ఎక్స్ లన్సిజ్,
నమస్కారం,
ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్యాని కి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. మన నాగరకత తాలూకు సంప్రదాయం లో ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది ఒక విడదీయలేనటువంటి భాగం గా ఉన్నది. లిచ్ఛవి మరియు శాక్య వంటి ఎన్నికైన గణతంత్ర నగర-ప్రభుత్వాలు భారతదేశం లో 2500 సంవత్సరాల కు పూర్వమే అభివృద్ధి చెందాయి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి పదో శతాబ్ది నాటి ‘‘ఉత్తరమేరూర్’’ శిలాశాసనం లో అగుపించింది. ఆ శిలాశాసనం లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రాల ను క్రోడీకరించడం జరిగింది. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి మరియు సంప్రదాయం ప్రాచీన భారతదేశాన్ని అత్యంత సమృద్ధమైన దేశాల లో ఒకటి గా నిలిపాయి. వందల సంవత్సరాల పాటు సాగిన వలసవాద పాలన భారతదేశ ప్రజల లోని ప్రజాస్వామిక భావన ను అణచి వేయలేకపోయింది. ఈ ప్రజాస్వామిక భావన భారతదేశం యొక్క స్వాతంత్య్ర ప్రస్థానం లో పూర్తి స్థాయి లో మరో మారు కానవచ్చింది. మరి గడచిన 75 సంవత్సరాల కాలం లో ప్రజాస్వామ్యయుతమైన రీతి లో జాతి నిర్మాణం తాలూకు ఒక సాటిలేనటువంటి గాథ ను ఇది ఆవిష్కరించింది.
ఇది అన్ని రంగాల లోను అపూర్వమైనటువంటి సామాజిక, ఆర్థిక మేళనాని కి చెందినటువంటి ఒక గాథ గా ఉంది. ఇది ఆరోగ్యం, విద్య, మానవ శ్రేయం వంటి రంగాల లో ఊహించలేనటువంటి స్థాయి లో నిరంతరం మెరుగుదల ల తాలూకు ఒక గాథ గా కూడా ఉంది. భారతదేశం గాథ ద్వారా ప్రపంచాని కి ఒక స్పష్టమైన సందేశం లభిస్తున్నది. అది ఏమిటి అంటే ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇవ్వగలుగుతుంది, ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇచ్చింది, మరి ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది అనేదే.
ఎక్స్ లన్సిజ్,
బహుళ పక్షాల తో కూడినటువంటి ఎన్నికలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుతమైన ప్రసార మాధ్యమాల వంటి వ్యవస్థాత్మక లక్షణాలు ప్రజాస్వామ్యాని కి ముఖ్యమైన సాధనాలు. ఏమైనప్పటి కీ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక శక్తి అనేది మన పౌరుల లోపల, మన సమాజాల లోపల ఇమిడి ఉన్నటువంటి ఉత్సాహం, ఇంకా మర్యాదలే అని చెప్పాలి. ప్రజాస్వామ్యం అంటే అది ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు అని మాత్రమే కాదు; ప్రజాస్వామ్యం అంటే అది ప్రజల తో ఉండేది, ప్రజల లోపల ఉండేది అని కూడా భావన చేయాలి.
ఎక్స్ లన్సిజ్,
ప్రపంచం లోని వేరు వేరు ప్రాంతాలు ప్రజాస్వామిక వికాసం తాలూకు భిన్నమైనటువంటి మార్గాల ను అనుసరించాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం నేర్చుకోగలిగింది ఎంతో ఉంది. మనం ప్రజాస్వామిక సాంప్రదాయాల కు మరియు వ్యవస్థల కు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకొంటూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం అన్ని వర్గాల ను కలుపుకొని పోవడాన్ని, పారదర్శకత్వాన్ని, మానవ గౌరవాన్ని, ఫిర్యాదుల ను పరిష్కరించడం పట్ల స్పందన ను, అధికార వికేంద్రీకరణ ను అదే పని గా పెంపొందింప చేసుకొంటూ సాగవలసి ఉన్నది.
ఈ సందర్భం లో నేటి సభ ప్రజాస్వామ్యాల మధ్య సహకారాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఒక కాలిక వేదిక ను అందిస్తున్నది. స్వేచ్ఛాయుతం గా, న్యాయం గా ఎన్నికల ను నిర్వహించడం లో తన కు ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడమన్నా, సరికొత్త డిజిటల్ పరిష్కార మార్గాల ద్వారా పాలన కు సంబంధించిన అన్ని రంగాల లో పారదర్శకత్వాన్ని వృద్ధి చెందించడమన్నా భారతదేశానికి సంతోషం గా ఉంటుంది. మనం సోశల్ మీడియా, ఇంకా క్రిప్టో-కరెన్సీజ్ ల వంటి ప్రవర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాల కు ఉద్దేశించిన ప్రపంచ విధానాల ను ఉమ్మడి గా తీర్చిదిద్దుకోవలసి ఉన్నది. ఎందుకంటే వాటిని ప్రజాస్వామ్యాన్ని సాధికారికం గా మలచడాని కి ఉపయోగిస్తాం తప్ప ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి కాదు.
ఎక్స్ లన్సిజ్,
కలసికట్టు గా కృషి చేయడం ద్వారా, ప్రజాస్వామ్య వ్యవస్థ లు మన పౌరుల ఆకాంక్షల ను నెరవేర్చగలుగుతాయి. అంతేకాదు, మానవాళి యొక్క, ప్రజాస్వామిక స్ఫూర్తి ని వేడుక గా జరుపుకోగలుగుతాయి. ఈ పవిత్రమైనటువంటి ప్రయాస లో సాటి ప్రజాస్వామ్య వ్యవస్థల తో చేతులు కలపడానికి భారతదేశం సిద్ధం గా ఉంది.
మీకు ఇవే ధన్యవాదాలు, మీకు చాలా చాలా ధన్యవాదాలు.