శ్రీ నరేంద్ర మోదీ ఖ్యాతి భారత తీరాలు దాటి విస్తరించింది. అమెరికా నుండి ఆస్ట్రేలియాదాకా, చైనా నుండి ఐరోపా వరకు శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని, కార్యశైలిని సదా ప్రశంసించేవారే అంతటా కనిపిస్తారు. వైబ్రన్ట్ గుజరాత్ సదస్సులు విజయవంతం కావడంతో పాలనదక్షుడుగా శ్రీ నరేంద్ర మోదీ ఖ్యాతి జగద్వితమైంది. ఈ సదస్సులలో వందకు పైగా దేశాలు పాల్గొంటుండటంతో పాటు ఆ ఫలితాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. గుజరాత్ కు పెట్టుబడులను ఆకర్షించడమేగాక రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆ సదస్సులు ఎంతగానో దోహదం చేశాయి. రాష్ట్రంలో సాధించిన ప్రగతి ద్వారా విదేశాల్లోని ప్రవాసులను కూడా అదే స్థాయిలో శ్రీ మోదీ ఆకట్టుకొన్నారు. అందుకే దేశంలో ఏటా నిర్వహించే ప్రవాస భారతీయ దినోత్సవంలో అందరూ అత్యంత ఉత్సుకతతో ఎదురు చూసే వక్త శ్రీ నరేంద్ర మోదీయే కావడంలో ఆశ్చర్యం లేదు. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, మారిషస్, థాయ్‌లాండ్, ఉగాండా తదితర దేశాలను సందర్శించి విస్తృత విదేశీ యాత్రలు చేసిన నాయకుడిగా ఆయన గణుతికెక్కారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరులో పదవీ బాధ్యతలు చేపట్టిన నెలలోపే నాటి ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు రష్యా పర్యటనకు వెళ్లిన బృందంలో శ్రీ నరేంద్ర మోదీకి స్థానం లభించింది. ఈ సందర్భంగా ఆస్త్రఖన్ రాష్ట్ర గవర్నర్‌తో చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు శ్రీ మోదీ. ముఖ్యమంత్రిగా శ్రీ మోదీ పలు మార్లు రష్యాలో అధికారికంగా పర్యటించడంతో ఆ తరువాతి సంవత్సరాలలో గుజరాత్-రష్యా సంబంధాలు ముందడుగు వేశాయి. అంతేగాక ఇంధన రంగంలో కీలక సహకారానికి కూడా బాటలు పరిచాయి.
భారతదేశం తరఫున ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఉన్నతస్థాయి నేతల ప్రతినిధి బృందంలోనూ శ్రీ నరేంద్ర మోదీ సభ్యుడుగా ఉన్నారు. మానవ వనరులు, వ్యవసాయం, జల సంరక్షణ, విద్యుత్తు, భద్రత రంగాలలో నేడు ఇజ్రాయెల్, గుజరాత్ ల మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడటం ఈ సందర్భంగా గమనార్హం.
భారతదేశం, ఆగ్నేయాసియా ల మధ్య శతాబ్దాలుగా గల స్నేహసంబంధాలు నేటికీ కొనసాగుతూ మరింత బలోపేతం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ పలు మార్లు ఆగ్నేయాసియాలో పర్యటించారు. హాంకాంగ్, మలేషియా, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్ ల వంటి దేశాలను ఆయన సందర్శించారు. గుజరాత్‌లో ఏటా నిర్వహించే అంతర్జాతీయ గాలిపటాల పండుగ సహా వివిధ సాంస్కృతిక వేడుకలలోనూ ఈ దేశాలన్నీ చురుగ్గా, క్రమం తప్పకుండా పాల్గొంటున్నాయి.
