నా ప్రియమైన దేశప్రజలందరికీ నమస్కారం! ఈమధ్యన చాలా చోట్ల వర్షాలు బాగా కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని ఆందోళన పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఇప్పటివరకూ అసలు వర్షాలే లేనందువల్ల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశ వైశాల్యం, భిన్నత్వాలే కాక అప్పుడప్పుడు వర్షాలు కూడా తమ ఇష్టాఇష్టాలను చూపెడుతూ ఉంటాయి. కానీ మనం వర్షాలను తప్పుపట్టలేము. ప్రకృతితో విరోధాన్ని కొని తెచ్చుకున్నది మనుషులే. ఆ కారణంగానే అప్పుడప్పుడు ప్రకృతి మనపై అలక వహిస్తుంది. అందుకని ప్రకృతి ప్రేమికులుగా మారి, ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనకి ఉంది. మనం ప్రకృతికి ప్రతినిధులుగా మారినప్పుడే, కొన్ని ప్రకృతిపరమైన విషయాల్లో ఉండే సమతుల్యం అదే విధంగా నిలిచి ఉంటుంది.
కొన్ని రోజుల క్రితం అలాంటి ఒక ప్రకృతి వైపరీత్యం ఒకటి యావత్ ప్రపంచాన్నీ తన వైపుకు తిప్పుకుంది. మానవ హృదయాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందా సంఘటన. మీరంతా టీవీలలో చూసే ఉంటారు. థాయిలాండ్ లో పన్నెండుమంది జూనియర్ ఫుట్ బాల్ ఆటగాళ్ళ జట్టు, వారి కోచ్ విహారానికి ఒక గుహ లోకి వెళ్ళారు. సాధారణంగా ఆ గుహ లోకి వెళ్ళి, బయటకు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ ఆ రోజు విధి నిర్ణయం మరో విధంగా ఉంది. వాళ్ళు గుహలో బాగా లోపలికి వెళ్ళిన తరువాత హటాత్తుగా వర్షం పడినందువల్ల గుహ ద్వారం వద్ద చాలా నీరు నిలిచిపోయింది. ఆ కారణంగా వాళ్ళు బయటకు వచ్చే దారి మూసుకుపోయింది. బయటకు వచ్చేందుకు ఏ మార్గం దొరకక వాళ్ళంతా గుహ లోపల ఉన్న ఒక చిన్న దిబ్బ దగ్గర ఉండిపోయారు. ఒకటో, రెండు రోజులో కాదు, ఏకంగా పధ్ధెనిమిది రోజులు వరకూ అలానే ఉండిపోయారు! యుక్తవయసులో ఉండగా మరణం ఎదురైతే, క్షణ క్షణం ఆ దుస్థితిలో గడపాల్సి వస్తే, ఆ క్షణాలు ఎలా ఉంటాయో మీరు ఊహించగలరు కదా.
ఒక వైపు వాళ్ళు ఆపదతో పోరాడుతుంటే, మరోవైపు యావత్ ప్రపంచం లోని మానవజాతంతా ఏకమై భగవంతుడు ప్రసాదించిన మానవతా విలువలను ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఈ పిల్లలు సురక్షితంగా బయట పడాలని ప్రార్థనలు చేశారు. ఆ పిల్లలు ఎక్కడ చిక్కుకుపోయారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, తెలుసుకునేందుకు వీలయినన్ని ప్రయత్నాలు చేశారు. వాళ్లని బయటకు ఎలా తీసుకురావాలి? ఒకవేళ సకాలంలో వారిని రక్షించడం కుదరకపోతే వర్షాకాలం ముగిసేవరకూ వారిని బయటకు తీసుకురావడం అసంభవం. అదృష్టవశాత్తూ వారు సురక్షితంగా ఉన్నారన్న శుభవార్త రాగానే ప్రపంచవ్యాప్తంగా అందరూ శాంతించారు, ఆనందించారు. కానీ ఈ రక్షణా కార్యక్రమం మొత్తం ఎలా జరిగింది అనే విషయాన్ని నేను మరో దృష్టితో గమనించాను. ప్రతి స్థాయిలోనూ కనబడిన పరిపూర్ణమైన బాధ్యత అద్భుతంగా తోచింది. ప్రభుత్వం , పిల్లల తల్లిదండ్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా, దేశ ప్రజలు, అందరూ కూడా ప్రశాంతంగా, ధైర్యాలను అద్భుతంగా ఆచరించి చూపెట్టారు. ప్రజలంతా ఒక జట్టుగా ఏర్పడి తమ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చూపెట్టిన నిదానమైన వైఖరి – నేర్చుకోవాల్సిన, అర్థంచేసుకోవాల్సిన సంగతి. ఆ తల్లిదండ్రులు బాధపడలేదనో, వారి తల్లులు కన్నీళ్ళు పెట్టలేదనో కాదు నేను చెప్పేది, వారి ధైర్యం, సహనం, యావత్ సమాజం శాంతియుతంగా ఆ వ్యవహారాన్ని నడిపిన తీరు చూసి మనందరమూ ఎంతో నేర్చుకోవాలి.
