోటీలు- యోగాసనాలు,మల్లాఖంబ్ కూడా చేర్చారు. స్వర్ణ పతకం గెలుచుకోవడంలో ముందంజలో ఉన్న మూడు జట్లు – సర్వీసెస్ టీమ్, మహారాష్ట్ర ,హర్యానా టీమ్. ఈ గేమ్‌లలో ఆరు జాతీయ రికార్డులను నెలకొల్పారు. సుమారు 60 జాతీయ క్రీడల రికార్డులను కూడా సృష్టించారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న, పతకాలు సాధించిన, కొత్త రికార్డులు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు. ఈ ఆటగాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.

మిత్రులారా!

     గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుజరాత్‌లో నవరాత్రుల సందర్భంగా జాతీయ క్రీడలు నిర్వహించడం మీరు చూశారు. ఈ సమయంలో గుజరాత్ మొత్తం నవరాత్రుల ఉత్సవాల్లో ఉండడం వల్ల ప్రజలు ఈ ఆటలను ఎలా ఆస్వాదించగలరని ఈ క్రీడల ప్రారంభానికి ముందు ఒకసారి నా మనస్సుకు అనిపించింది. ఇంత పెద్ద క్రీడోత్సవాల వ్యవస్థ- మరోవైపు నవరాత్రుల సందర్భంగా గర్బా మొదలైన వాటికి ఏర్పాట్లు. గుజరాత్ ఏకకాలంలో ఇవన్నీ ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ గుజరాత్ ప్రజలు తమ ఆతిథ్యంతో అతిథులందరినీ సంతోషపెట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా కళ, క్రీడలు,సంస్కృతుల సంగమం జరిగిన తీరు  ఆనందాన్ని నింపింది. క్రీడాకారులు కూడా పగటిపూట ఆటలో పాల్గొని, సాయంత్రం గర్బా, దాండియా రంగుల్లో మునిగితేలారు.  గుజరాతీ ఆహారంతో పాటు నవరాత్రులకు సంబంధించిన చాలా చిత్రాలను కూడా వారు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇవన్నీ చూడటం మా అందరికీ ఆనందదాయకం. ఇలాంటి ఆటలు భారతదేశంలోని విభిన్న సంస్కృతుల గురించి కూడా వెల్లడిస్తాయి. అవి 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కూడా బలోపేతం చేస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా!

          నవంబర్ నెలలో 15వ తేదీన మన దేశం ఆదివాసిల గౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది-భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివాసివారసత్వ, గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని దేశం గత సంవత్సరం ప్రారంభించింది.భగవాన్ బిర్సా ముండా తన స్వల్ప జీవితకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మందిని ఏకం చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసి సంస్కృతిపరి రక్షణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

మిత్రులారా!

        భగవాన్ బిర్సా ముండా విషయానికి వస్తే.. ఆయన  చిన్న జీవిత కాలం చూద్దాం. ఈ రోజు కూడా మనం ఆయన  నుండి చాలా నేర్చుకోవచ్చు. “ఈ భూమి మనది. మనమే దాని రక్షకులం” అని ఆయన చెప్పేవారు. ఈ వాక్యాల్లో  మాతృభూమి పట్ల కర్తవ్యం కూడా ఉంది. పర్యావరణం పట్ల కర్తవ్య భావన కూడా ఉంది. మన ఆదివాసిసంస్కృతిని మరచిపోకూడదని, దానికి దూరంగా వెళ్లకూడదని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. నేటికీదేశంలోని ఆదివాసి సమాజాల నుండి మనం ప్రకృతి, పర్యావరణం మొదలుకుని చాలా విషయాల గురించి నేర్చుకోవచ్చు.

మిత్రులారా!

      గత ఏడాది  భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగారాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. సమయం దొరికినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించాలని యువతను నేను కోరుతున్నాను. నవంబర్ 1వ తేదీ  అంటే ఎల్లుండి గుజరాత్-రాజస్థాన్ సరిహద్దుల్లోని మాన్‌గఢ్ లో ఉంటానని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, మన సుసంపన్నమైన ఆదివాసి వారసత్వంలో మాన్‌గఢ్ కు చాలా విశిష్ట  స్థానం ఉంది. 1913నవంబర్ లో ఇక్కడ ఒక భయంకరమైన ఊచకోత జరిగింది. బ్రిటిష్ వారు స్థానిక ఆదివాసిలను దారుణంగా హత్య చేశారు. ఈ మారణకాండలో వెయ్యి మందికి పైగా ఆదివాసి ప్రాణాలు కోల్పోయారని చెప్తారు. ఈ గిరిజన ఉద్యమానికి గోవింద్ గురు జీ నాయకత్వం వహించారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ రోజు గోవింద్ గురు జీ తో సహా ఆ ఆదివాసి అమరవీరులందరూ ప్రదర్శించిన అసమానమైన ధైర్యానికి, పరాక్రమానికి నేను నమస్కరిస్తున్నాను. భగవాన్ బిర్సా ముండా, గోవింద్ గురు, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను ఈ అమృత కాలంలో మనం ఎంత నిష్ఠతో పాటిస్తామోమన దేశం అంతే ఉన్నతంగా ఉంటుంది. ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!

      నవంబర్ 8వ తేదీన గురుపురబ్ ఉంది. మన విశ్వాసానికి గురునానక్ జీ  ప్రకాశ్ పర్వ్ ఎంతో ముఖ్యమైంది. దాన్నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. గురునానక్ దేవ్ జీ తన జీవితాంతంమానవాళికి వెలుగునిచ్చారు. గత కొన్నేళ్లుగా గురువుల వెలుగులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్‌ను దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం మనకు లభించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం కూడా జరగడం అంతే ఆనందంగా ఉంది. కొద్దిరోజుల క్రితం హేమకుండ్ సాహిబ్ కోసం రోప్‌వేకి పునాది రాయి వేసే అవకాశం కూడా నాకు లభించింది. మనం మన గురువుల ఆలోచనల నుండి నిరంతరం నేర్చుకోవాలి. వారి పట్ల అంకితభావంతో ఉండాలి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కూడా. ఈ రోజు మనం పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానం చేస్తాం. సేవ,దానధర్మాలు చేస్తాం. ఈ పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లోచాలా రాష్ట్రాలు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కేరళలో పిరవి జరుపుకుంటారు. కర్ణాటకలో రాజ్యోత్సవాలు జరుపుకుంటారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా కూడా తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాలన్నింటిలో ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, సహకరించుకోవడం, కలిసి పనిచేయడం అనే స్ఫూర్తి ఎంత బలంగా ఉంటే దేశం అంత ముందుకు సాగుతుంది. ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న నమ్మకం నాకు ఉంది. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. 'మన్ కీ బాత్'లో మళ్ళీ కలిసే వరకు మీ నుండి సెలవు తీసుకునేందుకు నన్ను అనుమతించండి. నమస్కారం, ధన్యవాదాలు.

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Insurance sector sees record deals worth over Rs 38,000 crore in two weeks

Media Coverage

Insurance sector sees record deals worth over Rs 38,000 crore in two weeks
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM speaks with HM King Philippe of Belgium
March 27, 2025

The Prime Minister Shri Narendra Modi spoke with HM King Philippe of Belgium today. Shri Modi appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. Both leaders discussed deepening the strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

In a post on X, he said:

“It was a pleasure to speak with HM King Philippe of Belgium. Appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. We discussed deepening our strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

@MonarchieBe”