చైనా పర్యటనలో భాగంగా 2011లో చెంగ్ డూ లోని హువావే టెక్నాలజీస్ సంస్థ పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని శ్రీ నరేంద్ర మోదీ సందర్శించినప్పటి చిత్రం
చైనాతో సన్నిహిత ఆర్థిక సంబంధాలు నెరపడం ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌కు ఎన్నో అవకాశాల బాటలు పరిచారు. మొత్తంమీద ఆయన మూడు సార్లు చైనాలో పర్యటించగా 2011 నవంబరు సందర్శన చివరిది. ఈ పర్యటనలోనే శ్రీ నరేంద్ర మోదీకి బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో చైనా అగ్ర నాయకులు శ్రీ నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. సాధారణంగా దేశాధినేతలకు మాత్రమే పరిమితమైన ఈ గౌరవం ఆయనకు లభించడం విశేషం. చైనాలో ఆయన పర్యటనల వల్ల గుజరాత్‌కు పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు సిచువాన్ రాష్ట్రంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అంతేగాకుండా చైనా కంపెనీ హువావే తోడ్పాటుతో గుజరాత్‌లో ఒక పరిశోధన-అభివృద్ధి కేంద్రం ఏర్పాటైంది
2012 జూలైలో జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి అగ్రనాయకులతో శ్రీ నరేంద్ర మోదీ ఇటువంటి అనేక ఫలవంతమైన చర్చలలో పాల్గొన్నారు
తూర్పు దేశాలతో సంబంధాలు ఇక్కడితోనే ఆగిపోలేదు. గుజరాత్‌కు జపాన్ ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉండటమేగాక ఉత్తేజ గుజరాత్ సదస్సు నిర్వహణకు నిరంతర మద్దతిస్తోంది. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక ప్రాంతం (డి ఎమ్ ఐ సి) నిర్మాణంలోనూ జపాన్ సాయం చేస్తోంది. ఈ కారిడర్ వల్ల గుజరాత్ ఆర్థిక ముఖచిత్రం పరివర్తన చెందడమే గాక గుజరాత్-జపాన్ మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసింది. ఇక 2012 నాటి చరిత్రాత్మక జపాన్ పర్యటన సందర్భంగా అనేక మంది అగ్ర శ్రేణి నాయకులు, మంత్రులతో శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అలాగే శ్రీ శింజో అబె (నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి)ను కూడా కలుసుకొన్నారు. జపాన్ తో పాటు దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి శ్రీ మోదీ పర్యటనల వల్ల అనేక ఫలవంతమైన ఆర్థిక, సాంస్కృతిక ఆదాన ప్రదానాలు చోటుచేసుకొని గుజరాత్ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డాయి
శ్రీ షింజో అబెతో శ్రీ నరేంద్ర మోదీ సమావేశమైన దృశ్యం
తూర్పు ఆఫ్రికా రాజకీయార్థిక రంగాలకు గుజరాతీలు గణనీయ తోడ్పాటును అందించారు. ఈ నేపథ్యంలో గుజరాత్- తూర్పు ఆఫ్రికా దేశాల మధ్య శ్రీ మోదీ సన్నిహిత సంబంధాలు కొనసాగించడం సహజమే. ఆయా దేశాల్లో నేటికీ గుజరాతీలు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం గమనార్హం. కెన్యా, ఉగాండా లలో ఆయనకు ఘనస్వాగతం లభించడంతో పాటు ఆయా పర్యటనలు విజయవంతం అయ్యాయి. శ్రీ నరేంద్ర మోదీ పాలనలో గుజరాత్ అభివృద్ధి కెన్యా, ఉగాండా ప్రభుత్వాలను ఎంతగానో ఆకట్టుకొంది. దక్షిణ ఆఫ్రికా హై కమిషనర్ 2014 జనవరిలో శ్రీ మోదీని కలుసుకొన్న సందర్భంగా మహాత్మ గాంధీ గారి స్వదేశాగమన శతాబ్ది (గాంధీ జీ 1915లో దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చారు) వేడుకలు నిర్వహించాలన్న శ్రీ మోదీ ప్రణాళిక ఆయనను ఎంతో ఆకట్టుకొంది..
దక్షిణాఫ్రికా హై కమిషనర్ ఎఫ్.కె.మోరూల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో 2014 జనవరిలో శ్రీ నరేంద్ర మోదీ సమావేశమైన దృశ్యం.
శ్రీ నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు అనేక సందర్భాల్లో భారతీయులకు అమిత హర్షం కలిగించాయి. కీర్తిశేషులైన శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ చితాభస్మాన్ని 50 ఏళ్ల తరువాత స్విట్జర్లాండ్ నుండి స్వదేశానికి తెచ్చేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు తదనంతర కాలంలో స్వయంగా జెనీవా కు వెళ్లి చితాభస్మ కలశాన్ని తీసుకువచ్చారు.
స్విట్జర్లాండ్ పర్యటన సందర్భంగా 2003లో శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ చితాభస్మ కలశాన్నిస్వీకరిస్తున్న శ్రీ మోదీ
భారతదేశ వజ్రాల వర్తకులు కొందరిపై చైనాలో కేసులు నమోదై జైళ్లలో మగ్గుతున్న నేపథ్యంలో 2011లో ఆయన విజ్ఞప్తి మేరకు చైనా అధికారులు విచారణను వేగిరపరచారు. వెలకట్టలేని ఈ ప్రయత్నంతో విచారణ త్వరగా ముగియడమే గాక కొందరు వర్తకులు విడుదలై స్వదేశం చేరుకోగలగడం విశేషం. సర్ క్రీక్ జల సంధి విషయంలో పాకిస్తాన్‌తో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ మోదీ ఏకంగా నాటి ప్రధాన మంత్రినే సవాలు చేశారు. ఈ ఒప్పందం భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు హానికరమని వాదించారు. చివరకు ప్రపంచ వేదికలపై అగ్ర దేశాల నాయకులతో సన్నిహితంగా మెలగినప్పటికీ ‘భారతదేశానికే తొలి ప్రాధాన్యం’ అన్నదే శ్రీ నరేంద్ర మోదీ విధానం.
