. గవర్నమెంట్ ఆఫ్ ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, రష్యన్ ఫెడరేశన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ల ప్రభుత్వాధినేతలం అయిన మేం అర్జెంటీనా లోని
బ్యూనస్ ఆయర్స్ లో జి20 శిఖర సమ్మేళనం సందర్భం గా 2018 నవంబరు 30వ
తేదీ న బ్రిక్స్ కూటమి నేత ల వార్షిక అనధికార సమావేశం లో పాల్గొన్నాం. ఈ
నేపథ్యం లో 2018కి గాను జి20 కూటమి అధ్యక్ష బాధ్యత లను సమర్థంగా
నిర్వర్తిస్తున్న అర్జెంటీనా కు అభినందనలు మరియు మద్దతు తో పాటు సమ్మేళనానికి సాదర
ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలను కూడా వ్యక్తం చేశాం.
2. బ్రిక్స్ కూటమి అధినేత వార్షిక సమావేశం లో భాగం గా ప్రపంచ రాజకీయ, భద్రత,
అంతర్జాతీయ ఆర్థిక- ద్రవ్య సంబంధిత అంశాల పై మా అభిప్రాయాలను పరస్పరం
వెల్లడి చేసుకున్నాం. అలాగే సుస్థిర అభివృద్ధి కి ఎదురవుతున్న సవాళ్ల ను గురించి కూడా
చర్చించాం. శాంతి, సుస్థిరత లు నిండిన ప్రపంచం దిశ గా ఐక్యరాజ్య సమితి
పోషించవలసిన కేంద్రక పాత్ర, సమితి ఆశయ పత్రం లో పొందుపరచిన ఉద్దేశాలు-
సూత్రాలు, అంతర్జాతీయ న్యాయానికి కట్టుబాటు, చటబద్ధ పాలన- ప్రజాస్వామ్యాలకు
ప్రోత్సాహం తదితరాలకు మేం పునరంకితమవుతున్నాం. బహుళపాక్షికత ను బలోపేతం
చేయడం సహా సముచిత, న్యాయమైన, సమాన, ప్రజాస్వామ్యబద్ధ, ప్రాతినిధ్య
అంతర్జాతీయ క్రమం కోసం సమష్టి గా కృషి చేస్తామని పునరుద్ఘాటిస్తున్నాం.
3. బ్రిక్స్ కూటమి సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర దాడులు కొనసాగుతుండటాన్ని తీవ్రంగా
నిరసిస్తున్నాం. ఎక్కడ, ఎవరు ఉగ్ర దాడులకు పాల్పడినా అన్ని రకాల స్వరూప-
స్వభావాలు గల అలాంటి ఉగ్రవాద దుశ్చర్య లను ఖండిస్తున్నాం. ఐక్య రాజ్య సమితి
నేతృత్వం లో పటిష్ఠ అంతర్జాతీయ చట్టాలు ప్రాతిపదిక గా ఉగ్రవాదాన్ని ఉమ్మడి గా
ఎదుర్కొనేందుకు కృషి అవసరమని మేం స్పష్టం చేస్తున్నాం. ఈ దిశ గా
జోహాన్స్ బర్గ్ సదస్సు తీర్మానం మేరకు ఇప్పటికే గుర్తించిన అన్ని అంశాల్లో సహా
ఉగ్రవాదాన్ని పారదోలడంపై అన్ని దేశాలూ సమగ్ర విధానాన్ని అనుసరించాలని
పిలుపునిస్తున్నాం.
4. పారదర్శక, వివక్ష రహిత, సార్వత్రిక, సార్వజనిక అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసా
ఇచ్చే దిశ గా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిర్దేశిస్తున్న నిబంధనల ఆధారిత బహుళపాక్షిక
వాణిజ్య వ్యవస్థకు మా సంపూర్ణ మద్దతు ను పునరుద్ఘాటిస్తున్నాం. అలాగే ప్రపంచ
వాణిజ్య సంస్థ పనితీరు మెరుగుదల దృష్ట్యా అందులోని ఇతర సభ్యత్వ దేశాలతో దాపరికం లేని
సఫల చర్చ లకు మా సమష్టి సంసిద్ధత ను తెలియజేస్తున్నాం.