ఈ మొత్తం వ్యవహారంలో ధాయ్ లాండ్ నావికాదళానికి చెందిన ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయాడు కూడా. అటువంటి కఠిన పరిస్థితుల్లో, గుహ మొత్తం వర్షపు నీటితో నిండిపోయినప్పటికీ కూడా, ఆ చీకటి గుహలో ఎంతో ధైర్యసాహసాలతో వారంతా ఆశను విడిచిపెట్టలేదు. మానవత్వమంతా ఏకమైతే అద్భుతమైన విషయాలు జరుగుతాయని ఈ సంఘటన తెలుపుతుంది. కాస్త శాంతంగా, స్థిరమైన మనసుతో మన లక్ష్యంపై మనసు పెట్టి పనిచేస్తే చాలు.
కొద్ది రోజుల క్రితమే మన దేశానికి ప్రియమైన కవి నీరజ్ గారు మనల్ని వదిలివెళ్ళ పోయారు. ఆశ, నమ్మకం, ధృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం మొదలైన గుణాలు నీరజ్ గారి ప్రత్యేకతలు. మన భారతీయులకు కూడా నీరజ్ గారి ప్రతి మాటా ఎంతో బలాన్ని ఇవ్వగలదు, ప్రేరణను అందించగలదు. ఆయన ఏమని రాశారంటే –
“అంధకారం అస్తమించే తీరుతుంది,
తుఫానులు ఎన్నైనా సృష్టించు,
పిడుగులు ఎన్నైనా కురిపించు,
దీపం వెలిగిందంటే ఇక అంధకారం అస్తమించే తీరుతుంది.”
నీరజ్ గారికి ఆదరణీయ శ్రధ్ధాంజలి .
“నమస్తే ప్రధానమంత్రి గారూ. నా పేరు సత్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో మొదటి సంవత్సరంలో అడ్మిట్ అయ్యాను. మా పాఠశాల బోర్డ్ పరీక్షల సమయంలో పరీక్షల వత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా చదువుకోవాలో మీరు మాకు చెప్పారు కదా. మా లాంటి విద్యార్థులకు ఇప్పుడు మీరిచ్చే సందేశం ఏదైనా ఉందా?”
ఒక రకంగా చూస్తే జులై, ఆగస్టు రెండు నెలలు రైతులకు, విద్యార్థులకూ కూడా ఎంతో ముఖ్యమైన నెలలు. ఇది కళాశాలలు ఆరంభమయ్యే సమయం . సత్యం లాంటి ఎందరో విద్యార్థులు పాఠశాలను వదిలి కళాశాలల్లో చేరే సమయం ఇది. ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షలు, ప్రశ్నా పత్రాలు, జవాబులతో గడిచిపోతాయి. సెలవులలో సరదాగా, కులాసాగా గడపడంతో పాటూ పరీక్షా ఫలితాలు, జీవనపయనాన్ని నిర్ణయించుకోవడం, భవిష్యత్ నిర్ణయాల ఆలోచనలతో ఏప్రిల్, మే నెలలు గడిచిపోతాయి. ఇక జులై వచ్చేసరికీ యువత తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంలో అడుగు పెడతారు. అక్కడ వాళ్ల దృష్టి ప్రశ్నల నుండి కట్ -ఆఫ్ వైపుకి మళ్ళుతుంది. విద్యార్థుల ధ్యాస ఇంటి నుండి హాస్టల్ కి మారిపోతుంది. విద్యార్థులు తల్లిదండ్రుల నీడ నుండి ప్రొఫెసర్ల నీడలోకి వస్తారు. నా యువ మిత్రులు తమ కాలేజీ జీవితాన్ని చాలా ఆనందంగా, ఉత్సాహంగా మెదలుపెట్టబోతూ ఉండి ఉంటారని నాకు గట్టి నమ్మకం. మొదటిసారి ఇంటి నుండి బయటకు , ఊరి నుండి బయటకు వెళ్ళి, ఒక భద్రత నిండిన వాతావరణం నుండి వేరుపడి, మీకు మీరే సారధులుగా మారాల్సిన సమయం ఇది. ఎంతోమంది యువజనులు మొదటిసారిగా తమ ఇళ్ళను వదిలి, తమ జీవితాలకు ఒక కొత్త దిశను అందించడానికి బయటకు వస్తారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమ తమ కాలేజీలలో చేరిపోయి ఉంటారు. కాలేజీలలో చేరాల్సిన వారు ఇంకా కొందరు ఉండి ఉంటారు. మీ అందరికీ నేను చెప్పేదేమిటంటే ప్రశాంతంగా ఉండండి, జీవితాన్ని ఆనందంగా గడపండి, జీవితంలో మనస్సాక్షిని పూర్తిగా ఆస్వాదించండి. చదువుకోవాలి అంటే పుస్తకాలను తప్పకుండా చదివే తీరాలి. వేరే మార్గం లేదు. కానీ కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ప్రవృత్తి ఎప్పుడూ ఉండాలి. పాత స్నేహితులకు ఎంతో గొప్ప విలువ ఉంది. చిన్ననాటి స్నేహితులు విలువైనవాళ్ళు. కానీ కొత్త స్నేహితులను ఎన్నుకోవడం, స్నేహం కలుపుకోవడం, ఆ స్నేహాలని నిలబెట్టుకోవడం ఇదంతా చాలా తెలివితేటలతో చెయ్యాల్సిన పని. కొత్త కొత్త నైపుణ్యాలు, కొత్త కొత్త భాషలు నేర్చుకోండి. తమ ఇంటిని, ప్రాంతాన్ని వదిలి చదువుకోవడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళిన యువత ఆ కొత్త ప్రదేశాలను శోధించండి. ఆ ప్రాంతాల గురించి తెలుసుకోండి. అక్కడి ప్రజలను, వారి భాషను, సంస్కృతిని తెలుసుకోండి. అక్కడి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి, వాటిని గురించి వివరాలను తెలుసుకోండి. కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న యువజనులందరికీ నా అభినందనలు. కాలేజీల ప్రస్థావన వచ్చింది కాబట్టి ఇటీవలే నేను వార్తల్లో చూసిన మరో విషయం గురించి చెప్తాను. మధ్యప్రదేశ్ లోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఆశారామ్ చౌదరి అనే విద్యార్థి తన జీవితంలోని కష్టమైన పోటీలన్నింటినీ దాటి విజయాన్ని చేజిక్కించుకున్నాడు. జోధ్పూర్ AIIMS తాలూకూ MBBS పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించాడు. అతని తండ్రి చెత్తను పోగుచేసే పని చేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ విజయానికి గానూ నేను ఆ విద్యార్థిని అభినందిస్తున్నాను. ఇటువంటి ఎందరో విద్యార్థులు నిరుపేద కుటుంబాల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండీ వచ్చి కూడా తమ కష్టంతో, పట్టుదలతో మనకు ప్రేరణాత్మకంగా నిలిచే విజయాలను సాధించి చూపెట్టారు. ఢిల్లీకి చెందిన DTC బస్సు డ్రైవర్ కుమారుడైన ప్రిన్స్ కుమార్ అయినా, కలకత్తాలో ఫుట్పాత్ పై వీధి దీపాల కింద చదువుకున్న అభయ్ గుప్తా అయినా సరే. అహ్మదాబాద్ కు చెందిన ఆడపడుచు అఫ్రీన్ షేక్ తండ్రి ఆటో నడుపుతాడు. నాగ్ పూర్ కు చెందిన ఆడబిడ్డ ఖుషీ తండ్రి ఒక పాఠశాల బస్సు డ్రైవరు. హరియానా కు చెందిన కార్తీక్ తండ్రి కాపలాదారుడు(వాచ్మేన్). ఝార్ఖండ్ కు చెందిన రమేష్ సాహూ తండ్రి ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడు. రమేష్ కూడా స్వయంగా తిరునాళ్లలో బొమ్మలు అమ్మేవాడు. పుట్టినప్పటి నుండీ spinal muscular atrophy అనే ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న గుర్గావ్ కు చెందిన దివ్యాంగ బాలిక అనుష్క పాండా , వీరందరూ కూడా తమకు ఎదురైన ప్రతి బాధని దాటుకుని, తమ ధృఢసంకల్పం, ధైర్యాలతో ప్రపంచం తమ వైపుకి చూసేలాంటి విజయాలను తమ సొంతం చేసుకున్నారు. మనం మన చుట్టుపక్కల గనుక గమనిస్తే ఇటువంటి ఎన్నో ఉదాహరణలు కనబడతాయి.
దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో జరిగిన మంచి సంఘటన అయినా నా మనసుకు శక్తిని ఇస్తుంది. ప్రేరణని అందిస్తుంది. నేనిప్పుడు మీకు కొందరు యువకుల కథ ను చెప్తుంటే నాకు నీరజ్ గారి మాటలు కూడా గుర్తువస్తున్నాయి.
“భూమి గీతాన్ని నేను ఆకాశానికి వినిపించాలి
ప్రతి చీకటినీ నేను వెలుగులోకి పిలవాలి
పూల పరిమళంతో కరవాలాన్ని జయించాలి
పాడి పాడి నేను కొండల్ని మేలుకొలపాలి ”
జీవిత పరమార్థం అదే కదా .