దక్షిణాసియాలోనూ శ్రీ నరేంద్ర మోదీకి ఎంతో ప్రసిద్ధులు. కరాచీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేసిసిఐ 2011లో నిర్వహించిన కార్యక్రమంలో గుజరాత్ అభివృద్ధి గురించి ప్రసంగించాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ మోదీని ఆహ్వానించింది. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ గారు 1934లో శంకుస్థాపన చేసిన కేసీసీఐ భవన నమూనాను శ్రీ మోదీ బహూకరించారు. అలాగే శ్రీ లంక మాజీ ప్రధాన మంత్రి, శ్రీ లంక యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన శ్రీ రణిల్ విక్రమసింఘే కూడా శ్రీ మోదీని కలుసుకుని గుజరాత్‌లో ప్రగతి గురించి శ్రీ లంకలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు.
శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్- ఐరోపా సంబంధాలు కూడా చారిత్రక ఉచ్ఛస్థాయిలో కొనసాగాయి. గ్రేట్ బ్రిటన్ హై కమిషనర్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్ ల రాయబారులు 2012-13 మధ్యకాలంలో శ్రీ నరేంద్ర మోదీని కలుసుకొన్నారు. ఐరోపా సమాఖ్యలోని అగ్ర శ్రేణి చట్ట సభల సభ్యుల తోనూ ఆయన సమావేశమయ్యారు. గడచిన దశాబ్ద కాలంలో గుజరాత్ సాధించిన అభివృద్ధిని వారంతా శ్లాఘించారు.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలన్నిటా గుజరాత్‌ను ఒక ఆకర్షణీయ గమ్యంగా ఐరోపా దేశాలు పరిగణించాయి
అట్లాంటిక్ దేశాల నుండి కూడా శ్రీ నరేంద్ర మోదీ కృషికి ప్రశంసలు లభించాయి. ఈ మేరకు 2011 సెప్టెంబరులో అమెరికన్ కాంగ్రెస్ పరిశోధక విభాగం విడుదల చేసిన నివేదికలో శ్రీ మోదీని ‘పాలనా సార్వభౌముడు’గా కొనియాడింది. అంతేగాక ముఖ్యమంత్రి శ్రీ మోదీ హయాంలో ప్రభావవంతమైన పరిపాలన, ఆకర్షణీయ పురోగమనానికి భారతదేశంలోనే గుజరాత్ అత్యుత్తమ నిదర్శనంగా నిలిచిందంటూ ప్రశంసించింది. అలాగే దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా రాష్ట్రం నిలిచిందని కితాబిచ్చింది. “అవినీతి నిరోధం, అలసత్వానికి అడ్డుకట్ట, ఆర్థిక ప్రక్రియలను గాడిలో పెట్టడం” వంటి చర్యల పైనా ఆయనకు ప్రశంసలు లభించాయి
ప్రపంచ ప్రసిద్ధ పత్రికలలో ఒకటైన ‘టైమ్’ వార్తా పత్రిక 2012 మార్చి 26 నాటి సంచికను శ్రీ నరేంద్ర మోదీ ముఖచిత్రంతో పాటు ‘మోదీ అంటే వ్యాపారం’ శీర్షికతో ముఖపత్ర కథనాన్ని ప్రచురించింది. టైమ్ పత్రిక ముఖపత్రంపై ప్రచురితమైన చిత్రాలలో మహాత్మ గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆచార్య వినోబా భావే గారు ల వంటి జగత్ర్పసిద్ధులు ఉండడం ఈ సందర్భంగా గమనార్హం. గడచిన దశాబ్దంలో గుజరాత్ అభివృద్ధిని టైమ్ పత్రిక ఎంతగానో ప్రశంసించింది. అంతేగాక శ్రీ నరేంద్ర మోదీని “సుదృఢ, సమర్థ, కఠిన క్రమశిక్షణ గల నాయకుడుగా కొనియాడింది. దేశాన్ని ప్రగతిపథంలో నడుపుతూ చివరకు చైనాకు దీటుగా నిలపగలరు” అంటూ భవిష్య వాణిని వినిపించింది. ఇక 2014లో టైమ్ పత్రిక ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నేతలలో ఒకరుగా శ్రీ నరేంద్ర మోదీకి స్థానం కల్పించింది.