5. ప్రపంచ వాణిజ్య సంస్థ స్ఫూర్తి, నిబంధనలు ఏకపక్ష- రక్షణవాద చర్యల
విషయంలో పరస్పర విరుద్ధంగా ప్రతిస్పందించేలా ఉన్నాయి. ఇటువంటి
అసంగతమైన చర్య లను వ్యతిరేకించాలని సభ్యత్వ దేశాలన్నింటికీ పిలుపునిస్తున్నాం.
అంతేకాకుండా సంస్థ లో భాగస్వాములుగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ
నియంత్రణాత్మకమైన, విచక్షణపూరితమైన స్వభావం గల చర్యలను
ఉపసంహరించాలని కోరుతున్నాం.
6. ప్రస్తుత సవాళ్ల, భావి సవాళ్ల పరిష్కారం దృష్టి తో ప్రపంచ వాణిజ్య సంస్థ ఔచిత్యం,
సామర్థ్యం పెంపుదల దిశ గా సంస్థ అభివృద్ధి కి మేం కృషి చేస్తాం. ఇందులో భాగం గా
సంస్థ కీలక విలువలు, ప్రాథమిక సూత్రాలతో పాటు సంస్థ లోని సభ్యత్వ దేశాల
ప్రయోజనాలను పరిరక్షించుకోవలసివుంది. ముఖ్యం గా వర్ధమాన దేశాల
ప్రయోజనాలు ఇందులో ప్రతిబింబించాలి.
7. ప్రపంచ వాణిజ్య సంస్థ సరైన దిశ లో పనిచేయాలంటే అందులో ఒక వివాద
పరిష్కార యంత్రాంగం ఉండటం తప్పనిసరి. తద్వారా సంస్థ లో భవిష్యత్తు
చర్చలకు సంబంధించి సభ్యత్వ దేశాల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది. కాబట్టి
పునర్విచారణ ప్రాధికార యంత్రాంగం ఎంపిక ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలని
మేం కోరుతున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థ వివాద పరిష్కార వ్యవస్థ సమర్థం గా,
నిలకడ గా పనిచేసేందుకు ఇది అవశ్యం.
8. ప్రపంచ వాణిజ్య సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు సాగడం
కోసం సమష్టిగా, సంయుక్తం గా కృషి చేయడానికి మా వంతు గా సమాచారం యొక్క
ఆదాన ప్రదానాలకు, సహకార విస్తరణ కు మా వచనబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం.
తద్వారా అంతర్జాతీయ వాణిజ్యం లో అన్ని దేశాల భాగస్వామ్యాన్ని, సార్వజనీన
వృద్ధి ని ప్రోత్సహిస్తూ ప్రపంచ ఆర్థిక పాలన లో ఆ సంస్థ అర్థవంతమైన పాత్రను
పోషించగలుగుతుంది.
9. సముచితమైన, సుస్థిరమైన అభివృద్ధి కోసం ఏకాభిప్రాయ సాధన అవసరమన్న జి20
అధ్యక్ష స్థానం లోని అర్జెంటీనా ఇతివృత్తం హర్షణీయం. ఆ మేరకు భవిష్యత్ కృషి కోసం,
ప్రగతి కోసం మౌలిక వసతుల అభివృద్ధి, అందరికీ ఆహార భద్రత, సుస్థిర
భవిష్యత్తు లపై దృష్టి సారించే మార్గం ఇదేనని విశ్వసిస్తున్నాం.
10. ప్రగతి కోసం మౌలిక వసతుల అభివృద్ధికిగల ప్రాధాన్యాన్ని మేం గుర్తించాం.
