ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. COVID-19 కు వ్యతిరేకంగా దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో మనం చూస్తున్నాం. గత వంద సంవత్సరాలలో ఇది అతి పెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి కాలంలోనే భారతదేశం అనేక ప్రకృతి వైపరీత్యాలతో పోరాడింది. ఈ సమయంలో అంఫాన్ తుపాను వచ్చింది. నిసర్గ్ తుపాను వచ్చింది. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. అనేక చిన్న, పెద్ద భూకంపాలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. గత 10 రోజుల్లో దేశం మళ్లీ రెండు పెద్ద తుఫానులను ఎదుర్కొంది. పశ్చిమ తీరంలో 'తౌ -తె' తుఫాను, తూర్పు తీరంలో 'యాస్' తుఫాను. ఈ రెండు తుఫానులు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. దేశం, దేశ ప్రజలు వాటితో తీవ్రంగా పోరాడారు. కనీసం ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే, ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారని మన అనుభవంలోకి వచ్చింది. ఈ కష్టమైన, అసాధారణమైన పరిస్థితుల్లో తుఫాను ప్రభావిత రాష్ట్రాల ప్రజలు విపత్తును ఎదుర్కోవడంలో ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ సంక్షోభం సమయంలో పునరావాసం, రక్షణ పనులలో అధికార యంత్రాంగం తో కలిసి ప్రజలు చాలా ఓపికతో, క్రమశిక్షణతో పనిచేశారు. ఆ ప్రజాలందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి కృషికి ఈ ప్రశంసలు, అభినందనలు చాలా చిన్నవి. వారందరికీ నమస్కరిస్తున్నాను. ఈ విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన యంత్రాంగం కలిసి పనిచేస్తున్నాయి. ఈ విపత్తుల్లో సన్నిహితులను కోల్పోయిన వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారితో మనమందరం గట్టిగా కలిసి నిలబడతాం.

 

నా ప్రియమైన దేశవాసులారా! ఎంత పెద్ద సవాలు అయినా గెలవాలనే భారతదేశ సంకల్పం ఎప్పుడూ గొప్పది. దేశ సామూహిక శక్తి, మన సేవాభావం ప్రతి తుఫాను నుండి దేశాన్ని కాపాడింది. ఇటీవలి కాలంలో మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ యోధులు తమ గురించి ఆలోచించకుండా పగలు, రాత్రి పనిచేశారు. ఈ రోజు కూడా అలాగే పని చేస్తున్నారు. రెండవ దశలో కరోనాతో పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారు. 'మన్ కి బాత్' శ్రోతలు చాలా మంది ఈ యోధులను గురించి చర్చించమని నమోయాప్‌ ద్వారా, లేఖల ద్వారా నన్ను కోరారు.

మిత్రులారా! సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆక్సిజన్ డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. ఇది చాలా పెద్ద సవాలు. దేశంలోని సుదూర ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చాలా పెద్ద సవాలు. ఆక్సిజన్ ట్యాంకర్ వేగంగా వెళ్ళవలసి వస్తుంది. ఒక చిన్న పొరపాటు చేసినా, చాలా పెద్ద పేలుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దేశంలోని తూర్పు భాగాలలో పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అనేక ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణా చేయడానికి చాలా రోజులు పడుతుంది. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలులో దేశానికి సహాయపడింది- క్రయోజెనిక్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్లు. ఇలాంటి వారు చాలా మంది పనిచేసి వేలాది, లక్షలాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఈ రోజు మన్ కి బాత్‌లో, అలాంటి ఒక మిత్రుడు మనతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని జౌన్‌పూర్‌కు చెందిన దినేష్ ఉపాధ్యాయ గారు.

మోదీ గారు: దినేష్ గారూ.. నమస్కారం!

దినేష్ ఉపాధ్యాయ గారు: సార్.. నమస్కారం..

మోదీ గారు: మొదట మీ గురించి మాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను.

దినేష్ ఉపాధ్యాయ గారు: సార్.. నా పేరు దినేష్ బాబూల్ నాథ్ ఉపాధ్యాయ. నేను జాన్ పూర్ జిల్లాలోని జామువా పోస్టాఫీస్ పరిధిలో ఉన్నహసన్పూర్ గ్రామంలో ఉంటాను సార్.

మోదీ గారు: మీది ఉత్తర ప్రదేశా?

దినేష్ ఉపాధ్యాయ గారు: అవును! అవును! సార్.

మోదీ గారు: ఓహ్

దినేష్: సార్. మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్. నా భార్యతో పాటు మా తల్లిదండ్రులు ఉన్నారు సార్

మోదీ గారు: మీరు ఏం చేస్తారు?

దినేష్: సార్, నేను ఆక్సిజన్ ట్యాంకర్ నడుపుతున్నాను సార్ .. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్.

మోదీ గారు: - పిల్లల చదువు సరిగా జరుగుతుందా?

దినేష్ - అవును సార్! పిల్లలు చదువుతున్నారు. ఆడపిల్లలు ఇద్దరూ చదువుతున్నారు. నా అబ్బాయి కూడా చదువుతున్నాడు సార్.

మోదీ గారు: ఈ ఆన్‌లైన్ చదువులు కూడా సరిగ్గా నడుస్తున్నాయా?

దినేష్ - అవును సార్. ప్రస్తుతం మా అమ్మాయిలు చదువుతున్నారు. ఆన్‌లైన్‌లోనే చదువుతున్నారు సార్. ఆక్సిజన్ ట్యాంకర్ ను 15 - 17 సంవత్సరాల నుండి నడుపుతున్నాను సార్.

మోదీ గారు: బాగుంది! ఈ 15-17 సంవత్సరాలు మీరు ఆక్సిజన్ ను తీసుకువెళ్తున్నారంటే మీరు ట్రక్ డ్రైవర్ మాత్రమే కాదు! మీరు ఒక విధంగా లక్షల మంది ప్రాణాలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నారు.