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం నా దృష్టిని “ఇద్దరు యువకులు కలిసి మోదీ కలలను సాకారం చేసారు” అని రాసి ఉన్న ఒక వార్త ఆకర్షించింది. లోపల చదివితే ఇవాళ మన యువత టెక్నాలజీని తెలివిగా, సృజనాత్మకంగా ఉపయోగించి ఎలా సామాన్య వ్యక్తి జీవితంలో మార్పుని తేవడానికి ప్రయత్నిస్తున్నారో తెలిసింది. అమెరికాలో టెక్నాలజీ హబ్ గా పిలవబడే సేంజోజ్ నగరంలో ఒకసారి నేను భారతీయ యువకులతో చర్చ జరుపుతున్నాను. భారతదేశం కోసం తమ ప్రతిభని ఎలా ఉపయోగించగలరో ఆలోచించి, సమయాన్ని వెచ్చించి, దేశం కోసం ఏదైనా చెయ్యమని నేను వారిని కోరాను. మేధో వలస ని మేధో వృధ్ధిగా మార్చమని కోరాను. రాయ్ బరేలీకి చెండిన ఇద్దరు ఐ.టి. ప్రొఫెషనల్స్ యోగేష్ సాహూ, రజనీశ్ భాజ్పేయీ గార్లు నా సవాలుని స్వీకరిస్తూ ఒక నూతన ప్రయత్నం చేసారు. తమ ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ వారిద్దరూ కలిసి, ఒక “స్మార్ట్ గావ్ యాప్” తయారు చేసారు. ఈ యాప్ ఆ గ్రామ ప్రజలను యావత్ ప్రపంచంతో కలపడమే కాకుండా వారు ఇకపై ఏదైనా సలహాను గానీ, సూచనను గానీ కావాల్సి వస్తే, తమ సొంత మొబైల్ లోనే అది లభ్యమయ్యేలా చేశారు. రాయ్ బరేలీ కు చెందిన గ్రామం తౌధక్ పూర్ నివాసులందరూ, గ్రామ పెద్ద, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సి.డి.ఓ అందరూ కూడా ఈ యాప్ ను ఉపయోగించుకోవలసిందని ప్రజలను కోరారు. ఒక రకంగా ఈ యాప్ గ్రామంలో డిజిటల్ విప్లవాన్ని తేచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్రామంలో జరిగే అభివృధ్ధి పనులను ఈ యాప్ ద్వారా రికార్డ్ చేయడం, ట్రాక్ చేయడం, మానిటర్ చేయడం సులువైపోయింది. ఈ యాప్ లో గ్రామం లోని ఫోన్ డైరెక్టరీ, వార్తా విభాగం, జరగబోయే కార్యక్రమాల జాబితా, ఆరోగ్య కేంద్రం, సమాచార కేంద్రం ఉన్నాయి. ఈ యాప్ రైతుల కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్ లోని గ్రామర్ ఫీచర్ రైతుల మధ్య FACT rate తెలుసుకోవడానికి, ఒక విధంగా చెప్పాలంటే వారి ఉత్పాదనకు మార్కెట్ ప్లేస్ లా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమౌతుంది – ఆ యువకులు అమెరికాలో, అక్కడి జీవన విధానం, ఆలోచనధోరణుల మధ్య జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం భారతదేశాన్ని వదిలి వెళ్ళినా కూడా తమ గ్రామంలోని చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుని, సవాళ్లను అర్థం చేసుకుని, తమ గ్రామంతో ఎంతో మానసికంగా ముడిపడి ఉన్నారు. ఈ కారణంగానే వారు గ్రామానికి ఏది అవసరమో సరిగ్గా అలాంటిదే చెయ్యగలిగారు. తమ గ్రామంతోటీ, తన మూలాలతో ఉన్న ఈ అనుబంధం , దేశం కోసం ఏదైనా చెయ్యాలనే ఒక తపన, ప్రతి భారతీయుడిలోనూ స్వాభావికంగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కాలం వల్ల, దూరాల వల్ల, పరిస్థితుల వల్ల, దానిపై ఒక పల్చని దుమ్ము పేరుకుపోతుంది. కానీ ఎవరైనా ఒక చిన్న నిప్పు రవ్వతో అయినా వాటిని స్పృశించితే చాలు లోపలి విషయాలన్నీ మరోసారి పైకి వస్తాయి. అవి తన గడచిన రోజుల జ్ఞాపకాల వైపుకి లాక్కుని తోసుకుపోతాయి. మన విషయంలో కూడా ఇలానే జరిగిందా? అని మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. స్థితులు, పరిస్థితులు, దూరాలూ మనల్ని దేశానికి దూరం చేసెయ్యలేదు కదా.. దుమ్ము పేరుకుపోలేదు కదా.. తప్పకుండా ఆలోచించండి.
“గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నేను సంతోష్ కాకడే ను , మహారాష్ట్ర లోని కొల్హాపూర్ నుండి మాట్లాడుతున్నాను. పండర్ పూర్ వారీ అనే పండర్పూర్ తీర్థయాత్ర మహారాష్ట్ర కు చెందిన ఒక ప్రాచీన సంప్రదాయం. ప్రతి ఏడూ ఇది చాలా ఉత్సాహము, ఉల్లాసాలతో జరుపుకుంటారు. దాదాపు ఏడెనిమిది లక్షల భక్తులు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం గురించి దేశప్రజలందరికీ కూడా తెలుసేలా మీరు మరిన్ని వివరాలను తెలపండి”
సంతోష్ గారూ మీ ఫోన్ కాల్ కు అనేకానేక ధన్యవాదాలు. పండర్ పూర్ తీర్థయాత్ర నిజంగా ఒక అద్భుతమైన యాత్ర. మిత్రులారా, ఈసారి జులై ఇరవై మూడవ తేదీన ఆషాఢ ఏకాదశి వచ్చింది. ఆ రోజున పండర్ పూర్ తీర్థయాత్రను ఒక భవ్య పరిణితి రూపంగా కూడా జరుపుకుంటారు. పండర్ పూ మహరాష్ట్ర లోని సోలాపూర్ జిల్లా లోని ఒక పవిత్రమైన ఊరు. ఆషాఢ ఏకాదశి కి ఒక పదిహేను, ఇరవై రోజుల ముందు నుండే వార్కరీ అంటే తీర్థయాత్రికులు, పల్లకీలతో పాటుగా పండర్ పూర్ తీర్థయాత్రకై కాలి నడకన బయలుదేరుతారు. ఈ యాత్రను వారీ అంటారు. ఇందులో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. జ్ఞానేశ్వర్, తుకారామ్ మొదలైన గొప్ప సాధువుల పాదుకలను పల్లకీలో పెట్టి, విఠ్ఠల్ ,విఠ్ఠల్ అని పాడుకుంటూ, నాట్యం చేస్తూ, వాయిద్యాలను మ్రోగిస్తూ కాలి నడకన పండర్ పూర్ బయలుదేరతారు. ఈ యాత్ర విద్య, సంస్కారం, శ్రధ్ధల త్రివేణీ సంగమం. తీర్థయాత్రికులు లేదా విఠోబా లేదా పాండురంగడు అనే పేర్లతో పిలవబడే విఠ్ఠల్ భగవానుడి దర్శనం కోసం అక్కడికి చేరుకుంటారు. విఠ్ఠల్ భగవానుడు పేదల, వంచితుల, పీడితులకు మేలు చేసి, రక్షిస్తాడు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలలో అపారమైన శ్రధ్ధ , భక్తి ఉన్నాయి. పండర్ పూర్ లో విఠ్ఠోబా ఆలయానికి వెళ్ళడం, అక్కడి మహిమ, సౌందర్యం, ఆధ్యాత్మిక ఆనందం ఒక ప్రత్యేకమైన అనుభూతి. వీలైతే ఒకసారి పండర్పూర్ వారీ అనుభవాన్ని తప్పక అనుభూతి చెందమని మన్ కీ బాత్ శ్రోతలని నేను కోరుతున్నాను.
జ్ఞానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, రామ్ దాస్, తుకారామ్ మొదలైన అసంఖ్యాక సాధువులు మాహారాష్ట్ర లో నేటికీ కూడా సామాన్య ప్రజలను శిక్షితులను చేస్తున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తున్నారు. భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈ సాధువుల సంప్రదాయం ప్రజలకు ప్రేరణను అందిస్తూ వచ్చింది. వారి ప్రముఖ జానపద సంగీత రీతులైన భారూడ్ లేదా అభంగ్ ఏదైనా సరే మనకు వాటి ద్వారా సద్భావం, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశం లభిస్తుంది. వీటి వల్ల మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సమాజం శ్రధ్ధగా పోరాడటానికో మంత్రం లభిస్తుంది. ఈ సాధువులే ఎప్పటికప్పుడు సమాజాన్ని ఆపి, అడ్డుపడి, అద్దం కూడా చూపెట్టారు. మన సమాజంలో ప్రాచీన దురలవాట్లు అంతమయ్యేలా చూశారు. ప్రజల్లో కరుణ, సమానత, శుభ్రత మొదలైన సంస్కారాలు ఏర్పడ్డాయి. మన భరతభూమి ఎందరో రత్నాలను కన్న భూమి. ఎందరో సాధువుల గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉంది. అలానే ఆ సమర్థవంతులైన మహాపురుషులైన ఈ భరతమాత బిడ్డలందరూ ఈ భూమి కోసం తమ జీవితాలను అర్పించారు, సమర్పించారు. అలాంటి ఒక మహాపురుషుడే లోకమాన్య తిలక్. ఆయన అనేక భారతీయుల మనసుల్లో