ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంకేతిక విజ్ఞానం శక్తిని అపారంగా విశ్వసిస్తారు. అంతేకాదు స్వయంగా తాను టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తారు. శ్రీ నరేంద్ర మోదీ, సాంకేతిక విజ్ఞానాన్ని సులభమైన, సమర్థమైన, పొదుపైన, వేగంతో కూడిన సేవలు అందించేదిగా భావిస్తారు. వివిధ పనులు వేగంగా చేయడానికి, వివిధ ప్రక్రియలను, వ్యవస్థలను సులభతరం చేయడానికి , ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇది మంచి అవకాశాన్నిస్తుంది. పాలనలో పారదర్శకతకు, సాధికారత లేని వారికి సాధికారత కల్పించడానికి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ విశ్వాసం.
2014 మే లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో సాంకేతిక విజ్ఞానం వినియోగాన్ని పెంచాలని కోరుతూ వచ్చారు.అందుకు అనుగుణంగా ప్రధాని డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాలనలో సరికొత్త సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడంతో పాటు, ప్రజల సమస్యలకు పరిష్కారాలను సాంకేతిక పరిజ్ఞాన శక్తితో సాధించడం దీని ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే వివిధ ప్రాజెక్టుల అమలును సమీక్షించడానికి సాంకేతిక పరిజ్ఞన ఆధారిత బహుళ ప్రయోజన కర, బహుళ అనుసంధానిత వేదికను ఒక దానిని ప్రగతి పేరుతో ప్రారంభించారు. ప్రతి నెలా చివరి బుధవారం రోజు
ప్రధాన మంత్రి స్వయంగా ఉన్నతాధికారులతో ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ..‘ప్రగతి’) ద్వారా వివిధ రంగాలపై ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తారు. ఇది ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది.
దేశ ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానం వాడకాన్ని గణనీయంగా పెంచుతోంది. కోట్లాది రైతులు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్ఎస్) ల ద్వారా పొందుతున్నారు. అగ్రిటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా గల నియంత్రిత మార్కెట్లు ఉమ్మడి ఇ- ప్లాట్ ఫామ్‌తో అనుసంధానమౌతాయి. రైతులు, వ్యాపారులు తమ అమ్మకాలు, కొనుగోళ్లను మంచి ధరకు పారదర్శకంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 జూలై లో MyGov.in పోర్టల్‌ను ప్రారంభించారు. పాలనలో, విధాన నిర్ణయాలలో పౌరులను భాగస్వాములను చేసేందుకు ఈ పోర్టల్ ఇంటర్ నెట్‌ను ఉపయోగిస్తుంది.
MyGov.in పోర్టల్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు వాటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాయి. ప్రధాన మంత్రి MyGov.in పోర్టల్‌ను తన నెల వారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) లేదా ఇతర కార్యక్రమాలకు తరచూ వాడుతున్నారు. 2015 సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా పలు టెక్నాలజీ సంస్థల సిఇఒ లతో సమావేశమయ్యారు. ఫేస్ బుక్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. విశేష సంఖ్యలో ప్రజలు వీక్షించిన టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు. గూగుల్ కార్యాలయాన్ని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న సాంకేతిక ఆవిష్కరణలను వారు ప్రధాన మంత్రికి తెలిపారు. సాంకేతిక విజ్ఞానం రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఇండియా డిన్నర్ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ‘డిజిటల్ ఇండియా’పై భారత ప్రభుత్వ దార్శనికతను వివరించారు. భారతదేశంలో డిజిటల్ సాధికారిత కలిగిన సమాజాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను టెక్నాలజీ రంగానికి చెందిన సిఇఒలు శ్రీ సత్యా నాదెళ్ల నుండి, శ్రీ సుందర్ పిచాయ్ వరకు అందరూ ప్రశంసించారు. ప్రధాన మంత్రి తన అమెరికా పర్యటన సందర్భంగా సాంకేతిక విజ్ఞానాన్ని ప్రధానంగా వాడుతున్న స్టార్ట్ అప్ వాణిజ్యవేత్తలను కలిశారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ టెస్లా మోటార్స్ సందర్శనకు శ్రీ ఈలాన్ మస్క్ ఏర్పాటు చేశారు. అభివృద్ధి ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలలో టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుందో ప్రధాన మంత్రి శ్రీ మోదీ, శ్రీ మస్క్ లు ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు
ప్రధాన మంత్రి శ్రీ మోదీ విదేశీ పర్యటనలు జరిపినపుడల్లా సాంకేతిక విజ్ఞాన సహకారానికి సంబంధించి విస్తృత స్థాయి చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇండియా - ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సాంకేతిక విజ్ఞాన రంగంలో ఆఫ్రికాకు భారతదేశం ఎలాంటి సహకారం అందిస్తుందో వివరించారు
వ్యక్తిగతంగా శ్రీ నరేంద్ర మోదీ ని గురించి తెలిసిన వారు, సాంకేతిక విజ్ఞానం పట్ల ఆయనకు గల ప్రేమను గుర్తు చేసుకొంటూ ఉంటారు. సామాజిక మాధ్యమాలలో అత్యంత చురుకుగా ఉండే ప్రపంచ నేతలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒకరు. ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్ డ్ ఇన్, ఇన్‌స్టాగ్రామ్ లలో చురుకుగా పాలు పంచుకొంటున్నారు. ప్రజలతో సంబంధాలకు ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమాన్ని కూడా వినియోగిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తమ కుమార్తెలతో సెల్ఫీలు తీసుకోవల్సిందిగా కోరడం. ఇన్ క్రెడిబుల్ ఇండియా ఫోటోలను షేర్ చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడం ద్వారా ప్రజలలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు
ఎం- గవర్నెన్స్ లేదా మొబైల్ గవర్నెన్స్‌పై ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రధానికి తన స్వంత మొబైల్ యాప్ ‘NarendraModi Mobile App’ ఉంది. ఇది యాపిల్, ఆండ్రాయిడ్ ఫొన్ లలో లభ్యమౌతుంది. ఈ యాప్ ద్వారా మీరు తాజా వార్తలను ,తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కనెక్ట్ కావచ్చు
ఈ విధంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1.25 బిలియన్ భారతీయులు సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానమయ్యేలా టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు పట్టుదలతో నిరంతర కృషి చేస్తున్నారు. డిజిటల్ హైవేల ద్వారా భారతదేశాన్ని అనుసంధానం చేసేందుకు , నెటిజన్ లను సాధికార పౌరులుగా మార్చేందుకు ప్రధాన మంత్రి కృషి చేస్తున్నారు.