దినేష్: సార్. ఇది మా పని సార్.. మా కంపెనీ ఐనాక్స్ కంపెనీ సార్. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మేం ఎక్కడికైనా వెళ్లి ఆక్సిజన్‌ను అందిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్.

మోదీ గారు: అయితే ఇప్పుడు కరోనా కాలంలో మీ బాధ్యత చాలా పెరిగింది?

దినేష్: అవును సార్. మా బాధ్యత చాలా పెరిగింది.

మోదీ గారు: మీరు మీ ట్రక్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు మీ మనసులో ఉండే ఆలోచన ఏంటి? ఇంతకుముందు కంటే వేరుగా ఉండే అనుభవం ఏమిటి? చాలా ఒత్తిడి కూడా ఉంటుందా? మానసిక ఒత్తిడి ఉంటుందా? కుటుంబ ఆందోళనలు, కరోనా వాతావరణం, ప్రజల నుండి ఒత్తిడి, డిమాండ్... ఏదైనా ఉంటుందా?

దినేష్: సార్, మాకు ఏ ఆలోచన లేదు. మా కర్తవ్యం మేం చేస్తున్నామని మాత్రమే ఉంటుంది. మేం సమయానికి తీసుకువెళ్ళి, ఈ ఆక్సిజన్ తో ఎవరి ప్రాణమైనా నిలబడితే అది మాకు ఎంతో గర్వకారణం.

మోదీ గారు: మీరు మీ భావాలను చాలా మంచి రీతిలో వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఈ మహమ్మారి సమయంలో మీ పని ప్రాముఖ్యతను చూస్తున్నారు. ఇది ఇంతకు ముందు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారు. మీపై వారి వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా?

దినేష్: అవును సార్! ఇంతకుముందు ఎక్కడో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయేవాళ్ళం. కానీ ఈరోజుల్లో అధికార యంత్రాంగం మాకు చాలా సహాయపడుతోంది. త్వరగా వెళ్ళి ప్రజల ప్రాణాలను రక్షించాలన్న ఉత్సుకత మాకు ఏర్పడుతోంది. మాకు తినేందుకు ఏదైనా దొరికిందా లేదా అని కానీ ఎలాంటి సమస్యలున్నా ఆలోచించకుండా ట్యాంకర్ ను వెంటనే తీసుకువెళ్తాం. మేం ట్యాంకర్ తీసుకువెళ్ళినప్పుడు ఆసుపత్రికి చేరుకోగానే అక్కడ అడ్మిట్ అయి ఉన్న వారి కుటుంబసభ్యులు V అనే సైగ చేస్తారు.

మోదీ గారు: విజయం గుర్తుగా V అనే సైగ చేస్తారా?

దినేష్: అవును సార్! V అని సైగ చేస్తారు. ఒక్కోసారి బొటనవేలును చూపిస్తారు. మేము చాలా ఓదార్పునిస్తున్నాం. జీవితంలో ఖచ్చితంగా కొన్ని మంచి పనులను చేసినందుకే ఇలాంటి సేవ చేసే అవకాశం దొరికిందని సంతోషంగా ఉంటుంది సార్.

మోదీ గారు: అప్పుడు అలసట అంతా పోతుందా?

దినేష్: అవును సార్! అవును సార్!

మోదీ గారు: మీరు ఇంటికి వెళ్ళి పిల్లలతో ఈ విషయాలన్నీ మాట్లాడతారా?

దినేష్: లేదు సార్. పిల్లలు మా గ్రామంలో నివసిస్తున్నారు. మేము ఇక్కడ INOX ఎయిర్ ప్రొడక్ట్ వద్ద ఉన్నాము. నేను డ్రైవర్‌గా పని చేస్తాను. 8-9 నెలల తరువాత నేను ఇంటికి వెళ్తాను.

మోదీ గారు: మీరు ఎప్పుడైనా పిల్లలతో ఫోన్‌లో మాట్లాడుతారా?

దినేష్: అవును సార్! తప్పకుండా మాట్లాడతా.

మోదీ గారు: కాబట్టి ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని వారి మనసులో ఉంటుంది కదా

దినేష్: అవును సార్. మా పిల్లలు చెప్తారు “నాన్నా.. పని చేసేప్పుడు జాగ్రత్తగా ఉండ”మని. మేం చాలా భద్రతతో పని చేస్తాం సార్. మాంగావ్ ప్లాంట్ కూడా ఉంది. INOX మాకు చాలా సహాయపడుతుంది.

మోదీ గారు: దినేష్ గారూ.. మీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. మీ మాటలు విన్న తర్వాత ఈ కరోనా పోరాటంలో మీలాంటి వారు ఎలా పని చేస్తున్నారో కూడా దేశం అనుభూతి చెందుతుంది. మీరు 9–9 నెలలు మీ పిల్లలను కలవడం లేదు. కుటుంబాన్ని కలవకుండా ప్రజల ప్రాణాలను రక్షించడం మాత్రమే ముఖ్యమైన పనిగా భావిస్తున్నారు. దినేష్ ఉపాధ్యాయ వంటి లక్షలాది మంది మనస్ఫూర్తిగా పనిచేస్తున్నందు వల్ల మనం యుద్ధంలో విజయం సాధిస్తామని దేశం గర్విస్తుంది.

దినేష్: సార్! కరోనాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఓడిస్తాం సార్.

మోదీ గారు: దినేష్ గారూ.. మీ ఈ భావనే దేశానికి బలం. చాలా ధన్యవాదాలు దినేష్ గారూ. మీ పిల్లలకు నా ఆశీర్వాదాలు తెలియజేయండి.

దినేష్: సరే సార్. నమస్కారం.

