ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 13వ తేదీ న బ్రెసీలియా లో 11వ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ సందర్భం గా రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో సమావేశమయ్యారు. ఇరువురు నేత లు ఈ సంవత్సరం లో భేటీ కావడం ఇది నాలుగో సారి.
సమావేశం పురోగమించిన క్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి వ్లాదివోస్తోక్ ను సందర్శించిన నాటి నుండి ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్న పురోగతి ని ఉభయ నాయకులు సమీక్షించారు. మన పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి రష్యా సందర్శన లు సఫలం అయ్యాయంటూ ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావించారు.
ద్వైపాక్షిక వ్యాపారాన్ని 2025వ సంవత్సరం కల్లా 25 బిలియన్ యుఎస్ డాలర్ కు చేర్చాలన్న లక్ష్యం ఇప్పటికే నెరవేరడాన్ని నాయకులు ఇరువురూ గమనించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. ప్రాంతీయ స్థాయి లో వ్యాపారం పరం గా ఉన్న అవరోధాల ను తొలగించటానికి భారతదేశ రాష్ట్రాలు మరియు రష్యా ప్రావిన్సు ల స్థాయి లో ఒకటో ద్వైపాక్షిక ప్రాంతీయ వేదిక ను వచ్చే సంవత్సరం లో నిర్వహించాలని ఇరువురు నేత లూ నిర్ణయించారు.
ఉభయ నేత లు చమురు దిగుమతుల లో మరియు సహజ వాయువు దిగుమతుల లో నిలుకడతనం తో పాటు పురోగతి నమోదు కావటాన్ని గమనించారు. సహజ వాయువు రంగం లో ఆర్క్‌టిక్ ప్రాంతం లో గల అవకాశాల ను అధ్యక్షుడు శ్రీ పుతిన్ వివరించి, మరి ఆ ప్రాంతం లో పెట్టుబడి పెట్టవలసింది అంటూ
భారతదేశాన్ని ఆహ్వానించారు.
మౌలిక సదుపాయాల రంగం లో చోటు చేసుకొన్న పురోగతి ని, మరీ ముఖ్యం గా నాగ్ పుర్- సికిందరాబాద్ సెక్టర్ రైలు మార్గం లో వేగాన్ని పెంచడాని కి సంబంధించి చోటు చేసుకొన్న పురోగతి ని సైతం ఉభయ నేతలు సమీక్షించారు. పరమాణు శక్తి ని పౌర ప్రయోజనాల కు వినియోగించుకొనే రంగం లో, రక్షణ రంగం లో సహకరించుకొంటున్న తీరు పట్ల కూడా నేత లు తమ సంతృప్తి ని వ్యక్తం చేశారు. తృతీయ దేశాల లో పరమాణు శక్తి ని శాంతియుత ప్రయోజనాల కు వినియోగించుకోవడం లో సహకారం కొనసాగడాని కి ఉన్న అవకాశాల ను వారు స్వాగతించారు.
అంతర్జాతీయ అంశాల పట్ల రెండు పక్షాల ఉమ్మడి వైఖరి ని కూడాను నేత లు పరిగణన లోకి తీసుకొని, ఇక ముందు కాలం లోనూ సన్నిహిత సహకారాన్ని కొనసాగించటాని కి అంగీకరించారు.
వచ్చే సంవత్సరం లో విజయ దినం ఉత్సవాల లో పాలు పంచుకోవటాని కి మాస్కో కు రండి అంటూ ప్రధాన మంత్రి ని ఆహ్వానించిన సంగతి ని అధ్యక్షుడు శ్రీ పుతిన్ పునరుద్ఘాటించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి సహర్షం గా ఆమోదించారు.