చెరగని ముద్రని వేశారు. జులై ఇరవై మూడవ తేదీన మనం తిలక్ గారి జయంతినీ, ఆగష్టు ఒకటవ తేదీన వారి వర్థంతినీ జరుపుకుంటాము. లోకమాన్య తిలక్ సాహసము, ఆత్మవిశ్వాసము నిండుగా ఉన్న వ్యక్తి. బ్రిటిష్ పాలకులకు వారి తప్పులను చూపెట్టే శక్తి , చాతుర్యం ఆయనలో ఉన్నాయి. ఆంగ్లేయులు తిలక్ అంటే ఎంత భయపడేవారంటే, ఇరవై ఏళ్లలో ఆయనకు వాళ్ళు మూడు సార్లు రాజద్రోహ నేరాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమేమీ కాదు. లోకమాన్య తిలక్, అహ్మదాబాద్ లో ఉన్న ఒక తిలక్ విగ్రహము గురించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇవాళ దేశప్రజలతో పంచుకుంటున్నాను. 1916, అక్టోబర్లో ఆహ్మదాబాద్ వచ్చినప్పుడు, ఇప్పటికి దాదాపు వందేళ్ల క్రితం నలభైవేలకు పైగా ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వారితో మాట్లాడే అవకాశం లభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పై లోకమాన్య తిలక్ గారి ప్రభావం అధికంగా ఉంది. 1920ఆగష్టు1,న లోకమాన్య తిలక్ గారు మృతి చెందినప్పుడు అహ్మదాబాద్ లో వారి స్మారక విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆయన అనుకున్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ నగరపాలక సంస్థకు మేయర్ గా ఎన్నికయ్యారు. వెంఠనే ఆయన లోకమాన్య తిలక్ గారి స్మారక విగ్రహం కోసం విక్టోరియా గార్డెన్ ని ఎన్నుకున్నారు. ఈ గార్డెన్ బ్రిటన్ మహారాణి పేరున ఉంది. ఈ నిర్ణయంపై స్వాభావికంగా బ్రిటిష్ వారు అప్రసన్నంగా ఉన్నారు. అనుమతిని ఇవ్వడానికి కలక్టర్ అనుమతించట్లేదు. కానీ సర్దార్ గారు సర్దార్ గారే! వారు స్థిరంగా ఉండి, లోకమాన్య విగ్రహం నెలకొల్పడం కోసం తన పదవిని త్యజించడానికి సిధ్ధమైయ్యారు. చివరికి విగ్రహం తయారైంది. సర్దార్ గారు ఆ విగ్రహాన్ని ఎవరితోనో కాకుండా, 1929 ఫిబ్రవరి 28న మహాత్మా గాంధీ గారితో చేయించారు. అన్నింటికన్నా గొప్ప విషయమేమిటంటే, ఆ ఉద్ఘాటన సభలో తన ప్రసంగంలో పూజ్య బాపూ ఏమన్నారంటే, సర్దార్ పటేల్ వచ్చిన తరువాత అహ్మదాబాద్ నగరపాలిక కు ఒక వ్యక్తి దొరకడామే కాకుండా అతని ధర్యం కారణంగానే తిలక్ గారి విగ్రహ నిర్మాణం కూడా సాధ్యమైంది.
ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, అది తిలక్ గారు ఒక కుర్చీలో కూర్చుని ఉన్న అరుదైన విగ్రహమే కాకుండా, క్రింద “స్వరాజ్యం నా జన్మ హక్కు” అని రాసి ఉంటుంది. ఇదంతా ఆంగ్లేయుల సమయంలోని విషయాన్నే మీకు చెప్తున్నాను. లోకమాన్య తిలక్ గారి ప్రయత్నాల కారణంగానే సామూహిక గణేశ ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. ఈ సామూహిక గణేశ ఉత్సవాలు సంప్రదాయక శ్రధ్ధ, ఉత్సవంతో పాటుగా , సమాజిక మేలుకొలుపు, సామూహికత, ప్రజల్లో సామరస్యత, సమానత భావాలను ముందుకు నడిపించడానికి ఒక ప్రభావవంతమైన మాధ్యమంగా మారాయి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఏకమవ్వాల్సిన సమయంలో ఈ ఉత్సవాలు జాతి, సంప్రదాయాల బంధనాలను తెంచుకుని అందరినీ ఏకం చేసే పని చేసింది. కాలంతో పాటూ ఇటువంటి వ్యవస్థల ప్రాముఖ్యత కూడా పెరిగింది. మన పురాతన వారసత్వం, చరిత్రలలో నిలిచిన వీర నాయకుల పట్ల ఇవాళ్టికి కూడా మన యువతరంలో ఎంతో ఇష్టం ఉందని ఇటువంటి వ్యవస్థల వల్లే తెలుస్తుంది. నేటికీ ఎన్నో పట్టణాల్లో దాదాపు ప్రతి వీధిలోనూ గణేశ విగ్రహాలను పెట్టి పూజలు చేయడం మనం చూశ్తూంటాం. ఒక జట్టుగా కలిసిమెలసి ఆ వీధిలో నివసించేవారంతా కలిసి పూజలను నిర్వహిస్తారు. ఇది మన యువత కు కూదా ఎంతో మెరుగైన అవకాశం. అక్కడే వారు నాయకత్వం, నిర్వాహణ మొదలైన గుణాలను నేర్చుకోవడం వీలవుతుంది.