మోదీ గారు: ధన్యవాదాలు

దినేష్: నమస్కారం సార్

మోదీ గారు: ధన్యవాదాలు.

మిత్రులారా! దినేష్ గారు చెబుతున్నట్లుగా, ఒక ట్యాంకర్ డ్రైవర్ ఆక్సిజన్‌తో ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, దేవుడు పంపిన దూతలాగా మాత్రమే కనిపిస్తారు. ఈ పనికి ఎంత బాధ్యత ఉందో, దానిలో ఎంత మానసిక ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

మిత్రులారా! ఈ సవాలు సమయంలో భారత రైల్వే కూడా ఆక్సిజన్ రవాణాను సులభతరం చేయడానికి ముందుకు వచ్చింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, ఆక్సిజన్ రైలు రోడ్లపై వెళ్ళే ఆక్సిజన్ ట్యాంకర్ కంటే చాలా వేగంగా ఎక్కువ పరిమాణంలో దేశంలోని ప్రతి మూలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళింది. ఒక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ను పూర్తిగా మహిళలే నడిపిస్తారన్న విషయం తెలిస్తే దేశంలోని ప్రతి మహిళ దీని గురించి గర్వపడుతుంది. అంతేకాదు.. ప్రతి భారతీయుడు గర్వపడతాడు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లోకో-పైలట్ శిరీషా గజని గారిని 'మన్ కీ బాత్' కు ఆహ్వానించాను.

మోదీ గారు: శిరీష గారూ.. నమస్తే!

శిరీష: నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్?

మోదీ గారు: నేను చాలా బాగున్నాను. శిరీష గారూ.. మీరు రైల్వే పైలట్‌గా పనిచేస్తున్నారని విన్నాను. మీ మొత్తం మహిళా బృందం ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోందని నాకు తెలిసింది. శిరీష గారూ.. మీరు గొప్ప పని చేస్తున్నారు. కరోనా కాలంలో మీలాగే చాలా మంది మహిళలు ముందుకు వచ్చి కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి దేశానికి శక్తి ఇచ్చారు. మీరు కూడా మహిళా శక్తికి గొప్ప ఉదాహరణ. కానీ దేశం తెలుసుకోవాలనుకుంటుంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.- ఈ ప్రేరణ మీకు ఎక్కడ నుండి వస్తుంది అని.

శిరీష: సార్.. నాకు ప్రేరణ మా అమ్మా నాన్న నుండి వచ్చింది సార్. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి సార్. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు సార్. మేం ముగ్గురమూ ఆడపిల్లలమే. అయినా మేము పని చేయడానికి మా నాన్న చాలా ప్రోత్సహిస్తున్నారు. మా పెద్ద అక్క బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. నేను రైల్వేలో స్థిరపడ్డాను. మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తారు.

మోదీ గారు: శిరీష గారూ.. సాధారణ రోజుల్లో కూడా మీరు మీ సేవలను రైల్వేలకు అందించారు. ఒక వైపు ఆక్సిజన్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, మీరు ఆక్సిజన్‌ను తీసుకువెళుతున్నప్పుడు అది కొంచెం ఎక్కువ బాధ్యతతో కూడింది కదా.. సాధారణ వస్తువులను తీసుకెళ్లడం వేరు, ఆక్సిజన్ చాలా సున్నితమైంది. కాబట్టి ఆక్సిజన్ ను తీసుకువెళ్లడం వేరు. ఈ విషయంలో మీ అనుభవం ఎలా ఉంది?

శిరీష: ఈ పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ఆక్సిజన్ స్పెషల్ ఇచ్చే సమయంలో భద్రత విషయంలో, ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూశారు. లీకేజీలు లేకుండా చూశారు. భారత రైల్వే కూడా చాలా సహకరిస్తోంది సార్. ఆక్సిజన్ రైలు నడపడానికి అవకాశం ఇచ్చింది. గంటన్నరలో 125 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు చేరుకుంది. రైల్వే శాఖ కూడా బాధ్యత తీసుకుంది. నేను కూడా బాధ్యత తీసుకున్నాను సార్.

మోదీ గారు: వావ్! ...మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముగ్గురు ఆడపిల్లలకు ప్రేరణనిచ్చిన మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు. ఈ విధంగా దేశానికి సేవ చేసిన, అభిరుచిని చూపించిన మీ సోదరీమణులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు శిరీష గారూ..

శిరీష: ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులు నాకు కావాలి సార్.

మోదీ గారు: దేవుని ఆశీర్వాదాలు ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు ఉండాలి. ధన్యవాదాలు !

శిరీష: ధన్యవాదాలు సార్.

మిత్రులారా! మనం ఇప్పుడే శిరీష గారి మాటలు విన్నాం. వారి అనుభవాలు కూడా స్ఫూర్తినిస్తాయి. అవి కూడా ప్రేరేపిస్తాయి. వాస్తవానికి, ఈ యుద్ధం ఎంత పెద్దదంటే రైల్వేల మాదిరిగా మన దేశం జల, భూ, ఆకాశ మార్గాల ద్వారా- మూడు మార్గాల ద్వారా- పనిచేస్తోంది. ఒక వైపు ఖాళీ అయిన ట్యాంకర్లను ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లకు రవాణా చేసే పనులు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి. అలాగే విదేశాల నుండి ఆక్సిజన్ ను, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, క్రయోజెనిక్ ట్యాంకర్లను కూడా దేశంలోకి తీసుకురావడం జరుగుతోంది. అందువల్ల ఈ పనుల్లో నౌకాదళం, వైమానిక దళం, సైనిక దళం, డిఆర్‌డిఓ లాంటి మన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. మన శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు , సాంకేతిక నిపుణులు కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరు చేసే పని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి దేశ ప్రజలందరి మనస్సుల్లో ఉంది. అందువల్ల మన వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు.