అమెరికాలోని మేధోనిలయ సంస్థలలో ఒకటైన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ గుజరాత్ అభివృద్ధి దశాబ్దాన్ని కొనియాడింది. శ్రీ నరేంద్ర మోదీని “ప్రతిభావంతుడు, ప్రభావశీలియైన రాజకీయ నాయకుడు”గానూ, “పలికిందల్లా పాటించే” నేతగానూ ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విలియమ్ ఆంథోలిస్ తన రచనలో అభివర్ణించారు. భూగోళంపై “చైనా సహా ఏ ప్రాంతంలోనూ లేనంత వేగంగా వృద్ధి చెందిన” రాష్ట్రంగా గుజరాత్‌ను గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ‘గుజరాత్ ప్రగతిని పరుగు తీయించిన మోదీ’ శీర్షికన ప్రచురించిన వ్యాసంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని కొనియాడింది. “భారతదేశంలోనే రెండంకెల వార్షిక వృద్ధి శాతంతో.. పెట్టుబడిదారులకు అత్యంత సన్నిహిత రాష్ట్రం”గా గుజరాత్ విలసిల్లుతున్నదని పేర్కొంది. అలాగే గుజరాత్‌లో దశాబ్దంగా నెలకొన్న శాంతియుత వాతావరణం భవిష్యత్తులో రాష్ట్రం మరింత ఉత్తేజకర అభివృద్ధిని సాధించగలదని గుజరాత్ సమాజం, ప్రత్యేకించి యువతరం స్వప్నించేలా చేసింది!
లాటిన్ అమెరికా, కరీబ్బీన్ దేశాల (LAC) ప్రతినిధి బృందంతో 2013 జూన్‌లో శ్రీ నరేంద్ర మోదీ
అమెరికా ఖండంలోని ఇతర దేశాలు కూడా గుజరాత్ అభివృద్ధిపై ఇదే విధంగా హర్షం వ్యక్తం చేశాయి. శ్రీ నరేంద్ర మోదీ 2012 జూలైలో లాటిన్ అమెరికా, కరిబియన్ దేశాలకు చెందిన ఏడుగురు రాయబారుల అగ్ర శ్రేణి ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. వీరిలో బ్రెజిల్, మెక్సికో, పెరూ, డొమినికన్ రిపబ్లిక్ తదితర దేశాలవారు కూడా ఉన్నారు. వీరంతా గుజరాత్‌లో అభివృద్ధిని ప్రశంసించడమేగాక తమ తమ దేశాలతో గుజరాత్ సహకారానికి గల మార్గాలను అన్వేషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాణిజ్య కేంద్రంతో పాటు కొయ్య, కలప, పాలరాయి ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన వారికి వివరించారు.
‘గుజరాత్ దినోత్సవం’లో భాగంగా 2012 మే 20వ తేదీ ఉదయం శ్రీ నరేంద్ర మోదీ అమెరికాలోని 12 నగరాల్లో గల ప్రవాసుల భారీ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గుజరాత్ అభివృద్ధికి తీసుకున్న వివిధ చర్యల గురించి ఈ సందర్భంగా శ్రీ మోదీ సమగ్రంగా వివరించారు. అలాగే ఆర్థిక వ్యవస్థలోని మూడు రంగాలూ రాష్ట్రంలో ఎలా ఎదుగుతున్నదీ వివరించారు.
ఈ ప్రసంగానికి ప్రవాసుల విశేషాదరణ లభించడంతోపాటు ఉపగ్రహం, టెలివిజన్, ఇంటర్నెట్‌ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలు ఆలకించారు.
అది మొదలు ప్రవాస భారతీయులతో శ్రీ మోదీ నిరంతర అన్యోన్య సంభాషణను క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఆ మేరకు తాజాగాన్యూఢిల్లీలో 2014లో నిర్వహించిన ప్రవాస భారతీయుల దినంలో ఆయన ప్రసంగించారు.
భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ 2014 ఫిబ్రవరి 13న గాంధీ నగర్ కు వచ్చి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించుకున్నారు.
విదేశీ ప్రముఖులతో అన్యోన్య సంభాషణలు, చర్చలతోపాటు వారి ప్రశంసలే ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి దేశం లోపలా, వెలుపలాగల విశేషాదరణకు నిదర్శనాలు. వ్యాపారవేత్తలు, సామాన్యుల నుండి ప్రపంచ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ శ్రీ నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఉత్సుకత చూపుతారు. ‘భారత వృద్ధి చోదకం’గా గుజరాత్ పరివర్తన చెందడం వెనుక ఆయన కృషిని గురించి తెలుసుకోవాలన్న అమితాసక్తే ఇందుకు కారణం!