తదనుగుణం గా అంతర్జాతీయం గా మౌలిక వసతుల వ్యత్యాసాల తొలగింపు దిశ గా
మా వంతు తోడ్పాటు ను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా విపత్తు లను
ఎదుర్కోగల మౌలిక వసతుల కల్పన కోసం నవ్యాభివృద్ధి బ్యాంకు
(NDB) ద్వారానే గాక జాతీయ, సామూహిక చొరవ తో వనరుల సమీకరణకు
కృషి చేస్తాం.
11. తగినన్ని వనరులు ఉన్న, కోటా ఆధారితమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కీలక పాత్ర ను
పోషించగల బలమైన ప్రపంచ ఆర్థిక భద్రత వ్యవస్థ (జిఎఫ్ఎస్ఎన్) అవసరమని మేం నొక్కి
పలుకుతున్నాం. ఈ దిశ గా కొత్త కోటా విధానం సహా ప్రస్తుత కోటా లపై ఐఎంఎఫ్ 15వ
సార్వత్రిక సమీక్ష ను త్వరగా పూర్తిచేసేందుకు మేం మా నిబద్ధత ను మరోసారి
ప్రకటిస్తున్నాం. గతిశీల, వర్ధమాన దేశాల గళానికి ప్రాతినిధ్యం, ప్రాముఖ్యం
పెరిగేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో వాటి సాపేక్ష భాగస్వామ్యాని కి ఇది భరోసా
ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాం. అదే సమయం లో స్వల్ప అభివృద్ధి దేశాల మాట కు తగు
విలువను ఇస్తూ 2019 వసంతకాల సమావేశాలు లేదా 2019 వార్షిక సమావేశాల కన్నా
వీలైనంత ముందు గా ఈ సమీక్ష పూర్తి కావాలని కోరుతున్నాం.
12. సుస్థిర ప్రగతి, సుస్థిర ప్రగతి లక్ష్యాల కు సంబంధించిన 2030 ప్రణాళిక అమలు కు మా
వచన బద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచం లో 2030 నాటికి పేదరిక నిర్మూలన
లక్ష్యం సాధించేందుకు ఆర్థిక, సామాజిక, పర్యావరణాలనే ముక్కోణపు
అంశాల పరంగా సమతూకంతో, సమగ్రతతో కూడిన సమాన, సార్వజనీన, సార్వత్రిక,
సర్వతోముఖ, ఆవిష్కరణచోదిత సుస్థిర ప్రగతి కి ఈ ప్రణాళిక దోహదం చేస్తుంది.
అలాగే అడిస్ అబాబా కార్యాచరణ ప్రణాళిక కు అనుగుణం గా వర్ధమాన దేశాలకు
అధికారిక అభివృద్ధి సాయం (ఒడిఎ) కింద ప్రకటించినవే కాకుండా అదనపు
వనరులను సమకూర్చడం లో తమ వాగ్దానాన్ని గౌరవించడంతో పాటు సంపూర్ణం గా
నెరవేర్చాలని అభివృద్ధి చెందిన దేశాల ను మేం కోరుతున్నాం.
13. అంతర్జాతీయం గా ఆర్థిక విస్తరణ కొనసాగుతున్నప్పటికీ, అది కొంత అసమతూకం తో
కూడి ఉండడమే గాక అధోముఖ ముప్పు పెరుగుతోంది. ప్రధాన ప్రగతిశీల దేశాల
ఆర్థిక వ్యవస్థ లలో విధాన సాధారణీకరణ వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావాలు వర్ధమాన
విపణి ఆర్థిక వ్యవస్థ లలో ఇటీవలి ఒడుదొడుకులకు మూల కారణం కావడం పై మేం
ఆందోళన చెందుతున్నాం. దీనివల్ల విస్తరణ కు అవకాశం ఉన్న ముప్పు లను
తొలగించే దిశ గా అన్ని దేశాలూ భాగస్వామ్య స్ఫూర్తి తో జి20 సహా ఇతర వేదికల పైనా
తమ ఆర్థిక వ్యవస్థ లపై చర్చలను, సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని మేం
అభిలషిస్తున్నాం.