మోదీ గారు: పట్నాయక్ గారూ.. జై హింద్.

Grp. Cpt. – సార్. జై హింద్ సార్. నేను గ్రూప్ కెప్టెన్ ఎ.కె. పట్నాయక్ ని సార్. నేను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్ నుండి మాట్లాడుతున్నాను.

మోదీ గారు: పట్నాయక్ గారూ.. కరోనాతో యుద్ధ సమయంలో మీరు చాలా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్యాంకర్లను, రవాణా ట్యాంకర్లను ఇక్కడకు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా వెళుతున్నారు. మీరు సైనికుడిగా వేరే రకమైన పని చేశారు. చనిపోవడం కోసం, చంపడం కోసం సైనికులు పరుగెత్తడం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రాణాలను కాపాడటానికి పరుగెత్తుతున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది?

Grp. Cpt.- సార్.. ఈ సంక్షోభ సమయంలో మన దేశస్థులకు సహాయం చేయగలగడం మాకు చాలా అదృష్టం సార్. మాకు ఏ బాధ్యతలు చెప్పినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం సార్. మాకు శిక్షణ, సహాయ సేవలు ఉన్నాయి. అవి మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నాయి. ఇందులో మాకు లభించే ఉద్యోగ సంతృప్తి చాలా ఎక్కువ స్థాయిలో ఉంది సార్. అదే అతి పెద్ద విషయం సార్. అందుకే మేం నిరంతరం ఇలాంటి పనులు చేయగలుగుతున్నాం.

మోదీ గారు: కెప్టెన్.. మీరు ఈ రోజుల్లో ఏ ప్రయత్నాలు చేసినా, అది కూడా అతి తక్కువ సమయంలోనే చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో మీ పనులు ఎలా జరిగాయి?

Grp. Cpt.: సార్. గత నెల రోజుల నుండి మేము ఆక్సిజన్ ట్యాంకర్లు, లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లను దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుండి తీసుకువస్తున్నాం సార్. నేను 1600 కి పైగా విమానాలలో వైమానిక దళం ఈ సరఫరా చేసింది. మేము 3000 గంటలకు పైగా ప్రయాణించాము. 160 అంతర్జాతీయస్థాయి సరఫరాలను చేశాం. అంతకుముందు దేశీయంగా సరఫరాకు 2 నుండి 3 రోజులు తీసుకుంటే మేం 2 నుండి 3 గంటల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపించగలం సార్. అంతర్జాతీయస్థాయి సరఫరా కూడా 24 గంటలలోపు చేయవచ్చు. నిరంతరాయంగా పనిచేయడంలో మొత్తం వైమానిక దళం నిమగ్నమై ఉంది సార్. వీలైనంత త్వరగా మేము వీలైనన్ని ట్యాంకర్లను తీసుకువచ్చి దేశానికి సహాయపడతాం సార్.

మోదీ గారు: కెప్టెన్.. మీరు అంతర్జాతీయంగా ఎక్కడెక్కడికి వెళ్లాల్సి వచ్చింది?

Grp. Cpt: సార్. ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ కాలం లేకుండానే భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్ -76, సి -17, సి -130 మొదలైన విమానాలన్నీ సింగపూర్, దుబాయ్, బెల్జియం, జర్మనీ, యుకె లకు వెళ్ళాయి. తక్కువ కాలంలోనే ఈ పనులను ప్రణాళికాబద్దంగా చేయగలిగాం సార్. మా శిక్షణ, ఉత్సాహం కారణంగా మేము ఈ పనులను సకాలంలో పూర్తి చేయగలిగాం.

మోదీ గారు: నౌకాదళం, వైమానికదళం, సైనిక దళం.. ఏ దళమైనా మన సైనికులందరూ కరోనాపై పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. ఇది దేశానికి గర్వకారణం. కెప్టెన్‌.. మీరు కూడా చాలా బాధ్యతగా పని చేశారు. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను.

Grp. Cpt.- సార్.. చాలా ధన్యవాదాలు సార్. మేం మా ఉత్తమ ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాం. నా కుమార్తె అదితి కూడా నాతో ఉంది సార్.

మోదీ గారు: ఓహ్.. వావ్!

అదితి: నమస్తే మోదీ గారూ..

మోదీ గారు: నమస్తే అదితి. నీ వయసెంత?

అదితి : నాకు 12 సంవత్సరాలు సార్. నేను 8 వ తరగతి చదువుతున్నాను.

మోదీ గారు: మీ నాన్న గారు బయటకు వెళ్లినప్పుడు యూనిఫాంలో ఉంటాడు కదా.

అదితి : అవును సార్! మా నాన్నని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయన ముఖ్యమైన పనులను చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. కరోనాతో బాధపడుతున్న ప్రజలకు చాలా సహాయం చేస్తున్నారు. చాలా దేశాల నుండి ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటైనర్లను తీసుకువస్తున్నారు.

మోదీ గారు: కాని కుమార్తె తన తండ్రిని చాలా మిస్ అయ్యింది కదా!

అదితి : అవును.. నేను చాలా మిస్ అయ్యాను. ఈ రోజుల్లో నాన్న ఇంట్లో ఎక్కువగా ఉండలేరు. ఎందుకంటే చాలా అంతర్జాతీయ విమానాలు వెళ్తున్నాయి. కంటైనర్లు, ట్యాంకర్లను ఉత్పత్తి కర్మాగారాలకు రవాణా చేస్తున్నాయి. తద్వారా కరోనా బాధితులు సకాలంలో ఆక్సిజన్ పొందగలుగుతున్నారు. అలా వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.

మోదీ గారు: ఆక్సిజన్ వల్ల ప్రజల ప్రాణాలను కాపాడిన పని ఇది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రజలు ఈ విషయం తెలుసుకున్నారు.

అదితి - అవును.