దానివల్ల వారి వ్యక్తిత్వం వికసిస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, నేను క్రితం ఏడాది కూడా మిమ్మల్ని అభ్యర్థించాను..ఈసారి కూడా మనం గణేశ ఉత్సవాలు జరుపుకుందాం. వైభవంగా జరుపుకుందాం. ఉల్లాస, ఉత్సాహాలతో జరుపుకుందాం. కానీ పర్యావరణానుకూల(ఇకో-ఫ్రెండ్లీ) గణేశుడికి మాత్రమే ఉత్సవం చెయ్యాలని పట్టుబట్టండి. ఈసారి కూడా లోకమాన్య తిలక్ గారిని గుర్తుచేసుకుంటున్నాం కాబట్టి మరోసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. వినాయకుడి విగ్రహం దగ్గర నుండీ అలంకరణ సామగ్రీ వరకూ అన్నీ పర్యావరణానుకూలంగా ఉండేలా చూడండి. ప్రతి నగరంలోనూ కూడా పర్యావరణానుకూల గణేశ ఉత్సవాల పోటీ జరగాలి. ఆ పోటీలకు బహుమతులు కూడా ఇవ్వాలి. మై గౌ యాప్ లోనూ, నరేంద్ర మోదీ యాప్ లోనూ కూడా పర్యావరణానుకూల గణేశ ఉత్సవాల తాలూకూ వస్తువులకు విస్తృతమైన ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తాను. లోకమాన్య తిలక్ దేశవాసులందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. “స్వరాజ్యం నా జన్మహక్కు. మేము దానిని సాధించి తీరతాం” అనే నినాదాన్ని ఇచ్చారు. ఇవాళ “స్వరాజ్యం నా జన్మహక్కు. మేము దానిని సాధించి తీరతాం” అనే ఈ నినాదాన్ని చెప్పాల్సిన సమయం. మంచి పాలన, అభివృధ్ధి ఫలాలు ప్రతి భారతీయుడికీ అందాలి. ఇటువంటి విషయాలే నవ భారతాన్ని నిర్మిస్తాయి. తిలక్ జన్మించిన ఏభై ఏళ్ల తరువాత సరిగ్గా అదే రోజున అంటే జులై ఇరవై మూడవ తేదీన మరో భరతమాత బిడ్డ జన్మించాడు. దేశవాసులందరూ స్వాతంత్రంగా ఊపిరి పీల్చుకోవాలనే సంకల్పంతో ఆయన కూడా తన జీవితాన్ని బలిదానం చేశారు. నేను చంద్ర శేఖర్ ఆజాద్ గురించి మాట్లాడుతున్నాను. ఈ క్రింది వాక్యాలను చదివి ప్రేరణ పొందని భారతీయుడు ఉండడు..
“సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై
దేఖ్నా హై జోర్ కిత్నా బాజు ఏ కాతిల్ మే హై”
అంటే
“బలవ్వాలనే కోరిక ఇప్పుడు మా మనసుల్లో ఉంది
ఇప్పుడిక హంతకుడి బలాన్ని పరీక్షించాలి”
ఈ వాక్యాలు అష్ఫాక్ ఉల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక యువకులకు ప్రేరణను అందించాయి. చంద్రశేఖర్ ఆజాద్ ధైర్యం, స్వాతంత్రం కోసం ఆయన పడ్డ తీవ్రమైన తపన ఎందరో యువకులను ప్రేరితులను చేసింది. ఆజాద్ తన జీవితాన్ని పణంగా పెట్టారు. విదేశీ పాలన ముందర ఎన్నడూ తలవంచలేదు. మధ్య ప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం అలీరాజ్ పూర్ వెళ్ళే అదృష్టం నాకు లభించింది. అలహాబాద్ లోని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ లో కూడా శ్రధ్ధాంజలి అర్పించే అవకాశం లభించింది. విదేశీయుల తుపాకీ గుళ్ళ వల్ల కూడా తాను చనిపోకూడదని కోరుకున్న వీర పురుషుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. స్వాతంత్రం కోసం పోరాడుతూ బ్రతికుతాం, లేకపోతే స్వాతంత్రంగా చనిపోతాం అనేవారాయన. ఇదే ఆయన ప్రత్యేకత. మరొక్కసారి భరతమాత బిడ్డలైన ఈ ఇద్దరు మహాపురుషులు – లోకమాన్యతిలక్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గార్లకు నేను శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.