14. జల వాయు పరివర్తన పై ఐక్య రాజ్య సమితి చట్రం తీర్మాన సూత్రాలకు, విభిన్న
బాధ్యతలతో పాటు సామర్థ్యాల కు అనుగుణం గా కుదిరిన పారిస్ ఒప్పందం
సంపూర్ణ అమలు కు మా నిబద్ధతను గురించి పునరుద్ఘాటిస్తున్నాం. ఆ మేరకు
విపత్తుల నుండి ఉపశమన సామర్థ్యం పెంపు సహా ఒప్పందం అమలు కోసం
వర్ధమాన దేశాల కు సామర్థ్య నిర్మాణంలోనే కాక సాంకేతికం గా, ఆర్థికం గా
అన్నివిధాలుగాను తోడ్పాటును ఇవ్వాలని అభివృద్ధి చెందిన దేశాల ను కోరుతున్నాం. పారిస్
ఒప్పందం అమలు, కార్యాచరణ ప్రారంభానికి వీలు కల్పించే సిఒపి-24 సదస్సు
సందర్భం గా ఒప్పందం అమలు కార్యక్రమం లో భాగంగా సమతూకపు ఫలితాలను
సాధించే దిశగా అన్ని దేశాలూ అంగీకారానికి రావాలని కూడా మేం
పిలుపునిస్తున్నాం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క విజయవంతమైన మరియు
ప్రతిష్టాత్మకమైన మొదటి భర్తీ ప్రక్రియ ను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత ను
మరియు ఆవశ్యకత ను మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మకమైన,
విజయవంతమైన హరిత వాతావరణ నిధి (జిసిఎఫ్) తొలి భర్తీ ప్రక్రియ ను
వీలైనంత త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి పలుకుతున్నాం.
15. జోహాన్స్ బర్గ్ లో 2018 జూలై 25-27 తేదీల్లో బ్రిక్స్ 10వ శిఖరాగ్ర
సదస్సు ను విజయవంతంగా నిర్వహించినందుకు దక్షిణాఫ్రికా ను మరో మారు
అభినందిస్తున్నాం. అదే సమయంలో మా దేశాల ప్రజల కు లబ్ధి కలిగే విధంగా
మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి పునరంకితం
అవుతున్నాం. దక్షిణాఫ్రికా నాయకత్వం లో ఆర్థిక, శాంతి, భద్రత, ప్రజా
సంబంధాల ఆదాన ప్రదాన రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం సాధించిన
విజయాలపై సంతృప్తి ప్రకటిస్తున్నాం. నవ్య పారిశ్రామిక విప్లవ భాగస్వామ్యం
(PartNIR) ఏర్పాటు, బ్రిక్స్ టీకా పరిశోధన-అభివృద్ధి కేంద్రం, బ్రిక్స్ ఇంధన
పరిశోధన-సహకార వేదిక, సావోపౌలో నగరం లో నవ్యాభివృద్ధి బ్యాంకు
(ఎన్ డిబి) అమెరికా ప్రాంతీయ శాఖ ఏర్పాటు వంటివి ఈ విజయాలలో భాగం గా
ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోహాన్స్ బర్గ్ సహా అంతకు ముందు ఇతర దేశాలలో
నిర్వహించిన బ్రిక్స్ కూటమి శిఖర సమ్మేళనాల నిర్ణయాలను పూర్తి స్థాయి లో
అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం.
16. బ్రిక్స్ కూటమి కొత్త చైర్మన్ హోదా లో 2019లో బ్రెజిల్ నిర్వహించబోయే 11వ బ్రిక్స్
సమావేశం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు విజయవంతం కావడంలో మా వంతు గా సంపూర్ణ మద్దతును అందిస్తాం.