ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
స్వయం సహాయ సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతోపాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25,000కు పెంచుతామని, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన స్వయం సహాయ సంఘం సభ్యురాలు కొమ్మలపాటి రమనమ్మతో ప్రధాని ముచ్చటించారు. వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ వినియోగంపై తన శిక్షణ అనుభవాన్ని ఆమె శ్రీ మోదీతో పంచుకున్నారు. డ్రోన్ పైలట్ శిక్షణను తాను 12 రోజుల్లో పూర్తి చేసుకున్నట్టు రమణమ్మ ఆయనకు వివరించారు.
వ్యవసాయ పనుల్లో డ్రోన్ల వినియోగం వల్ల గ్రామాలలో ప్రభావంపై ఈ సందర్భంగా ప్రధానమంత్రి వాకబు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ- నీటికి సంబంధించిన సమస్యల పరిష్కారంతోపాటు ఎంతో సమయం ఆదా అవుతున్నదని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో మహిళా శక్తిపై సందేహాలు వ్యక్తం చేసేవారికి వెంకట రమణమ్మ సామర్థ్యమే సమాధానమని నొక్కిచెప్పారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భవిష్యత్తులో మహిళా సాధికారతకు సంకేతంగా నిలుస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళల భాగస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.