కొద్ది రోజుల క్రితమే ఫిన్ ల్యాండ్ లో జూనియర్ అండర్-20 ప్రపంచ ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 400మీట్లర్ల పరుగుపందెంలో భారతదేశానికి చెందిన ధైర్యవంతురాలైన రైతుబిడ్డ హిమా దాస్ బంగారు పతకాన్ని సాధించి చరిత్రను సృష్టించింది. దేశానికి చెందిన మరొక ఆడపడుచు ఏక్తా భయాన్ ఇండోనేషియా నుండి నా ఈ-మెయిల్ కి జవాబు రాసింది. అక్కడ ఆమె ఏషియన్ గేమ్స్ కి సిధ్ధమౌతోంది. ఈ-మెయిల్ లో ఏక్తా భయాన్ ఏం రాసిందంటే – ” మువ్వన్నెల జండాను పట్టుకోవడం అనేది ప్రతి అథ్లెట్ జీవితంలోనూ అన్నింటికన్నా అపురూపమైన క్షణం. ఆ అవకాశం లభించినందుకు నాకు గర్వంగా ఉంది”. ఏక్తా మేము ఆందరమూ కూడా నిన్ను చూసి గర్వపడుతున్నాము. మీరు భారతదేశానికి వన్నె తెచ్చారు. తునిషియా లో ప్రపంచ పారా ఎథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2018లో ఏక్తా బంగారు పతకాన్నీ, కాంస్య పతకాన్నీ గెలుచుకుంది. ఆమె విజయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఆమె తన ఇబ్బందినే తన విజయానికి మాధ్యమంగా మార్చుకుంది. ఏక్తా భయాన్ కు 2003లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శరీరంలో సగ భాగం, క్రింది భాగం నిర్వీర్యం అయిపోయింది. కానీ ఈ అమ్మాయి ఓటమిని అంగీకరించలేదు. తనని తాను సమర్థురాలిగా తయారు చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకుంది. మరొక దివ్యాంగుడు యోగేష్ కఠునియా గారు బెర్లిన్ లో పారా ఎథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ లో డిస్క్ థ్రో లో బంగారు పతకాన్ని గెలుచుకుని ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఆయనతో పాటూ సుందర్ సింగ్ గుర్జర్ కూడా జావలిన్ లో బంగారు పతకాన్ని గెలుపొందారు. ఏక్తా భయాన్ గారు, యోగేష్ కఠురియా గారు, సుందర్ సింగ్ గారూ, వీరందరి ధైర్యానికీ, స్ఫూర్తికీ వందనం చేస్తున్నాను. ఆభినందింస్తున్నాను. వీరంతా ఇంకా ముందుకు వెళ్లాలి. ఆడుతూ ఉండాలి. వికసిస్తూ ఉండాలి.
నాప్రియమైన దేశప్రజలారా, ఆగష్టు నెల చారిత్రికంగా అనేక సంఘటనలు, ఉత్సవాలతో నిండి ఉంటుంది. కానీ వాతావరణం కారణంగా అప్పుడప్పుడు అనారోగ్యం ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీ అందరూ చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, దేశ భక్తిని ప్రేరేపించే ఆగస్టు నెలకూ, శతాబ్దాలుగా వస్తున్న అనేకానేక ఉత్సవాలకు గానూ మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరోసారి మన్ కీ బాత్ లో తప్పకుండా కలుద్దాం.
అనేకానేక ధన్యవాదాలు.
Importance of caring for the Environment.#MannKiBaat pic.twitter.com/Dnxqq4T95Q
— PMO India (@PMOIndia) July 29, 2018
The stories of human resilience from Thailand.#MannKiBaat pic.twitter.com/JbrN6X8dw7
— PMO India (@PMOIndia) July 29, 2018
The month of July often heralds new beginnings for our youth.#MannKiBaat pic.twitter.com/rIfDSA4Y6k
— PMO India (@PMOIndia) July 29, 2018
An inspiring story from Madhya Pradesh.#MannKiBaat pic.twitter.com/eeIDgbI5NL
— PMO India (@PMOIndia) July 29, 2018
Saluting young achievers who overcame challenges to succeed.#MannKiBaat pic.twitter.com/Dlejd0Qs6u
— PMO India (@PMOIndia) July 29, 2018
Youth are contributing towards creating a New India!#MannKiBaat pic.twitter.com/xizRsP5Edg
— PMO India (@PMOIndia) July 29, 2018
The teachings of our saints continue to inspire us in the fight against social evils.#MannKiBaat pic.twitter.com/DTzGFG7Lf5
— PMO India (@PMOIndia) July 29, 2018
Paying tributes to a brave son of India, Lokmanya Tilak.#MannKiBaat pic.twitter.com/vMpuPdagNc
— PMO India (@PMOIndia) July 29, 2018
Ganesh Utsav celebrations are an outcome of Lokmanya Tilak's efforts.#MannKiBaat pic.twitter.com/IHK70q68LG
— PMO India (@PMOIndia) July 29, 2018
Chandrashekhar Azad's passion for the country and his bravery inspire us.#MannKiBaat pic.twitter.com/DTqDa1Sumy
— PMO India (@PMOIndia) July 29, 2018