మోదీ గారు: మీ నాన్న ఆక్సిజన్ సేవలో నిమగ్నమై ఉన్నారని మీ తోటి విద్యార్థులకు తెలిస్తే, అప్పుడు వారు కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు కదా!

అదితి: అవును.. నా స్నేహితులందరూ కూడా మీ నాన్న ఇంత ముఖ్యమైన పని చేయడం మీకు గర్వ కారణమని అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబం, మా నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ – అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. మా అమ్మతో పాటు వాళ్ళంతా డాక్టర్లు. వారు కూడా పగలు, రాత్రి పనిచేస్తున్నారు. అన్ని సాయుధ దళాలు, మా నాన్నతో పాటు స్క్వాడ్రన్ అంకుల్స్, మొత్తం సైన్యం చాలా పని చేస్తోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నంతో కరోనాతో ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నాకు నమ్మకం సార్.

మోదీ గారు: కుమార్తె మాట్లాడేటప్పుడు సరస్వతి ఆమె మాటలలో ఉంటుందని ఒక లోకోక్తి. మనం ఖచ్చితంగా గెలుస్తామని అదితి చెబుతున్నప్పుడు అది దైవ స్వరమే అవుతుంది. అదితీ.. ఇప్పుడు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారా?

అదితి – అవును సార్. ఇప్పుడు మా ఆన్‌లైన్ క్లాసులు అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం మేము ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయటకు వెళ్లాలనుకుంటే డబుల్ మాస్క్ వేసుకుంటున్నాం. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నాం. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం.

మోదీ గారు: మీ హాబీలు ఏమిటి? మీకు ఏమిష్టం?

అదితి - నా అభిరుచులు ఈత కొట్టడం, బాస్కెట్‌బాల్ ఆడడం సార్. కానీ ఇప్పుడు అవి కొంచెం ఆగిపోయాయి. నాకు బేకింగ్, వంట చేయడం చాలా ఇష్టం. ఈ లాక్‌డౌన్, కరోనా వైరస్ కాలంలో నాన్న బయటికి వెళ్ళి చాలా పనులు చేసి వచ్చినప్పుడు నేను ఆయన కోసం కుకీస్, కేక్ తయారు చేసి పెడుతున్నాను.

మోదీ గారు: వావ్, వావ్, వావ్! చాలా కాలం తరువాత మీకు మీ నాన్నతో సమయం గడపడానికి అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్.. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. నేను కెప్టెన్‌ను అభినందించినప్పుడు మీ ఒక్కరినే కాదు- మన దళాలు- నీరు, భూమి, ఆకాశాలతో అనుసంధానించబడ్డ అందరికీ - నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు సోదరా!

Grp. Cpt. - ధన్యవాదాలు సార్

మిత్రులారా! ఈ యోధులు చేసిన పనికి దేశం వారికి నమస్కరిస్తుంది. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు పగలు, రాత్రి కరోనా సంబంధిత పనుల్లో ఉన్నారు. వారు చేస్తున్న పని వారి దినచర్యలో భాగం కాదు. వంద సంవత్సరాల తరువాత ప్రపంచం ఇంతటి విపత్తును ఎదుర్కొంటోంది. ఒక శతాబ్దం తరువాత ఇంత పెద్ద సంక్షోభం! అందువల్ల ఈ రకమైన పని గురించి ఎవరికీ అనుభవం లేదు. వారి కృషి వెనుక దేశ సేవ చేయాలన్న అభిరుచి, సంకల్ప శక్తి ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ చేయని పని దేశం చేసింది. మీరు ఊహించవచ్చు- సాధారణ రోజుల్లో మనం ఒక రోజులో 900 మెట్రిక్ టన్నుల ద్రవ వైద్య ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు ఇది 10 రెట్ల కన్నా ఎక్కువ పెరిగి, రోజుకు 9500 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి జరుగుతోంది. మన యోధులు ఈ ఆక్సిజన్‌ను దేశంలోని సుదూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.

నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.

మిత్రులారా! కరోనా ప్రారంభంలో దేశంలో ఒకే ఒక పరీక్షా ప్రయోగశాల ఉండేది. కాని ఇప్పుడు రెండున్నర వేలకు పైగా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ప్రారంభంలో, ఒక రోజులో కొన్ని వందల పరీక్షలు మాత్రమే నిర్వహించగలిగేవాళ్ళం. ఇప్పుడు ఒక రోజులో 20 లక్షలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 33 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించారు. ఈ యోధుల వల్ల మాత్రమే ఈ భారీ పని సాధ్యమవుతుంది. నమూనా సేకరణ పనిలో ఎంతోమంది ఫ్రంట్‌లైన్ కార్మికులు నిమగ్నమై ఉన్నారు. వైరస్ సోకిన రోగుల మధ్యకు వెళ్లడం, వారి నమూనాను తీసుకోవడం- ఇది ఎంత గొప్ప సేవ. తమను తాము రక్షించుకోవడానికి, ఈ సహచరులు ఇంత వేడిలో కూడా నిరంతరం పిపిఇ కిట్ ధరించాలి. ఆ తరువాత ఆ నమూనా ప్రయోగశాలకు చేరుకుంటుంది. అందువల్ల నేను మీ సలహాలను, ప్రశ్నలను చదువుతున్నప్పుడు మన ఈ స్నేహితుల గురించి కూడా చర్చ జరగాలని నిర్ణయించుకున్నాను. వారి అనుభవాల నుండి మనం కూడా చాలా తెలుసుకుంటాం. ఢిల్లీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కాండ్‌పాల్ గారితో మాట్లాడదాం.

మోదీ గారు: - ప్రకాశ్ గారూ.. నమస్కారం..

ప్రకాశ్ గారు: నమస్కారాలు గౌరవనీయ ప్రధానమంత్రి గారూ..

