ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ లంక విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తిలక్ మరాపనా ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.
శ్రీ లంక విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తిలక్ మరాపనా భారతదేశంలో మూడు రోజుల పాటు ద్వైపాక్షిక పర్యటన కోసం వచ్చారు.
శ్రీ లంక విదేశ వ్యవహారాల శాఖ మంత్రి గా శ్రీ తిలక్ మరాపనా నూతన పదవీబాధ్యతలను స్వీకరించినందుకుగాను ఆయనను ప్రధాన మంత్రి అభినందించారు. ఇంటర్ నేషనల్ వెసాక్ డే సందర్భంగా ఈ సంవత్సరం మే నెలలో తాను శ్రీ లంక లో జరిపిన పర్యటన ఫలప్రదం అయిన సంగతిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
శ్రీ లంక తో భారతదేశ సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ప్రగాఢమైన మరియు విశాల పరిధిని కలిగిన సంబంధాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టపరచుకోవడమే కాకుండా విస్తరించుకోవడానికి శ్రీ లంక అధ్యక్షునితో, ప్రధానితో సన్నిహితంగా పనిచేయడాన్ని కొనసాగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.