ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అఫ్గానిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సలాహుద్దీన్ రబ్బానీ ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు.
భారతదేశం అఫ్గానిస్తాన్ తో తన సంబంధాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. అఫ్గానిస్తాన్ పై మరియు ఆ దేశ ప్రజలపై మోపిన ఉగ్రవాదంతో పోరాడటంలో అఫ్గానిస్తాన్ కు భారతదేశం గట్టి మద్ధతిస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒక శాంతియుతమైన, సమైక్యమైన, ప్రజాస్వామ్యయుతమైన మరియు సమృద్ధమైన దేశాన్ని నిర్మించేందుకు అఫ్గానిస్తాన్ ప్రజలు, అఫ్గానిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భారతదేశం మానవతాపూర్వక, అభివృద్ధి సంబంధ సహాయాన్ని సమకూర్చడం ద్వారా సంపూర్ణమైన అండదండలను సైతం అందిస్తుందని ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితిని గురించి ప్రధాన మంత్రికి విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రబ్బానీ వివరించారు. అఫ్గానిస్తాన్ లో శాంతి ప్రక్రియ అఫ్గాన్ నేతృత్వంలో, అఫ్గాన్ యాజమాన్యంలో మరియు అఫ్గాన్ నియంత్రణలో సాగాలని వారు ఉభయులు అంగీకరించారు.
ఇండియా- అఫ్గానిస్తాన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ కౌన్సిల్ రెండవ సమావేశంలో పాల్గొనడానికి విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రబ్బానీ భారతదేశానికి విచ్చేశారు. భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు శ్రీ రబ్బానీ సహాధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.