మోదీ గారు: ప్రకాశ్ గారూ.. మొదట 'మన్ కీ బాత్' శ్రోతలందరికీ మీ గురించి చెప్పండి. మీరు ఈ పనిని ఎంతకాలం నుండి చేస్తున్నారు? కరోనా కాలంలో మీరు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఎందుకంటే దేశ ప్రజలు దీన్ని టీవీలో గానీ వార్తాపత్రికలలో గానీ చూడరు. అయినా ఒక రుషి లాగా ప్రయోగశాలలో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినప్పుడు దేశంలో పని ఎలా జరుగుతుందనే దాని గురించి ప్రజలకు కూడా తెలుస్తుంది.

ప్రకాశ్ గారు: ఢిల్లీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ అనే ఆసుపత్రిలో నేను గత 10 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. నాకు ఈ రంగంలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఐఎల్‌బిఎస్‌కు ముందే అపోలో హాస్పిటల్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, ఢిల్లీ లోని రోటరీ బ్లడ్ బ్యాంక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేశాను. సార్.. నేను ప్రతిచోటా బ్లడ్ బాంక్ విభాగంలో పనిచేసినప్పటికీ గత ఏడాది 2020 ఏప్రిల్ 1 va తేదీ నుండి నేను ILBS వైరాలజీ విభాగం పరిధిలోని కోవిడ్ పరీక్షా ప్రయోగశాలలో పనిచేస్తున్నాను. నిస్సందేహంగా కోవిడ్ మహమ్మారి కారణంగా వైద్య రంగంతో పాటు సంబంధిత అన్ని విభాగాలపై చాలా ఒత్తిడి ఉంది. దేశం, ప్రజలు, సమాజం మా నుండి ఎక్కువ బాధ్యతాయుత తత్వాన్ని, సహకారాన్ని, అధిక సామర్థ్యాన్ని ఆశించడం ఒక అవకాశంగా భావిస్తున్నాను. సార్.. దేశం, ప్రజలు, సమాజం ఆశించే సహకారానికి అనుగుణంగా పనిచేయడం గర్వాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా భయపడినప్పుడు నేను వారికి చెప్తాను- దేశం కోసం అసాధారణ పరిస్థితుల్లో సరిహద్దుల్లో పనిచేసే వారితో పోలిస్తే మేం చేసేది చాలా తక్కువ అని. వారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఒక విధంగా వారు నాతో కూడా సహకరిస్తారు. తమ సహకారాన్ని కూడా అందిస్తారు.

మోదీ గారు: ప్రకాశ్ గారూ.. ఒక వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ దూరం ఉంచమని చెబుతోంది. దూరం ఉంచండి. కరోనాలో ఒకరికొకరు దూరంగా ఉండండి. మీరు కరోనా వైరస్ మధ్యలో నివసించాలి. కాబట్టి ఇది ఒక ప్రాణాంతక వ్యవహారం. అప్పుడు కుటుంబం ఆందోళన చెందడం చాలా సహజం. కానీ ఇప్పటికీ ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సర్వసాధారణం. మహమ్మారి పరిస్థితులలో పని గంటలు చాలా పెరిగి ఉంటాయి. రాత్రిపూట ల్యాబ్‌లలో గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కోట్ల మంది ప్రజల నమూనాలను పరీక్షిస్తున్నారు. అప్పుడు భారం కూడా పెరుగుతుంది. కానీ మీ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకుంటారా లేదా?

ప్రకాశ్ గారు: తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం సార్. మా ILBS ప్రయోగశాల WHO గుర్తింపు పొందింది. కాబట్టి అన్ని ప్రోటోకాల్‌లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయి. మేం ల్యాబ్‌కు దుస్తుల్లో వెళ్తాం. అలాగే మూడు అంచెలలో పనిచేస్తాం. విసర్జించేందుకు, లేబులింగ్ చేయడానికి, పరీక్షించడానికి పూర్తి ప్రోటోకాల్ ఉంది. అప్పుడు అవి ఆ ప్రోటోకాల్ కింద పనిచేస్తాయి. సార్.. ఇంకా నా కుటుంబం, నా పరిచయస్తులలో చాలామంది ఈ సంక్రమణ నుండి దూరంగా ఉన్నారంటే దైవ కృప కారణం.. జాగ్రత్తగా, సంయమనంతో ఉంటే, దాన్ని నివారించవచ్చు.

మోదీ గారు: : ప్రకాశ్ గారూ.. మీలాంటి వేలాది మంది గత ఒక సంవత్సరం నుండి ల్యాబ్‌లో కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిని రక్షించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు దేశం ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంది. ప్రకాశ్ గారూ.. మీ ద్వారా మీ సహోద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశవాసుల తరపున ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండనివ్వండి. మీకు చాలా శుభాకాంక్షలు..

ప్రకాశ్ గారు: ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.

మోదీ గారు: - ధన్యవాదాలు సోదరా..

