ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లో 'గంగా నది ఒడ్డున వెలసిన వారణాసి నుంచి' పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎన్నిక తర్వాత మే 2014లో ఆయన మాట్లాడుతూ "గంగమ్మకు సేవ చేయడం నా అదృష్టం" అని పేర్కొన్నారు.
గంగానది ప్రజలందరికీ చాలా ముఖ్యమైన నది. సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక విశిష్టత వల్లనే అది ముఖ్యమైనది అని అనుకోవద్దు.. గంగానది దేశ జనాభాలో నలభై శాతం మంది ప్రజలకు జీవనాధారం. 2014లో అమెరికాలోని మేడిసన్ స్వేర్ నుంచి అక్కడి భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గంగానది గొప్పదనాన్ని వివరించారు. మనం గంగానదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామంటే అది దేశంలోని నలభైశాతం మంది ప్రజలకు సహాయం చేసినట్టే. కాబట్టి గంగానదిని శుభ్రపరిచే కార్యక్రమం కూడా ఒక ఆర్థిక ఎజెండాగానే భావించాలంటూ ఆ రోజున ప్రధాని స్పష్టం చేశారు.
ప్రధాని ఆశయాన్ని సాకారం చేయడానికి ప్రభుత్వం నమామి గంగే పేరుతో సమగ్రమైన గంగానది పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గంగా నది కాలుష్యం బారిన పడకుండా తక్షణమే చర్యలు చేపట్టడానికి, నదిని తిరిగి స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాచరణ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019-2020వరకు రూ.20,000 కోట్లను వెచ్చించి నదిని పరిశుభ్రపరచాలని నిర్ణయించారు. ఈ బడ్జెట్ గతంలో కేటాయించిన బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ కార్యక్రమం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం.
గంగానదిని పునరుజ్జీవంపచేసే ఈ కార్యక్రమం పూర్తి కావాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పలు విభాగాల సహకారం అవసరం. ఈ కార్యక్రమంలో అనేక కోణాలున్నాయి. అనేక భాగస్వాములు ఇమిడి ఉన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్రం- రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి మొదలైంది. కార్యాచరణ నిర్వహణలోను, కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో పర్యవేక్షణను పెంచడానికి చర్యలు మొదలయ్యాయి.
గంగానది శుద్ధి కార్యక్రమాన్ని పలు స్థాయిలకింద విడగొట్టడం జరిగింది. ప్రారంభ స్థాయి కార్యక్రమాల ద్వారా కొంతమేరకు శుభ్రత జరుగుతుంది. దీని ఫలితం వెంటనే కనిపిస్తుంది. మధ్యకాలిక కార్యక్రమాలద్వారా అంటే ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసే కార్యక్రమాలద్వారా మరికొంత శుభ్రతను సాధించడం జరుగుతుంది. ఇక దీర్ఘకాలిక కార్యక్రమాలద్వారా అంటే పది సంవత్సరాలవరకు అమలు చేసే కార్యక్రమాల ద్వారా పూర్తిగా శుభ్రతను సాధించవచ్చు.
ప్రారంభ స్థాయిలో చేపట్టే కార్యక్రమాలు ఇలా న్నాయి. నదిపైన తేలియాడే వ్యర్థాలను వెంటనే తొలగించడం జరుగుతుంది. గంగానది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను చేపడతారు. మరుగుదొడ్లను నిర్మిస్తారు. తద్వారా ఆయా గ్రామాలనుంచి మురికి కాలువలగుండా ద్రవ, ఘన వ్యర్థాలు గంగానదిలో కలవడం ఆగిపోతుంది. శ్మశానవాటికలను పునరుద్ధరించడం, ఆధునీకరించడం, కొత్తవాటిని నిర్మించడం చేస్తారు. తద్వారా కాల్చని, పాక్షికంగా కాలిన శవాలు నదిలోకి కొట్టుకురావడం ఆగిపోతుంది. అలాగే గంగానదితీరంలోని ఘాట్లకు రిపేర్లు చేయడం, ఆధునీకరించడం, కొత్త ఘాట్లను నిర్మించడం ద్వారా మనిషికి, నదికి ఉన్న అనుబంధాన్ని మెరుగుపరచడం జరుగుతుంది.
ఇక మధ్యకాలిక కార్యక్రమాలు ఇలా ఉంటాయి. మునిసిపాలిటీల నుంచి, పరిశ్రమల నుంచి కాలుష్యం నదిలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. మున్సిపాలిటీల నుంచి, మురికి కాలువల నుంచి కాలుష్యం నదిలోకి రాకుండా ఉండడానికిగాను అదనంగా 2500 ఎంఎల్ డి (మెగా లీటర్స్ పర్ డే) సామర్థ్యంగల మురికినీటి శుద్ధి కర్మాగాలను రానున్న ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తారు. గంగానది శుభ్రత కార్యక్రమం సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, సుస్థిరంగా ఉండడానికిగాను ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్ని చేయబోతున్నారు. హైబ్రిడ్ ఆన్యుటీ ఆధారిత ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక సాధన వాహిక వ్యవస్థ (ఎస్ పి వి) ద్వారా అన్ని ప్రధాన నగరాల్లో మురుగునీటి శుద్ధిని చేపట్టి, శుద్ధి అయిన నీటికి మార్కెట్ ను కల్పించడం జరుగుతుంది.
పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడానికిగాను మెరుగైన చర్యలను అమలు చేయడం జరుగుతుంది. గంగానది పరివాహక ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఎలాంటి కాలుష్యాన్ని నదిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే చట్టబద్దమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కాలుష్య నియంత్రణ బోర్డులు ఇప్పటికే తయారు చేశాయి. వాటిని ఆయా కర్మాగారాలకు తెలియజేస్తూ వాటితో కాలపరిమితితో కూడిన సంప్రదింపులను చేస్తున్నారు. అన్నిపరిశ్రమలు వాస్తవ సమయానికి అనుగుణంగా మురుగునీటి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.
పైన తెలిపిన చర్యలే కాకుండా గంగాశుద్ధి కోసం మరికొన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. జీవవైవిధ్య పరిరక్షణ, అడవులను విస్తరించడం, నీటి నాణ్యత పర్యవేక్షణ మొదలైనవి వీటిలో ముఖ్యమైనవి. నీటిలో జీవించే జీవుల్లో ముఖ్యమైన గోల్డెన్ మహసీర్ చేప, డాల్ ఫిన్లు, మొసళ్లు, తాబేళ్లు, ఓటర్స్ మొదలైనవాటి పరిరక్షణ కోసం కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టడం జరిగింది. అలాగే నమామీ గంగే కార్యక్రమం కింద 30 వేల హెక్టార్ల భూమిలో వనాలను పెంచుతారు. తద్వారా నేల కోతను నివారించి నది జీవావరణ వ్యవస్థను కాపాడడం జరుగుతుంది. భూగర్భ జల మట్టాలను కాపాడుకోవడం జరుగుతుంది. అటవీ విస్తరణ కార్యక్రమం 2016లో మొదలవుతుంది. 113 వాస్తవ సమయ నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా నీటి నాణ్యతను సమగ్రంగా తెలుసుకోవడం జరుగుతుంది.
ఇక దీర్ఘకాలిక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. నదిలోకి తగినన్ని నీళ్లు చేరడానికి చర్యలు చేపడతారు. ఇందుకుగాను మురికి నీళ్ల ప్రవాహం గురించి తెలుసుకుంటారు. నీటి వినియోగ సమర్థత, సాగునీటి వినియోగంలో వచ్చిన అభివృద్ధిని తెలుసుకుంటారు.
గంగానదిని శుద్ధి చేసే కార్యక్రమం ఎంతో కష్టతరమైన కార్యక్రమం. ఎందుకంటే దాని చుట్టూ పలు సామాజిక ఆర్థిక, సాంస్కృతిక కారణాలు అల్లుకుపోయి ఉన్నాయి. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎవరూ అమలు చేయలేదు. ఇది సఫలం కావాలంటే పలు రంగాల భాగస్వామ్యం అవసరం. దేశంలోని ప్రతి పౌరుని సహకారం కావాలి. మనలో ప్రతి ఒక్కరు పలు విధాలుగా ఈ గంగా శుద్ధి కార్యక్రమానికి చేయూతనందించవచ్చు.
- నిధులను సమకూర్చవచ్చు: గంగానది చాలా పెద్ద నది. ఇలాంటి నదిని శుద్ధి చేయాలంటే భారీగా నిధులు అవసరం. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించిన బడ్జెట్ ను నాలుగు రెట్లు ఎక్కువ చేసింది. అయినప్పటికీ ఈ నిధులు సరిపోవు. అందుకోసం గంగానది శుద్ధి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరైనా తమ స్థోమతను బట్టి విరాళాలు అందజేయవచ్చు.
- తగ్గించు, పునర్వినియోగించు, తిరిగి సేకరించు : వినియోగించిన నీరు, ఇళ్లనుంచి వెలువడే మురికిని శాస్త్రీయ పద్ధతుల్లో వదిలించుకోకపోతే అవి నదుల్లోకి చేరతాయని మనలో చాలా మంది గ్రహించడం లేదు. మురుగు నీటి పారుదల వ్యవస్థల్ని ప్రభుత్వం ఇప్పటికే నిర్మించింది. ప్రజలు నీటి వినియోగాన్ని, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాలి. వాడిని నీటిని, సేంద్రీయ వ్యర్థాలను, ప్లాస్టిక్కులను పునర్వినియోగించడం, తిరిగి సేకరించడం చేయాలి. ఈ పని చేస్తే గంగానది శుద్ధి కార్యక్రమానికి చెప్పుకోదగ్గ మేలు జరుగుతుంది.
మన నాగరికత, సంస్కృతి, వారసత్వానికి నిదర్శనంగా నిలిచిన మన జాతీయ నది గంగను రక్షించుకోవడానికి అందరమూ చేయి చేయి కలుపుదాం.