ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రేష్ఠులు సింగపూర్ ఉప ప్రధాని శ్రీ థర్మన్ షణ్ముగరత్నమ్ ఈ రోజు సమావేశమయ్యారు.
శ్రేష్ఠులు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియన్ లూంగ్ 2016 అక్టోబరులో చేపట్టిన భారతదేశ పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. అప్పటి శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఉభయ పక్షాలు తీసుకొన్న తదుపరి చర్యలను శ్రీ మోదీ ప్రశంసించారు కూడా.
భారతదేశంలో వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) ను విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ప్రధాన మంత్రికి శ్రీ షణ్ముగరత్నమ్ అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలలో, ప్రత్యేకించి ఆర్థిక రంగంలోని ప్రగతిని గురించి ప్రధాన మంత్రికి ఆయన సంక్షిప్తంగా వివరించారు.
పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, ఇంకా నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలలో సన్నిహిత ద్వైపాక్షిక సహకారాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు.
అలాగే బ్యాంకింగ్, డిజిటల్ ఫైనాన్స్, పర్యాటకం, నూతన ఆవిష్కరణల రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి కూడా ఉభయ నేతలు చర్చించారు.