సింగపూర్ మాన్య సీనియర్ మంత్రి శ్రీ గోహ్ చోక్ టోంగ్ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తమ మధ్య ఉన్నటువంటి సుదీర్ఘ సాన్నిహిత్యాన్ని స్నేహపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. అలాగే, శ్రీ గోహ్ చోక్ టోంగ్ ఈ సంవత్సరం ఆరంభంలో లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలిసి పాలక మండలికి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలను స్వీకరించడం పట్ల శ్రీ గోహ్ చోక్ టోంగ్ ను ప్రధాన మంత్రి అభినందించారు.
ఇటీవల కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి, సింగపూర్ కు మధ్య అనేక ఉన్నత స్థాయి రాకపోకలు చోటుచేసుకొన్నందువల్ల లభించిన ఊతాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. వ్యాపారం & పెట్టుబడులు, అనుసంధానం, రక్షణ, ఇంకా భద్రత రంగాలతో పాటు అన్ని రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావడాన్ని ఆయన ప్రశంసించారు.
ఇండియా- ఏశియన్ సుదృఢ సంబంధాల పునాది మీద నిర్మించినటువంటి భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’లో సింగపూర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశంతో ఏశియన్ సంబంధాలు ఏర్పరచుకోవలసిందిగా తొలి దశ లోనే గట్టి మద్దతునిచ్చిన ఖ్యాతి శ్రీ గోహ్ చోక్ టోంగ్ కే దక్కుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
పరస్పర ప్రయోజనాలు ముడిపడినటువంటి ప్రాంతీయ అంశాలను మరియు ప్రపంచ అంశాలను గురించి నేతలు ఇరువురూ చర్చించారు.