మిత్రులారా! నేను సోదరుడు ప్రకాశ్ గారితో మాట్లాడాను. కానీ అతని మాటల్లో వేలాది ల్యాబ్ టెక్నీషియన్ల సేవలోని గొప్పదనం మనకు చేరువవుతోంది. ఈ మాటల్లో వేలాది, లక్షలాది ప్రజల సేవాభావం మనకు కనిపిస్తుంది. మనమందరం మన బాధ్యతను కూడా గ్రహించాం. సోదరుడు ప్రకాశ్ గారి లాంటి మన సహోద్యోగులు ఎంతో కష్టపడి, అంకితభావంతో పనిచేస్తున్నారు. అదే అంకితభావంతో వారి సహకారం కరోనాను ఓడించడంలో సహాయపడుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా! మనం మన కరోనా యోధుల గురించి మాట్లాడుతున్నాం. గత ఒకటిన్నర సంవత్సరాల్లో వారి అంకితభావాన్ని, కృషిని చూశాం. ఈ పోరాటంలో దేశంలోని అనేక ప్రాంతాల నుండి చాలా మంది యోధులు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆలోచించండి.. మన దేశంలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఇది దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసింది. ఈ దాడి నుండి వ్యవసాయ వ్యవస్థ చాలా వరకు తనను తాను రక్షించుకుంది. సురక్షితంగా ఉండడమే కాకుండా పురోగతి సాధించింది- మరింత పురోగతి సాధించింది! ఈ మహమ్మారి కాలంలో కూడా మన రైతులు రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచారని మీకు తెలుసా? రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేశారు. కాబట్టి ఈసారి దేశం రికార్డు స్థాయిలో పంటలను కూడా కొనుగోలు చేసింది. ఈ సారి రైతులకు చాలా చోట్ల ఆవాల పంటకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ లభించింది. రికార్డు చేసిన ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల మన దేశం ప్రతి దేశస్థుడికి సహాయాన్ని అందించగలదు. ఈ సంక్షోభ కాలంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత రేషన్ లభిస్తుంది. పెద ప్రజల ఇళ్ళలో పొయ్యి వెలగని రోజు ఉండకూడనే లక్ష్యంతో ఉచిత రేషన్ ను అందిస్తున్నాం.

మిత్రులారా! ఈ రోజు మన దేశంలోని రైతులు అనేక ప్రాంతాలలో కొత్త ఏర్పాట్లను సద్వినియోగం చేసుకొని అద్భుతాలు చేస్తున్నారు. ఉదాహరణకు అగర్తల రైతులను తీసుకోండి! ఈ రైతులు చాలా మంచి పనస పండ్లను ఉత్పత్తి చేస్తారు. వాటి డిమాండ్ దేశ విదేశాలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అగర్తలరైతులు పనస పండ్లను రైలు ద్వారా గౌహతికి తీసుకువచ్చారు. ఈ జాక్‌ఫ్రూట్‌లను ఇప్పుడు గౌహతి నుండి లండన్‌కు పంపుతున్నారు. అదేవిధంగా మీరు బీహార్‌కు చెందిన 'షాహి లీచీ' పేరును విని ఉంటారు. 2018 లో ప్రభుత్వం ఈ 'షాహి లీచీ'కి జిఐ ట్యాగ్‌ను ఇచ్చింది. తద్వారా దానికి గుర్తింపు లభిస్తుంది. రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఈసారి బీహార్‌కు చెందిన ఓ 'షాహి లీచీ'ని కూడా విమానంలో లండన్‌కు పంపారు. మన దేశం తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఇటువంటి ప్రత్యేకమైన రుచులు, ఉత్పత్తులతో నిండి ఉంది. దక్షిణ భారతదేశంలో, విజయనగరంలోని మామిడి పండ్ల గురించి మీరు తప్పక విని ఉంటారు. ఇప్పుడు ఈ మామిడి పండ్లు తినడానికి ఇష్టపడని వారు ఎవరుంటారు? కాబట్టి ఇప్పుడు కిసాన్ రైలు వందల టన్నుల విజయనగరం మామిడిని ఢిల్లీ కి చేరుస్తోంది. దీనివల్ల ఢిల్లీ, ఉత్తర భారతదేశ ప్రజలకు విజయనగరం మామిడిపండ్లు తినడానికి దొరుకుతాయి. విజయనగరం రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. కిసాన్ రైలు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేసింది. ఇప్పుడు రైతులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలను దేశంలోని ఇతర మారుమూల ప్రాంతాలకు చాలా తక్కువ ఖర్చుతో పంపించగలుగుతున్నారు.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం మే 30 న 'మన్ కి బాత్' కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. యాదృచ్చికంగా ఇది ఈ ప్రభుత్వానికి 7 సంవత్సరాల కాలం పూర్తి అయ్యే సమయం. కొన్నేళ్లుగా దేశం 'సబ్కా-సాథ్, సబ్కా-వికాస్, సబ్కా-విశ్వాస్' అనే మంత్రాన్ని అనుసరించింది. మనమందరం దేశ సేవలో ప్రతి క్షణం అంకితభావంతో పనిచేశాం. చాలా మంది నాకు లేఖలు పంపారు. 'మన్ కీ బాత్'లో 7 సంవత్సరాల మన ప్రయాణం గురించి కూడా చర్చించాలని చెప్పారు. మిత్రులారా! ఈ 7 సంవత్సరాలలో ఏమైనా సాధించినా అది దేశానికి చెందింది, దేశవాసులది. ఈ సంవత్సరాల్లో మనం జాతీయ గౌరవానికి సంబంధించిన అనేక క్షణాలను కలిసి అనుభవించాం. ఇప్పుడు భారతదేశం ఇతర దేశాల ఒత్తిడికి లోనుకాకుండా, స్వీయ సంకల్పంతో నడుస్తుందని చూస్తే, మనమందరం గర్వపడుతున్నాం. మనకు వ్యతిరేకంగా కుట్ర చేసేవారికి ఇప్పుడు భారతదేశం తగిన సమాధానం ఇస్తుందని చూసినప్పుడు, మన విశ్వాసం పెరుగుతుంది. జాతీయ భద్రత సమస్యలపై భారతదేశం రాజీపడనప్పుడు, మన దళాల బలం పెరిగినప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నామని భావిస్తాం.

మిత్రులారా! నేను దేశంలోని ప్రతి మూల నుండి చాలా మంది దేశవాసుల సందేశాలను, వారి లేఖలను అందుకుంటున్నాను. 70 సంవత్సరాల తరువాత విద్యుత్తు మొదటిసారిగా తమ గ్రామానికి చేరుకున్నందుకు, వారి పిల్లలు విద్యుత్తు వెలుగులో ఫ్యాన్ కింద కూర్చుని చదువుకుంటున్నారని చాలా మంది కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామం కూడా ఇప్పుడు పట్టణానికి రోడ్డు ద్వారా అనుసంధానమైందని ఎంతో మంది అంటున్నారు. రహదారి నిర్మాణం తరువాత మొదటిసారిగా తాము కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలిసిపోయినట్టుగా వారు భావించారని ఒక గిరిజన ప్రాంతానికి చెందిన కొంతమంది సహచరులు నాకు సందేశం పంపారని గుర్తు. అదే విధంగా కొందరు బ్యాంకు ఖాతా తెరిచిన ఆనందాన్ని పంచుకుంటున్నారు. కొందరు వివిధ పథకాల సహాయంతో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు ఆ ఆనందంలో నన్ను కూడా భాగస్వామి అయ్యేందుకు ఆహ్వానిస్తాడు. 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' కింద ఇల్లు పొందిన తరువాత గృహ ప్రవేశానికి ఎందరి నుండో నిరంతరం నాకు చాలా ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ 7 సంవత్సరాలలో ఇలాంటి లక్షలాది ఆనందాలలో నేను పాలుపంచుకున్నాను. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక కుటుంబం 'జల్ జీవన్ మిషన్' కింద ఇంట్లో ఏర్పాటు చేసిన నీటి నల్లా ఫోటోను నాకు పంపింది. అతను ఆ ఫోటోకి 'నా గ్రామానికి చెందిన జీవన్ ధార' అనే శీర్షిక రాశాడు. ఇలాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాలలో మన దేశంలో 3.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్షన్ ఉంది. కానీ గత 21 నెలల్లో నాలుగున్నర కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన నీటి కనెక్షన్లు లభించాయి. వీటిలో15 నెలలు కరోనా కాలానికి చెందినవి.

'ఆయుష్మాన్ యోజన' ద్వారా ఇలాంటి నమ్మకం దేశంలో వచ్చింది. ఉచిత చికిత్సతో ఎవరైనా పేదవాడు ఆరోగ్యంగా ఇంటికి వచ్చినప్పుడు అతను కొత్త జీవితాన్ని పొండినట్టే భావిస్తాడు. దేశం తనతో ఉందని భరోసా ఏర్పడుతుంది. ఇలాంటి చాలా కుటుంబాల ఆశీర్వచనాలతో, కోట్ల మంది తల్లుల ఆశీర్వాదంతో, మన దేశం దృఢంగా అభివృద్ధి వైపు పయనిస్తోంది.

మిత్రులారా! ఈ 7 సంవత్సరాలలో, 'డిజిటల్ లావాదేవీలలో' ప్రపంచానికి కొత్త దిశను చూపించే పనిని భారతదేశం చేసింది. ఈ రోజు మీరు ఏ ప్రదేశంలోనైనా డిజిటల్ చెల్లింపు తేలికగా చేయగలుగుతున్నారు. ఈ కరోనా సమయంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజుల్లో పరిశుభ్రత పై దేశవాసుల ఆసక్తి అప్రమత్తత పెరుగుతోంది. మనం రికార్డ్ ఉపగ్రహాలను కూడా రూపొందిస్తున్నాం. , రికార్డ్ రోడ్లను కూడా తయారు చేస్తున్నాం.

ఈ 7 సంవత్సరాలలో దేశంలోని అనేక పాత వివాదాలు కూడా పూర్తి శాంతి, సామరస్యంతో పరిష్కృతమయ్యాయి. శాంతి, అభివృద్ధిపై కొత్త విశ్వాసం ఈశాన్య ప్రాంతాల నుండి కాశ్మీర్ వరకు పుట్టుకొచ్చింది. మిత్రులారా! దశాబ్దాలుగా చేయలేని ఈ పనులన్నీ ఈ 7 సంవత్సరాలలో ఎలా జరిగాయి? ఇవన్నీ ఎందుకు సాధ్యమయ్యాయంటే ఈ 7 సంవత్సరాలలో మనం ప్రభుత్వం- ప్రజలు అనే భావనకంటే ఎక్కువగా ‘ఒకే దేశం’ అనే భావనతో కలిసి పనిచేశాం. ఒక జట్టుగా పనిచేశాం. 'టీం ఇండియా'గా పనిచేశాం. ప్రతి పౌరుడు దేశాన్ని అభివృద్ధి చేయడంలో కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నించాడు. అవును! విజయాలు ఉన్నచోట పరీక్షలు కూడా ఉంటాయి. ఈ 7 సంవత్సరాలలో మనం కలిసి చాలా కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నాం. ప్రతిసారీ మనమందరం విజయం సాధించాం. దృఢంగా బయటపడ్డాం. కరోనా మహమ్మారి రూపంలో ఇంత పెద్ద పరీక్ష నిరంతరం జరుగుతోంది. ఇది ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన సంక్షోభం. ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. పెద్ద దేశాలు కూడా దాని విధ్వంసం నుండి రక్షణ పొందలేకపోయాయి. ఈ మహమ్మారి కాలంలో 'సేవ, సహకారం' అనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోంది. కరోనా మొదటి వేవ్‌లో కూడా మనం శక్తిమంతంగా పోరాడాం. ఈసారి కూడా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భారత్ విజయం సాధిస్తుంది.

రెండు గజాల దూరం, మాస్కులకు సంబంధించిన నియమాలను గానీ వ్యాక్సిన్‌కు సంబంధించిన నియమాలను గానీ మనం సడలించాల్సిన అవసరం లేదు. ఇదే మన విజయ మార్గం. తర్వాతిసారి 'మన్ కీ బాత్'లో కలిసినప్పుడు దేశవాసుల మరెన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణల గురించి మాట్లాడుకుందాం. కొత్త విషయాల గురించి చర్చిద్దాం. మీ సలహాలను ఇలాగే నాకు పంపుతూ ఉండండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. దేశాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేస్తూ ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi